సాక్షి, ఢాకా : అది దక్షిణ బంగ్లాదేశ్లోని కుతుపలాంగ్ ప్రాంతం. పచ్చిక బయళ్ల మధ్య విసిరేసినట్లుగా మట్టితో, తడకలతో కట్టిన గుడిశెలు. వాటిల్లో మగవారికన్నా ఎక్కువ ఆడవాళ్లే ఉంటారు. 14 ఏళ్ల నుంచి 30 ఏళ్ల ప్రాయం మధ్యనున్న బాలికలు, మహిళలు తమను ఎవరూ గుర్తుపట్టకుండా సంప్రదాయబద్ధమైన నల్లటి దుస్తులను ముఖం కనపడకుండా ధరించి ఎక్కడికో వెళుతుంటారు. వస్తుంటారు. ఎవరు, ఎవరిని పెద్దగా పట్టించుకోరు. వచ్చేటప్పుటు వారి చేతుల్లో అనుమానం రాకుండా ఆరోజు తిండికి సరిపడే సరుకులు ఉంటాయి. వారు ఏం చేస్తారో, ఎక్కడికి వెళతారో ఎవరికి తెలియనట్లే ఉంటారు.
వీరంతా ఏం చేస్తున్నారు ? ఎలా సంపాదిస్తున్నారు? ఏం తింటున్నారు? అన్న అంశంపై ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఏజెన్సీ, థామ్సన్ రాయటర్స్ ఫౌండేషన్ ఇటీవల అక్కడికెళ్లి ప్రత్యక్షంగా అధ్యయనం జరపగా, దిగ్భ్రాంతికరమైన అంశాలు బయటకు వచ్చాయి. వారంతా పొట్టకూటి కోసం పడుపు వృత్తిని నమ్ముకున్నారు. ఒక్క పూట కూడా సరైన తిండిలేని వారే వారిలో ఎక్కువగా ఉన్నారు. వారిలో రొమిదా అనే 26 ఏళ్ల యువతి గత పదేళ్లుగా బతకడం కోసం ఇదే వృత్తి చేస్తోందట. తనకు బిడ్డ పుట్టడంతో సంసారాన్ని ఈదలేక తాగుబోతు భర్త ఆమెను వదిలేసి వెళ్లాడట. అప్పటి నుంచి ఆమె కూతురు కోసం వ్యభిచార వృత్తిలోకి దిగింది.
పరిచయం ఉన్న వ్యక్తి ఆమెకు మొదట వెయ్యి రూపాయల ఆశ చూపి సెక్స్లోకి లాగాడట. ఆ తర్వాత కొన్నేళ్లు ఒక్కొక్కరి వద్ద నుంచి 500 రూపాయలు వచ్చేదట. ఇప్పుడు 200 రూపాయలే వస్తున్నాయట. అందులో సగం అంటే వంద రూపాయలు బేరం కుదర్చినవాడు తీసుకుంటాడట. బడంటే ఏమిటో, చదువంటే ఏమిటో తెలియని రేనా అనే 18 ఏళ్ల అమ్మాయి, కమ్రూ అనే 14 ఏళ్ల బాలిక ఈ వృత్తిలో చవిచూసిన అనుభవాలెన్నో. వీరిద్దరు కొత్తగా వలసవచ్చి అక్కడ స్థిరపడిన వారు. ఇలాంటి కొత్తవారు వేలాది మంది తరలిరావడంతో పడుపు వృత్తికి సరైన రేటు పలకడం లేదట. ఇంతకు వీరంతా ఎవరంటే మయన్మార్ నుంచి వలసవచ్చిన రోహింగ్యా ముస్లిం మహిళలు. బంగ్లాదేశ్ పాలకులు వారిని దేశంలోకి అనుమతించడమే గగనమైన కఠిన పరిస్థితుల్లో బతుకుతెరువు కోసం వారు మరో మార్గంలేక, ఈ మార్గాన్ని ఎన్నుకొన్నారు. ఎక్కువ మంది మగాళ్లు తల్లులను, పిల్లలను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోవడం, వలసల సందర్భంగా జరిగిన ప్రమాదాల్లో మరణించడం తదితర కారణాల వల్ల వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా మిగిలారు. గత ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షల మంది రోహింగ్యా ముస్లింలు వలస వచ్చిన విషయం తెల్సిందే.
వారు జాతి పరువు పోగొట్టుకోకూడదని రోహింగ్యాలతో వ్యభిచారం చేయరట. కేవలం బంగ్లాదేశ్ వాళ్లతోని వ్యభిచారం కొనసాగిస్తారట. వారి విటుల్లో యూనివర్సిటీ విద్యార్థుల నుంచి స్థానిక రాజకీయ నాయకుల వరకు ఉన్నారట. అక్కడి మహిళలు శిబిరం నుంచి తమను తరిమేయకుండా ఉండేందుకు స్థానిక రాజకీయ నాయకులతో మరింత సన్నిహితంగా ఉంటారట. అక్కడ విటులెవరూ కండోమ్స్ వాడేందుకు ఇష్టపడరట. మహిళలే పిల్లలు కాకుండా టాబ్లెట్లు వేసుకుంటారట. ఇప్పటికే సుఖ రోగాలు సోకాయో, లేదో కూడా తెలియదట.
ఎంతమంది ఇలా పడపు వృత్తిలో కొనసాగుతున్నారో తాము అంచనా వేయలేదని, దశాబ్దం క్రితం వలసవచ్చిన వారిలోనే దాదాపు 500 మంది వరకు ఈ వృత్తిలో ఉన్నట్లు అర్థం అయిందని ‘ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్’ సంస్థకు చెందిన లీసా అకిరో తెలిపారు. వారి బతుకుతెరువు కోసం వివిధ అంతర్జాతీయ సొసైటీల నుంచి వారికి కావాల్సిన సహాయం అందకపోయినట్లయితే మరింత మంది పడుపు వృత్తిని ఆశ్రయించే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment