కాక్స్‌బజార్(బంగ్లాదేశ్): మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిం మిలిటెంట్ల దురాగతాలు క్రమంగా వెలుగుచూస్తున్నాయి. హింసకు కేంద్రంగా మారిన రాఖైన్ రాష్ట్రంలో రోహింగ్యాల చేతిలో హత్యకు గురైన హిందువుల మృతదేహాలు 45 బయటపడ్డాయి. వీటి లో 28 శవాలను ఆదివారం రెండు వేర్వేరు చోట్ల గుర్తించగా, 17 శవాలను సోమవారం మరో చోట కనుగొన్నారు. అప్పటికప్పుడు తవ్విన గోతుల్లోనే ఈ శవాలను పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది.
జాడ తెలియకుండా పోయిన 100 మంది హిందువుల్లో శవాలుగా బయపడిన వారున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఆగస్టు 25న రోహింగ్యా మిలిటెంట్లు సామూహిక హత్యలకు పాల్పడ్డారనడానికి ఇవే నిదర్శనమని మయన్మార్ ఆర్మీ ప్రకటించింది. బౌద్ధులు, హిందువులు, ఇతర మైనారిటీలకు చెందిన పిల్లలు, మహిళలను రోహింగ్యాలు క్రూరంగా హతమార్చారని ఆరోపించింది. హిందువుల శవాలు బయటపడిన ప్రాంతానికి బుధవారం తొలిసారి విలేకర్లను అనుమతించారు.
హింస కారణంగా చెల్లాచెదురై బంగ్లాదేశ్‌కు తరలిపోయిన ప్రజలు తమ కుటుంబ సభ్యుల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. రోహింగ్యాల చేతిలో తమకు ఎదురైన పీడకలను బాధితులు గుర్తుచేసుకుంటున్నారు. ముసుగులు ధరించిన కొందరు కత్తులతో ఇంట్లోకి చొరబడి తన భర్త, ఇద్దరు సోదరులను కిరాతకంగా చంపా రని రీకా ధార్ అనే మహిళ పేర్కొంది. గ్రామస్థుల చేతులను వెనక కట్టేసి మోకాళ్లపై నడిపించారని తెలిపింది.
మూడు పెద్ద గోతులు తవ్వి శవాలను సామూహికంగా అందులో పాతిపెట్టారని వెల్లడించింది. కేవలం హిందువులమైనందునే తమపై దాడులు జరిగాయని ఆమె వాపోయింది. ‘నల్లదుస్తుల్లో ఉన్న కొం దరు మా గ్రామంలోకి చొరబడి మనుషులను కొట్టారు. కొంతమందిని అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేయడం నేను చూశా’ అని బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్‌లో ఆశ్రయం పొందుతున్న ప్రొమిలా షీల్ అనే మహిళ తెలిపింది.
దాడుల్లో 163 మంది మృతి
రాఖైన్ రాష్ట్రంలో ఏడాది కాలంగా రోహింగ్యా మిలిటెంట్ల దాడుల్లో 163 మంది మృతి చెందగా, 91 మంది కనిపించకుండా పోయారని మయన్మార్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్‌లో విడుదల చేసింది. 2016 అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఆగస్ట్ మధ్య కాలంలో 79 మంది చనిపోగా, 37 మంది గల్లంతయ్యారని పేర్కొంది.