Rohingya Muslim
-
రోహింగ్యా ముస్లింలపై డ్రోన్ దాడి.. 200 మంది మృతి?
బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు అదుపులోకి రావడం లేదు. ఇప్పుడు ఆ దేశం ముందు మరో సవాలు నిలిచింది. తాజాగా మయన్మార్ నుంచి పెద్ద సంఖ్యలో రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపధ్యంలో మయన్మార్ నుండి బంగ్లాదేశ్‌కు తరలివస్తున్న రోహింగ్యా ముస్లింలపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.. మృతుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ ఉదంతం సంచలనంగా మారింది. బురదతో కూడిన పొలంలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు పడి ఉండడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఈ మృతదేహాల చుట్టూ సూట్‌కేసులు, బ్యాక్‌ప్యాక్‌లు పడి ఉన్నాయి.వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు ప్రత్యక్ష సాక్షులు ఈ డ్రోన్ దాడుల గురించి మీడియాకు తెలిపారు. బంగ్లాదేశ్ సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబాలపై ఈ దాడి జరిగిందని వారు పేర్కొన్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఈ దాడి రోహింగ్యా పౌరులపై జరిగిన అత్యంత పాశవిక దాడి. ఈ దాడుల వెనుక అరకాన్ ఆర్మీ హస్తం ఉందని రాయటర్స్ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను అరకాన్ ఆర్మీ ఖండించింది. ఈ దాడిపై మయన్మార్ సైన్యం, మిలీషియా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఏ ప్రాంతానికి చెందనది? ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే వివరాలు ఇంకా నిర్ధారణ కాలేదు. -
వారి అంశంలో ‘ఆధార్’ కఠిన నిబంధనలు
సాక్షి, సిటీబ్యూరో: రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చి, భారత గుర్తింపుకార్డులు పొందడంలో వారికి సహకరించిన వారికీ కష్టాలు తప్పవని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఆధార్ సంస్థ నగరానికి చెందిన 127 మందికి నోటీసులు జారీ చేయడానికి ఇదే కారణమని వారు స్పష్టం చేస్తున్నారు. ఆధార్ కార్డులు పొందిన ఆయా విదేశీయులతో పాటు, వారికి సహకరించిన, ఆశ్రయం ఇచ్చిన వారు కూడా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత కార్డులు రద్దు చేయడమా? కొనసాగిండమా? అనేది యూనిక్ ఐడింటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) నిర్ణయం తీసుకుంటుందని వారు పేర్కొన్నారు. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సత్తార్ ఖాన్ కేసును దీనికి తాజా ఉదాహరణగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నోటీసులు జారీ అయిన నాటి నుంచి సత్తార్ ఖాన్ పేరు వార్తల్లోకి వస్తోంది. తాను భారతీయుడిని అయినా నిరూపించుకోవాలని అన్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఇతడు 2018లో రోహింగ్యాలకు సహకరించిన కేసులో అరెస్టైనందుకు ఆ విషయాన్ని యూఐడీఏఐకు తెలిపామని, ఫలితంగానే వారు నోటీసులు జారీ చేశారని నగర పోలీసు అధికారులు స్పష్టం చేశారు. రోహింగ్యాలైన రుబీనా అక్తర్, నజీరుల్ ఇస్లాం కొన్నేళ్ల క్రితం అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారు. నగరంలోని పాతబస్తీలో భార్యాభర్తలుగా స్థిరపడిన వీరిద్దరూ సత్తార్ ఖాన్ సహకారంతో అతడి ఇంటి చిరునామా, ధ్రువీకరణ పత్రాలతో ఓ మీ–సేవా కేంద్ర నిర్వాహకుడి ద్వారా ఆధార్ కార్డు సహా ఇతర గుర్తింపులు పొందారు. నజీరుల్ పాస్‌పోర్ట్ సైతం తీసుకోగా.. రుబీనా ఆ ప్రయత్నాలు చేశారు. 2018 జనవరిలో ఈ విషయాన్ని గుర్తించిన నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ కంచన్‌బాగ్ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రుబీనా అక్తర్‌తో పాటు నజీరుల్ ఇస్లాం, సత్తార్ ఖాన్, మీ–సేవ కేంద్రం నిర్వాహకుడిని కంచన్‌బాగ్ పోలీసులు అదే ఏడాది జనవరి 8న అరెస్టు చేసి వీరి నుంచి ఆధార్ సహా గుర్తింపుకార్డులను స్వాధీనం చేసుకున్నారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఈ ఇద్దరు విదేశీయులు (రోహింగ్యాలు) అక్రమంగా ఆధార్ కార్డు పొందారని, పాతబస్తీ చిరునామాతో తీసుకున్నారంటూ నగర పోలీసులు ఆధార్ నెంబర్లతో సహా యూఐడీఏఐకు లేఖ రాశారు. ఈ తరహాకు చెందిన అనేక కేసుల సమాచారాన్ని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు యూఐడీఏఐకు అధికారికంగా అందజేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న యూఐడీఏఐ ఆయా విదేశీయులతో పాటు ఆ కేసుల్లో సహ నిందితులుగా ఉన్న పాతబస్తీ వాసులు, వారికి ఆశ్రయం ఇచ్చిన వారితో కలిపి మొత్తం 127 మందికి నోటీసులు జారీ చేసింది. వీరంతా నిర్దేశిత సమయంలో యూఐడీఏఐ ఆధార్ అధికారుల ఎదుట హాజరై తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై నగర పోలీసు విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘దేశంలోకి పాస్‌పోర్ట్, వీసాలో వచ్చిన విదేశీయులు 182 రోజులకు మించి నివసిస్తే యూఐడీఏఐకు దరఖాస్తు చేసుకుని ఆధార్ కార్డు తీసుకునే అవకాశం ఉంది. అయితే వారు దేశం విడిచి వెళ్లే సమయంలో ఆ కార్డును తిరిగి అప్పగించాలి. అక్రమంగా దేశంలోకి ప్రవేశించి, తప్పుడు వివరాలు, పత్రాలతో ఆధార్ పొందిన వారితో పాటు సహకరించిన వారికీ యూఐడీఏఐ నోటీసులు ఇస్తుంది. వీరిలో పౌరసత్వం నిరూపించుకోలేని వారికి కార్డు రద్దవుతుంది’ అని పేర్కొన్నారు. -
ఆధార్ నోటీసులు: కీలక అంశాలు!
సాక్షి, హైదరాబాద్: ఆధార్ నోటీసుల వ్యవహారంలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నకిలీ ధృవపత్రాలతో ఆధార్ కార్డు అందుకున్నాడంటూ హైదరబాద్‌లో నివసించే సత్తర్‌ఖాన్ అనే ఆటో రిక్షా డ్రైవర్‌కు ఫిబ్రవరి 3న నోటీసులు జారీచేసింది. కాగా 2018లో రోహింగ్యా ముస్లింలకు నకిలీ పత్రాలు సృష్టించి.. వారికి ఆధార్‌కార్డులు ఇప్పించినట్లు సత్తార్‌పై సీపీఎస్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. అదే విధంగా.. పాతబస్తీలో పలువురు బ్రోకర్లు నకిలీ పాత్రలు సృష్టించి 127 మంది రోహింగ్యా లకు ఆధార్ నమోదు చేయిస్తున్న విషయం బట్టబయలైంది. ఈ నేపథ్యంలోనే విచారణలో భాగంగా... తెలంగాణ పోలీసులు ఆధార్ సంస్థకు లేఖ రాశారు. ఇందుకు స్పందించిన ఆధార్ యాజమాన్యం 127 మంది రోహింగ్యా ముస్లింలకు నోటీసులు జారీచేసింది. సరైన పత్రాలతో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అతడికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. ఇక సత్తార్‌ఖాన్‌కు తనకు వచ్చిన నోటీసుల గురించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఆధార్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులు పొందారంటూ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే 127 మంది హైదరాబాదీలకు నోటీసులు పంపించామని వివరణ ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారు గురువారంలోగా విచారణ అధికారి ముందు హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా... ఈరోజు జరగాల్సిన నకిలీ ఆధార్ విచారణను యూడీఏఐ రద్దు చేసింది. బాలాపూర్ మెగా గార్డెన్స్‌లో విచారణ జరగాల్సి ఉండగా అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక తదుపరి విచారణకు సంబంధించిన వివరాలను నోటీసులు అందుకున్న వారికి స్పీడ్‌పోస్టులో పంపింది. పౌరసత్వాన్ని నిరూపించుకోండంటూ 127 మందికి నోటీసులు -
బిగిసిన ఒక చిట్టి పిడికిలి
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు తెలియదు. తెలియాల్సిన అవసరం కూడా లేదు. కాని ఆ అమ్మాయి కళ్లల్లో గూడు కట్టి ఉన్న కన్నీరు ఆ అమ్మాయి కథంతా చెబుతోంది. ఈ ఫొటో 2017 నవంబర్‌లో ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ వార్తాసంస్థ తీసినది. బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్ శరణార్థి శిబిరాలలో తల దాచుకున్న రోహింగ్యా ముస్లింలను ఆ సంస్థ ఇంటర్వ్యూ చేసినప్పుడు మొత్తం 27 మంది స్త్రీలు తమ కళ్లు మాత్రమే కనపడేలా మాట్లాడారు. వారంతా తమపై సైన్యం అత్యాచారం చేసిందని చెప్పారు. ఈ ఫొటోలోని అమ్మాయి బంగ్లాదేశ్ చేరుకునేలోపు జూన్‌లో ఒకసారి, తిరిగి సెప్టెంబర్‌లో ఒకసారి అత్యాచారానికి గురైంది. 2017 ఆగస్టులో మయన్మార్‌లోని మైనార్టీ వర్గమైన రోహింగ్యా ముస్లింలపై సైన్యం తెగబడింది. ఊళ్లను తగులబెట్టింది. ఖాళీ చేయించింది. దేశం బయటకు తరిమికొట్టింది. వందలాది మరణాలు, లెక్కకు మించిన అత్యాచారాలు జరిగాయి. దాదాపు 7 లక్షల మంది ప్రాణాలు అరచేత పట్టుకొని సొంత నేలను వదిలి బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. ఈ మానవ హననం పట్ల ప్రపంచంలోని చాలా కొద్ది దేశాలు మాత్రమే నిరసన వ్యక్తం చేశాయి. అన్నింటి కంటే గట్టిగా కెనెడా దేశం తన పార్లమెంట్లో ‘మయన్మార్‌లో జరిగినది జాతి హననం’ అని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మయన్మార్ సైన్యం మీద అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలని ఆ దేశ మానవ హక్కుల సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే కెనెడా కేవలం ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి ఫిర్యాదు మాత్రమే చేయగలిగింది. కాని ఇప్పుడు మయన్మార్‌ను పశ్చిమాసియాలోని అతి చిన్న దేశమైన గాంబియా బోనులో నిలబెట్టింది. మయన్మార్‌లో ముస్లిం మైనారిటీల పట్ల సైన్యం చేసిన అత్యాచారాలను విచారించాల్సిందిగా నిన్న (నవంబర్ 11, 2019)న ఫిర్యాదు చేసింది. ఆ దేశం తరపున కొందరు న్యాయవాదుల బృందం నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ‘మా దేశం చాలా చిన్నదే కావచ్చు. కాని న్యాయం పట్ల మేమెత్తిన గొంతు పెద్దది’ అని గాంబియా దేశ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇటువంటి ప్రతిస్పందనలు చూసినప్పుడు బాధితులకు అండగా నిలిచేవారు ఎప్పుడూ ఉంటారని అనిపిస్తుంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుంది. -
అంతులేని కథ - అత్యాచారాల వ్యథ
‘‘మయన్మార్‌లోని రాఖైన్ ప్రాంతంలో రొహింగ్యా ముస్లింలు నివసించే కనీసం 200 గ్రామాలను సైనికదళాలు తగలబెట్టాయి. వందలాది మంది పౌరుల ప్రాణాలు తీశారు. పొరుగునున్న బంగ్లాదేశ్‌కు పారిపోయే శరణార్థులను గాయపరచి, చంపే లక్ష్యంతో సరిహద్దులో ఆర్మీ మందుపాతరలు పెట్టింది. స్త్రీలపై అత్యాచారాలు సహా అన్ని రకాల హింసాత్మక పద్ధతులు ప్రయోగించారు, ’’ అంటూ ఈ నెల ఆరున అమెరికా ప్రతినిధులసభ మయన్మార్ సర్కారు తీరును ఖండిస్తూ తీర్మానం ఆమోదించింది. అయితే, రొహింగ్యా జాతి నిర్మూలనకు ఈ వర్గం స్త్రీలపై సామూహిక అత్యాచారాలు జరిగాయని తాజాగా వార్తలందుతున్నాయి. పురుషులు పారిపోగా నిస్సహాయ స్థితిలో ఉన్న రొహింగ్యా మహిళలను వారి ఇళ్లలోనే బంధించి బలాత్కారాలు చేయడం సైనికులకు అలవాటుగా మారింది. యూనిఫాంలో ఉన్న ఆర్మీ సైనికులు కొందరు స్త్రీలపై వారి భర్తల ముందే అత్యాచారం చేసినట్టు అనేక మంది మహిళలు పాశ్చాత్య మీడియా ప్రతినిధులకు వెల్లడిస్తున్నారు. పెళ్లికాని యువతులు, వివాహితలనే తేడా లేకుండా ఒక వ్యూహం ప్రకారం రేప్ చేసి వారిలో భయోత్పాతం సృష్టిస్తున్నారని కూడా తమ పేరు చెప్పడానికి భయపడిన యువతులు వివరిస్తున్నారు. ఇంత పాశవికంగా అత్యాచారాలకు గురయ్యాక ప్రాణాలు దక్కించుకుని బంగ్లాదేశ్‌లోని కాక్స్ బాజార్ చేరుకున్న రొహింగ్యా మహిళలు సైనికుల రాక్షస కృత్యాలను కథలు కథలుగా చెబుతున్నారు. దేశ పశ్చిమ ప్రాంతంలోని రాఖైన్ నుంచి బెంగాలీ ముస్లిం తెగకు చెందిన రొహింగ్యాలందరినీ తుడిచిపెట్టడానికి రేప్‌ను బలమైన ఆయుధంగా ఆర్మీ వాడుకుంటోందని మానవహక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ విడుదల చేసిన 37 పేజీల నివేదికలో పేర్కొంది. ఆర్మీ ఆయుధం ‘రేప్’ ‘‘రొహింగ్యాలను సమూలంగా నిర్మూలించడానికి లేదా తరిమికొట్టడానికి వారి ఆడపడుచులపై సైన్యం ప్రయోగిస్తున్న దుర్మార్గమైన ఆయుధం రేప్. బర్మా సైన్యం రాక్షస చేష్టలతో లెక్కకు అందనంత మంది మహిళలు కోలుకోలేని స్థాయిలో మానసికంగా, శారీరకంగా గాయపడ్డారు,’’ అని ‘ఆలాఫ్ మై బాడీ వాజ్ పెయిన్-సెక్సువల్ వయలెన్స్ అగెనెస్ట్ రొహింగ్యా విమిన్ అండ్ గాల్స్ ఇన్ బర్మా’ (నా శరీరమంతా బాధే-బర్మాలో రొహింగ్యా మహిళలు, యువతులపై లైంగిక హింస) అనే పేరుతో హ్యూమన్‌రైట్స్ వాచ్ ప్రచురించిన నివేదిక రచయిత స్కయ్ వీలర్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి సైనిక దళాలు కొనసాగిస్తున్న దాష్టీకాలు, అత్యాచారాల ఫలితంగా ఇప్పటికి ఆరున్నర లక్షల మంది రొహింగ్యాలు మయన్మార్ వదిలి బంగ్లాదేశ్‌కు శరణార్థులుగా చేరుకున్నారు. ఇలా వచ్చిన 52 మంది మహిళలు, ఆడపిల్లలను హ్యూమన్ రైట్స్ వాచ్ కలిసి మాట్లాడింది. వారిలో 29 మంది బలాత్కారానికి గురయ్యాక ప్రాణాలతో బయటపడినవారు. ఇంకా 18 ఏళ్లు నిండని యువతులు వారిలో ఉన్నారు. సైనికుల చేతుల్లో అత్యాచారాలకు గురైన ఆడవాళ్లందరూ 19 గ్రామాలకు చెందినవారే. ఈ ప్రాంతంలో రొహింగ్యాలు కాని స్థానిక బర్మా జాతికి చెందిన పురుషులు తరచు ఆర్మీతో చేతులు కలిపి రొహింగ్యాలను ఇక్కడి నుంచి ఖాళీచేయించే పనిలో భాగంగా అన్ని రకాల అరాచకాలకూ పాల్పడ్డారు. అప్పటికే భయకంపితులైన రొహింగ్యా స్త్రీలపై సైనికులతోపాటు స్థానికులూ అత్యాచారాలు జరిపారు. హాథీపారా గ్రామానికి చెందిన హాలా సడక్ అనే 15 ఏళ్ల బాలిక తనను పది మంది సైనికులు ఎంత క్రూరంగా బలాత్కరించిందీ వివరించింది. సామూహిక అత్యాచారం చేశాక ఇలాంటి ఆడపిల్లలను మళ్లీ వాళ్ల ఇళ్ల దగ్గర వదలిపోవడం ఆర్మీకి అలవాటుగా మారింది. బాస్నియా తరహాలో ముస్లిం మహిళలపై అత్యాచారాలు పాతికేళ్ల క్రితం(1992-93) పూర్వపు యుగోస్లావియా విచ్ఛిన్నమయ్యాక దానిలో అంతర్భాగమైన బాస్నియాలోని ముస్లిం మహిలపై ఐరోపా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అత్యాచారాలు జరిపారు. ఈ దుర్మార్గానికి పాల్పడినవారంతా సెర్బియన్లే. జాతుల పోరాటంలో చివరికి మహిళలు ఎక్కువ మంది బలయ్యారు. మూకుమ్మడి బలాత్కారాలకు కారకుడైన బాస్నియా సెర్బియా నేత రదోవా కరాజిచ్ను విచారించిన అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్ కఠినశిక్ష విధించింది. ఇప్పుడు బర్మాలో జాతి ‘ప్రక్షాళన’ కార్యకలాపాల మాటున రొహింగ్యా స్త్రీలపై అత్యాచారాలు జరిగాయని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకటించగా, ఈ కథనాల్లో నిజం లేదని మయన్మార్ ఆర్మీ ఖండించింది. రొహింగ్యాలపై, మహిళలపై ఇదే స్థాయిలో అత్యాచారాలు కొనసాగితే ఆంక్షలు విధిస్తామని కూడా అనే ఐరోపా దేశాలతోపాటు అమెరికా పరోక్షంగా హెచ్చరిస్తోంది. ----(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
రోహింగ్యాలను మోదీ ఎందుకు అంగీకరించరు: ఓవైసీ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ రోహింగ్యా శరణార్ధులను ఎందుకు తన సోదరులుగా అంగీకరించడం లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. దేశ భద్రతకు రోహింగ్యా శరణార్ధులతో ముప్పు వాటిల్లుతుందని వెనక్కి పంపించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఎందరో శరణార్థులకు ఆశ్రయం కల్పించి, ముస్లింలైన రోహింగ్యాలను ఎందుకు అనుమంతించడం లేదన్నారు. బంగ్లాదేశ్ రచయిత తస్లీమా నస్రీన్‌కు ఆశ్రయం కల్పించవచ్చు. 65వేల మంది తస్లీమ్ శరణార్ధులు దేశంలో నివసించవచ్చు కానీ రోహింగ్యాలు మాత్రం ఎందుకు నివసించకూడదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షమంది టిబెట్ శరణార్ధులతో పాటు టిబెటియన్ నేత దలైలామకు ఆశ్రయం కల్పించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చక్మాస్లు అరుణాచల్ ప్రదేశ్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పాక్-భారత్ యుద్ద సమయంలో వేల మంది భారత్‌కు వచ్చారని, వారందరికి భారత పౌరసత్వం ఇచ్చి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాంటప్పుడు 130 కోట్ల జనాభాగల దేశంలో 40 వేల మంది రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తే ఏమవుతుందని ఓవైసీ కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు. రోహింగ్యా శరణార్ధులకు ఆశ్రయం కల్పించడం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, వారిని దేశంలోకి అనుమతించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్మూ, ఢిల్లీ, హైదరాబాద్, మేవట్ ప్రాంతాల్లో రోహింగ్యా తీవ్రవాదులు చురుగ్గా ఉన్నారని, వీరిని ఐసిస్ వంటి ఉగ్రసంస్థలు వాడుకునే ప్రమాదముందని సుప్రీంకు కూడా నివేదించింది.