సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఉంటున్న రోహింగ్యాల లెక్క తేల్చేందుకు నగర పోలీసుల సిద్ధమయ్యారు. అక్రమంగా వలస వస్తున్న రోహింగ్యాలతో దేశ భద్రతకు ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. వీరు ఎక్కువగా వలస వస్తున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో నివసిస్తున్న రోహింగ్యాలు ఎంతమందో లెక్కించాలని ఆదేశాలు జారీ చేశారు. సిటీ స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) అధికారులు శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించి వారం రోజుల్లో పూర్తి చేయాలన్న కొత్వాల్.. అందుకు 26 మంది అధికారులను ఎస్బీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ మూడు ఠాణాల పరిధిలోనే..
స్థానిక పరిస్థితుల నేపథ్యంలో మయన్మార్‌ను వదులుతున్న అనేక మంది రోహింగ్యాలు అక్రమంగా వివిధ దేశాలకు వలసపోతున్నారు. ఈ తరçహా శరణార్థుల బెడద బంగ్లాదేశ్‌తో పాటు భారత్‌కూ అధికంగానే ఉంది. దేశంలోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్‌కూ రోహింగ్యాలు పెద్ద సంఖ్యలోనే వచ్చారు. ప్రధానంగా శివార్లతో పాటు పాతబస్తీలోని బహదూర్‌పురా, కంచన్‌బాగ్, చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ల పరిధిలో వీరు నివసిస్తున్నారు. రోహింగ్యా శరణార్థుల ముసుగులో అసాంఘికశక్తులు, ఉగ్రవాదులు సైతం దేశంలోకి చొరబడతారని, వారి శిబిరాల్లోనే తలదాచుకుని అదును చూసి పంజా విసురుతారని కేంద్ర నిఘా వర్గాలు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో వీరిపై డేగకన్ను వేశారు.
సిటీలో ఆడిటింగ్‌కు నిర్ణయం
నగరంలో నివసిస్తున్న రోహింగ్యాల్లో కొందరు అనుమతి పొందిన శరణార్థులూ ఉన్నారు. వీరికి ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అక్రమంగా నివసిస్తున్న వారితోనే ముప్పు ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిటీలో ఉంటున్న రోహింగ్యాల్లో గుర్తింపు కార్డులు ఉన్న వారు ఎందరు? లేకుండా ఉంటున్న వారు ఎందరు? తదితర అంశాలను నిగ్గు తేల్చడానికి సిద్ధమయ్యారు. సాధారణంగా ప్రతి విదేశీయుడి వివరాలూ పోలీసుల వద్ద ఉన్నప్పటికీ రోహింగ్యాల విషయంలో మాత్రం ఇబ్బంది వస్తోంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సిటీ పోలీసు విభాగం రోహింగ్యాల ఆడిటింగ్ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించింది. అయితే, ఈలోపు ఎన్నికల హడావుడి రావడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు
ఎన్నికల క్రతువు బుధవారంతో పూర్తయింది. దీంతో రోహింగ్యాలను లెక్కింపు తక్షణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను ఎస్బీ అధికారులకు అప్పగించారు. అదనంగా 26 మంది ఎస్సైలు, కానిస్టేబుళ్లను కేటాయించారు. ఈ మేరకు కొత్వాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడంతో వీరంతా గురువారం ఎస్బీలో రిపోర్ట్ చేశారు. వీరందరితో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. శుక్రవారం నుంచి ఆడిటింగ్ ప్రారంభిస్తున్న ఈ స్పెషల్ టీమ్స్ ప్రతి ఒక్క రోహింగ్యా నుంచి వివరాలు సేకరిస్తారు. వారి పేర్లు, శాశ్వత, తాత్కాలిక చిరునామాలు, ఫొటోలతో పాటు బయోమెట్రిక్ వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరిస్తూ స్పెషల్‌బ్రాంచ్‌లో ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment