mayanmar
-
అండమాన్‌లో 6 వేల కిలోల డ్రగ్స్ పట్టివేత
పోర్ట్ బ్లయర్: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత తీర రక్షక దళం(ఐసీజీ) ఈ నెల 23న భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఓ పడవలో అక్రమంగా రవాణా అవుతున్న 6 వేల కిలోల నిషేధిత మెథాంఫెటమైన్ అనే మాదక ద్రవ్యంతోపాటు ఆరుగురు మయన్మార్ దేశస్తులను పట్టుకుంది. రెండు కిలోల చొప్పున బరువున్న 3 వేల ప్యాకెట్లలో ఉన్న ఈ డ్రగ్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలోనే ఉంటుందని సోమవారం అధికారులు వెల్లడించారు. పోర్ట్ బ్లయర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని బారెన్ ఐలాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న మత్స్యకారుల పడవను గస్తీ విమానంలో గమనించి, తీరానికి తీసుకువచ్చామన్నారు. మన దేశంతోపాటు పొరుగుదేశాలకు చేరవేసేందుకు దీనిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. -
శరదృతువులో అక్కడ పడవలతో పండుగ సందడి..ఏకంగా..!
సరస్సులో పడవల సందడితో కనువిందు చేసే పండుగ ఇది. ఏటా శరదృతువులో పద్దెనిమిది రోజుల పాటు కొనసాగే ఈ పండుగ కోలాహలం చూసి తీరాల్సిందే! మయాన్మార్‌లోని ఇన్లే సరస్సు ఒడ్డున ఉన్న ‘ఫాంగ్ డా వూ’ పగోడా వరకు పద్దెనిమిది రోజుల పాటు పడవల ఊరేగింపు జరుగుతుంది. మయాన్మార్ చాంద్రమాన కేలండర్లోని ఏడో నెల అయిన థాడింగ్యుట్ నెలలో శుక్లపక్షం మొదటి రోజు నుంచి బహుళపక్షం మూడో రోజు వరకు జరిగే ఈ పండుగలో లక్షలాది మంది జనాలు పాల్గొంటారు. ఈసారి ఈ పండుగ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమై, 20 వరకు జరుగుతోంది. మయాన్మార్‌లోని మైనారిటీ తెగలకు చెందిన ‘ఇంథా’, ‘పావో’ తెగలవారు ఈ పండుగలో పెద్దసంఖ్యలో పాల్గొంటారు. పండుగ జరిగే పద్దెనిమిది రోజుల్లోనూ ఇన్లే సరస్సులో పడవల మీద ఊరేగింపుగా వెళ్లి ‘ఫాంగ్ డా వూ’ పగోడాకు చేరుకుంటారు. పగోడాలో బంగారుపూతతో కొలువుదీరిన ఐదు బుద్ధప్రతిమలను భక్తిగా తాకి, వాటికి బంగారు రేకులను అతికిస్తారు. విగ్రహాలు మరీ బరువుగా మారడం వల్ల పగోడా నిర్వాహకులు విగ్రహాలకు భక్తులు బంగారు రేకులను అతికే ప్రక్రియపై 2019 నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. ఈ విగ్రహాల వద్ద భక్తులు సామూహికంగా ప్రార్థనలు జరుపుతారు. ఇన్లే సరస్సు తీరంలోని గ్రామాల్లో ఈ పద్దెనిమిది రోజులూ పండుగ కోలాహలం అట్టహాసంగా కనిపిస్తుంది. పడవల ఊరేగింపు జరిగినన్ని రోజులూ హంస ఆకారంలో ఉన్న రాచపడవను అనుసరించి వందలాది పడవలు ‘ఫాంగ్ డా వూ’ పగోడా తీరం వరకు ప్రయాణిస్తాయి.(చదవండి: అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం..!) -
‘100 శాతం నిజం.. ఆ దేశం నుంచి మణిపూర్‌లోకి కుకీ మిలిటెంట్లు’
ఇంఫాల్: మణిపూర్‌లో జాతుల మధ్య వైరంతో గత కొన్ని నెలలుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలో మణిపూర్ భద్రతా సలహాదారు కూల్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం మయన్మార్ నుంచి మణిపూర్‌కు గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందిన సుమారు 900 కుకీ మిలిటెంట్లు ప్రవేశించారని తెలిపారు. ఆ మిలిటెంట్లు ఆయుధాలతో కూడిన డ్రోన్ల వినియోగించటంలో శిక్షణ పొందినవారనే సమాచారం ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా అందినట్లు నిర్ధారించారు. ఆయన మీడియాతో మట్లాడుతూ.. ‘‘ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించిన విషయాలు 100 శాతం నిజం. ఆ నివేదిక తప్పు అని నిరూపించేవరకు మేము నమ్ముతాం. ఎందుకంటే ఇంటెలిజెన్స్ 100 శాతం నిజంగానే ఉంటుంది. ఆ సమాచారం ఆధారంగా మేము సిద్ధంగా ఉంటాం. ఒకవేళ ఆ నివేదిక నిజం కాకపోయినా. అన్ని రకాలుగా మా ప్రయత్నాలు ఆపకుండా ఉంటాం. ఇంటెలిజెన్స్ నివేదికను మేము ఎట్టి పరిస్థితుల్లో తేలికగా తీసుకోము’’ అని అన్నారు.దక్షిణ మణిపూర్‌లోని ఇండియా-మయన్మార్ సరిహద్దు జిల్లాల్లోని అన్ని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్లకు ఇంటెలిజెన్స్ రిపోర్టు అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గురువారం పంపిన ఈ నివేదికలో.. డ్రోన్ ఆధారిత బాంబులు, క్షిపణులు అమర్చటం, గెలిల్లా యుద్ధంలో కొత్తగా శిక్షణ పొందిన 900 మంది కుకీ మిలిటెంట్లు మయన్మార్ నుండి మణిపూర్‌లోకి ప్రవేశించారు’’ అని స్పష్టం చేసినట్లు మణిపూర్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. కుకి మిలిటెంట్లు 30 మంది సభ్యులతో కూడిన యూనిట్లతో గ్రూప్‌లుగా ఉంటారని, మణిపూర్‌లో పలు ప్రాంతాల్లో విస్తరించిన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ కుకీ మిలిటెంట్లు సెప్టెంబర్ చివరి వారంలో మైతేయి వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు పాల్పడవచ్చనే హెచ్చరికలు ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఉన్నట్లు రాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు.చదవండి: సినిమా రేంజ్లో బీజేపీ మేయర్ ఓవరాక్షన్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ -
అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
హైదరాబాద్: అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ముగ్గురు మయన్మార్ దేశస్తులుపై చార్జిషీట్ దాఖలు చేసింది. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా భారత్‌లోకి మయన్మార్ దేశస్తులు చొరబడ్డారు. మయన్మార్‌కు చెందిన నిందితులు.. రబి ఇస్లామ్, షఫీ అలం, మహమ్మద్ ఉస్మాన్.. రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల వేశారు. నకిలీ పత్రాలతో ఇక్కడ ఆధార్ కార్డులను సైతం నిందితులు పొందారు. ఆధార్ కార్డులతో తమ పేరుతో సిమ్ కార్డులు విక్రయించారు. నిందితులు బ్యాంకు ఖాతాలను సైతం తెరవటం గమనార్హం. గత ఏడాది నవంబర్ 7న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. పలువురు ట్రాఫికర్లు, రోహింగ్యలతో కలిసి మయన్మార్ నిందితులు అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారు. బంగ్లాదేశీ రెఫ్యుజీ క్యాంపులో ఉన్న మహిళలను భారత్‌లోకి దింపిందీ ముఠా. తెలంగాణ, యూపీ, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఉన్న రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల విసిరింది. -
భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మయన్మార్ ప్రభుత్వ ఆర్మీ(జుంటా) సైనికులు భారత్‌లోకి చొచ్చుకురావటంపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయటంలో భాగంగా భారత సరిహద్దుల వెంట త్వరలో పటిష్టమైన కంచెను ఏర్పాటు చేయనున్నట్లు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎలాంటి కంచె ఉందో.. ఇక్కడ (భారత్-మయన్మార్) సరిహద్దు వద్ద కూడా చాలా పటిష్టమైన కంచె ఏర్పాటు చేస్తామని అన్నారు. దీంతో మనదేశంలోకి సరిహద్దులు దాటుకొని మయన్మార్ సైనికులు రావటం సాధ్యం కాదని పేర్కొన్నారు. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్‌లో ఆశ్రయం పొందుతున్నారు. మయన్మార్ ఆర్మీ సైనికుల విషయాన్ని.. మిజోరం సీఎం లాల్దుహోమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. భారత సరిహద్దుల్లోని మిజోరం ప్రాంతం నుంచి మయన్మార్ ఆర్మీ సైనికులను వెనక్కి పంపించాలని కేంద్రాన్ని ఆయన అభ్యర్థించిన విషయం తెలిసిందే. చదవండి: భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన -
10 వేల మందికి క్షమాభిక్ష!
బ్యాంకాక్: మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 10 వేల మందికి క్షమాభిక్ష ప్రకటించింది. జైళ్ల నుంచి విడుదలయ్యే వారిలో సైనిక ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజకీయ ఖైదీలున్నదీ లేనిదీ వెల్లడి కాలేదు. 9,652 మంది ఖైదీలను క్షమాభిక్ష ద్వారా విడుదల చేస్తామంటూ దేశ మిలటరీ కౌన్సిల్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హెలయింగ్ తెలిపినట్లు ప్రభుత్వ టీవీ వెల్లడించింది. అయితే, పదవీచ్యుత నేత అంగ్ సాన్ సుకీ(78) పేరు ఈ జాబితాలో ఉన్న సూచనల్లేవని పరిశీలకులు అంటున్నారు. ఆమ్నెస్టీ పొందిన వారిలో 114 మంది విదేశీయులు సైతం ఉన్నారు. ఖైదీల విడుదల గురువారం మొదలై కొన్ని రోజులపాటు సాగుతుందని చెబుతున్నారు. రెండేళ్ల క్రితం అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆర్మీ 25 వేల మందికి పైగా నిర్బంధించినట్లు చెబుతున్నారు. ఇవి చదవండి: వికేంద్రీకరణను అడ్డుకుంటున్న విజ్ఞత లేని పార్టీలు -
మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె!
ఇంఫాల్: మణిపూర్-మయన్మార్ సరిహద్దు వెంబడి 70 కి.మీ. మేర కంచె నిర్మించేందుకు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎన్. బైరెన్ సింగ్ సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర పోలీసులు, హోంశాఖతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. అత్యంత అవసరం.. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి మయన్మార్ అక్రమ వలసదారుల చొరబాటు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అక్కడ అమలులో ఉన్న స్వేచ్చాయుత రాకపోలను వెంటనే నిలిపివేసి సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం గురించి కేంద్రాన్ని కోరగా 60 కి.మీ. వరకు కంచెను వేయడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు సీఎం బైరెన్ సింగ్. ఆదివారం సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర హోంశాఖతోనూ జరిగిన చర్చల్లో ఈ కంచెను నిర్మించే విషయమై ఒక నిర్ణయానికి వచ్చామని అక్రమ చొరబాట్ల తోపాటు మాదకద్రవ్యాల రవాణా కూడా జోరుగా జరుగుతున్న నేపథ్యంలో 70 కి.మీ. మేర కంచె నిర్మాణం ఇప్పుడు అత్యంత ఆవసరమని తెలిపారు. స్వేచ్చాయుత రాకపోకలు.. మణిపూర్ మయన్మార్ సరిహద్దులో అమలులో ఉన్న స్వేచ్చాయుత రాకపోకల కారణంగానే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయని అత్యధికులు అభిప్రాయపడుతున్న కారణంగా ఈ రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు సీఎం. స్వేచ్చాయుత రాకపోకల నిబంధన ప్రకారం ఇటు వారు అటువైపు గానీ అటు వారు ఇటువైపు గానీ 16 కిలోమీటర్లు వరకు ఎటువంటి ఆధారాలు లేకుండా స్వేచ్ఛగా తిరగవచ్చు. తప్పనిసరి.. మయన్మార్ దేశం భారతదేశం సరిహద్దులో 1600 కి.మీ. సరిహద్దును పంచుకుంటుండగా అందులో మణిపూర్‌లోని ఐదు జిల్లాలు మయన్మార్‌తో మొత్తంగా 390 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. ఖర్చు తోపాటు అక్కడి స్థితిగతులు అనుకూలంగా లేనికారణంగా మొత్తం సరిహద్దు అంతటా కంచె వేయడం కష్టమైతే ఎక్కడైతే అక్రమ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ మాత్రమే కంచె వేస్తే సమస్యకు కాస్తైనా పరిష్కారం దక్కుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగానే మొదటి 70 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం ఆవసరమని నిర్ణయించారు. Held a meeting with the officials of BRO and deliberated the plan to begin construction of an additional 70 km of border fencing along the Indo-Myanmar border. I was joined by Chief Secretary, DGP & officials from the Home Department. In view of the rise in illegal immigration… pic.twitter.com/cZWO00k3as — N.Biren Singh (@NBirenSingh) September 24, 2023 ఇది కూడా చదవండి: డిసెంబర్లోనే అయోధ్య ఎయిర్పోర్ట్ సేవలు! -
మణిపూర్ అల్లర్లకు వారే కారణమా..?
ఇంఫాల్: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మయన్మార్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి బయోమెట్రిక్ డేటాను సేకరించడం మొదలుపెట్టింది. ఈ అల్లర్లకు వారికీ సంబంధం ఉందన్న కోణంలోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు చెబుతోంది మణిపూర్ ప్రభుత్వం. మణిపూర్ హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం మయన్మార్ నుండి అక్రమంగా వలసవచ్చిన వారి గణన సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తవుతుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు హోంశాఖ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్.సి.ఆర్.బి) నుండి కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపినాట్లు తెలిపారు జాయింట్ సెక్రెటరీ(హోమ్) పీటర్ సలాం. కూకీలు అత్యధికంగా ఉండే కొండ ప్రాంతమైన చురాచంద్ పూర్ లో ఏడుగురు మయన్మార్ వలసదారులకు బులెట్ గాయాలు తగలడంతో అల్లర్లలో వారి పాత్ర ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే వెంటనే స్పందించి మణిపూర్, మిజోరాం రాష్ట్రాల ప్రభుత్వాలను వెంటనే బయోమెట్రిక్ ఆధారంగా మయన్మార్ అక్రమ వలసదారుల గణన చేపట్టాలని అదేశించింది. మయన్మార్ వలసదారులు ఎక్కువగా అడవులను కొట్టి, గసగసాల సాగు, గంజాయి సాగుకి పాల్పడుతూ ఉంటారని గతంలో ఒకసారి మణిపూర్ సీఎం బైరెన్ సింగ్ కూడా తెలిపారు. ఇది కూడా చదవండి: Manipur Violence: నా కొడుకు, భర్తను చంపేశారు.. కూతురిని నగ్నంగా.. -
తల నరికేసే ఊరిలో.. రెండు దేశాల బార్డర్!
దేశాల మధ్య సరిహద్దులు అంటే.. కంచెలు, హద్దు రాళ్లు గుర్తుకువస్తుంటాయి. కొన్నిచోట్ల గ్రామాలు, పట్టణాలకు దగ్గరగా సరిహద్దులు ఉంటుంటాయి. గ్రామాల మధ్యలోంచి కూడా దేశాల సరిహద్దులు వెళ్లే ప్రాంతాలూ కొన్ని ఉన్నాయి. అలా భారత్, మయన్మార్ దేశాల మధ్య ఉన్న గ్రామమే.. లోంగ్వా. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. రెండు దేశాల బార్డర్! భారత్, మయన్మార్ దేశాల మధ్య నాగాలాండ్ రాష్ట్రంలో లోంగ్వా గ్రామం ఉంది. కొన్యాక్ గిరిజనులు నివసించే ఈ గ్రామం ఎత్తైన కొండల మీద ఉంటుంది. ఈ గ్రామ పెద్ద ఇంటి మీదుగానే అంతర్జాతీయ సరిహద్దు వెళ్తుంది. ‘మేం భారత్‌లో తింటాం. మయన్మార్‌లో నిద్రపోతాం’ అని గ్రామ పెద్ద సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. ఈ గ్రామ పెద్దను ‘ఆంఘ్’ లేదా ‘చీఫ్టేన్’ అని పిలుచుకుంటారు. కొన్యాక్ తెగకు చెందినవారు 5 వేల మందికిపైగా ఉంటారని అంచనా. వారందరికీ ‘ఆంఘ్’ రాజు. ఆయనకు 60 మంది భార్యలు అని.. చుట్టూ ఇటు భారత్, అటు మయన్మార్‌లో ఉన్న 60 గ్రామాలను పాలిస్తుంటారని చెబుతారు. ఈ పరపతి కారణంగానే.. చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే ముందే లోంగ్వా గ్రామానికి 4జీ మొబైల్ నెట్వర్క్ వచి్చందని అంటుంటారు. తల నరికేసే యోధులు! రెండు దేశాల్లోనూ పౌరసత్వం కొన్యాక్ తెగలో ఓ ఆచారం ఉంది. ఈ తెగ యువకులు ప్రత్యర్థి తెగలవారితో తలపడి తల తెగనరికి తీసుకువస్తే యుద్ధవీరుడిగా గుర్తింపు ఇస్తారు. తలపై ఇత్తడి కిరీటాన్ని, మెడలో ఇత్తడి బిళ్లలతో కూడి దండను ధరిస్తారు. ఎంత మంది తలలు నరికితే అన్ని ఇత్తడి బిళ్లలు వేసుకుంటారు. ప్రభుత్వం 1960లో ఈ సాంప్రదాయాన్ని నిషేధించింది. అయినా ఇప్పటికీ తమ మెడలో ‘హెడ్ హంటర్స్’కు గుర్తుగా దండలను ధరిస్తారు. ఇక వారి తెగ సాంప్రదాయాన్ని, తమ హోదాను బట్టి ముఖంపై వివిధ ఆకారాల్లో పచ్చబొట్లు వేసుకుంటారు. తర్వాతి కాలంలో ఈ తెగకు చెందినవారు చాలా మంది క్రిస్టియనిటీ స్వీకరించారు. అయినా తమ ఆచారాలను కొనసాగిస్తుంటారు. భారత్, మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దుపై ఉన్న లోంగ్వా గ్రామస్తులకు అధికారికంగానే ఇరు దేశాల పౌరసత్వం ఉంది. మన దేశంలో ఇలాంటి పౌరసత్వం ఉన్న ఏకైక గిరిజన తెగ వీరిదేనని చెబుతారు. గ్రామస్తులు చాలా మంది రెండు దేశాల ఎన్నికల్లోనూ ఓటేస్తారు. కొందరు మయన్మార్ ఆరీ్మలోనూ పనిచేస్తున్నారు. లోంగ్వా గ్రామం, పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలకు నెలవు. భారత్ వైపు రెండు, మయన్మార్ వైపు మరో రెండు చిన్న నదులు, షిలోయ్ అనే ఓ సరస్సు ఉన్నాయి. దీనికితోడు కొన్యాక్ తెగవారి ప్రత్యేకతలు, ఆచారాలను చూడటానికి ఇటీవలికాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు లోంగ్వాకు వెళుతున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ (చదవండి: జ్ఞానవాపి మసీదు: కీలక తీర్పు పై ఉత్కంఠ) -
Aung San Suu Kyi: మయన్మార్‌లో సంచలనం.. సూకీకి జైలు శిక్ష
Aung San Suu Kyi: భారత్ పొరుగు దేశం మయన్మార్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. మయన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం.. ప్రస్తుతం మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, సైనిక ప్రభుత్వం.. సూకిపై 11 అవినీతి కేసులను మోపింది. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం.. జుంటా కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. 6 లక్షల డాలర్లను నగదు, 11.4 కిలోల బంగారాన్ని లంచం రూపంలో తీసుకున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. దీంతో సూకీకి ఐదేళ్లపాటు జైలు శిక్షను విధిస్తున్నట్టు కోర్టు తీర్పునిచ్చింది. అయితే, సైనిక ప్రభుత్వం మోపిన 11 కేసుల్లో ఇది మొదటి కేసు కావడం విశేషం. మిగిలిన 10 కేసుల్లో కూడా ఆమెపై ఉన్న ఆరోపణలు నిరూపితమైతే.. ఆమె మరింత శిక్షపడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ చైర్ పర్సన్‌గా ఉన్న ప్రజానేత ఆంగ్ సాన్ సూకీ.. 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్లపాటు హౌస్ అరెస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె మయన్మార్‌లో సైనిక పాలన నిర్మూలన కోసం పోరాటం చేసింది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం ఆమె మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే ఆంగ్ సాన్ సూకీకి 1991లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. A court in military-ruled #Myanmar sentenced deposed leader Aung San Suu Kyi to five years in jail after finding her guilty in the first of 11 corruption cases against her, according to a source with knowledge of proceedings. pic.twitter.com/IhkfM6Jmrt — Alpha7News (@Alpha7News) April 27, 2022 ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌కు చైనా గట్టి వార్నింగ్ -
విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు
Myanmar jad Mine Landslide: ఉత్తర మయన్మార్‌లో కచిన్ రాష్ట్రంలోని హ్పాకాంత్ ప్రాంతంలో ఉన్న జాడే గనుల్లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 70 మంది గల్లంతవ్వగా, ఒకరు మృతి చెందారు. రెస్క్యూ కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. (చదవండి: నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్ క్యూర్ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!) జాడే గనులు ప్రపంచంలోనే ప్రసిద్ధింగాంచిన అతి పెద్దగనులు. అయితే లారీల నుండి ఓపెన్ పిట్ గనులకు విసిరిన శిథిలాలు గుట్టలుగా పొంగిపొర్లడంతో కొండచరియలు విరిగిపడినట్లు భావిస్తున్నారు. ఈ గనుల్లోని ఖనిజాలు సేకరించడం అత్యంత ప్రమాదకరమైన శ్రమతో కూడిన పని. నిజానికి ప్రమాదాలు తరుచుగా సంభవించడంతో హ్పాకాంత్‌లో జాడే మైనింగ్‌ని నిషేధించారు. కానీ స్థానికులకు ఉపాధి లేకపోవడం, మరోవైపు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దిగజారుతున్న వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. (చదవండి: అతి పెద్ద విడాకుల సెటిల్మెంట్..రూ. 5, 500 కోట్ల భరణం!) -
అమెరికా జర్నలిస్ట్‌కి 11 ఏళ్లు జైలు శిక్ష
మయన్మార్: మయన్మార్ జుంటా కోర్టు అమెరికన్ జర్నలిస్ట్ డానీ ఫెన్‌స్టర్‌కు చట్టవిరుద్ధమైన పనులు, మిలిటరీని రెచ్చగొట్టేల చేయడం, వీసా నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలతో 11 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించినట్లు పేర్కొంది. గత ఫిబ్రవరి నుంచి మయన్మార్ మిలటరీ బలాగాలు తిరుగాబాటు ధోరణితో డజన్ల కొద్దీ జర్నలిస్టులను అరెస్టు చేసి ప్రెస్‌ని అణిచివేస్తుందన్న సంగతి తెలిసిందే. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్ బేబిగా గిన్నిస్ రికార్డ్) అయితే డానీ ఫెన్స్టర్ స్థానిక మయన్మార్‌లోని అవుట్లెట్ ఫ్రాంటియర్ పత్రికలో ఒక ఏడాది నుంచి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను తన కుటుంబాన్ని చూడటానికై దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మయన్మార్ మిలటరీ అతన్ని అరెస్టు చేసింది. ఈ మేరకు ఫ్రాంటియర్ పత్రిక తమ సంస్థలో మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేసిన డానీ ఫెన్స్టర్ను ఇలా మూడు ఆరోపణలతో దోషిగా నిర్ధారించి 11 సంవత్సరాల జైలు శిక్ష విధించడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఫెన్స్టర్ నిర్భందించినప్పటి నుంచి జీవితాంతం జైలు శిక్ష విధించేలా దేశద్రోహం, తీవ్రవాదం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నాడంటూ పేర్కొంది. అంతేకాదు తాము ఫెన్స్టర్ వీలైనంత త్వరగా విడుదలై తమ కుటుంబాన్ని చూడటానికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఫ్రాంటియర్ మయన్మార్ తెలిపింది. ఈ మేరకు క్రైసిస్ గ్రూప్ మయన్మార్ సీనియర్ అడ్వైజర్ రిచర్డ్ హార్సీ మిలటరీ చేస్తున్న ఈ పనిని "దౌర్జన్యం"గా అభివర్ణించారు. ఈ సంఘటన వాస్తవిక పరిస్థితులు గురించి వివరిస్తే ఇలానే చాలా ఏళ్లు జైలు శిక్ష విధించడం జరుగుతుందనేలా అంతర్జాతీయ జర్నలిస్టులకు మాత్రమే కాక మయన్మార్ జర్నలిస్టులకు కూడా పరోక్షంగా సందేశాన్ని ఇచ్చిందన్నారు. అంతేకాదు ఫెన్స్టర్ని విడుదల చేసేందుకు అమెరికా దౌత్యవేత్తలు కృషి చేస్తున్నారని సీనియర్ అడ్వైజర్ రిచర్డ్ పేర్కొన్నారు. ఈ సమస్య కచ్చితంగా దౌత్య మార్గాల ద్వారా పరిష్కారమవుతుందంటూ రిచర్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: తప్పించుకునే ప్రయత్నంలో దూకేశాడు..అంతే చివరికి!!) -
ఉగ్రదాడి.. ఏడుగురు రోహింగ్యా వలసదారుల మృతి
బంగ్లాదేశ్: బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దులోని రోహింగ్యా శరణార్థి శిబిరంలోని శిక్షణ సంస్థపై ముష్కరులు జరిపిన దాడుల్లో సుమారు ఏడుగురి చనిపోయినట్లు బంగ్లాదేశ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ముష్కరులు కొంతమందిని చంపేసి మరికొంత మంది పై కత్తులతో దాడి చేసినట్లు పోలీస్ చీఫ్ వెల్లడించారు. మూడు వారాల క్రితం రోహింగ్యా కమ్యూనిటీ నాయకుడిని అతని పై కాల్పుల జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: తింగరోడు.. లైవ్ టెలికాస్టింగ్‌లో ఫోన్ చోరీ! కట్ చేస్తే..) అయితే ఈ నేపథ్యంలోనే మయన్మార్ నుండి వచ్చిన దాదాపు 9 లక్షల మందికి పైగా ఉన్న శరణార్థుల శిభిరాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొనడంతోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడి జరిగినపుడు నలుగురు వెంటనే చనిపోగా మిగతా ముగ్గురు బాలుఖాలి క్యాంప్‌లోని ఆసుపత్రిలో మరణించారని అన్నారు. ఈ మేరకు దాడి జరిగిన వెంటనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సాయుధ బలగాల బెటాలియన్ ప్రాంతీయ చీఫ్ శిహాబ్ కైసర్ ఖాన్ తెలిపారు. (చదవండి: మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’) -
రూ. 29 కోట్ల ఖరీదు చేసే బంగారం, డ్రగ్స్ పట్టివేత
గౌహతి: కోహిమాలోని ఖుజమాలో నార్కోటిక్ చెక్ పాయింట్ వద్ద చేసిన తనిఖీలలో సుమారు 48 కిలోల బంగారం, రూ. 29 కోట్ల ఖరీదు చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గత మూడు రోజులగా నార్కోటిక్ చెక్ పాయింట్లలో నిర్వహించిన తనిఖీలో ఇవి వెలుగు చూశాయి అని చెప్పారు. (చదవండి: ఒకప్పుడు నేరస్తుడు.. ఇప్పుడు అనాథలకు మార్గదర్శకుడు!) ఈ సందర్భంగా నాగాలాండ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ ఎం తమ్‌గాడ్గే మాట్లాడుతూ...."రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువగా స్మగ్లింగ్ కోహిమాలోని ఖుజమా-ఇంఫాల్ జాతీయ రహదారిలోనే ఎక్కువగా జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ నిందుతులైన సౌరభ్ సింగ్, పవన్ కుమార్‌లకు సంబంధించిన వాహనంలోని గేర్‌లో 29 ప్యాకెట్లో రూ.22 కోట్లు ఖరీదు చేసే 10 బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నాం. దాదాపు ఆరు కోట్లు ఖరీదు చేసే హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం" అని చెప్పారు. మయాన్మార్ నుంచి సరిహద్దు ప్రాంతాలైన ఈశాన్యా ప్రాంతాలకు తరుచుగా మాదక ద్రవ్యాలు, ఆయుధ సామాగ్రీని అక్రమంగా తరలిస్తున్నారని అస్సాం రైఫిల్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అధికారులు వెల్లడించారు. (చదవండి: మిస్ వరల్డ్ అమెరికాగా తొలిసారి భారత సంతతి అమెరికన్) -
Myanmar Beauty Queen: దేశమాత స్వేచ్ఛ కోరి
మయన్మార్ బ్యూటీ క్వీన్ హటటున్.. జుంటా సైనిక నియంత పాలకులపై సమర శంఖాన్ని పూరించారు! జన్మభూమి విముక్తి కోసం మరణానికైనా తను సిద్ధమేనని ప్రకటించారు. మూడున్నర నెలల క్రితం మయన్మార్ సైన్యం ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి దేశాన్ని హస్తగతం చేసుకున్నాక మొదలైన తిరుగుబాటు ప్రదర్శనల్లో ఇప్పటివరకు వందల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగం వృథా కాకూదని అంటూ.. సైన్యంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధం కమ్మని యువతకు పిలుపునిస్తున్నారు హటటున్. మయన్మార్ బ్యూటీ క్వీన్ హటటున్ 1992లో పుట్టే నాటికే ముప్పై ఏళ్లుగా ఆ దేశం సైనిక పాలనలో ఉంది. పుట్టాక కూడా మరో ఇరవై ఏళ్లు మయన్మార్ సైనిక పాలనలోనే ఉంది. మధ్యలో పదేళ్ల ప్రజాస్వామ్య పాలన తర్వాత మళ్లీ ఇప్పుడు సైనిక పాలన! ఈ మధ్యలోని పదేళ్లలో హటటున్ బి.టెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివారు. మోడల్ అయ్యారు. సినిమాల్లో నటించారు. టీవీ సీరియల్స్‌లో కనిపించారు. మిస్ మయన్మార్ అయ్యారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచారు. జిమ్నాస్టిక్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నారు. ఇప్పుడు ‘మిలిటెంట్’ అయ్యారు! దేశమాత స్వేచ్ఛ కోసం తుపాకీని చేతికి అందుకున్నారు. ఇందుకు ఆమెను ప్రేరేపించిన పరిణామాలు ప్రపంచం అంతటికీ తెలిసినవే. నిత్యం ప్రపంచం కళ్లబడుతున్నవే. ఈ ఏడాది ఫిబ్రవరి 1న మయన్మార్ సైన్యం ప్రజాప్రభుత్వాన్ని కూలదోసింది. ప్రజలెన్నుకున్న నేత ఆంగ్‌సాంగ్ సూకీని అరెస్ట్ చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రజలెవరూ ప్రశ్నించడానికి, నిరసన ప్రదర్శనలు చేయడానికి వీధుల్లోకి రాకుండా యుద్ధట్యాంకుల్ని కవాతు చేయించింది. గగనతలంపై నుంచి బాంబులు జారవిడిచింది. సైన్యం కుట్రకు వ్యతిరేకంగా బిగిసిన పిడికిళ్లకు సంకెళ్లు వేసింది. గర్జించిన గళాలను అణిచివేసింది. ఇప్పటికి 800 మందికి పైగా ప్రదర్శనకారులు నియంత సైన్యం ‘జుంటా’ కాల్పుల్లో అమరులయ్యారు. బందీలుగా చిత్రహింసలు అనుభవిస్తూ తదిశ్వాస విడిచారు. ఈ ఘటనలన్నీ హటటున్‌ను కలచివేశాయి. ఆగ్రహోదగ్రురాలిని చేశాయి. అందాలరాణి కిరీటాన్ని పక్కనపెట్టి తుపాకీని చేతబట్టేలా ఆమెను ప్రేరేపించాయి. తనకు జన్మనిచ్చిన తల్లిని కాపాడుకోలేకపోతే తన జన్మే వృథా అనే ఆలోచనను ఆమెలో కలిగించాయి. ఇన్నాళ్లూ హటటున్‌ను ఒక అందాలరాణిగా మాత్రమే చూసిన మయన్మార్ యువత అత్యవసర సమయంలో ఆమెనొక పీపుల్స్ సోల్జర్‌గా చూసి సైనిక నియంతలపై తమ తిరుగుబాటుకు ఒక దివ్యాస్త్రం దొరికినట్లుగా భావిస్తున్నారు. కలిసికట్టుగా చేస్తున్న యుద్ధంలో హటటున్ ఇచ్చిన పిలుపు వారిలో ధైర్యాన్ని, సమరోత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ‘‘తిప్పికొట్టేందుకు సమయం ఆసన్నమైంది. మీ చేతిలో ఉన్న ఆయుధం అది ఏమిటన్నది కాదు. కలం, కీబోర్డు, ప్రజాస్వామ్య ఉద్యమానికి విరాళాలు ఇవ్వడం.. ఏదైనా సరే. అది ఆయుధమే. విప్లవం విజయం సాధించడానికి ఎవరి వంతుగా వారు పోరాడాలి’’ అని హటటున్ సోషల్ మీడియాలో విప్లవ నినాదం చేశారు. ఆ వెంటనే మయన్మార్ సైనిక ప్రభుత్వం ఆమెపై నిఘాపెట్టింది. ఆమె ఏ ప్రదేశం నుంచి తిరుగుబాటును రాజేస్తున్నదీ ఇప్పటికే సైన్యం కనిపెట్టిందనీ, ఏ క్షణమైనా ఆమెను రహస్య నిర్బంధంలోకి తీసుకోవచ్చనీ ఐక్యరాజ్యసమితికి వర్తమానం అందినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి! అయితే సైన్యం బూట్లచప్పుడుకు బెదిరేది లేదని హటటున్ అంటున్నారు. ‘‘నా దేశం కోసం నా ప్రాణాన్ని మూల్యంగా చెల్లించడానికైనా నేను సిద్ధమే. ‘విప్లవం అనేది చెట్టుపైనే మగ్గి రాలిపడే ఆపిల్ పండు కాదు. ఆ పండును నువ్వే చెట్టుపై నుంచి రాలిపడేలా చెయ్యాలి’ అని చే గువేరా అన్నారు. ఆయన మాటల్ని మదిలో ఉంచుకుంటే మనం విజయం సాధించినట్లే..’’ అని మే 11న ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఇచ్చిన ఒక పోస్టుతో యువతరంలో విప్లవస్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు హటటున్. ∙∙ మయన్మార్‌లోని ప్రధాన నగరం యాంగూన్‌లో ఉండేవారు హటటున్. గత ఏప్రిల్‌లో అక్కడి నుంచి తన ఫ్రెండ్‌తో కలిసి అజ్ఞాత ప్రదేశానికి తరలి వెళ్లారు. అక్కడ కారెన్ నేషనల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, యునైటెడ్ డిఫెన్స్ ఫోర్స్‌లతో కలిసి యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారు. నెలా పదిరోజులు ఆమె ఆ శిక్షణలో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌లను బట్టి తెలుస్తోంది. -
మయన్మార్‌లో నరమేథం
మయన్మార్‌లో ఎన్నికైన ప్రభుత్వాన్ని రెండునెలల క్రితం కుట్రపూరితంగా కూల్చి పాలన చేజి క్కించుకున్న సైనిక నియంతలు ఉన్నకొద్దీ ఉన్మాదులుగా మారుతున్నారు. అర్థరాత్రుళ్లు ఇళ్లపైబడి రాళ్లదాడి చేయటం, కాల్పులు సాగిస్తూ బీభత్సం సృష్టించటం, తలుపులు తెరవకపోతే వాహనాలతో ఢీకొట్టి పగలకొట్టడం నిత్యకృత్యమైంది. ఆ తర్వాత తమకు ‘కావలసిన’ వ్యక్తులు దొరికితే సంకెళ్లువేసి తీసుకుపోతున్నారు. రోజులు, వారాలు గడుస్తున్నా తమవారి ఆచూకీ తెలియక కుటుం బాలు రోదిస్తున్నాయి. చాలా సందర్భాల్లో శవాలను తిరిగి అప్పగిస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు సాయుధ దళాల గౌరవార్థం శనివారం జరిగిన దినోత్సవంనాడు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న ప్రజానీకంపై కాల్పులు జరిపి 114మందిని కాల్చిచంపారు. తాజాగా జనావాసాలపై విమానదాడులు కూడా మొదలయ్యాయి. ఫిబ్రవరి 1న ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నప్పటినుంచీ సైన్యం చేతుల్లో 450మంది మరణించగా, దాదాపు 3,000మంది అరెస్టయ్యారు. వందలాదిమంది జాడ తెలియడం లేదని ఆగ్నేయాసియా పార్లమెంటేరియన్ల బృందం చెబుతోంది. వీధుల్లోకి ఎవరూ రాకూడదని, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులున్నాయని సైన్యం ప్రతిరోజూ ప్రకటిస్తున్నా నిరసనలు ఆగకపోవటం ఆ దేశ పౌరుల స్వేచ్ఛా పిపాసకు అద్దం పడుతోంది. ఇదే సైన్యానికి కంటగింపుగా వుంది. మయన్మార్ సైన్యానికి జనం నాడి తెలియనిదేమీ కాదు. అర్థ శతాబ్దికిపైగా ఆ దేశాన్ని గుప్పిట బంధించినప్పుడు వారికి నిరంతరం ఛీత్కారాలే ఎదురయ్యాయి. ఇలా ఎల్లకాలమూ మనుగడ సాగించటం సాధ్యంకాదని 2015లో ఎన్నికలకు సిద్ధపడింది. అయితే తమ పెత్తనం యధావిధిగా సాగించేందుకు వీలుగా పార్లమెంటులో 25 శాతం స్థానాలను ఏకపక్షంగా తనకు తాను రిజర్వ్ చేసుకుంది. తన వ్యూహానికి ఇది సరిపోకపోవచ్చన్న ఉద్దేశంతో మాజీ సైనికాధికారులతో యూనియన్ సాలిడారిటీ అండ్ డెవెలప్మెంట్ పార్టీ(యూఎన్డీపీ) పేరిట ఒక పార్టీని కూడా నెలకొల్పింది. గత నవంబర్ ఎన్నికల్లో ఈ వ్యూహం అక్కరకు రాకుండాపోయి ఆంగ్‌సాన్ సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ)కే మెజారిటీ లభించటంతో దానికి కాళ్లూ చేతులూ ఆడలేదు. అందుకే మరోసారి సైనిక నియంతృత్వానికి తెగబడింది. మయన్మార్ బహుళ జాతుల నిలయం. ఈ జాతులన్నిటి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే ఒక ప్రజాస్వామిక వేదిక అవసరం. ఇది లేని కారణంగానే యాభైయ్యేళ్లపాటు దాదాపు అన్ని జాతులూ తమ ప్రయోజనాల పరిరక్షణకు ఘర్షణనే మార్గంగా ఎంచుకున్నాయి. ఇవి ఉన్నకొద్దీ ముదిరి, పాలన అదుపు తప్పటం సైన్యానికి తలనొప్పిగా పరిణమించింది. ఈ అనుభవాల తర్వాతే మయన్మార్ సైన్యం కనీసం ప్రత్యక్షంగా పాలించే విధానానికైనా దూరంగా వుండాలని 2015లో నిర్ణయించుకుంది. కానీ గత అయిదారేళ్లుగా అది ప్రజాస్వామ్య పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. విషాదమేమంటే ఉద్యమ నేత ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ సైతం ఆ స్పృహలో లేకపోవటం. మయన్మార్‌లో ప్రజాస్వామ్యం మళ్లీ మొగ్గ తొడిగే సమయానికి సాయుధ పోరాటబాట పట్టిన 15 ముఖ్యమైన జాతుల్లో ఏడెనిమిది జాతులు ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రోహింగ్యా ముస్లింలు అందులో లేరు. అనంతరం వచ్చిన ఎన్ఎల్డీ ప్రభుత్వం వారిని కూడా శాంతిప్రక్రియలో భాగం చేసివుంటే, బుద్ధిస్ట్ మిలిటెంట్లను కట్టడి చేస్తే పరిస్థితి వేరుగా వుండేది. కానీ ఆ దిశగా ప్రయత్నం చేయకపోగా, రోహింగ్యాలపై దమనకాండ అమలు చేసిన సైన్యం తీరును చూసీచూడనట్టు వూరుకుంది. సరిగదా...అంతర్జాతీయ వేదికపై సాక్షాత్తూ సూకీయే సైన్యాన్ని సమర్థించారు. వారికి ఓటు హక్కు కూడా లేకుండా చేయటం ఆమెకు ఏమాత్రం అన్యాయం అనిపించలేదు. దాని పర్యవసానాలేమిటో ఇప్పుడామెకు అర్ధమైవుండాలి. ప్రజాస్వామ్యమంటే సైన్యం నుంచి తన పార్టీకి అధికారమార్పిడి జరగటం కాదు. ప్రజాస్వామ్య సంస్కృతి సమాజంలోని అన్ని స్థాయిల్లోనూ నెలకొనటం. గత అయిదేళ్లలో అలాంటి సంస్కృతి వేళ్లూనుకుంటే సైన్యం మళ్లీ అధికారం హస్తగతం చేసుకోవటం ఇంత సులభమయ్యేది కాదు. మయన్మార్ సైన్యం ఆగడాలపై ఆలస్యంగానైనా ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. 12 దేశాల సైనిక చీఫ్‌లు నిరాయుధ పౌరులపై కాల్పులు జరపటాన్ని, బాంబుదాడులు చేయటాన్ని ఖండించారు. అయితే ఒకపక్క సైన్యం ప్రజలను పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తుంటే సైనిక దినోత్సవంలో మన దౌత్యకార్యాలయ ప్రతినిధితోపాటు రష్యా, చైనా, పాకిస్తాన్ తదితర ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి. ఇది తప్పుడు సంకేతాలు పంపుతుంది. మయన్మార్‌తో మనకు 1,600 కిలోమీటర్ల సరిహద్దు వుంది. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ ఆ పొడవునే వున్నాయి. మయన్మార్‌లో సైన్యం దారుణాలు పెచ్చరిల్లాక ఒక్క మిజోరంకే దాదాపు 1,500మంది ఆ దేశ పౌరులు కుటుంబాలతోసహా ప్రాణభయంతో వచ్చారు. వీరిలో మయన్మార్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వున్నారు. ఉన్నకొద్దీ ఇది పెరుగుతుందే తప్ప తగ్గదు. కనుక మయన్మార్ అల్లకల్లోలంగా ఉన్నంతకాలమూ అది మన దేశంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంది. అందుకే సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తగిన చర్యలు తీసుకోమని మయన్మార్ సైన్యానికి చెప్పాల్సిన బాధ్యత మనపై వుంది. -
మయన్మార్ మిలటరీ ఫేస్బుక్ పేజీ తొలగింపు
యాంగాన్: మయన్మార్‌లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు సాధారణ పౌరులు మరణించడం పట్ల ఫేస్బుక్ యాజ మాన్యం విచారం వ్యక్తం చేసింది. మయన్మార్ మిలటరీ ప్రధాన పేజీని ఫేస్బుక్ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. తాము పాటిస్తున్న ప్రమాణాల ప్రకారం హింసను రెచ్చగొట్టే అంశాలను కచ్చితంగా తొలగిస్తామని వెల్ల్లడించింది. మయన్మార్ సైన్యం తాత్మదా ట్రూ న్యూస్ ఇన్ఫర్మేషన్ టీమ్ పేరిట ఫేస్బుక్ పేజీని నిర్వహిస్తోంది. ఆ పేజీ ఇప్పుడు కనిపిం చడం లేదు. కాగా, పోలీసు దమనకాండను ఖండిస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఫిబ్రవరి 9న పోలీసుల కాల్పుల్లో గాయపడిన 19 ఏళ్ల మయా థ్వెట్ ఖీనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. ఆమె అంత్యక్రియలను ఆదివారం యాంగాన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా జనం పాల్గొన్నారు. -
సూకీపై కొత్తగా అక్రమ వాకీటాకీల కేసు
యాంగాన్: మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ) అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూకీపై పోలీసులు కొత్త ఆరోపణలు ప్రారంభించారు. విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న వాకీటాకీలు ఆమె ఇంట్లో లభ్యమయ్యాయని, ఈ కేసులో ఆమెను ఫిబ్రవరి 15దాకా నిర్బంధంలో ఉంచుతామన్నారు. ప్రభుత్వం వద్ద రిజిస్టర్ కాని వాకీటాకీలను సూకీ భద్రతా సిబ్బంది వాడారని పేర్కొన్నారు. మయన్మార్‌లో సోమవారం కొత్త ప్రభుత్వాన్ని కూలదోసి, సైన్యం అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అదే రోజు ఆంగ్ సాన్ సూకీని, ఆమె పార్టీకి చెందిన ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా వాకీటాకీల దిగుమతి కేసులో సూకీకి గరిష్టంగా రెండేళ్ల దాకా జైలుశిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
బిగిసిన ఒక చిట్టి పిడికిలి
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు తెలియదు. తెలియాల్సిన అవసరం కూడా లేదు. కాని ఆ అమ్మాయి కళ్లల్లో గూడు కట్టి ఉన్న కన్నీరు ఆ అమ్మాయి కథంతా చెబుతోంది. ఈ ఫొటో 2017 నవంబర్‌లో ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ వార్తాసంస్థ తీసినది. బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్ శరణార్థి శిబిరాలలో తల దాచుకున్న రోహింగ్యా ముస్లింలను ఆ సంస్థ ఇంటర్వ్యూ చేసినప్పుడు మొత్తం 27 మంది స్త్రీలు తమ కళ్లు మాత్రమే కనపడేలా మాట్లాడారు. వారంతా తమపై సైన్యం అత్యాచారం చేసిందని చెప్పారు. ఈ ఫొటోలోని అమ్మాయి బంగ్లాదేశ్ చేరుకునేలోపు జూన్‌లో ఒకసారి, తిరిగి సెప్టెంబర్‌లో ఒకసారి అత్యాచారానికి గురైంది. 2017 ఆగస్టులో మయన్మార్‌లోని మైనార్టీ వర్గమైన రోహింగ్యా ముస్లింలపై సైన్యం తెగబడింది. ఊళ్లను తగులబెట్టింది. ఖాళీ చేయించింది. దేశం బయటకు తరిమికొట్టింది. వందలాది మరణాలు, లెక్కకు మించిన అత్యాచారాలు జరిగాయి. దాదాపు 7 లక్షల మంది ప్రాణాలు అరచేత పట్టుకొని సొంత నేలను వదిలి బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. ఈ మానవ హననం పట్ల ప్రపంచంలోని చాలా కొద్ది దేశాలు మాత్రమే నిరసన వ్యక్తం చేశాయి. అన్నింటి కంటే గట్టిగా కెనెడా దేశం తన పార్లమెంట్లో ‘మయన్మార్‌లో జరిగినది జాతి హననం’ అని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మయన్మార్ సైన్యం మీద అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలని ఆ దేశ మానవ హక్కుల సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే కెనెడా కేవలం ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి ఫిర్యాదు మాత్రమే చేయగలిగింది. కాని ఇప్పుడు మయన్మార్‌ను పశ్చిమాసియాలోని అతి చిన్న దేశమైన గాంబియా బోనులో నిలబెట్టింది. మయన్మార్‌లో ముస్లిం మైనారిటీల పట్ల సైన్యం చేసిన అత్యాచారాలను విచారించాల్సిందిగా నిన్న (నవంబర్ 11, 2019)న ఫిర్యాదు చేసింది. ఆ దేశం తరపున కొందరు న్యాయవాదుల బృందం నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ‘మా దేశం చాలా చిన్నదే కావచ్చు. కాని న్యాయం పట్ల మేమెత్తిన గొంతు పెద్దది’ అని గాంబియా దేశ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇటువంటి ప్రతిస్పందనలు చూసినప్పుడు బాధితులకు అండగా నిలిచేవారు ఎప్పుడూ ఉంటారని అనిపిస్తుంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుంది. -
2 లక్షల మంది రోహింగ్యాల ర్యాలీ
కుటుపలోంగ్: మయన్మార్ బలగాల దాడుల నుంచి తప్పించుకుని పారిపోయి రెండేళ్లయిన సందర్భంగా బంగ్లాదేశ్‌లోని కుటుపలోంగ్ శరణార్థి శిబిరంలో ఉంటున్న దాదాపు 2 లక్షల మంది రోహింగ్యాలు అక్కడే ర్యాలీ చేపట్టారు. 2017 ఆగస్టులో మయన్మార్‌లోని రఖినే రాష్ట్రం నుంచి 7.4 లక్షల మంది రోహింగ్యాలు బయటకు వెళ్లిపోయారు. అంతకుముందే మయన్మార్ నుంచి వచ్చిన మరో 2 లక్షల మంది రోహింగ్యాలు ఆగ్నేయ బంగ్లాదేశ్‌లోని శిబిరాల్లో ఉంటున్నారు. వారికి ఈ 7.4 లక్షల మంది కూడా జతకలిశారు. ఆదివారం జరిగిన ర్యాలీలో హత్యాకాండ దినం సందర్భంగా చిన్నారులు, మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘దేవుడు గొప్పవాడు. రోహింగ్యాలు వర్ధిల్లాలి’ అంటూ వారంతా నినాదాలు చేశారు. -
భారత్ మానవ హక్కులను కాలరాస్తోందా
సాక్షి, న్యూఢిల్లీ : ఏడుగురు రోహింగ్యా ముస్లింలను భారత ప్రభుత్వం గురువారం నాడు మయన్మార్‌కు పంపించిన విషయం తెల్సిందే. వారు 2012లో భారత్‌లో అక్రమంగా ప్రవేశించి అరెస్టయ్యారు. అప్పటి నుంచి వారు అస్సాం జైల్లోనే ఉన్నారు. వారిని వెనక్కి పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంత మంది మానవ హక్కుల కార్యకర్తలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో వారిని గురువారం మయన్మార్‌కు సాగనంపారు. మయన్మార్‌లో 2012 నుంచే కల్లోల పరిస్థితులు నెలకొని ఉండగా, 2016లో మైనారిటీలయిన రోహింగ్యా ముస్లింలకు వ్యతిరేకంగా అక్కడ మారణ హోమం ప్రారంభమైంది. ఆ జాతిని సమూలంగా నిర్మూలించేందుకు మయన్మార్ సైన్యం నడుంగట్టింది. పర్యవసానంగా వేలాది కుటుంబాలను హత్య చేశారు. వందలాది గ్రామాలను తగులబెట్టారు. మహిళలు, పిల్లలపై సామూహికంగా హత్యలు జరిపారు. ఇక ఆ దేశంలో తలదాచుకునేందుకు కూడా చోటు లేక దాదాపు 9 లక్షల మంది రోహింగ్యాలు ఇరుగు, పొరుగు దేశాల వైపు పరుగులు తీశారు. ఈ దారణ మారణ కాండను ఐక్యరాజ్య సమితితోపాటు పలు ప్రపంచ దేశాలు ఖండించాయి. శాంతి భద్రతల పరిస్థితిని చక్కదిద్దాలని, రోహింగ్యాలను తిరిగి వెనక్కి తీసుకోవాలని మయన్మార్ ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. అప్పటి వరకు తాత్కాలికంగానైనా సరే రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలని ఇరుగు పొరుగు దేశాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారీ సంఖ్యలో పరుగెత్తుకొచ్చిన రోహింగ్యాలను అటు బంగ్లా, ఇటు భారత దేశం సరిహద్దుల్లోనే నిలిపి వేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏడుగురు రోహింగ్యాలను భారత ప్రభుత్వం వెనక్కి పంపించింది. మాతృ దేశంలో మారణ హోమం కొనసాగుతున్నప్పుడు వారిని అక్కడికి పంపించడం కచ్చితంగా మానవ హక్కులను ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ చట్టం ‘రిఫౌల్‌మెంట్’ను ఉల్లంఘించడమే. ఓ దేశంలో జాతుల మధ్య హింసాకాండ కొనసాగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాందిశీకులను లేదా శరణార్థులను ఆ దేశానికి పంపించకూడదన్నదే ‘రిఫౌల్‌మెంట్’ ఒప్పందం. ఈ అంతర్జాతీయ ఒప్పందంపై భారత్ కూడా సంతకం చేసింది. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి హెచ్చరికలను పట్టించుకోకుండా రోహింగ్యా ముస్లింలను పంపించాలని భారత ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకుంది. అస్సాంలో అసలైన భారతీయ పౌరులను గుర్తించడంలో భాగంగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను వేరు చేసేందుకు కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించేందుకు బిల్లును తీసుకొచ్చిన (ప్రస్తుతం ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది) భారత ప్రభుత్వం రోహింగ్యాలను వెనక్కి పంపించడానికి కారణం వారు ముస్లింలు కావడమేనా...! చదవండి: రెచ్చగొడితేనే ‘మారణ హోమాలు’ -
‘ఆ జర్నలిస్టులకు క్షమాభిక్ష పెట్టాలి’
న్యూయార్క్ : జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టుల తరపున వారి కుటుంబాలు.. మయన్మార్ అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేశాయని మానవ హక్కుల న్యాయవాది అమల్ క్లూనీ తెలిపారు. శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో జరిగిన పత్రికా స్వేచ్ఛా కార్యక్రమంలో అమల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లకు మయన్మార్ అధ్యక్షుడు విన్ మింట్ క్షమాభిక్ష పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఆమెకే బాగా తెలుసు.. ‘ఒక వ్యక్తికి శిక్ష పడిన తర్వాత క్షమాభిక్ష ద్వారా అతడు మళ్లీ సాధారణం జీవితం గడిపేందుకు వీలవుతుంది కదా. ఈ కోవలోనే వా లోన్, కా సో ఓల కుటుంబ సభ్యులు అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం వారి తరపున దరఖాస్తు చేశారు. నాకు తెలిసి మయన్మార్ అధ్యక్షుడు ఈ విషయమై అంగ్ సాన్ సూకీతో తప్పకుండా చర్చిస్తారు. వారిద్దరు తలచుకుంటే ఈ ఇద్దరు జర్నలిస్టులకు ఈరోజుతో శిక్ష నుంచి విముక్తి లభిస్తుంది. ఒక రాజకీయ ఖైదీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అంగ్ సాన్ సూకీ కంటే ఎవరికీ కూడా అంత ఎక్కువగా తెలిసి ఉండదు’ అంటూ అమల్ వ్యాఖ్యానించారు. కాగా మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లకు యంగూన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మయన్మార్ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంగా అరెస్టైన వీరిద్దరి వద్ద దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు లభ్యమయ్యాయన్న ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు వీరికి శిక్ష ఖరారు చేస్తూ సెప్టెంబరు 3న తీర్పు ఇచ్చింది. ధైర్యంగా ఎదుర్కొంటాం.. తీర్పు అనంతరం వా లోన్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ తీర్పును మేం దృఢచిత్తంతో, ధైర్యంగా ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ప్రభుత్వం తమను అరెస్ట్ చేయగలదనీ, కానీ ప్రజల కళ్లు, చెవులను మాత్రం మూయలేదని కా అన్నారు. కాగా ఇద్దరు జర్నలిస్టులను విడుదల చేయాలని మయన్మార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేశాయి. -
రోహింగ్యాలకు భారత్ చేయూత..!
సాక్షి, న్యూఢిల్లీ : మయన్మార్‌లో ఊచకోతకు గురైన రోహింగ్యా ముస్లింలకు భారత ప్రభుత్వం చేయూతగా నిలిచింది. గత ఏడాది మయన్మార్ ప్రభుత్వం, సైన్యం చేతిలో ఊచకోతకు గురైన రోహింగ్యాలు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నివాసముంటున్న విషయం తెలిసిందే. బంగ్లాలో ఉంటున్న రోహింగ్యా ముస్లింలకు భారత ప్రభుత్వం తరుఫున నిత్యవసర వస్తువులను సోమవారం బంగ్లాకు పంపింది. పదిలక్షల లీటర్లకుపైగా కిరోసిన్, ఇరవై వేల కిరోసిన్ స్టవ్‌లు, ఇతర నిత్యవసర వస్తువులు రోహింగ్యాలకు చేరినట్లు బంగ్లాదేశ్‌లో భారత హై కమిషనర్ హర్ష వర్ధన్ వెల్లడించారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాల బలోపేతంలో భాగంగా భారత విదేశాంగ ప్రతినిధులు వాటిని పంపినట్లు ఆయన తెలిపారు. కాగా మయన్మార్ సైన్యం రోహింగ్యాలపై దమనకాండ తరువాత అత్యధికంగా బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో సుమారు ఐదు లక్షల వరకు రోహింగ్యాలు నివాసముంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది -
మయన్మార్ చరిత్రలో చీకటిరోజు
నోపిడా : మయన్మార్ చరిత్రలో ఈ రోజును చీకటి రోజుగా ఆ దేశ పత్రిక సెవెన్ డైలీ (7డైలీ) వర్ణించింది. దేశంలో వాక్ స్వాతంత్య్ర లేదని, మీడియాపై ప్రభుత్వం కుట్రపూరీతంగా వ్యవహరిస్తోందని దేశంలో అతిపెద్ద ప్రచురణగల సెవెన్ డైలీ మొదటి పేజీలో ప్రచురించింది. అంతేకాకుండా మొదటి పేజీలో కొంత భాగాన్ని పూర్తిగా నల్లరంగుతో ప్రచురించి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. మయన్మార్‌లో ఇటీవల జరిగిన రోహింగ్యాల ఊచకోతపై ఇద్దరు జర్నలిస్టులు ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా కథనాలు రాశారన్న ఆరోపణలతో.. ప్రభుత్వం వారిపై అక్రమ కేసులను పెట్టింది. ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు ఇద్దరు జర్నలిస్టులకు ఏడేళ్లు శిక్షను విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన పత్రికలు ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రజాప్రభుత్వం పేరుతో 2015లో బాధ్యతలు స్వీకరించిన అంగ్‌సాన్ సూకీ కూడా గతంలో దుర్మర్గాలకు పాల్పడిన సైన్యం అడుగుజాడల్లోనే నడుస్తున్నారని సెవెన్ డైలీ వ్యాఖ్యానించింది. పత్రికలపై సెన్సార్షిప్ విధిస్తూ 2012 సైన్యం చట్టం చేసిందని.. ఆ చట్టం పేరుతో సూకీ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారని తీవ్రంగా మండిపడింది. -
రాయిటర్స్ జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు
యాంగూన్: మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులకు అక్కడి న్యాయస్థానం సోమవారం ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లు అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని యాంగూన్ కోర్టు వ్యాఖ్యానించింది. గతేడాది ఆగస్టులో అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్ఎస్ఏ)కి చెందిన కొందరు ఉగ్రవాదులు మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, ఆర్మీ కేంద్రాలపై దాడిచేశారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేత పేరిట మయన్మార్ సైన్యం ఊచకోత ప్రారంభించడంతో దాదాపు 7 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు అరచేత పట్టుకుని బంగ్లాదేశ్‌కు పారిపోయివచ్చారు. ఈ సందర్భంగా రఖైన్‌లోని ఇన్ డిన్ గ్రామంలో 10 మంది అమాయకుల్ని మయన్మార్ సైన్యం కాల్చిచంపిన విషయాన్ని వా లోన్, కా బయటపెట్టారు. అనంతరం యాంగూన్‌లో జరిగిన ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న వీరికి పోలీస్ అధికారి ఒకరు కొన్ని కాగితాలను రహస్యంగా అందించారు. వాటిని తీసుకుని హోటల్ నుంచి బయటకు రాగానే ఆర్మీ అధికారులు కా, లోన్లను అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన యాంగూన్ కోర్టు ఇద్దరు జర్నలిస్టుల వద్ద దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు లభ్యమయ్యాయని తెలిపింది. తామిద్దరం ఎలాంటి తప్పు చేయలేదని జర్నలిస్టులు చేసిన వాదనను ఈ సందర్భంగా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరిద్దరికి ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు అనంతరం లోన్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ తీర్పును మేం దృఢచిత్తంతో, ధైర్యంగా ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ప్రభుత్వం తమను అరెస్ట్ చేయగలదనీ, కానీ ప్రజల కళ్లు, చెవులను మాత్రం మూయలేదని కా అన్నారు. ఈ రోజు మయన్మార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాకు దుర్దినమని రాయిటర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీఫెన్.జె.అడ్లర్ వ్యాఖ్యానించారు. మీడియా నోరు మూయించేందుకు, భయపెట్టేందుకు మయన్మార్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందన్నారు. కాగా ఇద్దరు జర్నలిస్టులను విడుదల చేయాలని మయన్మార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేశాయి.