దేశాల మధ్య సరిహద్దులు అంటే.. కంచెలు, హద్దు రాళ్లు గుర్తుకువస్తుంటాయి. కొన్నిచోట్ల గ్రామాలు, పట్టణాలకు దగ్గరగా సరిహద్దులు ఉంటుంటాయి. గ్రామాల మధ్యలోంచి కూడా దేశాల సరిహద్దులు వెళ్లే ప్రాంతాలూ కొన్ని ఉన్నాయి. అలా భారత్, మయన్మార్ దేశాల మధ్య ఉన్న గ్రామమే.. లోంగ్వా. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా..
రెండు దేశాల బార్డర్!
భారత్, మయన్మార్ దేశాల మధ్య నాగాలాండ్ రాష్ట్రంలో లోంగ్వా గ్రామం ఉంది. కొన్యాక్ గిరిజనులు నివసించే ఈ గ్రామం ఎత్తైన కొండల మీద ఉంటుంది. ఈ గ్రామ పెద్ద ఇంటి మీదుగానే అంతర్జాతీయ సరిహద్దు వెళ్తుంది. ‘మేం భారత్లో తింటాం. మయన్మార్‌లో నిద్రపోతాం’ అని గ్రామ పెద్ద సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. ఈ గ్రామ పెద్దను ‘ఆంఘ్’ లేదా ‘చీఫ్టేన్’ అని పిలుచుకుంటారు.
కొన్యాక్ తెగకు చెందినవారు 5 వేల మందికిపైగా ఉంటారని అంచనా. వారందరికీ ‘ఆంఘ్’ రాజు. ఆయనకు 60 మంది భార్యలు అని.. చుట్టూ ఇటు భారత్, అటు మయన్మార్‌లో ఉన్న 60 గ్రామాలను పాలిస్తుంటారని చెబుతారు. ఈ పరపతి కారణంగానే.. చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే ముందే లోంగ్వా గ్రామానికి 4జీ మొబైల్ నెట్‌వర్క్ వచి్చందని అంటుంటారు.
తల నరికేసే యోధులు! రెండు దేశాల్లోనూ పౌరసత్వం
కొన్యాక్ తెగలో ఓ ఆచారం ఉంది. ఈ తెగ యువకులు ప్రత్యర్థి తెగలవారితో తలపడి తల తెగనరికి తీసుకువస్తే యుద్ధవీరుడిగా గుర్తింపు ఇస్తారు. తలపై ఇత్తడి కిరీటాన్ని, మెడలో ఇత్తడి బిళ్లలతో కూడి దండను ధరిస్తారు. ఎంత మంది తలలు నరికితే అన్ని ఇత్తడి బిళ్లలు వేసుకుంటారు. ప్రభుత్వం 1960లో ఈ సాంప్రదాయాన్ని నిషేధించింది.
అయినా ఇప్పటికీ తమ మెడలో ‘హెడ్ హంటర్స్’కు గుర్తుగా దండలను ధరిస్తారు. ఇక వారి తెగ సాంప్రదాయాన్ని, తమ హోదాను బట్టి ముఖంపై వివిధ ఆకారాల్లో పచ్చబొట్లు వేసుకుంటారు. తర్వాతి కాలంలో ఈ తెగకు చెందినవారు చాలా మంది క్రిస్టియనిటీ స్వీకరించారు. అయినా తమ ఆచారాలను కొనసాగిస్తుంటారు.
భారత్, మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దుపై ఉన్న లోంగ్వా గ్రామస్తులకు అధికారికంగానే ఇరు దేశాల పౌరసత్వం ఉంది. మన దేశంలో ఇలాంటి పౌరసత్వం ఉన్న ఏకైక గిరిజన తెగ వీరిదేనని చెబుతారు. గ్రామస్తులు చాలా మంది రెండు దేశాల ఎన్నికల్లోనూ ఓటేస్తారు. కొందరు మయన్మార్ ఆరీ్మలోనూ పనిచేస్తున్నారు.
లోంగ్వా గ్రామం, పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలకు నెలవు. భారత్ వైపు రెండు, మయన్మార్ వైపు మరో రెండు చిన్న నదులు, షిలోయ్ అనే ఓ సరస్సు ఉన్నాయి. దీనికితోడు కొన్యాక్ తెగవారి ప్రత్యేకతలు, ఆచారాలను చూడటానికి ఇటీవలికాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు లోంగ్వాకు వెళుతున్నారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
(చదవండి: జ్ఞానవాపి మసీదు: కీలక తీర్పు పై ఉత్కంఠ)
Comments
Please login to add a commentAdd a comment