
నేపిడా: ప్రకృతి ప్రకోపానికి మయన్మార్.. మరుభూమిగా మారింది. గత శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం(Major earthquake) ఆ దేశాన్ని అస్తవ్యస్తం చేసింది. భూకంపం దరిమిలా ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. భూకంప మృతుల సంఖ్య 2,056 కు చేరింది. దాదాపు 3,900 మంది గాయపడ్డారు. 270 మంది గల్లంతయ్యారు.

మరింత దిగజారిన పరిస్థితులు
మయన్మార్(Myanmar)లోని ప్రధాన పట్టణాలైన మండలే, నేపిడాలలో భూకంప బాధితులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులన్నీ భూకంప బాధితులతో నిండిపోయాయి. దీంతో అందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో వారికి చికిత్స అందించేందుకు స్థలం, వనరుల కొరత ఏర్పడుతోంది. ఈ రెండు నగరాల్లోని వైద్య సిబ్బంది బాధితులను ఆదుకునేందుకు నిరంతరం తమ సేవలు అందిస్తున్నారు.

సైనిక పాలనలో..
పలు నివేదికల ప్రకారం గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న సైనిక పాలన(Military rule) మయన్మార్‌లో ఆరోగ్య సేవలను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. భూకంపానికి ముందు నుంచి పలు ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మండలేలో పరిస్థితి దారుణంగా ఉంది. 80 శాతానికిపైగా వైద్య సిబ్బంది సైనిక పాలనకు వ్యతిరేకిస్తున్నారు. గడచిన నెలలో ఏడు ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేశారు. భూకంపానికి ముందే మండలేలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను మూసివేశారు.

ఆస్పత్రులు ధ్వంసం
భూకంపం కారణంగా కొన్ని ఆస్పత్రులు ధ్వంసం కావడంతో బాధితులందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. అరకొరగా ఉన్న ఆస్పత్రులలో పడకల కొరత అధికంగా ఉంది. రోగులను నేలపైనే పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. కాగా మయన్మార్ వాతావరణ, జలశాస్త్ర విభాగం తెలిపిన వివరాల ప్రకారం భారీ భూకంపం తరువాత 36 భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వాటి తీవ్రత 2.8- 7.5 మధ్య ఉంది. శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన కొద్ది నిమిషాల తర్వాత 6.4 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించింది.
ఇది కూడా చదవండి: చిరాగ్ పాశ్వాన్ తల్లి గదికి తాళం.. రోడ్డునపడ్డ కుటుంబ కలహాలు