
రోహింగ్యాలతో పెనుముప్పు
సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
న్యూఢిల్లీ: భారత్‌లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యా ముస్లింల వల్ల జాతీయ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం భారతీయులు దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చని, ఎక్కడైనా నివసించవచ్చనీ, కానీ రోహింగ్యాలు అక్రమ వలసదారులు అయినందున వారికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుప్రీం కోర్టును ఆశ్రయించే హక్కులేదని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి 1951 శరణార్థుల తీర్మానంపై భారత్ సంతకం చేయనందున రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలన్న నిబంధనలు తమకు వర్తించవని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలరీత్యా విధానపరమైన నిర్ణయాల ద్వారా రోహింగ్యాలను మయన్మార్‌కు తిప్పిపంపడానికి అనుమతించాలని కోరింది. ఈ మేరకు రోహింగ్యాల వలసలపై సోమవారం కేంద్రం కోర్టు రిజిస్ట్రీకి సమగ్ర అఫిడవిట్‌ను సమర్పించింది. ప్రస్తుతం భారత్‌లోని రోహింగ్యా శరణార్థుల్లో కొందరికి పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో పాటు ఐసిస్, లష్కరే తోయిబా, అల్‌కాయిదా తదితర ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయని, వారు భారత్‌లోనే ఉంటే జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనానికి విన్నవించింది. కేంద్రం వాదనలు విన్న తర్వాత కోర్టు తదుపరి విచారణను అక్టోబర్3కు వాయిదా వేసింది.