
ఇంఫాల్: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మయన్మార్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి బయోమెట్రిక్ డేటాను సేకరించడం మొదలుపెట్టింది. ఈ అల్లర్లకు వారికీ సంబంధం ఉందన్న కోణంలోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు చెబుతోంది మణిపూర్ ప్రభుత్వం.
మణిపూర్ హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం మయన్మార్ నుండి అక్రమంగా వలసవచ్చిన వారి గణన సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తవుతుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు హోంశాఖ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్.సి.ఆర్.బి) నుండి కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపినాట్లు తెలిపారు జాయింట్ సెక్రెటరీ(హోమ్) పీటర్ సలాం.
కూకీలు అత్యధికంగా ఉండే కొండ ప్రాంతమైన చురాచంద్ పూర్ లో ఏడుగురు మయన్మార్ వలసదారులకు బులెట్ గాయాలు తగలడంతో అల్లర్లలో వారి పాత్ర ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే వెంటనే స్పందించి మణిపూర్, మిజోరాం రాష్ట్రాల ప్రభుత్వాలను వెంటనే బయోమెట్రిక్ ఆధారంగా మయన్మార్ అక్రమ వలసదారుల గణన చేపట్టాలని అదేశించింది. మయన్మార్ వలసదారులు ఎక్కువగా అడవులను కొట్టి, గసగసాల సాగు, గంజాయి సాగుకి పాల్పడుతూ ఉంటారని గతంలో ఒకసారి మణిపూర్ సీఎం బైరెన్ సింగ్ కూడా తెలిపారు.
ఇది కూడా చదవండి: Manipur Violence: నా కొడుకు, భర్తను చంపేశారు.. కూతురిని నగ్నంగా..