ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఉన్నా కూడా...
ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఉన్నా కూడా...
Published Tue, Aug 15 2017 1:54 PM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM
న్యూఢిల్లీ: రొహింగ్య ముస్లిం ప్రజల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ చొరబాటుదారులుగా పేర్కొంటూ సుమారు 40,000 మందిని తక్షణమే దేశం నుంచి పంపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రహోంశాఖ కసరత్తులు ప్రారంభించగా, రంగంలోకి దిగిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గట్టర్స్ భారత ప్రతినిధులతో చర్చిస్తున్నారు.
మయన్మార్ కు చెందిన రొహింగ్య ప్రజలు అక్కడ జరుగుతున్న దాడుల నేపథ్యంలో పొరుగున ఉన్న బంగ్లాదేశ్, భారత్ లకు వలసలగా వెళ్తున్నారు. వారి కోసం రంగంలోకి దిగిన ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయించి ఆశ్రయం కల్పించింది. భారత్ లో సుమారు 16,500 మంది పౌరులకు గుర్తింపు కార్డులను కూడా మంజూరు చేసింది. అయితే హోంశాఖ సహోయమంత్రి కిరెన్ రిజ్జూ మాత్రం అవి చెల్లవని తేల్చేశారు.
"శరణార్థుల విషయంలో ఐక్యరాజ్య సమితి చొరవను మేము అడ్డుకోబోం. అలాగని అక్రమచొరబాటుదారులను ఇక్కడ జీవించేందుకు ఒప్పుకోలేం. అలాగని వాళ్లనేం బంగాళాఖాతంలో పడేయట్లేదు. చట్టం ప్రకారమే తిరిగి వాళ్లను స్వదేశానికి పంపించేస్తాం. ఇప్పటికే మయన్మార్, బంగ్లాదేశ్ లతో సంపద్రింపులు చేపట్టాం" అని రిజ్జూ పేర్కొన్నారు.
మయన్మార్ రఖీనే రాష్ట్రంలో స్థిరపడిన రొహింగ్య ముస్లిం ప్రజలపై గత కొన్నేళ్లుగా చొరబాటుదారుల ముద్ర వేయటమే కాదు, అల్లర్లకు కారణమౌతున్నారని పేర్కొంటూ సైన్యం వారిపై దాడులకు పాల్పడుతోంది. రొహింగ్య యువకులను కాల్చి చంపటం, మహిళలపై అకృత్యాలు పెరిగిపోవటంతో వారంతా పొరుగు దేశాలకు పరుగులు తీస్తున్నారు. గత అక్టోబర్లో సుమారు 75,000 మంది బంగ్లాదేశ్ లోకి ప్రవేశించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే అక్కడ రక్షణ కరువైందన్న ప్రజలను తిరిగి అదే ప్రాంతానికి పంపటం సరికాదన‍్న అభిప్రాయం ఐక్యరాజ్యసమితి వ్యక్తం చేస్తోంది.
Advertisement