2018లో అరెస్టైన సత్తార్ తదితరులు (ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చి, భారత గుర్తింపుకార్డులు పొందడంలో వారికి సహకరించిన వారికీ కష్టాలు తప్పవని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఆధార్ సంస్థ నగరానికి చెందిన 127 మందికి నోటీసులు జారీ చేయడానికి ఇదే కారణమని వారు స్పష్టం చేస్తున్నారు. ఆధార్ కార్డులు పొందిన ఆయా విదేశీయులతో పాటు, వారికి సహకరించిన, ఆశ్రయం ఇచ్చిన వారు కూడా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత కార్డులు రద్దు చేయడమా? కొనసాగిండమా? అనేది యూనిక్ ఐడింటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) నిర్ణయం తీసుకుంటుందని వారు పేర్కొన్నారు. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సత్తార్ ఖాన్ కేసును దీనికి తాజా ఉదాహరణగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నోటీసులు జారీ అయిన నాటి నుంచి సత్తార్ ఖాన్ పేరు వార్తల్లోకి వస్తోంది. తాను భారతీయుడిని అయినా నిరూపించుకోవాలని అన్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఇతడు 2018లో రోహింగ్యాలకు సహకరించిన కేసులో అరెస్టైనందుకు ఆ విషయాన్ని యూఐడీఏఐకు తెలిపామని, ఫలితంగానే వారు నోటీసులు జారీ చేశారని నగర పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
రోహింగ్యాలైన రుబీనా అక్తర్, నజీరుల్ ఇస్లాం కొన్నేళ్ల క్రితం అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారు. నగరంలోని పాతబస్తీలో భార్యాభర్తలుగా స్థిరపడిన వీరిద్దరూ సత్తార్ ఖాన్ సహకారంతో అతడి ఇంటి చిరునామా, ధ్రువీకరణ పత్రాలతో ఓ మీ–సేవా కేంద్ర నిర్వాహకుడి ద్వారా ఆధార్ కార్డు సహా ఇతర గుర్తింపులు పొందారు. నజీరుల్ పాస్‌పోర్ట్ సైతం తీసుకోగా.. రుబీనా ఆ ప్రయత్నాలు చేశారు. 2018 జనవరిలో ఈ విషయాన్ని గుర్తించిన నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ కంచన్‌బాగ్ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రుబీనా అక్తర్‌తో పాటు నజీరుల్ ఇస్లాం, సత్తార్ ఖాన్, మీ–సేవ కేంద్రం నిర్వాహకుడిని కంచన్‌బాగ్ పోలీసులు అదే ఏడాది జనవరి 8న అరెస్టు చేసి వీరి నుంచి ఆధార్ సహా గుర్తింపుకార్డులను స్వాధీనం చేసుకున్నారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఈ ఇద్దరు విదేశీయులు (రోహింగ్యాలు) అక్రమంగా ఆధార్ కార్డు పొందారని, పాతబస్తీ చిరునామాతో తీసుకున్నారంటూ నగర పోలీసులు ఆధార్ నెంబర్లతో సహా యూఐడీఏఐకు లేఖ రాశారు.
ఈ తరహాకు చెందిన అనేక కేసుల సమాచారాన్ని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు యూఐడీఏఐకు అధికారికంగా అందజేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న యూఐడీఏఐ ఆయా విదేశీయులతో పాటు ఆ కేసుల్లో సహ నిందితులుగా ఉన్న పాతబస్తీ వాసులు, వారికి ఆశ్రయం ఇచ్చిన వారితో కలిపి మొత్తం 127 మందికి నోటీసులు జారీ చేసింది. వీరంతా నిర్దేశిత సమయంలో యూఐడీఏఐ ఆధార్ అధికారుల ఎదుట హాజరై తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై నగర పోలీసు విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘దేశంలోకి పాస్‌పోర్ట్, వీసాలో వచ్చిన విదేశీయులు 182 రోజులకు మించి నివసిస్తే యూఐడీఏఐకు దరఖాస్తు చేసుకుని ఆధార్ కార్డు తీసుకునే అవకాశం ఉంది. అయితే వారు దేశం విడిచి వెళ్లే సమయంలో ఆ కార్డును తిరిగి అప్పగించాలి. అక్రమంగా దేశంలోకి ప్రవేశించి, తప్పుడు వివరాలు, పత్రాలతో ఆధార్ పొందిన వారితో పాటు సహకరించిన వారికీ యూఐడీఏఐ నోటీసులు ఇస్తుంది. వీరిలో పౌరసత్వం నిరూపించుకోలేని వారికి కార్డు రద్దవుతుంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment