షా పొరిర్ ద్వీప్ : 13 ఏళ్ల నబీ హుస్సేన్. పుట్టిన ఊరు తప్ప బయటి ప్రపంచం గురించి ఏం తెలీదు. అలాంటి బాలుడు ఒక్కడే ఓ పెద్ద నదిని దాటి పొరుగు దేశానికి వలస వెళ్లాడు. అలాగని అతనికి ఈత రాదు. ఓ ప్లాస్టిక్ డబ్బా సాయంతో బతుకు జీవుడా అంటూ 2.5 మైళ్లు దాటి ప్రాణాలు రక్షించుకున్నాడు.
మయన్మార్‌లో నబీ లాంటి వ్యక్తులు ఎంతో మంది ఇలా తెగించి దేశం ఒడ్డు దాటి పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కి వలస వెళ్తున్నారు. ఇలా సుమారు ఒకవారంలోనే ముప్ఫై మందికి పైగా ఇలా ఖాళీ ఆయిల్ డబ్బాల ద్వారా నఫ్ నదీ ద్వారం గుండా దేశం దాటారని బంగ్లా అధికారులు చెబుతున్నారు. వీరంతా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన షా పొరిర్ ద్వీపం(బంగ్లాదేశ్ ఆధీనంలో ఉంది)కి చేరుకున్నారు.
నబీ హుస్సేన్ ఫోటో
నది గుండా వచ్చే సమయంలో దేవుడా.. ఇదే నా చివరి రోజు కాకూడదు అని ప్రార్థించా. అని నబీ మీడియాకు చెబుతున్నాడు. నబీ పెద్దగా చదువుకోలేదు. దీంతో తల్లిదండ్రులు అతన్ని కూలీపనులకు పంపటం ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడి దారుణ పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుటికైనా నబీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అందుకే అతన్ని తల్లిదండ్రులు బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. ఇలా ఒక్క నబీ తల్లిదండ్రులే కాదు.. అక్కడ ఉన్న వందల మంది తల్లిదండ్రులు తమ పిల్లను నఫా గుండా బంగ్లాదేశ్‌కు దగ్గరుండి మరీ పంపిస్తున్నారు. నాలుగు రోజులు నిద్ర, ఆకలి, దాహం(అది సముద్ర ముఖ ద్వారం దగ్గరగా ఉండటంతో ఉప్పు నీరుగా మారిపోయింది) అన్నింటిని చంపేసుకుని వారు షా పొరిర్‌కు చేరుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది వారి విషయంలో ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం.
భద్రతా సిబ్బంది అదుపులో మయన్మార్ యువత...
అసలు సమస్యేంటి?
కాగా, శతాబ్దాల నుంచి మయన్మార్‌లో తాము నివసిస్తున్నామని చెప్పుకుంటున్న రోహింగ్యా ముస్లింల ప్రాణాలకు ఇప్పుడు అక్కడ భద్రత లేకుండా పోయింది. రెండు నెలల క్రితం రోహింగ్యా చోరబాటుదారుల దాడి ఆరోపణలతో ఎదురుదాడి ప్రారంభించిన మయన్మార్ సైనికులు, వారికి జత కలిసిన బౌద్ధ సంఘాలు ఊచకోతకు పాల్పడ్డారు. రోహింగ్యాలపై ఉగ్రవాద ముద్ర వేసి వారిని దారుణంగా హతమార్చటం, మహిళలపై అత్యాచారాలు, వారి ఆస్తుల విధ్వంసంలాంటివి చేయటం ప్రారంభించారు.
దీంతో భయకంపితులైన 6 లక్షల మంది రోహింగ్యాలు పొరుగు దేశాల వైపు పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మయన్మార్ ప్రభుత్వం కూడా వారి హక్కుల రక్షణ విషయంలో చేతులెత్తేయగా.. అందుకే ఐక్యరాజ్య సమితి మాత్రం వారికి ఆశ్రయం కల్పించాలంటూ వివిధ దేశాలకు(భారత్ సహా) విజ్ఞప్తి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment