‘‘మయన్మార్లోని రాఖైన్ ప్రాంతంలో రొహింగ్యా ముస్లింలు నివసించే కనీసం 200 గ్రామాలను సైనికదళాలు తగలబెట్టాయి. వందలాది మంది పౌరుల ప్రాణాలు తీశారు. పొరుగునున్న బంగ్లాదేశ్‌కు పారిపోయే శరణార్థులను గాయపరచి, చంపే లక్ష్యంతో సరిహద్దులో ఆర్మీ మందుపాతరలు పెట్టింది. స్త్రీలపై అత్యాచారాలు సహా అన్ని రకాల హింసాత్మక పద్ధతులు ప్రయోగించారు, ’’ అంటూ ఈ నెల ఆరున అమెరికా ప్రతినిధులసభ మయన్మార్ సర్కారు తీరును ఖండిస్తూ తీర్మానం ఆమోదించింది. అయితే, రొహింగ్యా జాతి నిర్మూలనకు ఈ వర్గం స్త్రీలపై సామూహిక అత్యాచారాలు జరిగాయని తాజాగా వార్తలందుతున్నాయి. పురుషులు పారిపోగా నిస్సహాయ స్థితిలో ఉన్న రొహింగ్యా మహిళలను వారి ఇళ్లలోనే బంధించి బలాత్కారాలు చేయడం సైనికులకు అలవాటుగా మారింది.
యూనిఫాంలో ఉన్న ఆర్మీ సైనికులు కొందరు స్త్రీలపై వారి భర్తల ముందే అత్యాచారం చేసినట్టు అనేక మంది మహిళలు పాశ్చాత్య మీడియా ప్రతినిధులకు వెల్లడిస్తున్నారు. పెళ్లికాని యువతులు, వివాహితలనే తేడా లేకుండా ఒక వ్యూహం ప్రకారం రేప్ చేసి వారిలో భయోత్పాతం సృష్టిస్తున్నారని కూడా తమ పేరు చెప్పడానికి భయపడిన యువతులు వివరిస్తున్నారు. ఇంత పాశవికంగా అత్యాచారాలకు గురయ్యాక ప్రాణాలు దక్కించుకుని బంగ్లాదేశ్‌లోని కాక్స్ బాజార్ చేరుకున్న రొహింగ్యా మహిళలు సైనికుల రాక్షస కృత్యాలను కథలు కథలుగా చెబుతున్నారు. దేశ పశ్చిమ ప్రాంతంలోని రాఖైన్ నుంచి బెంగాలీ ముస్లిం తెగకు చెందిన రొహింగ్యాలందరినీ తుడిచిపెట్టడానికి రేప్‌ను బలమైన ఆయుధంగా ఆర్మీ వాడుకుంటోందని మానవహక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ విడుదల చేసిన 37 పేజీల నివేదికలో పేర్కొంది.
ఆర్మీ ఆయుధం ‘రేప్’
‘‘రొహింగ్యాలను సమూలంగా నిర్మూలించడానికి లేదా తరిమికొట్టడానికి వారి ఆడపడుచులపై సైన్యం ప్రయోగిస్తున్న దుర్మార్గమైన ఆయుధం రేప్. బర్మా సైన్యం రాక్షస చేష్టలతో లెక్కకు అందనంత మంది మహిళలు కోలుకోలేని స్థాయిలో మానసికంగా, శారీరకంగా గాయపడ్డారు,’’ అని ‘ఆలాఫ్ మై బాడీ వాజ్ పెయిన్-సెక్సువల్ వయలెన్స్ అగెనెస్ట్ రొహింగ్యా విమిన్ అండ్ గాల్స్ ఇన్ బర్మా’ (నా శరీరమంతా బాధే-బర్మాలో రొహింగ్యా మహిళలు, యువతులపై లైంగిక హింస) అనే పేరుతో హ్యూమన్రైట్స్ వాచ్ ప్రచురించిన నివేదిక రచయిత స్కయ్ వీలర్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి సైనిక దళాలు కొనసాగిస్తున్న దాష్టీకాలు, అత్యాచారాల ఫలితంగా ఇప్పటికి ఆరున్నర లక్షల మంది రొహింగ్యాలు మయన్మార్ వదిలి బంగ్లాదేశ్‌కు శరణార్థులుగా చేరుకున్నారు.
ఇలా వచ్చిన 52 మంది మహిళలు, ఆడపిల్లలను హ్యూమన్ రైట్స్ వాచ్ కలిసి మాట్లాడింది. వారిలో 29 మంది బలాత్కారానికి గురయ్యాక ప్రాణాలతో బయటపడినవారు. ఇంకా 18 ఏళ్లు నిండని యువతులు వారిలో ఉన్నారు. సైనికుల చేతుల్లో అత్యాచారాలకు గురైన ఆడవాళ్లందరూ 19 గ్రామాలకు చెందినవారే. ఈ ప్రాంతంలో రొహింగ్యాలు కాని స్థానిక బర్మా జాతికి చెందిన పురుషులు తరచు ఆర్మీతో చేతులు కలిపి రొహింగ్యాలను ఇక్కడి నుంచి ఖాళీచేయించే పనిలో భాగంగా అన్ని రకాల అరాచకాలకూ పాల్పడ్డారు. అప్పటికే భయకంపితులైన రొహింగ్యా స్త్రీలపై సైనికులతోపాటు స్థానికులూ అత్యాచారాలు జరిపారు. హాథీపారా గ్రామానికి చెందిన హాలా సడక్ అనే 15 ఏళ్ల బాలిక తనను పది మంది సైనికులు ఎంత క్రూరంగా బలాత్కరించిందీ వివరించింది. సామూహిక అత్యాచారం చేశాక ఇలాంటి ఆడపిల్లలను మళ్లీ వాళ్ల ఇళ్ల దగ్గర వదలిపోవడం ఆర్మీకి అలవాటుగా మారింది.
బాస్నియా తరహాలో ముస్లిం మహిళలపై అత్యాచారాలు
పాతికేళ్ల క్రితం(1992-93) పూర్వపు యుగోస్లావియా విచ్ఛిన్నమయ్యాక దానిలో అంతర్భాగమైన బాస్నియాలోని ముస్లిం మహిలపై ఐరోపా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అత్యాచారాలు జరిపారు. ఈ దుర్మార్గానికి పాల్పడినవారంతా సెర్బియన్లే. జాతుల పోరాటంలో చివరికి మహిళలు ఎక్కువ మంది బలయ్యారు. మూకుమ్మడి బలాత్కారాలకు కారకుడైన బాస్నియా సెర్బియా నేత రదోవా కరాజిచ్‌ను విచారించిన అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్ కఠినశిక్ష విధించింది. ఇప్పుడు బర్మాలో జాతి ‘ప్రక్షాళన’ కార్యకలాపాల మాటున రొహింగ్యా స్త్రీలపై అత్యాచారాలు జరిగాయని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకటించగా, ఈ కథనాల్లో నిజం లేదని మయన్మార్ ఆర్మీ ఖండించింది. రొహింగ్యాలపై, మహిళలపై ఇదే స్థాయిలో అత్యాచారాలు కొనసాగితే ఆంక్షలు విధిస్తామని కూడా అనే ఐరోపా దేశాలతోపాటు అమెరికా పరోక్షంగా హెచ్చరిస్తోంది.
----(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment