జరిగినదానికి నన్ను క్షమించండి: మణిపూర్‌ సీఎం | CM Biren Singh Apology for Manipur Situation | Sakshi
Sakshi News home page

ఇప్పటిదాకా జరిగినదానికి నన్ను క్షమించండి: మణిపూర్‌ సీఎం

Published Tue, Dec 31 2024 5:08 PM | Last Updated on Tue, Dec 31 2024 6:06 PM

CM Biren Singh Apology for Manipur Situation

ఇంఫాల్‌: మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌(Biren Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నరగా రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, హింసాత్మక ఘటనలకుగానూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారాయన. అంతేకాదు.. వచ్చే ఏడాదిలోనైనా శాంతి స్థాపనకు ముందుకు రావాలంటూ తెగలన్నింటికి ఆయన పిలుపు ఇచ్చారు.

‘‘గతేడాది మే 3వ తేదీ నుంచి ఇవాళ్టిదాకా జరిగిన పరిణామాలపై నేను క్షమాపణలు చెప్పదల్చుకుంటున్నా. గడిచిన ఏడాది అంతా చాలా దురదృష్టకరమైంది. ఎంతోమంది అయినవాళ్లను కోల్పోయారు. మరెంతో మంది తమ ఇళ్లను వదిలి వలసలు వెళ్లారు. ఆ విషయంలో నేనెంతో బాధపడుతున్నా. అందుకు నా క్షమాపణలు.  అయితే..

గత మూడు, నాలుగు నెలల నుంచి శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో కాస్త పురోగతి కనిపిస్తోంది. కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోయే సమయంలో.. 2025 రాష్ట్రంలోనైనా  సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నా.. అయ్యిందేదో అయ్యింది. గతంలో జరిగిన తప్పులను మరిచిపోయి.. కొత్త ఏడాదిలో అందరం కొత్త జీవితాల్ని ప్రారంభిద్దాం. మణిపూర్‌(Manipur)ను  శాంతి వనంగా మార్చుకుందాం. ఇదే అన్ని ఉన్న 35 తెగలకు నేను చేసే ఏకైక విజ్ఞప్తి అని సందేశం అని అన్నారాయన. 

జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నర కాలంగా మణిపుర్‌ అట్టుడుకుతోంది. తరచూ హింసాత్మక ఘటనలు జరుగుతుండడంతో.. గతేడాది మే నుంచి ఇప్పటివరకు 300 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. శాంతి భద్రతల అదుపు విషయంలో అక్కడి పోలీస్‌ శాఖ చేతులు ఎత్తేయడంతో.. 19 నెలలుగా కేంద్ర బలగాలే అక్కడ పహారా కాస్తున్నాయి. తప్పుడు ప్రచారాల కట్టడి పేరుతో.. ఇంటర్నెట్‌పై సైతం చాలాకాలం ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం.

ఒకవైపు.. మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపడం, భార్యభర్తలను తగలబెట్టడం, అన్నాచెల్లెళ్లను పైశాచికంగా హతమార్చడం.. తరహా ఘటనలు మణిపూర్‌ గడ్డ నుంచి వెలుగులోకి రావడం అక్కడి పరిస్థితికి అద్దం పట్టాయి. మరోవైపు.. రాజకీయంగా ఈ అంశం దేశాన్ని కుదిపేసింది. ఇంకోవైపు.. సుప్రీం కోర్టు(Supreme Court) జోక్యంతోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. 

కారణం ఏంటంటే.. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని  పరిశీలించేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు ప్రతిపాదన చేయాలని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో అల్లర్లు చెలరేగాయి. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వవద్దని ఆదివాసీ తెగలు డిమాండ్‌ చేస్తున్నాయి. అనేక సంవత్సరాల నుంచి మెయితీలకు కుకీ, నాగాలతో వైరుధ్యాలున్నాయి. మెయితీలకు రిజర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమకు ఉద్యోగాల వాటా తగ్గిపోతుందన్నది వారి ఆందోళన. 

వాస్తవానికి మెయితీలకు కుకీ, నాగాలకు మధ్య గత పదేళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు లేవు. మణిపుర్‌లోని కొన్ని ప్రాంతాలను మహానాగాలింలో చేర్చాలని నాగా సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. నాగాలకు, కుకీలకు మధ్య వైరం ఉంది. అయితే మెయితీలకు రిజర్వేషన్ అంశంపై రెండు వర్గాలు కలవడం విశేషం. 1948 కన్నా ముందు మెయితీలను ఆదివాసీలుగా పరిగణించేవారని మెయితీ నేతలు గుర్తుచేస్తున్నారు. కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదని గతంలో ఉన్నదాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని మాత్రమే కోరుతున్నామని వారు చెబుతున్నారు.

అదే సమయంలో.. మయన్మార్‌లో జరుగుతున్న అల్లర్లతో మణిపుర్‌లోకి అనేకమంది అక్కడి ప్రజలు ఆశ్రయం కోసం వచ్చారు. ఇప్పటివరకు దాదాపు ఐదువేలమందికి పైగా వచ్చి ఉంటారని అంచనా. అయితే ఈ ముసుగులో మయన్మార్‌ కుకీలు సైతం రాష్ట్రానికి వస్తున్నారని మెయితీలు ఆరోపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement