కోర్టు వద్ద బేడీలతో వా లోన్, కా సో ఓ
యాంగూన్: మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులకు అక్కడి న్యాయస్థానం సోమవారం ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లు అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని యాంగూన్ కోర్టు వ్యాఖ్యానించింది. గతేడాది ఆగస్టులో అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్‌ఎస్‌ఏ)కి చెందిన కొందరు ఉగ్రవాదులు మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, ఆర్మీ కేంద్రాలపై దాడిచేశారు.
దీంతో ఉగ్రవాదుల ఏరివేత పేరిట మయన్మార్ సైన్యం ఊచకోత ప్రారంభించడంతో దాదాపు 7 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు అరచేత పట్టుకుని బంగ్లాదేశ్‌కు పారిపోయివచ్చారు. ఈ సందర్భంగా రఖైన్‌లోని ఇన్ డిన్ గ్రామంలో 10 మంది అమాయకుల్ని మయన్మార్ సైన్యం కాల్చిచంపిన విషయాన్ని వా లోన్, కా బయటపెట్టారు. అనంతరం యాంగూన్‌లో జరిగిన ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న వీరికి పోలీస్ అధికారి ఒకరు కొన్ని కాగితాలను రహస్యంగా అందించారు.
వాటిని తీసుకుని హోటల్ నుంచి బయటకు రాగానే ఆర్మీ అధికారులు కా, లోన్‌లను అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన యాంగూన్ కోర్టు ఇద్దరు జర్నలిస్టుల వద్ద దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు లభ్యమయ్యాయని తెలిపింది. తామిద్దరం ఎలాంటి తప్పు చేయలేదని జర్నలిస్టులు చేసిన వాదనను ఈ సందర్భంగా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరిద్దరికి ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది.
తీర్పు అనంతరం లోన్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ తీర్పును మేం దృఢచిత్తంతో, ధైర్యంగా ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ప్రభుత్వం తమను అరెస్ట్ చేయగలదనీ, కానీ ప్రజల కళ్లు, చెవులను మాత్రం మూయలేదని కా అన్నారు. ఈ రోజు మయన్మార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాకు దుర్దినమని రాయిటర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీఫెన్.జె.అడ్లర్ వ్యాఖ్యానించారు. మీడియా నోరు మూయించేందుకు, భయపెట్టేందుకు మయన్మార్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందన్నారు. కాగా ఇద్దరు జర్నలిస్టులను విడుదల చేయాలని మయన్మార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment