సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో రోహింగ్యా ముస్లింల పేర్లను అక్రమంగా చేర్చారని బీజేపీ బుధవారం ఆరోపించింది. పాలక టీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌లు మూకుమ్మడిగా కుట్ర పన్ని ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని, దీనిపై ఈసీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్టీ జాతీయ మీడియా చీఫ్ అనిల్ బలూనిలతో కూడిన ఆ పార్టీ ప్రతినిధి బృందం ఈ మేరకు ఈసీ ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించింది.
రోహింగ్యా ముస్లింలు భారత పౌరులు కాదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసినా తెలంగాణలో వారిని ఓటర్లుగా చేర్చారని నక్వీ ఆరోపించారు. దేశ చట్టాలకు విరుద్ధంగా రోహింగ్యా ముస్లింలను ఓటర్ల జాబితాలో చేర్చడం దారుణమని మండిపడ్డారు. ఈ అంశంపై విచారణ చేపట్టేందుకు ఈసీ తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోగా 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను చక్కదిద్దాలని కోరారు. ఓటర్ల జాబితాలో అసాధారణ హెచ్చుతగ్గులున్నాయని బీజేపీ విస్మయం వ్యక్తం చేసింది. పాలక టీఆర్‌ఎస్ అక్రమ పద్ధతుల్లో బోగస్ ఓటర్లను చేర్పించిందని కేంద్ర మంత్రి నక్వీ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment