రోహింగ్యాలను మోదీ ఎందుకు అంగీకరించరు: ఓవైసీ
రోహింగ్యాలను మోదీ ఎందుకు అంగీకరించరు: ఓవైసీ
Published Fri, Sep 15 2017 11:49 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ రోహింగ్యా శరణార్ధులను ఎందుకు తన సోదరులుగా అంగీకరించడం లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. దేశ భద్రతకు రోహింగ్యా శరణార్ధులతో ముప్పు వాటిల్లుతుందని వెనక్కి పంపించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఎందరో శరణార్థులకు ఆశ్రయం కల్పించి, ముస్లింలైన రోహింగ్యాలను ఎందుకు అనుమంతించడం లేదన్నారు.
బంగ్లాదేశ్ రచయిత తస్లీమా నస్రీన్‌కు ఆశ్రయం కల్పించవచ్చు. 65వేల మంది తస్లీమ్ శరణార్ధులు దేశంలో నివసించవచ్చు కానీ రోహింగ్యాలు మాత్రం ఎందుకు నివసించకూడదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షమంది టిబెట్ శరణార్ధులతో పాటు టిబెటియన్ నేత దలైలామకు ఆశ్రయం కల్పించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చక్మాస్‌లు అరుణాచల్ ప్రదేశ్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పాక్-భారత్ యుద్ద సమయంలో వేల మంది భారత్‌కు వచ్చారని, వారందరికి భారత పౌరసత్వం ఇచ్చి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాంటప్పుడు 130 కోట్ల జనాభాగల దేశంలో 40 వేల మంది రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తే ఏమవుతుందని ఓవైసీ కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు.
రోహింగ్యా శరణార్ధులకు ఆశ్రయం కల్పించడం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, వారిని దేశంలోకి అనుమతించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్మూ, ఢిల్లీ, హైదరాబాద్, మేవట్ ప్రాంతాల్లో రోహింగ్యా తీవ్రవాదులు చురుగ్గా ఉన్నారని, వీరిని ఐసిస్ వంటి ఉగ్రసంస్థలు వాడుకునే ప్రమాదముందని సుప్రీంకు కూడా నివేదించింది.
Advertisement