ఢిల్లీ: మణిపూర్‌లో చోటు చేసుకున్న హింసాకాండ పరిస్థితులపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇప్పటివరకు ఏం చేశారు.. ఇప్పుడేం చేస్తున్నారు?.. ఇకపై ఏం చేయబోతున్నారో.. సమగ్ర నివేదిక సమర్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హింస చెలరేగకుండా చూసుకోవాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.
మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీసే ఎలాంటి హింసాకాండ జరగకుండా చూడాలని అక్కడి అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు అని ఎన్‌హెచ్‌ఆర్సీ ప్యానెల్ సదరు ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు.. ఇప్పటివరకు చోటు చేసుకున్న అఘాయిత్యాలకు, అకృత్యాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు వెల్లడించింది.
మణిపూర్ అల్లర్లు-హింసకు సంబంధించి నుంచి రోజుకో ఘటన మా దృష్టికి వస్తోంది. ఇలాంటి తరుణంలో మేం ఓ తుది నిర్ణయం తీసుకోలేం. అందుకే వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి.. అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ఆరా తీస్తున్నాం అని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని మణిపూర్ సర్కార్‌ను ఆదేశించాం.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల మధ్య సామరస్యం వెల్లివిరియడానికి అక్కడి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆరా తీస్తున్నాం అని సదరు ప్రకటనలో జాతీయ మానవ హక్కుల సంఘం పేర్కొంది.
ఇక నుంచి అయినా అలాంటి ఘోరాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది NHRC. అలాగే.. శరణార్ధుల విషయంలో చేపడుతున్న చర్యలు, వాళ్లకు అందిస్తున్న పరిహారం మీదా ఆరా తీసింది మానవ హక్కుల సంఘం.
Comments
Please login to add a commentAdd a comment