rohingya muslims
-
‘రోహింగ్యాలపై హత్యాకాండ ఆపండి’
ది హేగ్: మయన్మార్ సైన్యం దాడులతో బంగ్లాదేశ్ వెళ్లి తలదాచుకుంటున్న లక్షలాది మంది రోహింగ్యా ముస్లింలకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బాసటగా నిలిచింది. రోహింగ్యాలపై మారణకాండను ఆపేందుకు మయన్మార్ ప్రభుత్వం వెంటనే అన్ని రకాల చర్యలనూ తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నదీ ముందుగా నాలుగు నెలలకు, ఆ తర్వాత ఆరు నెలలకోసారి నివేదిక అందించాలని ఐసీజే ప్రెసిడెంట్ అబ్దుల్ఖవీ అహ్మద్ యూసఫ్ కోరారు. మయన్మార్ సైన్యం రోహింగ్యాలపై అత్యాచారాలు, హత్యలు, ఆస్తుల విధ్వంసాలకు పాల్పడుతోందని ముస్లిం దేశాల తరఫున ఐసీజేలో గాంబియా వాదించింది. -
సిటీలో రోహింగ్యాలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఉంటున్న రోహింగ్యాల లెక్క తేల్చేందుకు నగర పోలీసుల సిద్ధమయ్యారు. అక్రమంగా వలస వస్తున్న రోహింగ్యాలతో దేశ భద్రతకు ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. వీరు ఎక్కువగా వలస వస్తున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో నివసిస్తున్న రోహింగ్యాలు ఎంతమందో లెక్కించాలని ఆదేశాలు జారీ చేశారు. సిటీ స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) అధికారులు శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించి వారం రోజుల్లో పూర్తి చేయాలన్న కొత్వాల్.. అందుకు 26 మంది అధికారులను ఎస్బీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మూడు ఠాణాల పరిధిలోనే.. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో మయన్మార్‌ను వదులుతున్న అనేక మంది రోహింగ్యాలు అక్రమంగా వివిధ దేశాలకు వలసపోతున్నారు. ఈ తరçహా శరణార్థుల బెడద బంగ్లాదేశ్‌తో పాటు భారత్‌కూ అధికంగానే ఉంది. దేశంలోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్‌కూ రోహింగ్యాలు పెద్ద సంఖ్యలోనే వచ్చారు. ప్రధానంగా శివార్లతో పాటు పాతబస్తీలోని బహదూర్‌పురా, కంచన్‌బాగ్, చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ల పరిధిలో వీరు నివసిస్తున్నారు. రోహింగ్యా శరణార్థుల ముసుగులో అసాంఘికశక్తులు, ఉగ్రవాదులు సైతం దేశంలోకి చొరబడతారని, వారి శిబిరాల్లోనే తలదాచుకుని అదును చూసి పంజా విసురుతారని కేంద్ర నిఘా వర్గాలు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో వీరిపై డేగకన్ను వేశారు. సిటీలో ఆడిటింగ్‌కు నిర్ణయం నగరంలో నివసిస్తున్న రోహింగ్యాల్లో కొందరు అనుమతి పొందిన శరణార్థులూ ఉన్నారు. వీరికి ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అక్రమంగా నివసిస్తున్న వారితోనే ముప్పు ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిటీలో ఉంటున్న రోహింగ్యాల్లో గుర్తింపు కార్డులు ఉన్న వారు ఎందరు? లేకుండా ఉంటున్న వారు ఎందరు? తదితర అంశాలను నిగ్గు తేల్చడానికి సిద్ధమయ్యారు. సాధారణంగా ప్రతి విదేశీయుడి వివరాలూ పోలీసుల వద్ద ఉన్నప్పటికీ రోహింగ్యాల విషయంలో మాత్రం ఇబ్బంది వస్తోంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సిటీ పోలీసు విభాగం రోహింగ్యాల ఆడిటింగ్ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించింది. అయితే, ఈలోపు ఎన్నికల హడావుడి రావడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు ఎన్నికల క్రతువు బుధవారంతో పూర్తయింది. దీంతో రోహింగ్యాలను లెక్కింపు తక్షణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను ఎస్బీ అధికారులకు అప్పగించారు. అదనంగా 26 మంది ఎస్సైలు, కానిస్టేబుళ్లను కేటాయించారు. ఈ మేరకు కొత్వాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడంతో వీరంతా గురువారం ఎస్బీలో రిపోర్ట్ చేశారు. వీరందరితో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. శుక్రవారం నుంచి ఆడిటింగ్ ప్రారంభిస్తున్న ఈ స్పెషల్ టీమ్స్ ప్రతి ఒక్క రోహింగ్యా నుంచి వివరాలు సేకరిస్తారు. వారి పేర్లు, శాశ్వత, తాత్కాలిక చిరునామాలు, ఫొటోలతో పాటు బయోమెట్రిక్ వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరిస్తూ స్పెషల్బ్రాంచ్లో ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయనున్నారు. -
‘ఓటర్ల జాబితాలో రోహింగ్యా ముస్లింలు’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో రోహింగ్యా ముస్లింల పేర్లను అక్రమంగా చేర్చారని బీజేపీ బుధవారం ఆరోపించింది. పాలక టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌లు మూకుమ్మడిగా కుట్ర పన్ని ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని, దీనిపై ఈసీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్టీ జాతీయ మీడియా చీఫ్ అనిల్ బలూనిలతో కూడిన ఆ పార్టీ ప్రతినిధి బృందం ఈ మేరకు ఈసీ ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించింది. రోహింగ్యా ముస్లింలు భారత పౌరులు కాదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసినా తెలంగాణలో వారిని ఓటర్లుగా చేర్చారని నక్వీ ఆరోపించారు. దేశ చట్టాలకు విరుద్ధంగా రోహింగ్యా ముస్లింలను ఓటర్ల జాబితాలో చేర్చడం దారుణమని మండిపడ్డారు. ఈ అంశంపై విచారణ చేపట్టేందుకు ఈసీ తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోగా 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను చక్కదిద్దాలని కోరారు. ఓటర్ల జాబితాలో అసాధారణ హెచ్చుతగ్గులున్నాయని బీజేపీ విస్మయం వ్యక్తం చేసింది. పాలక టీఆర్ఎస్ అక్రమ పద్ధతుల్లో బోగస్ ఓటర్లను చేర్పించిందని కేంద్ర మంత్రి నక్వీ ఆరోపించారు. -
భారత్ మానవ హక్కులను కాలరాస్తోందా
సాక్షి, న్యూఢిల్లీ : ఏడుగురు రోహింగ్యా ముస్లింలను భారత ప్రభుత్వం గురువారం నాడు మయన్మార్‌కు పంపించిన విషయం తెల్సిందే. వారు 2012లో భారత్‌లో అక్రమంగా ప్రవేశించి అరెస్టయ్యారు. అప్పటి నుంచి వారు అస్సాం జైల్లోనే ఉన్నారు. వారిని వెనక్కి పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంత మంది మానవ హక్కుల కార్యకర్తలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో వారిని గురువారం మయన్మార్‌కు సాగనంపారు. మయన్మార్‌లో 2012 నుంచే కల్లోల పరిస్థితులు నెలకొని ఉండగా, 2016లో మైనారిటీలయిన రోహింగ్యా ముస్లింలకు వ్యతిరేకంగా అక్కడ మారణ హోమం ప్రారంభమైంది. ఆ జాతిని సమూలంగా నిర్మూలించేందుకు మయన్మార్ సైన్యం నడుంగట్టింది. పర్యవసానంగా వేలాది కుటుంబాలను హత్య చేశారు. వందలాది గ్రామాలను తగులబెట్టారు. మహిళలు, పిల్లలపై సామూహికంగా హత్యలు జరిపారు. ఇక ఆ దేశంలో తలదాచుకునేందుకు కూడా చోటు లేక దాదాపు 9 లక్షల మంది రోహింగ్యాలు ఇరుగు, పొరుగు దేశాల వైపు పరుగులు తీశారు. ఈ దారణ మారణ కాండను ఐక్యరాజ్య సమితితోపాటు పలు ప్రపంచ దేశాలు ఖండించాయి. శాంతి భద్రతల పరిస్థితిని చక్కదిద్దాలని, రోహింగ్యాలను తిరిగి వెనక్కి తీసుకోవాలని మయన్మార్ ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. అప్పటి వరకు తాత్కాలికంగానైనా సరే రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలని ఇరుగు పొరుగు దేశాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారీ సంఖ్యలో పరుగెత్తుకొచ్చిన రోహింగ్యాలను అటు బంగ్లా, ఇటు భారత దేశం సరిహద్దుల్లోనే నిలిపి వేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏడుగురు రోహింగ్యాలను భారత ప్రభుత్వం వెనక్కి పంపించింది. మాతృ దేశంలో మారణ హోమం కొనసాగుతున్నప్పుడు వారిని అక్కడికి పంపించడం కచ్చితంగా మానవ హక్కులను ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ చట్టం ‘రిఫౌల్‌మెంట్’ను ఉల్లంఘించడమే. ఓ దేశంలో జాతుల మధ్య హింసాకాండ కొనసాగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాందిశీకులను లేదా శరణార్థులను ఆ దేశానికి పంపించకూడదన్నదే ‘రిఫౌల్‌మెంట్’ ఒప్పందం. ఈ అంతర్జాతీయ ఒప్పందంపై భారత్ కూడా సంతకం చేసింది. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి హెచ్చరికలను పట్టించుకోకుండా రోహింగ్యా ముస్లింలను పంపించాలని భారత ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకుంది. అస్సాంలో అసలైన భారతీయ పౌరులను గుర్తించడంలో భాగంగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను వేరు చేసేందుకు కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించేందుకు బిల్లును తీసుకొచ్చిన (ప్రస్తుతం ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది) భారత ప్రభుత్వం రోహింగ్యాలను వెనక్కి పంపించడానికి కారణం వారు ముస్లింలు కావడమేనా...! చదవండి: రెచ్చగొడితేనే ‘మారణ హోమాలు’ -
రాయిటర్స్ జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు
యాంగూన్: మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులకు అక్కడి న్యాయస్థానం సోమవారం ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లు అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని యాంగూన్ కోర్టు వ్యాఖ్యానించింది. గతేడాది ఆగస్టులో అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్ఎస్ఏ)కి చెందిన కొందరు ఉగ్రవాదులు మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, ఆర్మీ కేంద్రాలపై దాడిచేశారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేత పేరిట మయన్మార్ సైన్యం ఊచకోత ప్రారంభించడంతో దాదాపు 7 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు అరచేత పట్టుకుని బంగ్లాదేశ్‌కు పారిపోయివచ్చారు. ఈ సందర్భంగా రఖైన్‌లోని ఇన్ డిన్ గ్రామంలో 10 మంది అమాయకుల్ని మయన్మార్ సైన్యం కాల్చిచంపిన విషయాన్ని వా లోన్, కా బయటపెట్టారు. అనంతరం యాంగూన్‌లో జరిగిన ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న వీరికి పోలీస్ అధికారి ఒకరు కొన్ని కాగితాలను రహస్యంగా అందించారు. వాటిని తీసుకుని హోటల్ నుంచి బయటకు రాగానే ఆర్మీ అధికారులు కా, లోన్లను అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన యాంగూన్ కోర్టు ఇద్దరు జర్నలిస్టుల వద్ద దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు లభ్యమయ్యాయని తెలిపింది. తామిద్దరం ఎలాంటి తప్పు చేయలేదని జర్నలిస్టులు చేసిన వాదనను ఈ సందర్భంగా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరిద్దరికి ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు అనంతరం లోన్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ తీర్పును మేం దృఢచిత్తంతో, ధైర్యంగా ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ప్రభుత్వం తమను అరెస్ట్ చేయగలదనీ, కానీ ప్రజల కళ్లు, చెవులను మాత్రం మూయలేదని కా అన్నారు. ఈ రోజు మయన్మార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాకు దుర్దినమని రాయిటర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీఫెన్.జె.అడ్లర్ వ్యాఖ్యానించారు. మీడియా నోరు మూయించేందుకు, భయపెట్టేందుకు మయన్మార్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందన్నారు. కాగా ఇద్దరు జర్నలిస్టులను విడుదల చేయాలని మయన్మార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేశాయి. -
రోహింగ్యాలకు మయన్మార్ పిలుపు
కాక్స్ బజార్ : మయన్మార్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన ఏడు లక్షల రోహింగ్యా ముస్లింలు తిరిగి స్వచ్ఛందంగా మయన్మార్ రావచ్చని ఈ దేశ జాతీయ భద్రత సలహాదారుడు థాంగ్ తన్ తెలిపారు. సింగపూర్‌లో జరుగుతున్న ప్రాంతీయ భద్రతాదళ సమావేశంలో థాంగ్ మాట్లాడుతూ.. ‘రోహింగ్యా ముస్లింలు స్వచ్ఛందంగా మయన్మార్ తిరిగి రావచ్చు. వారు మేం వస్తున్నాం అంటే మా దేశం వారికి స్వాగతం పలుకుతుంది. ఐక్యరాజ్యసమితి బాధ్యతలను కాపాడటానికి రఖైన్ రాష్ట్రంలో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలను తమ దేశానికి ఆహ్మానించాల్సిన అవసర ఉందని’ ఆయన పేర్కొన్నారు. 2017 నుంచి మయన్మార్‌లో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలను ఆ దేశ సైన్యం చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. సైన్యం నుంచి తప్పించుకుని పారిపోయిన రోహింగ్యాలు ఎక్కువగా బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందారు. బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందుతున్న రోహింగ్యాలను మయన్మార్ రావటానికి వీలుగా యూఎన్ఓ రూపొందించిన అవగాహన పత్రంపై థాంగ్ తన్ సంతకం చేశారు. -
‘అడ్డదారిలో ఆధార్’
సాక్షి, న్యూఢిల్లీ : రోహింగ్యా ముస్లింలు కొందరు ఆధార్, పాన్, ఓటరు కార్డులు సంపాదిస్తున్న ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. అక్రమ పద్ధతుల్లో వారు ఈ పత్రాలను పొందుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఘటనలను గుర్తించిన వెంటనే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర అధికారులు కఠిన చర్యలు చేపట్టడంతో పాటు ఆయా పత్రాలను రద్దు చేస్తారని మంత్రి పార్లమెంట్‌కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. రోహింగ్యా ముస్లింలు ఆధార్, పాన్ కార్డులు సంపాదిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నా..వారికి కొందరు అక్రమంగా ఆశ్రయం కల్పిస్తున్న ఉదంతాలు ప్రభుత్వం దృష్టికి రాలేదని మంత్రి తెలిపారు. -
వారి కోసం విద్యార్థుల నుంచి రాజకీయ నాయకుల వరకు..
సాక్షి, ఢాకా : అది దక్షిణ బంగ్లాదేశ్‌లోని కుతుపలాంగ్ ప్రాంతం. పచ్చిక బయళ్ల మధ్య విసిరేసినట్లుగా మట్టితో, తడకలతో కట్టిన గుడిశెలు. వాటిల్లో మగవారికన్నా ఎక్కువ ఆడవాళ్లే ఉంటారు. 14 ఏళ్ల నుంచి 30 ఏళ్ల ప్రాయం మధ్యనున్న బాలికలు, మహిళలు తమను ఎవరూ గుర్తుపట్టకుండా సంప్రదాయబద్ధమైన నల్లటి దుస్తులను ముఖం కనపడకుండా ధరించి ఎక్కడికో వెళుతుంటారు. వస్తుంటారు. ఎవరు, ఎవరిని పెద్దగా పట్టించుకోరు. వచ్చేటప్పుటు వారి చేతుల్లో అనుమానం రాకుండా ఆరోజు తిండికి సరిపడే సరుకులు ఉంటాయి. వారు ఏం చేస్తారో, ఎక్కడికి వెళతారో ఎవరికి తెలియనట్లే ఉంటారు. వీరంతా ఏం చేస్తున్నారు ? ఎలా సంపాదిస్తున్నారు? ఏం తింటున్నారు? అన్న అంశంపై ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఏజెన్సీ, థామ్సన్ రాయటర్స్ ఫౌండేషన్ ఇటీవల అక్కడికెళ్లి ప్రత్యక్షంగా అధ్యయనం జరపగా, దిగ్భ్రాంతికరమైన అంశాలు బయటకు వచ్చాయి. వారంతా పొట్టకూటి కోసం పడుపు వృత్తిని నమ్ముకున్నారు. ఒక్క పూట కూడా సరైన తిండిలేని వారే వారిలో ఎక్కువగా ఉన్నారు. వారిలో రొమిదా అనే 26 ఏళ్ల యువతి గత పదేళ్లుగా బతకడం కోసం ఇదే వృత్తి చేస్తోందట. తనకు బిడ్డ పుట్టడంతో సంసారాన్ని ఈదలేక తాగుబోతు భర్త ఆమెను వదిలేసి వెళ్లాడట. అప్పటి నుంచి ఆమె కూతురు కోసం వ్యభిచార వృత్తిలోకి దిగింది. పరిచయం ఉన్న వ్యక్తి ఆమెకు మొదట వెయ్యి రూపాయల ఆశ చూపి సెక్స్‌లోకి లాగాడట. ఆ తర్వాత కొన్నేళ్లు ఒక్కొక్కరి వద్ద నుంచి 500 రూపాయలు వచ్చేదట. ఇప్పుడు 200 రూపాయలే వస్తున్నాయట. అందులో సగం అంటే వంద రూపాయలు బేరం కుదర్చినవాడు తీసుకుంటాడట. బడంటే ఏమిటో, చదువంటే ఏమిటో తెలియని రేనా అనే 18 ఏళ్ల అమ్మాయి, కమ్రూ అనే 14 ఏళ్ల బాలిక ఈ వృత్తిలో చవిచూసిన అనుభవాలెన్నో. వీరిద్దరు కొత్తగా వలసవచ్చి అక్కడ స్థిరపడిన వారు. ఇలాంటి కొత్తవారు వేలాది మంది తరలిరావడంతో పడుపు వృత్తికి సరైన రేటు పలకడం లేదట. ఇంతకు వీరంతా ఎవరంటే మయన్మార్ నుంచి వలసవచ్చిన రోహింగ్యా ముస్లిం మహిళలు. బంగ్లాదేశ్ పాలకులు వారిని దేశంలోకి అనుమతించడమే గగనమైన కఠిన పరిస్థితుల్లో బతుకుతెరువు కోసం వారు మరో మార్గంలేక, ఈ మార్గాన్ని ఎన్నుకొన్నారు. ఎక్కువ మంది మగాళ్లు తల్లులను, పిల్లలను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోవడం, వలసల సందర్భంగా జరిగిన ప్రమాదాల్లో మరణించడం తదితర కారణాల వల్ల వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా మిగిలారు. గత ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షల మంది రోహింగ్యా ముస్లింలు వలస వచ్చిన విషయం తెల్సిందే. వారు జాతి పరువు పోగొట్టుకోకూడదని రోహింగ్యాలతో వ్యభిచారం చేయరట. కేవలం బంగ్లాదేశ్ వాళ్లతోని వ్యభిచారం కొనసాగిస్తారట. వారి విటుల్లో యూనివర్సిటీ విద్యార్థుల నుంచి స్థానిక రాజకీయ నాయకుల వరకు ఉన్నారట. అక్కడి మహిళలు శిబిరం నుంచి తమను తరిమేయకుండా ఉండేందుకు స్థానిక రాజకీయ నాయకులతో మరింత సన్నిహితంగా ఉంటారట. అక్కడ విటులెవరూ కండోమ్స్ వాడేందుకు ఇష్టపడరట. మహిళలే పిల్లలు కాకుండా టాబ్లెట్లు వేసుకుంటారట. ఇప్పటికే సుఖ రోగాలు సోకాయో, లేదో కూడా తెలియదట. ఎంతమంది ఇలా పడపు వృత్తిలో కొనసాగుతున్నారో తాము అంచనా వేయలేదని, దశాబ్దం క్రితం వలసవచ్చిన వారిలోనే దాదాపు 500 మంది వరకు ఈ వృత్తిలో ఉన్నట్లు అర్థం అయిందని ‘ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్’ సంస్థకు చెందిన లీసా అకిరో తెలిపారు. వారి బతుకుతెరువు కోసం వివిధ అంతర్జాతీయ సొసైటీల నుంచి వారికి కావాల్సిన సహాయం అందకపోయినట్లయితే మరింత మంది పడుపు వృత్తిని ఆశ్రయించే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. -
రోహింగ్యాకు అక్రమంగా ‘ఆధార్’
హైదరాబాద్: తప్పుడు పత్రాలతో ఆధార్‌కార్డు పొందిన రోహింగ్యా ముస్లింతోపాటు అతడికి సహకరించిన పశ్చి మ బెంగాల్వాసిని బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వనస్థలిపురం ఇన్చార్జ్ ఏసీపీ ఎస్.మల్లారెడ్డి ఆదివా రం ఇక్కడ కేసు వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రియాజుద్దీన్ మొల్లా(36) వస్త్ర వ్యాపారి. వ్యాపార నిమిత్తం ఏడాది క్రితం బంగ్లాదేశ్‌కు వెళ్లినప్పుడు అక్కడ మయన్మార్ దేశానికి చెందిన శరణార్థి మహ్మద్ ఎజాముద్దీన్ అలియాస్ మొల్లా ఎజాముద్దీన్ (19) పరిచయమయ్యాడు. పశ్చిమ బెంగాల్‌కు వస్తే మంచి వేతనంతో కూడిన పని ఇస్తానంటూ ఎజాము ద్దీన్‌కు ఆశచూపి ఫోన్ నంబర్ ఇచ్చాడు. దీంతో ఎజా ముద్దీన్ కోల్‌కతా వచ్చి అతడిని కలిశాడు. శరణార్థికి రియాజుద్దీన్ నెలకు రూ.6 వేల వేతనం ఇచ్చి పని చేయించుకోవటంతో పాటు తన కుమారుడంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆధార్ కార్డు (5893 0394 1315) ఇప్పించాడు. గత బక్రీద్ సందర్భంగా వ్యాపార నిమిత్తం ఎజాముద్దీన్ను హైదరాబాద్‌కు తీసుకువచ్చి బాలాపూర్ రాయల కాలనీలో ఉన్న శరణార్థుల ఆశ్రమంలో చేర్పించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి ఆధార్ కార్డులను, పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. -
సామూహికంగా చంపేశారు!
కాక్స్‌బజార్(బంగ్లాదేశ్): మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిం మిలిటెంట్ల దురాగతాలు క్రమంగా వెలుగుచూస్తున్నాయి. హింసకు కేంద్రంగా మారిన రాఖైన్ రాష్ట్రంలో రోహింగ్యాల చేతిలో హత్యకు గురైన హిందువుల మృతదేహాలు 45 బయటపడ్డాయి. వీటి లో 28 శవాలను ఆదివారం రెండు వేర్వేరు చోట్ల గుర్తించగా, 17 శవాలను సోమవారం మరో చోట కనుగొన్నారు. అప్పటికప్పుడు తవ్విన గోతుల్లోనే ఈ శవాలను పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. జాడ తెలియకుండా పోయిన 100 మంది హిందువుల్లో శవాలుగా బయపడిన వారున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఆగస్టు 25న రోహింగ్యా మిలిటెంట్లు సామూహిక హత్యలకు పాల్పడ్డారనడానికి ఇవే నిదర్శనమని మయన్మార్ ఆర్మీ ప్రకటించింది. బౌద్ధులు, హిందువులు, ఇతర మైనారిటీలకు చెందిన పిల్లలు, మహిళలను రోహింగ్యాలు క్రూరంగా హతమార్చారని ఆరోపించింది. హిందువుల శవాలు బయటపడిన ప్రాంతానికి బుధవారం తొలిసారి విలేకర్లను అనుమతించారు. హింస కారణంగా చెల్లాచెదురై బంగ్లాదేశ్‌కు తరలిపోయిన ప్రజలు తమ కుటుంబ సభ్యుల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. రోహింగ్యాల చేతిలో తమకు ఎదురైన పీడకలను బాధితులు గుర్తుచేసుకుంటున్నారు. ముసుగులు ధరించిన కొందరు కత్తులతో ఇంట్లోకి చొరబడి తన భర్త, ఇద్దరు సోదరులను కిరాతకంగా చంపా రని రీకా ధార్ అనే మహిళ పేర్కొంది. గ్రామస్థుల చేతులను వెనక కట్టేసి మోకాళ్లపై నడిపించారని తెలిపింది. మూడు పెద్ద గోతులు తవ్వి శవాలను సామూహికంగా అందులో పాతిపెట్టారని వెల్లడించింది. కేవలం హిందువులమైనందునే తమపై దాడులు జరిగాయని ఆమె వాపోయింది. ‘నల్లదుస్తుల్లో ఉన్న కొం దరు మా గ్రామంలోకి చొరబడి మనుషులను కొట్టారు. కొంతమందిని అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేయడం నేను చూశా’ అని బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్‌లో ఆశ్రయం పొందుతున్న ప్రొమిలా షీల్ అనే మహిళ తెలిపింది. దాడుల్లో 163 మంది మృతి రాఖైన్ రాష్ట్రంలో ఏడాది కాలంగా రోహింగ్యా మిలిటెంట్ల దాడుల్లో 163 మంది మృతి చెందగా, 91 మంది కనిపించకుండా పోయారని మయన్మార్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ఫేస్బుక్లో విడుదల చేసింది. 2016 అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఆగస్ట్ మధ్య కాలంలో 79 మంది చనిపోగా, 37 మంది గల్లంతయ్యారని పేర్కొంది. -
హైదరాబాద్‌లో 4వేల మంది రోహింగ్యాలు
-
వారి అకౌంట్లపై ఫేస్బుక్ నిషేధం
మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలు ఎదుర్కొంటున్న జాతి ప్రక్షాళనపై డాక్యుమెంట్ చేసిన కార్యకర్తల అకౌంట్లను ఫేస్బుక్ నిలిపివేసింది. అంతేకాక వారి పోస్టులను కూడా ఫేస్బుక్ నుంచి తొలగించిందని డైలీ బీస్ట్ రిపోర్టు చేసింది. అయితే తమ అకౌంట్లను తరుచు నిలిపివేస్తుందని, నిజాలను నిర్భయంగా మాట్లాడేందుకు ఈ సోషల్ మీడియా దిగ్గజం అవకాశం కల్పించాలని రోహింగ్యా కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ వీరి పోస్టులను ఫేస్బుక్ తొలగిస్తోంది. అంతేకాక వీరి అకౌంట్లను నిలిపివేస్తోంది కూడా. ప్రజలు బాధ్యతాయుతంగా పంచుకునే చోటు ఫేస్బుక్ కావాలని కోరుకుంటున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి రుచిక బుధ్రాజ్ తెలిపారు. తమ కమ్యూనిటీ స్టాండర్స్‌కు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను జాగ్రత్తగా సమీక్షిస్తున్నామని తెలిపారు. రహిమ్ అనే పేరుతో పేస్‌బుక్‌లో రోహింగ్యా శరణార్థుల గురించి పోస్టు చేసిన వ్యక్తిగత పోస్టులను ఫేస్బుక్ తొలగించింది. ఫేస్బుక్ కమ్యూనిటి స్టాండర్స్‌ను అనుసరించకపోవడం వల్ల కంటెంట్‌ను తొలగిస్తున్నామని ఫేస్బుక్ ఓ మెసేజ్ అందించింది. రోహింగ్యా ముస్లింలను బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులుగా ఇటు మయన్మార్ గుర్తిస్తుండగా.. అటు బంగ్లాదేశ్ వీరిని మయన్మార్ సిటిజన్లుగా పేర్కొంటోంది. వీరికి పౌరసత్వం ఇవ్వడానికీ మయన్మార్ తిరస్కరిస్తోంది. అంతేకాక రోహింగ్యా ముస్లింలపై మయన్మార్‌లో జాతి విద్వేష దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులతో రోహింగ్యా ముస్లింలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఆశ్రయం ఇచ్చి ప్రాణభిక్ష పెట్టాల్సిందిగా బ్రతిమాలాడుతున్నారు. -
రోహింగ్యాలతో పెనుముప్పు
సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ న్యూఢిల్లీ: భారత్‌లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యా ముస్లింల వల్ల జాతీయ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం భారతీయులు దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చని, ఎక్కడైనా నివసించవచ్చనీ, కానీ రోహింగ్యాలు అక్రమ వలసదారులు అయినందున వారికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుప్రీం కోర్టును ఆశ్రయించే హక్కులేదని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి 1951 శరణార్థుల తీర్మానంపై భారత్ సంతకం చేయనందున రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలన్న నిబంధనలు తమకు వర్తించవని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలరీత్యా విధానపరమైన నిర్ణయాల ద్వారా రోహింగ్యాలను మయన్మార్‌కు తిప్పిపంపడానికి అనుమతించాలని కోరింది. ఈ మేరకు రోహింగ్యాల వలసలపై సోమవారం కేంద్రం కోర్టు రిజిస్ట్రీకి సమగ్ర అఫిడవిట్‌ను సమర్పించింది. ప్రస్తుతం భారత్‌లోని రోహింగ్యా శరణార్థుల్లో కొందరికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు ఐసిస్, లష్కరే తోయిబా, అల్‌కాయిదా తదితర ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయని, వారు భారత్‌లోనే ఉంటే జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనానికి విన్నవించింది. కేంద్రం వాదనలు విన్న తర్వాత కోర్టు తదుపరి విచారణను అక్టోబర్3కు వాయిదా వేసింది. -
రోహింగ్యాలతో భద్రతకు ముప్పు’
న్యూఢిల్లీ / ఢాకా: భారత్‌లో ఉంటున్న రోహింగ్యా ముస్లింలు జాతీయ భద్రతకు తీవ్ర ముప్పని కేంద్రం గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. రోహింగ్యా ముస్లింలను భారత్ నుంచి తిప్పిపంపకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిల్‌పై కేంద్రం ఈ మేరకు అభిప్రాయాన్ని వెల్లడించింది. పలువురు రోహింగ్యాలకు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయని కేంద్రం పేర్కొంది. జమ్మూ, ఢిల్లీ, హైదరాబాద్, మేవట్ ప్రాంతాల్లో రోహింగ్యా తీవ్రవాదులు చురుగ్గా ఉన్నారని, వీరిని ఐసిస్ వంటి ఉగ్రసంస్థలు వాడుకునే ప్రమాదముందని సుప్రీంకు నివేదించింది. అయితే సుప్రీంకు అందిన అఫిడవిట్ పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని, పొరపాటున కోర్టుకు అందిందని కేంద్రం వివరణ ఇచ్చింది. బంగ్లాలో రోహింగ్యా శరణార్థుల కోసం 53 టన్నుల ఆహార పదార్థాలు, నిత్యావసరాల్ని పంపినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. -
రోహింగ్యాలు: మాకు అతిపెద్ద సవాల్!
నేపితా: మయన్మార్‌లో ముదురుతున్న రోహింగ్యాల సంక్షోభంపై ఆ దేశ ప్రభుత్వ కౌన్సిలర్ ఆంగ్‌సాన్ సూచీ స్పందించారు. 'ఇది మాకు అతిపెద్ద సవాలు..కేవలం ప్రభుత్వంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఈ సవాలును మేం పరిష్కరించాలనడం సహేతుకం కాదు' అని ఆమె ఏఎన్ఐ వార్తాసంస్థతో అన్నారు. 'రఖైన్ రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాలుగా.. సామ్రాజ్యవాద బ్రిటిష్ పాలనకు ముందునుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రోహింగ్యా ముస్లింలలో ఉగ్రవాదులెవరో, సామన్యులెవరో మేం గుర్తించాల్సి ఉంది. ఈ సమస్య గురించి భారత్‌కు బాగా తెలుసు' అని ఆమె అన్నారు. 'మా పౌరులను కాపాడటం మా కర్తవ్యం. అందుకు మేం తీవ్రంగా కృషిచేస్తున్నాం. కానీ మాకు తగినంతగా వనరులు అందుబాటులో లేవు. ప్రతి ఒక్కరికీ చట్టబద్ధమైన రక్షణ లభించేలా మేం చూడాలనుకుంటున్నాం' అని సూచి అన్నారు. ప్రధాని మోదీ తాజాగా మయన్మార్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో రోహింగ్యాల సంక్షోభంపై మాట్లాడిన సంగతి తెలిసిందే. మయన్మార్ దేశ ఐక్యతను గౌరవిస్తూ రోహింగ్యాల సమస్య పరిష్కారానికి సంబంధిత పక్షాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సవాళ్లతో ఇబ్బందిపడుతున్న మయన్మార్‌కు భారత్ అండగా ఉంటుందని హామీనిచ్చారు. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో అతివాద హింస నేపథ్యంలో ఆ దేశ ఆందోళనల్ని భారత్ అర్థం చేసుకుందన్నారు. మయన్మార్ పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూచీతో ప్రధాని విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రోహింగ్యా ముస్లింలపై మయన్మార్ సైన్యం దాడులతో దాదాపు 1.25 లక్షల మంది బంగ్లాదేశ్‌కు వలసవెళ్లిన నేపథ్యంలో ప్రధాని ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘రఖైన్ రాష్ట్రంలో అమాయకులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అతివాద హింసపై మయన్మార్ ఆందోళనల్ని భారత్ అర్థం చేసుకుంది. మయన్మార్ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ సమస్యకు పరిష్కారం కోసం సంబంధిత పక్షాలు కలిసికట్టుగా పనిచేయాలి’ అని మోదీ సూచించారు. -
బతకాలంటే దేశం దాటాల్సిందే
పిల్లాజెల్లా, తట్టాబుట్టాతో నీటిలో ఈదుకుంటూ వెళ్తున్న వీరంతా మయన్మార్‌కు చెందిన రోహింగ్యా ముస్లింలు. మయన్మార్‌లో రోహింగ్యాలపై దాడులు మితిమీరడంతో బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందేందుకు బయల్దేరారు. ఇలా ప్రాణాలు అరచేతపట్టుకుని గత 10 రోజుల్లో బంగ్లాదేశ్‌కు దాదాపు 1,23,000 మంది వలసపోయారు. గత 24 గంటల్లో 35,000 మంది సరిహద్దు దాటారు. -
400 మంది ముస్లింలు ఊచకోత
-
400 మంది ముస్లింలు ఊచకోత
సాక్షి, రఖైన్: సుగంధ ద్రవ్యాల సువాసనలతో అలరారే మయన్మార్ మట్టి రోహింగ్యా ముస్లింల నెత్తురుతో తడిసింది. రఖైన్ రాష్ట్రంలో మొదలైన హింసాకాండ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. తాజాగా ఆర్మీ పోస్టులపై రోహింగ్యా మిలిటెంట్లు విరుచుకుపడటంతో వారిని అడ్డుకునేందుకు ఆర్మీ నరమేధానికి దిగాల్సివచ్చింది. మత ఘర్షణల్లో సుమారు 400 మంది రోహింగ్యా ముస్లింలు మరణించినట్లు ఆ దేశ సైనికాధిపతి మిన్ ఆంగ్ హ్లెయింగ్ కార్యాలయం తెలిపింది. మయన్మార్‌లో అత్యధికులు బౌద్ధ మతస్థులు. ఆ దేశంలో నివసించే రోహింగ్యా ముస్లింల సంఖ్య చాలా తక్కువ(మైనారిటీ). దేశంలో ఉన్న రోహింగ్యా ముస్లింలలో అత్యధికులు రఖైన్ రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. బర్మాలో బౌద్ధులకు, రోహింగ్యా ముస్లింలకు మధ్య విభేదాలు కొత్తవేమీ కాదు. గత ఐదేళ్లుగా ఈ మత పరమైన సంక్షోభం బర్మాలో కొనసాగుతూనే ఉంది. సైన్యం, రోహింగ్యా ముస్లింల మధ్య జరుగుతున్న మారణహోమంలో రఖైన్ రాష్ట్రంలో వందల కొద్దీ గ్రామాలు తగులబడిపోయాయి. ఎంతలా అంటే వాటి ఆనవాళ్లు కూడా తెలుసుకోలేనంతలా. సైన్యం మీద కక్ష్యతో రోహింగ్యా మిలిటెంట్లు మారుమూల గ్రామాలకు నిప్పు పెడితే.. సైనికులు రోహింగ్యా ముస్లింలు దాగి ఉన్నారనే ఆరోపణలతో గ్రామాలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. దీంతో వణికిపోతున్న సామాన్య రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు పారిపోతున్నారు. బంగ్లాదేశ్‌కు చేరేందుకు అడ్డుగా ఉన్న నాఫ్ నదిని దాటేందుకు తాత్కాలిక పడవలను ఆశ్రయించారు. అయితే, అవి మార్గం మధ్యలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఊచకోతలపై దేశ వ్యాప్తంగా పుకార్లు చెలరేగడంతో అశాంతి నెలకొంది. రఖైన్ రాష్ట్రం జాతి, మతపరంగా చీలిపోయింది. ఊచకోతలో మరణించిన వారి సంఖ్య వేలల్లో ఉంటుందని, మిలటరీ దళాలు తక్కువ మంది మరణించినట్లు లెక్కలు చూపుతున్నాయని స్వచ్చంద సంస్ధలు ఆరోపిస్తున్నాయి. జాతిని కూకటివేళ్లతో పెకలించేందుకే.. రోహింగ్యా జాతిని నశింపజేసేందుకు సైన్యం, బౌద్ధులు యత్నిస్తున్నారని స్వచ్చంద సంస్థల ఆరోపణ. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కూడా మయన్మార్‌పై ఇదే ఆరోపణ చేశారు. బర్మాలో చెలరేగిన హింస కారణంగా ఇప్పటివరకూ 27 వేలకు పైగా రోహింగ్యా ముస్లింలు పారిపోయినట్లు ఐరాస ఓ ప్రకటనలో పేర్కొంది. మయన్మార్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి కూడా పెరుగుతోంది. పౌరుల ప్రాణాలను కాపాడాలని మయన్మార్ ప్రభుత్వాన్ని అమెరికా కోరింది. -
మయన్మార్ ఉగ్రదాడుల్లో 89 మంది మృతి
మాంగ్డా: మయన్మార్‌లోని రఖీనే రాష్ట్రం ఉగ్రదాడులతో దద్దరిల్లుతోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి దేశంలోని సరిహద్దు ప్రాంతాలపై తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో 12 మంది భద్రతాదళ అధికారులు, 77 మంది మిలిటెంట్లు మరణించారు. అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రమంతటా ఎమర్జెన్సీని ప్రకటించింది. అరాకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఎఆర్‌ఎస్‌ఏ) అనే ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడినట్లు ఆర్మీ ప్రకటించింది. -
మయన్మార్‌లో మారణకాండ
- బంగ్లా సరిహద్దు రఖీనేలో తీవ్రవాదుల దాడి - 70 మంది మృతి.. వందల మందికి గాయాలు నెపిటా: మయన్మార్‌లో మరోసారి రక్తపుటేరులు పారాయి. బంగ్లాదేశ్ సరిహద్దులోని రఖీనే రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున తీవ్రవాదులు జరిపిన భీకర దాడుల్లో సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోగా, వందలమంది గాయపడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రమంతటా ఎమర్జెన్సీని ప్రకటించింది. క్షతగాత్రులకు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కాగా, దాడికి పాల్పడింది రోహింగ్యా ముస్లిం(బెంగాలీ) తీవ్రవాదులేనని మయన్మార్ ఆర్మీ అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో బంగ్లా సరిహద్దులోని మంగ్టావ్ పోలీస్ స్టేషన్‌ను తీవ్రవాదులు పేల్చేశారని, అదే సమయంలో రఖినేలోని కొన్ని పోలీస్ స్టేషన్లు, ఆర్మీ క్యాంపులపైనా దాడులు జరిగాయని, మొత్తం 200 మంది తీవ్రవాదులు ఈ దాడుల్లో పాల్గొని ఉండొచ్చని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇరువైపులా ప్రాణనష్టం జరిగిందని, కొందరు సాధారణ పౌరులు కూడా చనిపోయారని ఆర్మీ వర్గాలు చెప్పారు దశాబ్ధాల వైరం: బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకుని ఉండే రఖీనే రాష్ట్రంలోకి రొహింగ్యా ముస్లింల వలసలు ఎక్కువ. దీంతో స్థానిక ప్రజలకు, వలసదారులకు మధ్య ఘర్షణలు జరిగేవి. ఒక దశలో రంగంలోకి దిగిన సైన్యం.. రోహింగ్యాలను తిరిగి బంగ్లాదేశ్‌లోకి వెళ్లగొట్టేయత్నం చేసింది. ఈ క్రమంలోనే ప్రారంభమైన హింసాయుత పోరాటం.. దశాబ్ధాలుగా కొనసాగుతోంది. -
ఆ సైనికులు మమ్మల్ని రేప్ చేశారు!
మయన్మార్ సైనికులు చేస్తున్న అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వాళ్ల చేతుల్లో హబీబా, ఆమె సోదరి అనుభవించిన దారుణ నరకం వెలుగు చూసిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. వేలాది మంది రోహింగ్యాలు మయన్మార్ సైనికుల ఆగడాలు భరించలేక బంగ్లాదేశ్‌కు వలసపోతున్నారు. వాళ్లు తామిద్దరినీ కట్టేసి, ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారని హబీబా (20) వాపోయింది. ఇప్పుడు ఆమె బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దుల్లోని ఓ శరణార్థి శిబిరంలో ఓ రోహింగ్యా కుటుంబంతో పాటు తలదాచుకుంది. ఇక్కడ తమకు తినడానికి తిండి లేకపోయినా.. కనీసం తమను చిత్రహింసలు పెట్టడానికి ఎవరూ రారన్న విషయమే సంతోషంగా ఉందని హబీబా సోదరుడు హషీముల్లా చెప్పాడు. హబీబాతో పాటు ఆమె సోదరి సమీరా (18)ని కూడా మయన్మార్ సైనికులు ఎత్తుకుపోయి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. వాళ్ల ఇంటిని తగలబెట్టేశారు. తమదే కాదని.. ఇంకా చాలా ఇళ్లను తగలబెట్టేశారని హబీబా చెప్పింది. తమ తండ్రితో సహా అనేక మందిని చంపేశారని, చిన్నపిల్లలని కూడా చూడకుండా ఆడపిల్లలపై అత్యాచారాలు చేశారని ఆమె చెప్పింది. ఈసారి వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తే చంపేస్తామని బెదిరించి, సైనికులు అక్కడినుంచి వెళ్లిపోయారని.. వెళ్లే ముందు తమ ఇంటిని తగలబెట్టేశారని ఆమె చెప్పింది. రోహింగ్యా ముస్లిం తెగల వారిపై మయన్మార్‌లో ఘోరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దాంతో వేలాదిమంది అక్కడినుంచి వెళ్లిపోతున్నారు. మయన్మార్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను వెళ్లగొడుతోందని ఐక్యరాజ్యసమితి కూడా హెచ్చరించింది. హబీబా కుటుంబంలో మిగిలిన ముగ్గురు ఎలాగోలా తాము దాచిపెట్టుకున్న డబ్బులు తీసుకుని వందలాది రోహింగ్యా కుటుంబాలతో పాటు జాగ్రత్తగా కొండల నడుమ నాలుగు రోజులు దాక్కుని, చివరకు ఒక బోటు యజమాని వారిని బంగ్లాదేశ్ తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. అతడు వాళ్లదగ్గరున్న డబ్బులన్నింటినీ తీసేసుకున్నాడు. సరిహద్దుల సమీపంలో ఓ చిన్న దీవి వద్ద వారిని వదిలేశాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి ఓ రోహింగ్యా కుటుంబాన్ని ఆశ్రయించారు. ఇలాంటి వందలాది కథనాలు మయన్మార్ - బంగ్లాదేశ్ సరిహద్దులలో కనిపిస్తున్నాయి.