communities
-
జరిగినదానికి నన్ను క్షమించండి: మణిపూర్ సీఎం
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్(Biren Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నరగా రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, హింసాత్మక ఘటనలకుగానూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారాయన. అంతేకాదు.. వచ్చే ఏడాదిలోనైనా శాంతి స్థాపనకు ముందుకు రావాలంటూ తెగలన్నింటికి ఆయన పిలుపు ఇచ్చారు.‘‘గతేడాది మే 3వ తేదీ నుంచి ఇవాళ్టిదాకా జరిగిన పరిణామాలపై నేను క్షమాపణలు చెప్పదల్చుకుంటున్నా. గడిచిన ఏడాది అంతా చాలా దురదృష్టకరమైంది. ఎంతోమంది అయినవాళ్లను కోల్పోయారు. మరెంతో మంది తమ ఇళ్లను వదిలి వలసలు వెళ్లారు. ఆ విషయంలో నేనెంతో బాధపడుతున్నా. అందుకు నా క్షమాపణలు. అయితే..గత మూడు, నాలుగు నెలల నుంచి శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో కాస్త పురోగతి కనిపిస్తోంది. కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోయే సమయంలో.. 2025 రాష్ట్రంలోనైనా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నా.. అయ్యిందేదో అయ్యింది. గతంలో జరిగిన తప్పులను మరిచిపోయి.. కొత్త ఏడాదిలో అందరం కొత్త జీవితాల్ని ప్రారంభిద్దాం. మణిపూర్(Manipur)ను శాంతి వనంగా మార్చుకుందాం. ఇదే అన్ని ఉన్న 35 తెగలకు నేను చేసే ఏకైక విజ్ఞప్తి అని సందేశం అని అన్నారాయన. జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నర కాలంగా మణిపుర్ అట్టుడుకుతోంది. తరచూ హింసాత్మక ఘటనలు జరుగుతుండడంతో.. గతేడాది మే నుంచి ఇప్పటివరకు 300 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. శాంతి భద్రతల అదుపు విషయంలో అక్కడి పోలీస్ శాఖ చేతులు ఎత్తేయడంతో.. 19 నెలలుగా కేంద్ర బలగాలే అక్కడ పహారా కాస్తున్నాయి. తప్పుడు ప్రచారాల కట్టడి పేరుతో.. ఇంటర్నెట్పై సైతం చాలాకాలం ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం.ఒకవైపు.. మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసి చంపడం, భార్యభర్తలను తగలబెట్టడం, అన్నాచెల్లెళ్లను పైశాచికంగా హతమార్చడం.. తరహా ఘటనలు మణిపూర్ గడ్డ నుంచి వెలుగులోకి రావడం అక్కడి పరిస్థితికి అద్దం పట్టాయి. మరోవైపు.. రాజకీయంగా ఈ అంశం దేశాన్ని కుదిపేసింది. ఇంకోవైపు.. సుప్రీం కోర్టు(Supreme Court) జోక్యంతోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. కారణం ఏంటంటే.. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు ప్రతిపాదన చేయాలని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో అల్లర్లు చెలరేగాయి. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వవద్దని ఆదివాసీ తెగలు డిమాండ్ చేస్తున్నాయి. అనేక సంవత్సరాల నుంచి మెయితీలకు కుకీ, నాగాలతో వైరుధ్యాలున్నాయి. మెయితీలకు రిజర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమకు ఉద్యోగాల వాటా తగ్గిపోతుందన్నది వారి ఆందోళన. వాస్తవానికి మెయితీలకు కుకీ, నాగాలకు మధ్య గత పదేళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు లేవు. మణిపుర్‌లోని కొన్ని ప్రాంతాలను మహానాగాలింలో చేర్చాలని నాగా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. నాగాలకు, కుకీలకు మధ్య వైరం ఉంది. అయితే మెయితీలకు రిజర్వేషన్ అంశంపై రెండు వర్గాలు కలవడం విశేషం. 1948 కన్నా ముందు మెయితీలను ఆదివాసీలుగా పరిగణించేవారని మెయితీ నేతలు గుర్తుచేస్తున్నారు. కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదని గతంలో ఉన్నదాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని మాత్రమే కోరుతున్నామని వారు చెబుతున్నారు.అదే సమయంలో.. మయన్మార్‌లో జరుగుతున్న అల్లర్లతో మణిపుర్‌లోకి అనేకమంది అక్కడి ప్రజలు ఆశ్రయం కోసం వచ్చారు. ఇప్పటివరకు దాదాపు ఐదువేలమందికి పైగా వచ్చి ఉంటారని అంచనా. అయితే ఈ ముసుగులో మయన్మార్ కుకీలు సైతం రాష్ట్రానికి వస్తున్నారని మెయితీలు ఆరోపిస్తున్నారు. -
బీసీ రిజర్వేషన్ల పెంపే మా ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: బీసీలకు రాజకీయ అవకాశాలను మెరుగుపరిచేందుకు స్థానికసంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, వారి జనాభాకు అనుగుణంగా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు, బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, కన్వీనర్ బాలగోనీ బాలరాజుగౌడ్ తదితరులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా బీసీ ప్రతినిధుల బృందానికి డిసెంబర్‌లోగా కుల గణన సర్వే పూర్తి చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. దీనిపై బీసీ కుల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభు త్వం చిత్తశుద్ధితో ఉండటం పట్ల బీసీ సంక్షేమసంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులను సందర్భంగా కోరారు. -
కాషాయ పార్టీకి షాకిచ్చిన ఆ ఓటర్లు.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అంశాలు ఇవే!
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీకి షాకిస్తూ ఘన విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే హస్తం పార్టీ గెలుపుకు పలు అంశాలు కలిసొచ్చినప్పటికీ ప్రధానంగా మాత్రం మూడు సామాజిక వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడమనే చెప్పాలి. అవేంటో చూస్తే.. లింగాయత్‌లు దెబ్బ బీజేపీకి భారీగానే నష్టాన్ని మిగిల్చింది. కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను పక్కన పెట్టడం, రాజకీయ విశ్లేషకుల ప్రకారం కాషాయ పార్టీని కోలుకోలేని దెబ్బతీసిందని అంటున్నారు. బీజేపీ తప్పు కాంగ్రెస్ కలిసొచ్చిందా! లింగాయత్‌ల ఆధిపత్యం ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓట్ల శాతం పడిపోయింది(2018లో 41.8 శాతం నుంచి 2023లో 39.5 శాతానికి). అయితే ఓట్ల శాతం తక్కువే అయినప్పటికీ ఈ తేడా కారణంగా బీజేపీ ఊహించని నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని ప్రభావం దాదాపు సగం సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. (2018లో 41 నుంచి 2023లో 21 చేరుకుంది). మరోవైపు, జేడీ(ఎస్)కు స్థిరంగా ఉన్న ఓటు బ్యాంకును కాస్త కోల్పోయింది. ఈసారి లింగాయత్ ఓట్లలో ఐదు శాతంతో పాటు కమ్యూనిటీ ఆధిపత్యంలో ఉన్న మూడు స్థానాలను కోల్పోయింది. సాధారణంగా జనతాదళ్ (సెక్యులర్) వైపు మొగ్గు చూపే బీజేపీయేతర లింగాయత్ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు ఇది సూచిస్తుంది. జగదీష్ శెట్టర్, లక్ష్మణ్ సవాది వంటి లింగాయత్ నేతలు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించడం ఆ పార్టీకి దోహదపడి ఉండవచ్చు. అథని సీటులో సవాది గెలుపొందగా, హుబ్లీ-ధార్వాడ్ (సెంట్రల్) సీటులో షెట్టర్ ఓడిపోవడం గమనార్హం. లింగాయత్‌ల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కూడా ఇతర ప్రధాన సామాజిక వర్గాలు ఈసారి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడం కూడా పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. లింగాయత్ తర్వాత వారీ ఓట్లు కీలకంగా మారాయి లింగాయత్‌ల సామాజిక వర్గం తర్వాత వొక్కలిగలు, దళితులు ఆధిపత్య వర్గాలుగా ఉన్న స్థానాల్లో కూడా కాంగ్రెస్ బాగానే సాధించింది. మరోవైపు, వొక్కలిగ స్థానాల్లో కాంగ్రెస్ దాదాపు నాలుగు శాతం ఓట్ల లాభంతో 2018లో 14 నుంచి 2023లో 27 సీట్లకు రెట్టింపు అయింది. దీనికి మరో ప్రముఖ వొక్కలిగ నేత, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఒక కారణమని తెలుస్తోంది. కనకపుర నియోజక వర్గంలో 1.2 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన శివకుమార్ గౌడ గడ్డపై వొక్కలిగ ఓట్లను దూరం చేసి ఉండవచ్చు." జేడీ(ఎస్)కు కంచుకోటగా ఉన్న ఓల్డ్ మైసూరులో కాంగ్రెస్ పార్టీ 36 గ్రామీణ స్థానాల్లో విజయం సాధించడం ఓటర్లు మార్పునగా సూచనగా కనిపిస్తోంది. షెడ్యూల్డ్ కులాల ఓట్లతో కాంగ్రెస్‌కు మరో భారీ విజయం దక్కినట్లయింది. కాంగ్రెస్ పది సీట్లు, ఎస్సీ ప్రాబల్యం ఉన్న స్థానాల్లో 5.5 శాతం ఓట్లు సాధించింది. బీజేపీ, జేడీ(ఎస్) వరుసగా ఐదు, మూడు స్థానాలు కోల్పోయాయి. ఇవి నేరుగా కాంగ్రెస్‌లోకి వెళ్లినట్లు తెలస్తోంది. రాష్ట్రంలో దళితుల ఓట్లు సాధారణంగా చీలిపోతాయి. అయితే, ఈసారి, ఎస్సీ-ఆధిపత్య ప్రాంతాలు కాంగ్రెస్‌కు అత్యధికంగా ఓటేశారు. రాష్ట్రంలోని 37 ఎస్సీ-ఆధిపత్య స్థానాల్లో కాంగ్రెస్ 22 గెలుచుకుంది, గత ఎన్నికల్లో సాధించిన దానికంటే దాదాపు రెట్టింపుగా ఉంది. చదవండి: 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డిని ఉప ముఖ్యమంత్రి చేయాలి -
రూట్స్ : సేవే శక్తి!
ఉత్సాహం నుంచి శక్తి జనిస్తుంది. మరి ఆ ఉత్సాహం ఎలా వస్తుంది? ఎవరి మాట ఎలా ఉన్నా... విట, జలజ్ దాని దంపతులకు మాత్రం ఆ ఉత్సాహం స్వచ్ఛంద సేవాకార్యక్రమాల ద్వారా వస్తుంది. పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన ఈ దంపతులు తన ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఒక మంచి పని చేసి చూడండి. అందులో నుంచి వచ్చే శక్తి ఏమిటో మీకే తెలుస్తుంది’ అంటున్నారు... ముందుకు వెళ్లడం మంచిదేగానీ వెనక్కి తిరిగి చూసుకోవడం కూడా మంచిదే. విటల్, జలజ్ దాని దంపతులు అదే చేశారు. వారి తాత స్వçస్థలం గుజరాత్‌లోని చారిత్రక పట్టణం కపడ్ వంజ్. ఆయన రకరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఒకసారి ఆయన సేవాకార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ఆ స్ఫూర్తితో ఎనభై సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ‘కపడ్వంజ్ కెలవాణి మండల్’ (కెకెఎం) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఈ సంస్థ పరిధిలో పదమూడు విద్యాసంస్థలు ఉన్నాయి. ‘కెకెఎం’తో కలిసి పనిచేయడం విట, జలజ్ దంపతులలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత... తమ సేవాకార్యక్రమాలను విస్తృతం చేయడం కోసం ‘దాని ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ‘కెకెఎం’తో పాటు అన్నమిత్ర ట్రస్ట్, ఈఎల్ఎంఎస్ స్పోర్ట్స్ ఫౌండేషన్... మొదలైన సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ‘అన్నమిత్ర’తో కలిసి దేశంలోని 6,500 పాఠశాలలో పిల్లల కోసం మ«ధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ‘బాలకార్మిక వ్యవస్థ పోవాలంటే ముందు పిల్లలకు కడుపు నిండా తిండి దొరకాలి. ఆ భోజనమే వారిని విద్యకు దగ్గర చేస్తుంది. అభివృద్థిపథంలోకి నడిపిస్తుంది’ అంటుంది విట. ‘ప్రథమ్’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి అట్టడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమాలలో పాలుపంచుకుంటుంది దాని ఫౌండేషన్. సేవా కార్యక్రమాలే కాకుండా తమ కుమారుడు, ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ముదిత్ కోరిక మేరకు ఆటలపై కూడా దృష్టి సారించారు. ఈఎల్ఎంఎస్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి క్రీడా నైపుణ్యాలు మెరుగుపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ఆటలకు ప్రాచుర్యాన్ని తీసుకువస్తున్నారు. పాఠశాలలో క్రీడాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రొఫెషనల్ లెవెల్లో పిల్లలను క్రీడల్లో తీర్చిదిద్దడానికి హై–పెర్ఫార్మెన్స్ ప్లాన్స్, హై–పెర్ఫార్మెన్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్‌కు రూపకల్పన చేశారు. గతంతో పోల్చితే విద్యార్థులు ఆటలపై ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఇదొక శుభపరిణామంగా చెప్పుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా అంటుంది విట... ‘ఆటలో ఉత్సాహం ఉంటుంది. వినోదం ఉంటుంది. గెలుపు కోసం చేసే పథక రచన ఉంటుంది. లైఫ్ స్కిల్స్‌ను పిల్లలు ఆటల్లో నుంచే నేర్చుకోవడం మొదలు పెడతారు. మన దేశంలో కోట్ల జనాభా ఉంది. ఇలాంటి దేశంలో మనం ఛాంపియన్లను తయారు చేయలేమా!’ ‘క్రీడలపై వారి అనురక్తి, అంకితభావాన్ని దగ్గరి నుంచే చూసే అవకాశం వచ్చింది. క్రీడారంగంపై వారు చేపడుతున్న కార్యక్రమాల ప్రభావం తప్పకుండా ఉంటుంది’ అంటున్నాడు ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత అభినవ్ బింద్రా. గతకాలం మాట ఎలా ఉన్నా విట ప్రస్తుతం తమ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువ సమయం గడుపుతుంది. ‘ఆడ్వర్బ్ టెక్నాలజీ ప్రైవెట్ లిమిటెడ్’ చైర్మన్ జలజ్ కంపెనీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమాలకు తగిన సమయం కేటాయిస్తుంటాడు. విట దృష్టిలో స్వచ్ఛంద సేవ అంటే చెక్ మీద సంతకం చేయడం కాదు. యాంత్రికంగా చేసే పని కాదు. మనసుతో చేసే మంచిపని. ప్రజలతో కలిసి పోయి చేసే ఉత్తేజకరమైన పని. ‘ఆటలో ఉత్సాహం ఉంటుంది. వినోదం ఉంటుంది. గెలుపు కోసం చేసే పథక రచన ఉంటుంది. లైఫ్ స్కిల్స్‌ను పిల్లలు ఆటల్లో నుంచే నేర్చుకోవడం మొదలు పెడతారు. – విట, దాని ఫౌండేషన్ -
కొండ మూలన ‘కీడు పాక’
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు మన్యంలో ఎత్తైన కొండలపై చెట్టుకొకటి, పుట్టకొకటి అన్నట్టుగా ఉండే మారుమూల పల్లెలవి. అక్కడ నివసించే కొండరెడ్డి గిరిజనుల్లో నూటికి 70 మంది నిరక్షరాస్యులే. గిరిజన జాతుల్లో కొండరెడ్ల జీవనం ప్రత్యేకంగా ఉంటుం ది. అనాదిగా వారి జీవన విధానాన్ని మూఢనమ్మ కాలే శాసిస్తున్నాయి. రాష్ట్ర విభజనతో తెలంగాణ నుంచి విడివడి తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన నాలుగు విలీన మండలాల్లోనూ కొండరెడ్డి గిరిజనులు ఎక్కువగానే ఉన్నారు. కూనవరం, చింతూరు, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లోని సుమారు 70 ఆవాసాల్లో 2,500 కుటుంబాలున్నాయి. వీరి జనాభా 8 వేల పైమాటే. ఎవరికీ కనిపించనిచోట ‘కీడు పాక’ కొండరెడ్లలో పూర్వీకుల నుంచి ఓ దురాచారం కొనసాగుతోంది. అదే కీడుపాకల ఆచారం. కొండరెడ్డి మహిళలు నెలసరి, ప్రసవ సమయంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు ఎట్టిపరిస్థితుల్లో కనిపించకూడదు. ఆ సమయంలో మహిళలు ఊరి బయట ప్రత్యేకంగా ఉండే పూరిపాకల్లో ఒంటరిగా నివాసం ఉండాల్సిందే. నెలసరి (పీరియడ్స్) సమయం నాలుగైదు రోజుల్లో పర పురుషులెవరూ ఆమెను కన్నెత్తి కూడా చూడకూడదు. ఆ మహిళకు భర్త మాత్రమే ఆహారం తీసుకువెళ్లాలి. అతడు కూడా ఆహారాన్ని ఆ పాకముందు పెట్టి ఆమెకు కనిపించకుండా తిరిగి వచ్చేయాలి. ప్రసవ సమయంలో గర్భిణులు రెండు నెలలకు పైగా కీడుపాకలోనే ఉండాలి. ప్రసవం కూడా ఆ పూరిపాకలోనే. పుట్టిన బిడ్డకు ఆ తల్లే బొడ్డుపేగు కత్తిరించి ముడివేయాలి. ఈ ఆచారాన్ని పాటిస్తేనే అడవి జంతువులు, శారీరక రుగ్మతల నుంచి కొండ దేవరలు కాపాడతారని కొండరెడ్ల విశ్వాసం. కీడుపాక ఆచారం వల్ల సకాలంలో ప్రసవాలు జరగక, వైద్యం అందక పురిటి సమయంలోనే నవజాత శిశువులు, గర్భిణులు, బాలింతలు మృత్యువాత పడుతుండేవారు. ప్రభుత్వ చర్యలతో మార్పొస్తోంది ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం చింతూరు ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మొదట్లో చింతూరు ఐటీడీఏ అధికారులు ఎంతగా నచ్చచెప్పినా అక్కడి మహిళలు కీడు పాకల ఆచారాన్ని విడిచిపెట్ట లేదు. చివరకు కీడుపాకకు ప్రత్యామ్నాయంగా ఊరి చివర్లో చిన్నపాటి భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతంలో చింతూరు ఐటీడీఏ పీవోగా పనిచేసిన ఆకుల వెంటకరమణ వీటిని ఏర్పాటు చేయించారు. వాటిలో విద్యుత్ సదుపాయం, మంచినీరు, స్నానాల గదులు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించారు. దీంతోపాటు ఆ గ్రామాల్లో పాఠశాలలను మెరుగుపరచడమే కాకుండా వారి పిల్లలను బడులకు రప్పించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. గిరిజనులు ఇప్పుడిప్పుడే అధికారుల మాట వింటున్నారు. గర్భిణులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా కీడుపాకల వల్ల తలెత్తే దుష్ఫలితాలపై అవగాహన కల్పిస్తుండటంతో గర్భిణులు కాన్పుల కోసం పీహెచ్‌సీలకు వెళుతున్నారు. అమ్మఒడి, విద్యాకానుక వంటి పథకాలతో అక్కడి పిల్లలు చదువుల వైపు ఆకర్షితులవుతున్నారు. చింతూరు మండల ఏరియా ఆస్పత్రి, కూనవరం మండలం కూటూరు, వీఆర్ పురం మండలం రేకపల్లి పీహెచ్‌సీలకు కాన్పులకు వచ్చే గర్భిణిల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చింతూరు డివిజన్లో గతంలో ఏడాదికి కాన్పులు 70లోపే ఉండేవి. ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది 148 కాన్పులు జరిగాయి. గతంలో మూడో తరగతి నుంచి డిగ్రీ వరకు వెయ్యి మించి లేని విద్యార్థు సంఖ్య ఇప్పుడు 1,500 మందికి పెరగడం మార్పునకు సంకేతంగా పేర్కొంటున్నారు. కాన్పులపై అవగాహన పెరిగింది ఆస్పత్రుల్లో కాన్పుల పట్ల కొండరెడ్డి మహిళల్లో అవగాహన పెరిగింది. ఆస్పత్రిలో కాన్పయితే ప్రభుత్వం జేఎస్వై క్రింద తక్షణం రూ.వెయ్యి, ఆరోగ్యశ్రీ కార్డుంటే రూ.4000 ఇస్తున్న విషయాన్ని ఏఎన్ఎం, ఆశాలు, అంగన్వాడీ సిబ్బంది కొండలపైకి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులను ప్రసవానికి 15 రోజులు ముందే మైదాన ప్రాంత ఆస్పత్రికి తరలించి బర్త్ వెయిటింగ్ సెంటర్లో ఉంచుతున్నాంద. – డాక్టర్ శివకృష్ణారెడ్డి, వైద్యాధికారి, కూటూరు పీహెచ్సీ, కూనవరం మండలం కీడుపాకలు వదిలిపెడుతున్నారు ప్రస్తుత ప్రభుత్వం కొం డరెడ్లకు మంచి సౌకర్యాలు కల్పిస్తోంది. గతంలో ఊరికి దూరంగా ఉండే కీడుపాకల్లోనే ప్రసవాలు జరిగేవి. వైద్యసిబ్బంది తరచూ కొండలపైకి వచ్చి అవగాహన కల్పిస్తుండటంతో ప్రసవాల కోసం కీడుపాకలు విడిచిపెట్టి ప్రభుత్వ ఆస్పత్రులకు వెళుతున్నారు. కీడుపాకలకు బదులుగా భవనాలు నిర్మించేందుకు అధికారులు ముందుకు రావడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. – కదల బూబమ్మ, ఎర్రగొండపాకల, చింతూరు మండలం -
మీరు అపార్ట్మెంట్లో నివసిస్తున్నారా? ఇలాంటి చీడ పురుగులతో జాగ్రత్త!
హైదరాబాద్‌లో తొలి హైరైజ్ అపార్ట్మెంటది. పదేళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసి.. నివాసిత సంఘానికి అప్పగించేసింది నిర్మాణ సంస్థ. మొదట్లో రెండుమూడేళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే ఒకరిద్దరు ప్రతికూల సభ్యులతో నివాసిత సంఘం సర్వనాశనమైంది. పదేళ్ల క్రితం డెవలపర్ వసూలు చేసిన రూ.3.2 కోట్ల కార్పస్ ఫండ్.. ప్రస్తుతం వడ్డీతో సహా కలిపి రూ.4–5 కోట్ల వరకుంది. కానీ, ఏం లాభం ప్రాజెక్ట్ నిర్వహణ చేసుకునే స్థితిలో అసోసియేషన్ లేదు. మధ్యలో ఓసారి కమ్యూనిటీ బాధ్యతలు చేపట్టేందుకు మహిళా సభ్యులు దైర్యంగా ముందుకొస్తే.. వాళ్ల మీద లేనిపోని పోలీసు కేసులు పెట్టడంతో మనకొచ్చిన గొడవెందుకులే అని వాళ్లూ వెనుదిరిగారు. ఫలితంగా నగరంలోనే తొలి హైరైజ్ అపార్ట్మెంట్ రంగులు వెలిసి, రోడ్లు పాడైపోయి బోసిపోయింది. దీంతో ప్రస్తుతం అక్కడ అపార్ట్మెంట్ ధర చ.అ.కు రూ.5 వేలు ఉంటే.. ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం రూ.3,500లకు మించి పలకట్లేదు. సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ అసోసియేషన్లలో ఒకరిద్దరు చీడపురుగుల్లాంటి సభ్యులతో కలిగే నష్టాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. నగరంలోని కమ్యూనిటీ అసోసియేషన్లలో 50 శాతం వరకు ఇలాంటివే ఉంటాయంటే ఆశ్చర్యం లేదు. వార్షిక నిర్వహణ బాధ్యత నివాసిత సంఘాలదే అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తే.. తగ్గేది మనం ఉండే ఇంటి విలువే. ప్రతీది బిల్డరే చేయాలంటే ఎలా? ప్రతి ఒక్కరూ కష్టపడిన సొమ్ముతోనే ఇల్లు కొనుక్కుంటారు. పండుగలకు, ప్రత్యేక సందర్భాలలో ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోమా? నాలుగైదేండ్లకు ఒకసారి రంగులు వేసుకోవటం, పగుళ్లు వచ్చినా, డ్రైనేజీ, బోర్, లిఫ్ట్ వంటి వాటిల్లో సమస్యలొస్తే రిపేరు చేసుకోమా? అలాగే అపార్ట్మెంట్లలో ఉండే వాళ్లూ అంతే అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి చేసుకోవాలే తప్ప.. ప్రాజెక్ట్‌లో ఏ నిర్వహణ పనులైనా బిల్డరే చేపించాలని పట్టుబడుతూ కూర్చుంటే పాడైపోయేది మీరు ఉండే ఇళ్లేనని గుర్తుంచుకోండి. చెట్లు నాటుతారు కానీ ప్రతి రోజూ దగ్గరుండి నీళ్లు పోయరు కదా.. అలాగే డెవలపర్ ప్రాజెక్ట్ నిర్మించి, నివాసిత సంఘాన్ని ఏర్పాటు చేసి కార్పస్ ఫండ్‌ను అందిస్తారు. నిర్వహణ వ్యయాన్ని కార్పస్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టుకోవాలే గానీ అన్నింటికీ బిల్డరే చేయాలని కూర్చుంటే మూర్ఖత్వమే అవుతుంది. ఎవరి ప్రాపర్టీని వాళ్లే కాపాడుకోవాలి. నిర్వహణ బాగుంటేనే ప్రాజెక్ట్ బాగుంటుంది. ఇంటి విలువ కూడా పెరుగుతుంది. ( ఫైల్ ఫోటో ) పైన పటారం.. లోన లొటారం.. ‘పైన పటారం లోన లొటారం’ అన్న చందంగా.. భవనం బయట నుంచి చూస్తే రంగులు వెలిసి, రోడ్లు పాడైపోయి వికారంగా కనిపిస్తుంటుంది గానీ అదే అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అందమైన ఇంటీరియర్‌తో లగ్జరీగా బాగుంటుంది. అయినా ఏం లాభం బయటి నిర్మాణం అందవిహీనంగా కనిపిస్తుంటే ఇంటి విలువ తగ్గక ఏమవుతుంది మరి? అపార్ట్మెంట్లకు వెళితే వసతులు బాగుంటాయని కొనుగోలు చేస్తుంటారు. మీ ఇంటి కోసం మీరే ఖర్చుపెడుతున్నారని ఎందుకు భావించరు? నివాసిత సంఘాల దృక్పథం మారాలి. పాజిటివ్ మైండ్‌సెట్ ఉన్న సభ్యులనే ఎన్నుకొని ప్రాజెక్ట్‌ను అభివృద్ధి పరుచుకోవాలని సాకేత్ గ్రూప్ డైరెక్టర్ రవి కుమార్ సూచించారు. - పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్లనే అధ్యక్షులుగా ఎన్నుకోవాలి. నిర్వహణ చేయడానికి ముందుకొచ్చే వారిని ప్రోత్సహించాలి. వాళ్ల పనులకు అడ్డుపడుతూ, లోపాలను ఎంచకూడదు. పంతాలు, పట్టింపులకు పోవద్దు. - ఇదేమీ వేతనం వచ్చే పదవి కాదు. సామాజిక సేవ లాంటిదే. అలాంటప్పుడు వాళ్ల పనులు వదిలేసి మన ప్రాజెక్ట్ బాగుండాలని, అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో ముందుకొస్తే లేనిపోని మాటలతో, అభాండాలను వేయకూడదు. - ప్రతి అసోసియేషన్‌లో 2 శాతం నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్న సభ్యులుంటారు. వాళ్లను వదిలేసి మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయాలను తీసుకోవాలి. ఒకరిద్దరు సభ్యుల చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. - కమ్యూనిటీ అంతా ఒక కుటుంబంలా ఉంటే.. ఆనందం, ఆరోగ్యంతో పాటు బయటి వాళ్లలో కమ్యూనిటీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. దీంతో ప్రాజెక్ట్ విలువ పెరుగుతుంది. - పిల్లలు ఉంటే వీకెండ్స్, సెలవు రోజుల్లో ఆటలు, సాంస్కృతిక పోటీల వంటివి నిర్వహించాలి. పెద్దల కోసం తీర్థయాత్రలు, వన భోజనాల వంటివి ఏర్పాటు చేయాలి. - రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థలను క్రమం తప్పకుండా చెక్ చేపించాలి. పార్క్, గ్రీనరీ, లిఫ్ట్, జనరేటర్ వంటి వసతులను నిర్వహణ చేసుకోవాలి. ఇందుకు అయ్యే వ్యయాలను సభ్యులు అందరూ పంచుకోవాలి. - అవసరాలకు తగ్గట్టు ప్రాజెక్ట్‌లో వసతులను కల్పించుకోవాలి. ఉదాహరణకు.. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ పాయింట్లు, సోలార్ వ్యవస్థ వంటివి ఏర్పాటు చేసుకోవాలి. అవి కూడా డెవలపరే చేపించాలని పట్టుబడుతూ కూర్చోవద్దు. చదవండి: పెరుగుతున్న హైరైజ్ ప్రాజెక్ట్‌లు -
అవి అవ్వ-తాతల సంఘాలు.. కొడుకు, కోడళ్లతో ఎలా మెలగాలో చెబుతాయి..
జీవితాంతం కనాకష్టం చేసి.. చరమాంకంలో తమకంటూ ఏమీ మిగుల్చుకోని స్థితి వృద్ధులది. పెద్దలు చెప్పింది పిల్లలు వినరు. ‘అత్త మూతి విరుపు... మామ చాదస్తం’ అంటారు. అలాగే పిల్లల చేతలు పెద్దలకు నచ్చవు. ‘కొడుకు పట్టించుకోడు.. కోడలు సూటి పోటి మాటలు’ అని పుట్టడన్నీ ఫిర్యాదులు. ఇలా చిన్నచిన్న ఇబ్బందులతో మొదలైన మాటలు పంచాయతీ దాకా వస్తుంటాయి. చివరికి పెద్ద మనుషులనో, పోలీసు స్టేషన్ల నో ఆశ్రయించాల్సిన పరిస్థితి చాలా కుటుంబాలది. అయితే కామారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఈ సీన్ కనిపించదు. అక్కడ పండుటాకులంతా సం ఘటితమయ్యారు. వృద్ధాప్యంలో ఒకరికొకరై, అందరూ ఒకటై... ఆపద వస్తే ధైర్యాన్నిస్తారు. తల్లిదండ్రులను పట్టించుకోని బిడ్డలకు బుద్ధి చెబుతారు. సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని మోతె గ్రామంలో వృద్ధులు గాంధీ మహాత్ముని స్ఫూర్తితో 2009లో ‘తాత సంఘం’స్థాపించారు. 60 ఏళ్లు పైబడిన 60 మందితో మొదలైన సంఘం ఇప్పుడు 108 మందికి చేరింది. ప్రతి నెల రూ.పది చొప్పున జమ చేస్తారు. సంఘం కోసం షెడ్డు నిర్మించుకున్నారు. గాంధీ విగ్రహంతోపాటు అందరి పేర్లతో రూపొందించిన శిలాఫలకాన్నీ పెట్టుకున్నారు. ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్ల తో ఎలా మెలగాలనేది చర్చించుకుంటారు. చదవండి: తెలంగాణలో రికార్డ్: తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ సలీమా కోమట్‌పల్లిలో తాత, అమ్మల సంఘం లింగంపేట మండలం కోమట్‌పల్లిలో 2018లో ‘తాత, అమ్మ’ల సంఘం ఏర్పాటైంది. ఇందులో 93 మంది సభ్యులున్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు సంగయ్య సహకారంతో సంఘాన్ని బలోపేతం చేసుకున్నారు. సభ్యులు ప్రతినెల ఒక్కొక్కరూ రూ. 50 సంఘంలో జమ చేస్తారు. ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉంటారు. సమస్య వస్తే కలిసి పరిష్కరించుకుంటున్నారు. చదవండి: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు దేమికలాన్‌లో వయో వృద్ధుల సంఘం తాడ్వాయి మండలం దేమికలాన్‌లో 2017లో ‘పార్వతీ దేవి వయో వృద్ధుల సంక్షేమ సంఘం’ఏర్పాటైంది. 40 మందితో మొదలైన సంఘం ఇప్పు డు 80 మందికి చేరింది. ఇందులో పది మంది మహిళలు ఉన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ప్రతి ఒక్కరూ రూ.పది తీసుకుని సమావేశానికి వస్తారు. సంఘం సభ్యుల విరాళాలు, ప్రభుత్వ నిధులతో కలిపి రూ.5 లక్షలతో భవనం నిర్మించుకున్నారు. అప్పటి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సహాయం తో ఫర్నీచర్‌ను సమకూర్చుకున్నారు. ప్రతి రోజూ అక్కడకు వచ్చి సాదకబాధకాలు పంచుకుంటారు. -
క్రికెట్ లవర్స్‌కు ట్విటర్ గుడ్‌న్యూస్..!
క్రికెట్ లవర్స్‌కు ట్విటర్ గుడ్‌న్యూస్‌ను అందించింది. క్రికెట్ అభిమానుల కోసం ట్విటర్లో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. టీ20 ప్రపంచకప్-2021 రావడంతో భారత్‌లో తొలిసారిగా కమ్యూనిటీస్ ఫీచర్‌ను ట్విటర్ అందుబాటులోకి తెచ్చింది. “Cricket Twitter - India’’ పేరుతో కమ్యూనిటీస్ ఫీచర్‌ను ట్విటర్ లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా క్రికెట్ అభిమానులు లైవ్ స్కోర్‌ను కూడా తెలుసుకోవచ్చును. గత నెలలో ట్విటర్ ‘కమ్యూనీటీస్’ ఫీచర్‌ను అమెరికన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. చదవండి: స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై జియో బంపర్ ఆఫర్...! అసలు ఏంటీ కమ్యూనిటీస్ ఫీచర్..! ఫేస్‌బుక్‌లోని పలు గ్రూప్స్ మాదిరిగానే ట్విటర్ కమ్యూనిటీలతో ఇతర యూజర్లు తమ అభిప్రాయాలను ఈ గ్రూప్స్‌లో పంచుకోవచ్చును. ఈ గ్రూప్స్‌లోకి ఇతర యూజర్లను ఆహ్వానించవచ్చును. ఈ గ్రూప్ నుంచి ఆహ్వానం ఉంటేనే కమ్యూనిటీ ఫీచర్లో యాడ్ కావచ్చును. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో ట్విటర్లో యూజర్లకు క్రికెట్ ఎక్స్ప్లోర్ ట్యాబ్, లైవ్ మ్యాచ్ స్కోరును కూడా ట్విటర్ అందిస్తోంది. పబ్లిక్ ట్వీట్ల మాదిరిగానే ప్రతి ట్విటర్ యూజర్ కమ్యూనిటీ ట్వీట్లను చదవవచ్చును ఆయా ట్విట్స్పై రిపోర్ట్ కూడా చేయవచ్చును. కాగా ట్విటర్ కమ్యూనిటీస్‌లో భాగం కానీ యూజర్లు మాత్రం ఆయా ట్విట్లకు రిప్లే ఇవ్వలేరు. ప్రస్తుతం ట్విటర్ ప్లాట్‌ఫారమ్‌లో కమ్యూనిటీలను సృష్టించడానికి యూజర్ల అందరికీ ఇంకా అనుమతించలేదు. చదవండి: జుమ్‌జుమ్మని... బోయింగ్ సర్వీసులకు వీలుగా.. -
‘అమరావతి వద్దు.. అభివృద్ది వికేంద్రికరణ ముద్దు’
సాక్షి, కర్నూలు: అమరావతి వద్దు.. అభివృద్ధి వికేంద్రికరణ ముద్దు అంటూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నినాదాలు చేశాయి. రాజధాని వికేంద్రీకరణకు సంఘీభావం తెలుతున్నాయి. ఈ సందర్భంగా సంఘ నేతలు మాట్లాడుతూ.. రాజధాని రైతుల పేరుతో అమరావతిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టే బస్సు యాత్రను అడ్డుకుంటామని తెలిపారు. చంద్రబాబు, సీపీఐ అధ్యక్షుడు రామకృష్ణ , ఆ పార్టీ నేతలు రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారని విద్యార్థులు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా: మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ నగరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. నియోజకవర్గంలోని క్లాక్ టవర్ నుంచి ఓంశక్తి ఆలయం వరకు చేపట్టిన ఈ భారీ ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా: విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదనకు మద్దతుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా వేదిక అధ్యక్షులు మాట్లాడుతూ.. రాజధాని 29 గ్రామాల సోత్తు కాదని, రాష్ట్ర ప్రజలందరిదన్నారు. అలాగే అధికార వికేంద్రికరణతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. -
ఎడారి గడ్డపై.. సోషల్ ఇంజనీరింగ్
‘మోదీ, మీరంటే కోపం లేదు. కానీ.. రాజేని సహించే ప్రసక్తే లేదు’ రాజస్తాన్‌లో ఎక్కడికి వెళ్లినా ఇదే నినాదం వినిపిస్తోంది. ఎవరికీ అందుబాటులో ఉండరు, తలబిరుసు ఎక్కువ వంటి విమర్శల్ని ఎదుర్కొంటూ ఎన్నికలకు ముందే ప్రజాగ్రహం వేడిని చూస్తున్న వసుంధరా రాజే.. కుల సమీకరణలతోనైనా నెగ్గడానికి వ్యూహాలు పన్నుతున్నారు. ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ రాజస్తాన్‌లో కులమే అత్యంత కీలకమని, అభ్యర్థుల జయాపజయాల్ని అదే శాసిస్తుందని బలంగా నమ్ముతున్న రెండు పార్టీలు టిక్కెట్ల పంపిణీ సమయంలో కులాల లెక్కల్ని పక్కాగా వేసుకొని బరిలోకి దిగాయి. దీంతో 30 చోట్ల ఒకే కులానికి చెందిన అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. 15 నియోజకవర్గాల్లో జాట్లు తలపడుతుండగా.. 7 స్థానాల్లో బ్రాహ్మణులే బ్రాహ్మణులతో తలపడాల్సి వస్తోంది. 4 సీట్లలో రాజ్‌పుత్‌లు ఒకరిపై మరొకరు సై అంటుండగా.. 2 చోట్ల గుజ్జర్లు, యాదవ్‌లు నువ్వా నేనా అని సమరశంఖం పూరిస్తున్నారు. రాజపుత్‌లు ఎవరివైపు? రాజస్తాన్ జనాభాలో 9% ఉన్న రాజపుత్‌లు ఓట్లు ఏ పార్టీకైనా అత్యంత కీలకం. గతసారి ఎన్నికల్లో బీజేపీ అండదండగా ఉన్న ఈ సామాజిక వర్గం ఇప్పుడు కమలనాథులపై ఆగ్రహంతో ఉంది. రాజ్‌పుత్ అయిన గ్యాంగ్‌స్టర్ ఆనందపాల్ సింగ్ నకిలీ ఎన్కౌంటర్, పద్మావత్ సినిమా విడుదలకు రాజే సర్కార్ సై అనడం, ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణలు వంటివి బీజేపీపై రాజ్‌పుత్‌లలో కోపాన్ని పెంచాయి. రాజ్‌పుత్ సంఘాలు బహిరంగంగానే సభలు నిర్వహిస్తూ గతంలో కమలం పార్టీకి ఓటు వెయ్యడం తాము చేసిన తప్పిదమంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ సారి బీజేపీని ఓడించాలంటూ శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన కన్వీనర్ లోకేంద్ర కాల్వీ పిలుపునిచ్చారు. వీరి ఓట్లన్నీ ఈ సారి కాంగ్రెస్‌కు మళ్లే అవకాశం ఉంది. ఇక రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన నేత జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. అయితే, రాజపుత్ర సేనను చీల్చిన సుఖ్‌దేవ్ సింగ్ గోగామేధీ బీజేపీకి మద్దతు ప్రకటించారు. రాజ్‌పుత్‌లు - 9% ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 25 బీజేపీ ఇచ్చిన టికెట్లు- 26 కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 15 గుజ్జర్ల అండ దక్కేదెవరికి? రాష్ట్ర జనాభాలో 9%శాతం ఉన్న గుజ్లర్లు కూడా ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన ఈ వర్గం తమను సంచార తెగగా గుర్తించి ఎస్టీ హోదా కల్పించాలంటూ దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఎస్టీ కులమైన మీనాలతో రాజకీయంగా పోటీపడుతున్నారు. రాజే సర్కార్ గత జులైలోనే గుజ్లర్లను తిరిగి ఓబీసీల్లోకి చేర్చింది. దీంతో ఇప్పటికే అమల్లో ఉన్న 21% రిజర్వేషన్లు వారికీ వర్తిస్తాయి ఇక అదనంగా ఒక్క శాతాన్ని అత్యంత వెనుకబడిన వర్గాల్లోకి (ఎంబీసీ) చేర్చింది. ఈ చర్యతో రాష్ట్రంలో సుప్రీం అనుమతిచ్చిన 50% రిజర్వేషన్లు పూర్తయ్యాయి. అయినా గుజ్లర్లు సంతృప్తిగా లేరు. మరోవైపు కాంగ్రెస్‌లో గుజ్జర్ అయిన సచిన్ పైలెట్ సీఎం అభ్యర్థి రేసులో ముందు ఉండడంతో ఈ ఎన్నికల్లో గుజ్లర్లు కాంగ్రెస్‌కే మద్దతు ఇవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ‘ప్రభుత్వంలో మా ప్రాధాన్యం చాలా తక్కువగా ఉంది. గుజ్జర్ నేతలు ఎక్కువ మంది ఎన్నికైతేనే మా డిమాండ్లు సాధించుకునే అవకాశం ఉంటుంది. సచిన్ పైలెట్ సీఎం రేసులో ఉండడం హర్షణీయం. ఈ సారి మా మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుంది’ అని గుజ్జర్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి శైలేంద్ర సింగ్ ధభానీ వెల్లడించారు. గుజ్జర్లు- 9% ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 25 కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 12 బీజేపీ ఇచ్చిన టికెట్లు- 10 జాట్లు రూటు ఎటు? గ్రామీణ రాజస్థాన్‌లో జాట్ల ప్రాబల్యం ఎక్కువ. రాష్ట్ర జనాభాలో 15% ఉన్న వీరు మొదట్నుంచి కాంగ్రెస్ పక్షమే. కానీ ఆ పార్టీ తమకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి వీరిలో ఉంది. పరశురామ్ మధేర్నా, రామ్నివాస్ మీర్ధా, శీష్‌రాం ఓలా వంటి బలమైన జాట్ నేతలను కాంగ్రెస్ ఎప్పుడూ సీఎంను చేయలేదని జాట్లు అసంతృప్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో పరశురామ్ మధేర్నాను సీఎంగా కాంగ్రెస్ ప్రకటించాలని ఒత్తిడి తెచ్చారు. కానీ మాలీ వర్గానికి చెందిన అశోక్ గెహ్లాట్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో వీరంతా కాంగ్రెస్‌కు దూరమయ్యారు. జాట్లలో అత్యధికులు వ్యవసాయ రంగం మీద ఆధారపడే ఉన్నారు. అయితే రైతాంగ సమస్యల కారణంగా వారు బీజేపీ వైపు కూడా ఉండే అవకాశం లేదు. తిరిగి జాట్లను తమ గూటికి లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్నిరకాలుగా ప్రయత్నించింది. వ్యూహాత్మకంగా ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా ముందుకు వెళ్లింది. ఈ సారి ఎన్నికల్లో ప్రముఖ జాట్ నాయకుడు హనుమాన్ బేనీవాల్ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీతోబరిలో దిగడంతో జాట్ ఓటు బ్యాంకు అటు మళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాట్లు- 15% ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 60 కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 33 బీజేపీ ఇచ్చిన టికెట్లు- 33 సర్వేలు ఏం చెబుతున్నాయంటే ఏబీపీ సీఎస్డీఎస్ బీజేపీ - 84 కాంగ్రెస్- 110 ఇతరులు-06 టైమ్స్ నౌ సీఎన్ఎక్స్ బీజేపీ - 70-80 కాంగ్రెస్- 110-120 బీఎస్పీ- 1-3 ఇతరులు- 7-9 ఇక ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో వసుంధా రాజే ప్రభుత్వం మారాలని 48% మంది కోరుకుంటే, రాజే ప్రభుత్వ పనితీరుపై 32% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల వివరాలు.. ఎన్నికలు – డిసెంబర్ 7 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కౌంటింగ్, ఫలితాలు – డిసెంబర్ 11 రాష్ట్ర జనాభా– 6.86 కోట్లు హిందువులు– 88.49%, ముస్లింలు– 9.07% ఓటర్ల సంఖ్య – 4,77,89,815 పోలింగ్ కేంద్రాల సంఖ్య– 51,965 అసెంబ్లీ స్థానాలు – 200 పోలింగ్ జరిగే సీట్లు– 199 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు– 34 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు– 25 జనరల్ సీట్లు– 141 పోటీలో ఉన్న అభ్యర్థులు–2,873 మహిళా అభ్యర్థులు– 189 సీఎం – వసుంధరా రాజే (బీజేపీ) 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–163 సీట్లు– 45,17% కాంగ్రెస్–22 సీట్లు– 33.07% ఇతరులు–17 సీట్లు– 22% -
వనభోజనాలు.. పొలిటికల్ మీల్స్
రాజకీయ పార్టీల రూటు మారింది. సాధారణంగా రద్దీ కూడళ్లు, కాలనీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించే అభ్యర్థులు తాజాగా నగర శివార్లకు తరలి వెళ్తున్నారు. శివార్లలోని ఫంక్షన్‌హాళ్లు, ఫాంహౌస్‌లు, ఆలయాలను సైతం ప్రచార వేదికలుగా మలుచుకుంటున్నారు. ఈ వరసలో కార్తీక వనభోజనాల్లో ఇప్పుడు పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. కుల, కాలనీ, అపార్ట్మెంట్ సంఘాల ఓట్లను గంపగుత్తగా వేసుకొనేందుకు రాజకీయ పార్టీలే వనభోజనాలను నిర్వహిస్తున్నాయి. వివిధ కులసంఘాలకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఫంక్షన్ హాళ్లు, పార్కుల్లో ముందస్తు బుకింగ్‌లు కాలనీ, అపార్ట్మెంట్ సంఘాలు కూడా ఏడాదికోసారి ఆటవిడుపుగా ఉండేందుకు, సాన్నిహిత్యాన్ని పెంచుకొనేందుకు నగరంలోని పార్కుల్లో ఇలాంటి వేడుకలను నిర్వహిస్తారు. కానీ ఈసారి వనభోజనాలు ఎన్నికల ప్రచార వేదికలుగా మారాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున మొదటి విడత వన భోజనాలను నిర్వహించిన పార్టీలు రానున్న కార్తీక మాసం చివరి రెండు ఆదివారాల (ఈ నెల 25, డిసెంబర్ 2)లో రెండో విడత కార్తీక వన భోజనాలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకున్నాయి. వంటలు.. వడ్డింపులు సాధారణంగా కుల సంఘాలు, కాలనీ సంఘాలు నిర్వహించే వనభోజనాలకు పిల్లలు, పెద్దలు కలిసి వెయ్యి నుంచి 1,500 మంది వరకు ఉంటారు. అందరినీ ఆకట్టుకునేందుకు త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా మెనూ రూపొందిస్తున్నట్లు ఓ పార్టీ నాయకుడు తెలిపారు. ఇక సొంత కులానికి చెందిన వాళ్లే వనభోజనాలకు తరలివచ్చిన చోట అభ్యర్థుల పని మరింత సులువవుతోంది. చలో టూర్.. వారాంతాలు, వరస సెలవులు కూడా పార్టీల ప్రచారానికి కలిసొచ్చాయి. కాలనీ సంఘాలకు, సీనియర్ సిటీజన్స్ సంఘాలకు టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. సరదాగా పర్యాటక ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకొనే పెద్దవాళ్లకు పార్టీల అభ్యర్థులే స్వయంగా వాహనాలు బుక్ చేసి, టూర్ ప్యాకేజీలను అందజేస్తున్నారు. ఎస్సార్‌నగర్‌లోని ఓ కాలనీకి చెందిన సీనియర్ సిటిజన్స్ పర్యటన కోసం ఒక పార్టీకి చెందిన అభ్యర్థి రూ.2 లక్షలు అందజేశారు. టూర్ ముగించుకొని వచ్చాక వనభోజనాల కోసం మరికొంత డబ్బు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ..::: పగిడిపాల ఆంజనేయులు -
మహిళలకు 15 స్థానాలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ పోటీలో నిలుపుతున్న అభ్యర్థుల సామాజిక వర్గాల వారీ లెక్క తేలింది. రాష్ట్రంలోని 119 స్థానాలకు గాను 118 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. ఒక్క భువనగిరి స్థానాన్ని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి కేటాయించేందుకు అంగీకరించడంతో ఆ స్థానంలో తమ అభ్యర్థిని పోటీలో నిలుపలేదు. ఇక నారాయణ ఖేడ్ స్థానంలో తమ అభ్యర్థిని మార్పు చేసింది. అక్కడి నుంచి రవికుమార్‌ను పోటీలో నిలిపేందుకు మొదట్లో నిర్ణయించినా చివరి క్షణంలో ఆయనకు బదులు సంజీవరెడ్డికి బీఫారం ఇచ్చింది. ఇక బీజేపీ ప్రకటించిన 118 స్థానాల్లో ఓసీలకు 50 స్థానాలను కేటాయించగా, బీసీలకు 33 స్థానాలను కేటాయించింది. ఎస్సీలకు 21 స్థానాలను, ఎస్టీలకు 12 స్థానాలను, మైనారిటీలకు 2 స్థానాలను కేటాయించింది. ఇందులో మహిళలకు మొత్తంగా 15 స్థానాలను కేటాయించడం విశేషం. రాష్ట్రంలోని అన్ని పార్టీల కంటే బీజేపీనే మహిళలకు ఎక్కువ స్థానాలను కేటాయించింది. టీఆర్ఎస్ 4 స్థానాలను కేటాయించగా, కాంగ్రెస్ 11 స్థానాలను కేటాయించింది. ఇక బీఎల్ఎఫ్ 11 స్థానాలను, టీడీపీ 1 స్థానాన్ని, టీజేఎస్ ఒక స్థానాన్ని, సీపీఐ ఒక స్థానాన్ని కేటాయించగా.. బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధికంగా 15 స్థానాలను కేటాయించింది. -
అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు!
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పలు వర్గాలకు వరాలు ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, అర్చకులు, మౌజన్, ఇమామ్‌లకు, చిరుద్యోగులకు ఒకేరోజు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే చర్చ నేపథ్యంలో సీఎం ప్రకటనలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని అన్ని కులాల వారు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఈ భవనాల కోసం కోకాపేట, ఘట్కేసర్, మేడిపల్లి, మేడ్చల్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇంజాపూర్ ప్రాంతాల్లో స్థలాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, జగదీశ్‌రెడ్డి, చందూలాల్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్‌రావు, రామకృష్ణ రావు, మహేశ్‌దత్ ఎక్కా, శివశంకర్, దాన కిశోర్, బుద్ధప్రకాశ్, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ కులాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించారు. ‘రాష్ట్రంలో బలహీన వర్గాల వారి సంఖ్య అధికంగా ఉంది. సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో వారు వెనుకబడి ఉన్నారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. వీటితోపాటు వారి వికాసానికి ఉపయోగపడేలా ప్రతీ కులానికి హైదరాబాద్‌లో ప్రభుత్వమే భవనాలను నిర్మిస్తుంది. దీనికి అవసరమైన స్థలాలను సేకరించాం. నిధులు సిద్ధంగా పెట్టాం. దాదాపు 36 సంచార కులాలకు కలిపి హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో రూ.10 కోట్ల వ్యయంతో సంచార ఆత్మగౌరవ భవన్ నిర్మిస్తాం. ఇందులో అన్ని సంచార కులాల అభ్యున్నతి కోసం చేపట్టే కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు, ఎస్సీల్లోని బుడగ జంగాలు, ఎస్టీల్లోని ఎరుకల కులానికి స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి నిధులివ్వాలని నిర్ణయించాం. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం దేశంలోనే ఇదే తొలిసారి. రాష్ట్రం మత సామరస్యానికే కాదు.. సామాజిక వికాసానికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఇప్పటికే కొన్ని కులాలకు స్థలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. మిగిలిన కులాలకు స్థలాలు, నిధులు కేటాయిస్తున్నాం. మున్నూరు కాపులకు 5 ఎకరాలు, రూ.5 కోట్లు... దూదేకులకు 3 ఎకరాలు, రూ.3 కోట్లు... గంగపుత్రులకు, విశ్వకర్మలకు 2 ఎకరాలు, రూ.2 కోట్లు... నాయీ బ్రాహ్మణులు, ఆరె క్షత్రియులు, వడ్డెర, కుమ్మరి, ఎరుకల, ఉప్పర, మేర, బుడిగ జంగాల, మేదర, పెరిక, చాత్తాద శ్రీవైష్ణవ, కటిక, ఎల్లాపి, బొందిలి కులస్తులకు ఒక్కో ఎకరం, రూ.కోటి... బట్రాజులకు అర ఎకరం, రూ.50 లక్షలు కేటాయిస్తున్నాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని కులాలకు స్థలం, నిధులు కేటాయించినందున వెంటనే నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని ఆయా శాఖల మంత్రులకు, అధికారులకు, కుల సంఘాలకు ఆయన సూచించారు. 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్... రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు ఇంటి అవసరాల కోసం వినియోగించే విద్యుత్‌ను 101 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని... టీవీలు, ఇతర విద్యుత్ గృహోపకరణాలు పెరిగినందున విద్యుత్ వినియోగం ఎక్కువైందని పేర్కొన్నారు. అందుకే 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందివ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికయ్యే విద్యుత్ చార్జీలను డిస్కమ్‌లకు ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. అర్చకుల పదవీ విరమణ 65 ఏళ్లకు.. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నేరుగా వేతనాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అర్చకులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ ఖజానా ద్వారా వేతనాలు అందుతాయన్నారు. పూజారుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నామన్నారు. జీతాల చెల్లింపు, పదవీ విరమణ వయోపరిమితి పెంపు విధి విధానాలు తయారు చేసి సోమవారం ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇమామ్, మౌజన్ల భృతి రూ.5వేల పెంపు... మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజన్లకు నెలకు రూ.5 వేల భృతి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్ 1 నుంచే పెరిగిన భృతి చెల్లించనున్నామన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో మౌజమ్, ఇమామ్‌లకు మొదట నెలకు వెయ్యి రూపాయల భృతి ఉండేది. ఆ తర్వాత రూ.1500కు పెంచారు. సెప్టెంబర్ 1 నుంచి పెరగనున్న భృతితో దాదాపు 9వేల మందికి లబ్ధి చేకూరనుందని తెలిపారు. మినీ గురుకులాల్లో ఉద్యోగుల వేతనాల పెంపు... రాష్ట్రంలోని 29 మినీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. హెడ్మాస్టర్/వార్డెన్‌కు రూ.5 వేల నుంచి రూ.21 వేలకు, సీఆర్టీలకు రూ.4 వేల నుంచి రూ.15 వేలకు, పీఈటీలకు రూ.4 వేల నుంచి రూ.11 వేలకు, అకౌంటెంట్‌కు రూ.3,500 నుంచి రూ.10 వేలకు, ఏఎన్ఎంలకు రూ.4 వేల నుంచి రూ.9 వేలకు, వంటవారికి రూ.2,500 నుంచి రూ.7,500కు, ఆయాలకు రూ.2,500 నుంచి రూ.7,500కు, హెల్పర్‌కు రూ.2,500 నుంచి రూ.7,500కు, స్వీపర్‌కు రూ.2,500 నుంచి రూ.7,500కు, వాచ్‌మెన్‌కు రూ.2,500 నుంచి రూ.7,500కు పెంచుతున్నామన్నారు. వేతనాల పెంపు ప్రతిపాదనల ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ శుక్రవారం సంతకం చేశారు. -
అంధకారంలో విశ్వకర్మలు
కుల వృత్తులపై, చేతివృత్తులపై ఆధారపడి జీవి స్తున్న ప్రజలు భారత గ్రామీణ వ్యవస్థలో అత్యధికంగా వున్నారు. మారిన పాలకుల ఆర్థిక విధానాల వల్ల నమ్ముకున్న, నేర్చుకున్న వృత్తులు నిర్వీర్యం కావడం వల్ల తమ బతుకుదెరువును గురించి ఆందోళనలు చేపట్టారు, చాలా మంది ఇతర వృత్తులకు మారారు. కులం పరిధిలో వున్నారు కాబట్టి కుల వృత్తులు పోవాలి కాబట్టి వారి గురించి అభ్యుదయవా దులు, అంబేడ్కర్ వాదులు పట్టించుకోకుండా ఉందాం అంటారా, లేదు కులం పరిధిలో ఉన్న అణగారిన, బలహీనులను సమీకరించి చైతన్యం కలిగించి మానవీయకోణంలో వారి హక్కులు, అధికారాల వైపు ఆలోచింపజేస్తూ పోరాడేందుకు ప్రయత్నం చేద్దామా? మారోజు వీరన్న అన్నట్లు కులంలో వర్గం, వర్గంలో కులం అనే సిద్ధాంతం మన దేశానికి, ముఖ్యంగా, మన రెండు తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తుంది. కులవృత్తులకు, చేతివృత్తులకు ప్రత్యామ్నాయ మార్గాలను మనం సూచిస్తూ ఆదిశగా ఏదైనా కార్యక్రమాన్నీ గతంలో చేశామా, భవిష్యత్‌లో ఏమైనా చేయగలమా, పాలకులు కులవృత్తులను, చేతివృత్తులను తప్పించి అన్ని రంగాలలో, తమ భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలకు, దళారులకు మొత్తంగా తమవారికి అనుకూలంగా బడ్జెట్లో కేటాయింపులు చేశారు, పంచవర్ష ప్రణాళికలలో అన్యాయం జరిగింది, మనం గమనించలేదు, నీతి అయోగ్‌లో అదే జరుగుతోంది మనం చూడటం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు వోట్ బ్యాంక్ రాజకీయ సమీకరణాలు చేస్తున్నాయి మనం గమనించం. కానీ కులం పోవాలి, కుల వృత్తులు పోవాలి అంటాం.. ఇది ఎట్లా సాధ్యం. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, సంక్షేమంలో జరిగే ప్రజా ఉద్యమాలలో వారిని భాగస్వామ్యం చేయడమే కుల నిర్మూలనకు పరి ష్కార మార్గం. కులరహిత సమాజం కోసం పని చేస్తున్న మనం కులవృత్తులు పోవాలి అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. సంతోషం, కానీ కులాన్ని ప్రక్కన పెట్టి కులం పేరుతో వందల, వేల సంవత్సరాల నుంచి ఆ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారు తమ జీవితాల్లో విద్యా, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, తినడానికి తిండి, ఉండటానికి నివాసం వంటి కనీస మౌలిక సౌకర్యాలు పొందడానికి వారికి మనం కలిపిం చిన చైతన్యం ఏమిటి? ఆ దిశగా పాలకుల నిర్లక్ష్యంపై మనం చేసిన ఒత్తిడి ఏమిటి? ఒక వైపు చేతివృత్తులను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు, బహుళజాతి సంస్థలకు విపరీతమైన రాయితీలను, భూమిని ధారాదత్తం చేస్తున్న సందర్భంలో గత 70ఏళ్లలో చేతివృత్తుల సామాజిక వర్గం ఒకటి ఉన్నదని, వారి గురించి కూడా మాట్లాడాలని ఏ అభ్యుదయ వాదులు, అంబేడ్కర్ వాదులు ప్రయత్నం చేసినా ఫలితాలు వేరే విధంగా ఉండేవి. ఇప్పుడు చెప్పండి. చేతివృత్తులపై ఆధారపడిన అశేష ప్రజానీకాన్ని మినహాయించి కుల రహిత, మత రహిత సమాజాన్ని ఎట్లా నిర్మిద్దాం? కుల వృత్తులకు నీచత్వం అంటగట్టి అదే కుల వృత్తులను ఆధునిక, యంత్ర,సాంకేతిక పరిజ్ఞానంతో పెట్టుబడిదారులు, భూస్వాములు, అగ్రకులాలు హస్తగతం చేసుకొని వృతికళాకారులను గుమస్తాలుగా, కూలీలుగా పెట్టుకుని కోట్లలో వ్యాపారం చేస్తున్నప్పటికీ, మన అభ్యుదయ వాదులకు, అంబేడ్కర్ వాదులకు కనిపించడం లేదు, వారికి మనువాదం మాత్రమే కనిపిస్తోంది. దాని వెనుక జరుగుతున్న దోపిడీ, పీడన, అణచి వేత కనిపించవు. కుల నిర్మూలన జరగాలి అంటే కులం పేరుతో కొనసాగుతున్న (కుల)చేతివృత్తుల వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావలసిన శిక్షణా, పెట్టుబడి, మార్కెట్ సౌకర్యాలు కల్పించాలి. ఆ పని మనం గతంలో చేశామా, ఇక ముందు మన ప్రయత్నం చేస్తామా? అనేది తేల్చుకోవాలి. ఈ పని మారోజు వీరన్న కొంతవరకు చేయగలిగిండు, అయిన చేయవలసింది ఇంకా మిగిలే ఉన్నదని గుర్తిస్తే దానికి తగిన ఆచరణ రూపాలను ఎంచుకోవచ్చు. వస్తువు ఉపరితలం ను మార్చితే వస్తువు రూపం మాత్రమే మారుతుంది, అందులోని సారం మాత్రం మారదు, మనం సారం మార్చితేనే సారం, రూపం మొత్తంగా పునాది నుంచి నిజమైన మార్పు జరిగినట్లుగా భావించాలి. బెజ్జంకి ప్రభాకరాచారి, కన్వీనర్ విశ్వకర్మ జనసమితి, తెలంగాణ 81439 66591 -
సామాజిక వర్గాలకు అధికారమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: సామాజిక వర్గాలకు అధికారం– సకల జనాల సంక్షేమం, ఉద్యమకారులకు గౌరవం దక్కాలనే లక్ష్యంతో ఆవిర్భవించిన తెలంగాణ ఇంటి పార్టీ మొదటి వార్షికోత్సవానికి సిద్ధమైంది. శనివారం నల్లగొండ పట్టణంలో భారీఎత్తున వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ‘సాక్షి’తో మాట్లాడారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి న కేసీఆర్ దళిత ఉద్యమాలను అణచివేస్తున్నారని అన్నారు. దళితుల భూములను ప్రభుత్వం గుంజుకొని దౌర్జన్యం చేస్తోందని ఆరోపించారు. ఆంధ్రా కార్పొరేట్ శక్తులకు అమ్ముడుపోయిన వేళ.. ఇంటికో ఉద్యోగమని చెప్పి నిరుద్యోగులను మోసం చూస్తున్న వేళ.. ఉద్యమ, సామాజికశక్తులను సంఘటితం చేస్తూ 2017 జూన్ 2న తెలంగాణ ఇంటి పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. మల్లన్నసాగర్, నేరెళ్ల సంఘటన, ఆడబిడ్డల ఆర్తనాదాలు, రైతుల జీవన్మరణ పోరాటాలు, సమస్య ఎక్కడున్నా అక్కడ చిలకపచ్చ తెలంగాణ ఇంటి పార్టీ జెండా ఎగిరిందని అన్నారు. తెలంగాణ అమర గాయకుడు గూడ అంజన్న సంస్మరణ సభ పెట్టే తీరికలేని ప్రభుత్వాల తీరు ను తెలంగాణ ఇంటి పార్టీ ఎండగట్టిందని చెప్పారు. సబ్బండ వర్ణాల ఆశల సింగిడి... సబ్బండ వర్ణాల ఆశల సింగిడిగా ఇవాళ తెలంగాణ ఇంటి పార్టీ ఎదిగిందని, మట్టి నేల మీద వెట్టి బతుకుల మధ్య పరుచుకున్న వెచ్చని బొంత లాంటి ఒక సెంటిమెంటు, ఒక కమిట్మెంట్, ఒక ఆచరణాత్మక డాక్యుమెంటు ఇంటి పార్టీ అని సుధాకర్ పేర్కొన్నారు. సకల జనుల పోరాటాల్లో ఎదిగిన ఉద్యమ జేఏసీలకు, కుల సంఘాల నేతలకు, వివిధ పార్టీల్లో నష్టపోయి కష్టపడిన ఉద్యమబిడ్డలను తెలంగాణ ఇంటి పార్టీ సాదరంగా ఆహ్వానిస్తోందని అన్నారు. కేసీఆర్ తన నాలుగేళ్ల పాలనలో ప్రజావ్యతిరేక నిర్ణయాలతో సకల వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, ప్రతికా ప్రకటనలకు, పనికిరాని రీడిజైనింగ్ పనులతో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. ‘సాలు దొరో నీ పాలన– ఏలిన కాడికి సాలు’అనే యువతను పార్టీలోకి ఆహ్వానించి వారినే ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెడతామని చెప్పారు. పార్టీని బలోపేతం చేయటం కోసం తెలంగాణ స్టూడెంట్ యూనియన్(టీఎస్‌యూ), యూత్ వింగ్, లీగల్ సెల్, తెలంగాణ సాంస్కృతిక సైన్యం ఏర్పాటు చేశామన్నారు. -
ముందుగానే మృత్యువాత పడుతున్నారు..
దేశంలోని ఇతర సామాజికవర్గాలతో పోల్చితే ఆదివాసీలు, షెడ్యూల్డ్ కులాలు, అల్పసంఖ్యాక వర్గాలు (ముస్లింలు) ముందుగానే మృత్యువాత పడుతున్నారు. ఇతర వర్గాల ప్రజలతో పోల్చితే సరైనస్థాయిలో వైద్యసేవలు అందక క్షీణిస్తున్న ఆరోగ్యాల కారణంగా చిన్నవయసులోనే చనిపోతున్నారు. భారత్‌లోని నిచ్చెన మెట్ల సమాజంలో అట్టడగున ఉన్న అణగారిన వర్గాలపై ఈ ప్రభావం అధికంగా ఉన్నట్టు తేలింది. ఉన్నత తరగతులు, ముస్లీమేతర వర్గాలకు చెందిన వారితో పోల్చి చూస్తే ఈ వర్గాలకు సరైన వైద్య,ఆరోగ్య సేవలు అందడం లేదని ‘భారత్‌లో కులం, మతం, ఆరోగ్యాలపై ప్రభావం (2004–14 మధ్యకాలంలో)’ పై ఆర్థికవేత్త వాణీæకాంత్ బారువా జరిపిన విశ్లేషణలో వెల్లడైంది. 2004 నుంచి 2014 వరకు పరిశీలిస్తే ఆదివాసీల సగటు జీవితకాలం తగ్గిపోయింది.. 2004 వరకు ఎస్టీలు సగటును 45 ఏళ్లపాటు జీవిస్తుండగా, ఆ తర్వాతి దశకంలో అది మరింత తగ్గిపోయింది. ఎస్సీల సగటు జీవితకాలం 42 నుంచి 2014 కల్లా ఆరేళ్లు పెరిగింది. మొత్తం ఆరుగ్రూపుల్లో ముస్లీమేతర ఉన్నత కుటుంబాల సగటు జీవించే వయసు 2004లో 55 ఏళ్ల నుంచి 2014లో 66 ఏళ్లకు పెరిగింది. దీనికి ఆరోగ్య,వైద్యసేవల నిర్వహణలో లోపాల కారణంగా తలెత్తుతున్న అసమానతలే ప్రధాన కారణమని బారువా తేల్చారు. భారత్‌లో ఓ వ్యక్తి ఆరోగ్యస్థితి నిర్థారణకు అతడు/ఆమె ఆర్థిక, సామాజిక స్థాయి సారూప్యపాత్ర (రిలేటివ్ రోల్) నిర్వహిస్తోందంటారు. 2004, 2014లలోని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) గణాంకాల ఆధారంగా ఆయన వివిధ అంశాలు పరిశీలించారు. 2004, 2014లలో సామాజిక బృందాల వారీగా సగటు వయసు మరణాలు... 2004 2014 ముస్లీమేతర ఉన్నత వర్గాల వయసు 55 60 ముస్లీమేతర ఓబీసీలు 49 52 ఉన్నత వర్గ ముస్లింలు 44 49 షెడ్యూల్డ్ కులాలు 42 48 షెడ్యూల్డ్ జాతులు 45 43 ఇతర సామాజికవర్గాలతో పోల్చితే ఎస్టీలు తక్కువ వయసులోనే చనిపోతున్నా, తాము అనారోగ్యంగా ఉన్న విషయాన్ని 24 శాతం మాత్రమే వెల్లడిస్తున్నారు. 2004లో ఇది 19 శాతంగానే ఉంది. ముస్లింలు, ఓబీసీలు 35 శాతం మంది వైద్య సేవల కోసం బయటకు వస్తున్నారు. పేదలు, ఒంటరిగా ఉంటున్న వారు తమ ఆరోగ్య సమస్యలు వెల్లడించి వైద్యసేవలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బారువా పేర్కొన్నారు. -
మా వెతలు తీర్చండి మహాప్రభో
కొరిటెపాడు(గుంటూరు): సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా మా వెతలు తీరడం లేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్–2 ముంగా వెంకటేశ్వరరావు, డీఆర్వో నాగబాబు తదితరులు వినతి పత్రాలను స్వీకరించారు. బీటీ విత్తనాలతో నష్టపోయాం.. జిల్లాలో బీటీ పత్తి విత్తనాలు వేసి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏ రుణమైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందగోరు అభ్యర్థులు మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రుణాల కోసం అర్జీలను ఇస్తున్న అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి అనేక మంది ఫిర్యాదుదారులు మీ సేవలో దరఖాస్తు చేసుకునే విధానం తెలియక గుంటూరు జిల్లా కేంద్రానికి వచ్చి మీ కోసం కార్యక్రమంలో దరఖాస్తులు ఇస్తున్నారని, ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలోని మీ సేవలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసిందని, 2018–19 ఆర్థిక సంవత్సరానికి వచ్చే జూన్ మాసంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఏ రుణం కావాల్సినా కూడా ఆన్లైన్ ద్వారా మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సైనికుడి కుటుంబానికి ఊరట తెనాలి: 1965 ఇండో–పాకిస్తాన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి, ప్రభుత్వ నిరాదరణతో నైరాశ్యంలో ఉన్న సైనికుడి కుటుంబానికి ‘మీకోసం’లో కొంత ఊరట కనిపించింది. గుంటూరులో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో తెనాలికి చెందిన వృద్ధురాలు తోట వెంకాయమ్మ, సుదీర్ఘకాలంగా తమ పట్ల ప్రభుత్వం చూపుతున్న నిరాదరణ, తమ ఆవేదనను తెలియజేస్తూ అర్జీనిచ్చారు. తన నలుగురు కుమారుల్లో ఒకరైన తోట వీరనాగప్రసాద్ ఆర్మీలో పనిచేస్తూ 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు. 1966లో ప్రభుత్వం చినగంజాంలో వర్షాధారమైన 2.5 ఎకరాల (సర్వే నెం.701/1) భూమిని వీరసైనికుడి తల్లి వెంకాయమ్మ పేరిట కేటాయించింది. కొంతకాలానికి మళ్లీ తీసేసుకుంది. మరోచోట ఇచ్చినట్టే ఇచ్చి, మళ్లీ తీసేసుకుని వేరొక చెరువు భూమిని కేటాయించారు. కోర్టు వివాదంతో ఆ భూమీ దక్కలేదు. ప్రత్యామ్నాయంగా వేరొకచోట భూమిని ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇన్నేళ్లుగా పట్టించుకోలేదు. వెంకాయమ్మ భర్త 30 ఏళ్ల క్రితమే మరణించారు. అప్పట్నుంచి బిడ్డల దగ్గర ఉంటూ వస్తోంది. దీనిపై విచారించిన కలెక్టర్ జిల్లాలో అనువైన భూమి అన్వేషణ కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా రెవిన్యూ అధికారికి అప్పగించినట్టు ఆమె కుమారుడు హనుమంతరావు చెప్పారు. రైతులకు పరిహారం చెల్లించాలి ఖరీఫ్ సీజన్లో నాగార్జునసాగర్ కుడి కాలువకు నీరు రాకపోవటంతో మాగాణి భూముల్లో కంది పంటను సాగు చేశాం. గత మూడేళ్లగా ప్రభుత్వం ప్రోత్సహించి ఏపీ సీడ్స్ ద్వారా సబ్సిడీ కంది విత్తనాలు సరఫరా చేస్తుంది. ఆ విత్తనాలను తీసుకుని కందిపంట సాగు చేస్తున్నాం. ఈ ఏడాది మండలంలో సుమారు 3 వేల ఎకరాల్లో వైరస్ సోకి గూడ, పూత లేకుండా చెట్టు ఏపుగా పెరిగింది. ఇప్పటివరకు కౌలు కాకుండా ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి పెట్టాము. కానీ పంట పూర్తిగా దెబ్బతిని, కాయలు లేవు. ఉన్నతాధికారులు స్పందించిఎకరాకు రూ.10 వేలు నష్టపరిహాం చెల్లించి ఆదుకోవాలి. – ముండ్రు వెంకట్రావు, తైదల కృపారావు, సోమేపల్లి వీరాంజనేయులు, మోహన్‌చంద్, భువనగిరి వెంకటేశ్వర్లు, శావల్యాపురం మండలం, పిచుకులపాలెం, మతుకుమల్లి, బొందిలపాలెం గ్రామాల రైతులు సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేయాలి గురజాల మండలం, అంబాపురం గ్రామానికి సామాజిక భద్రతా పింఛన్లు 16 మంజూరయ్యాయి. ఆ 16 పింఛన్లుకు గ్రామంలో ఉన్న 6గురు జన్మభూమి కమిటీ సభ్యుల్లో 4గురు సభ్యులు ఆమోదం తెలిపారు. అర్హులను గుర్తించి పింఛన్ల దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి గ్రామ పంచాయితీ కార్యదర్శికి ఐదు నెలల క్రితం అందజేశాం. కానీ ఇంతవరకు ఆన్లైన్లో పొందుపరచలేదు. తాము ఆమోదం తెలిపిన పేర్లు పంపకుండా రాజకీయ ఒత్తిడితో వేరే పేర్లు మంజూరు చేసేందుకు పంచాయితీ కార్యదర్శి, ఎంపీడీవో ప్రయత్నం చేస్తున్నారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీసర్పంచిని అనే కించపరుస్తూ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. విచారణ జరిపి అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలి. – ఎం.పార్వతి, అంబాపురం సర్పంచి, ఎం.రమణ, అల్లూరి రాములమ్మ, అర్లి లక్ష్మీ, పింఛన్ల బాధితులు -
భారత్‌లో అత్యంత సంపన్నులు ఏ మతస్తులో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘దేశంలో ముస్లింల జనాభా పెరిగిపోతున్నద’ని హిందూ అతివాదులు.. ‘మీకు పిల్నల్ని కనడం చేతకావట్లేద’ని ముస్లిం అతివాదులు పరస్పరం విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం చూస్తున్నాం. కానీ వాస్తవం ఏంటంటే.. రెండు వర్గాల మహిళల్లోనూ గర్భధారణ(ఫర్టిలిటీ) రేటు గణనీయంగా తగ్గిపోయింది. తాజాగా విడుదలైన కేంద్ర ఆరోగ్య జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్)లో ఇలాంటివే పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సంతానోత్పత్తి ఇలా.. : గడిచిన పదేళ్లలో హిందూ కుటుంబాల్లో ఫర్టిలిటీ రేటు 2.8 నుంచి 2.1కి పడిపోయింది. అదే ముస్లిం మహిళల్లో 3.4 నుంచి 2.6కు తగ్గింది. అయితే హిందూ-ముస్లిం వర్గాలతో పోల్చుకుంటే జైన, సిక్కు, బౌద్ధ, క్రైస్తవ వర్గాల్లో పిల్లల్నే కనే ప్రక్రియ దారుణంగా మందగించింది. జైనులు కేవలం 1.2 ఫర్టిలిటీ రేటుతో అట్టడుగున నిలిచారు. అదే సిక్కుల్లో 1.6, బౌద్ధుల్లో 1.7, క్రైస్తవుల్లో 2గా నమోదయింది. అల్పాదాయం పొందే పేద వర్గాల్లో సంతానోత్పత్తి రేటు 3.2కాగా, అధిక పొందే(హై ఇన్కమ్ లెవెల్) వర్గాల్లో ఈ రేటు 1.5 మాత్రమే ఉంది. ఇక ఎస్టీల్లో 2.5, ఎస్సీల్లో 2.3, బీసీల్లో 2.2 గా ఉన్న సంతానోత్పత్తి రేటు.. అగ్రకులాల్లో(అప్పర్ క్యాస్ట్స్‌లో) మాత్రం 1.9గా ఉంది. జైనులే అత్యంత సంపన్నులు ⇒జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే 2015-16 ప్రకారం దేశంలో అత్యంత సంపన్న వర్గం జైనులదే. ⇒జైనుల్లో 70.6శాతం మంది అత్యధిక ఆదాయాన్ని పొందుతూ సంపన్నులుగా ఉన్నారు. ⇒జైనుల్లో 7.9శాతం మంది మాత్రమే ఆల్పాదాయవర్గంలో ఉన్నారు. ⇒జైనుల తర్వాత సంపన్నవర్గంగా సిక్కులు ఉన్నారు. ⇒సిక్కుల్లో 59.6 శాతం మంది సంపన్నులేకాగా, అల్పాదాయాన్ని పొందేవారు 5.2 మంది మాత్రమే ఉన్నారు. ⇒ఇక దేశంలో మెజారిటీ వర్గమైన హిందువుల్లో 40.2 మంది అల్పాదాయ పరిధిలో ఉన్నారు. ⇒హిందువుల్లో సంపన్నుల శాతం19.3కాగా, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిలో 39.6 శాతం మంది ఉన్నారు. ⇒ముస్లింలలో 39.5 శాతం మంది చాలా తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. ⇒ముస్లింలలో సంపన్నుల శాతం 18.2గా, మధ్యతరగతి, ఎగువ తరగతి వారి శాతం 42.3గా ఉంది. ⇒క్రైస్తవుల్లో 29.1 శాతం మంది సంపన్నులు, 26.6 శాతం మంది పేదలు ఉన్నారు. ⇒బౌద్ధుల్లో 20.4 శాతం మంది సంపన్నులుగానూ, 49.6శాతం మంది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గంగానూ, 30.2 శాతం మంది అల్పదాయ వర్గంగానూ కొనసాగుతున్నారు. సంపన్న రాష్ట్రాలు ఢిల్లీ, పంజాబ్ ఎన్‌ఎఫ్‌హెచ్ సర్వే ప్రకారం దేశం మొత్తంలో ఢిల్లీ, పంజాబ్‌లు సంపన్న రాష్ట్రాలుగా నిలిచాయి. అందుబాటులో స్వచ్ఛమైన తాగునీరు, సౌకర్యవంతమైన ఇళ్లు, టెలివిజన్ వంటి గృహోపకరణాలు, రవాణా.. తదితర సౌకర్యాల ప్రాతిపదికన సంపన్న రాష్ట్రాల జాబితాలో ఢిల్లీ- పంజాబ్‌లు తొలి స్థానాన్ని దక్కించుకున్నాయి. పేద రాష్ట్రంగా బిహార్ చివరి స్థానంలో ఉంది. సర్వే చేసింది ఎవరు? : అమెరికా కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్(ఐఐపీఎస్) ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వ సహకారంతో 1992 నుంచి ‘కేంద్ర ఆరోగ్య జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్)’ను నిర్వహిస్తున్నారు. ఇటీవల వెల్లడించిన (2015-16) సర్వే.. ఎన్ఎఫ్హెచ్ఎస్ చేపట్టినవాటిలో నాలుగోది. 1992-93లో మొదటిసారి, 1998-99లో రెండో, 2005-6లో మూడో, 2015-16లో నాలుగో సర్వేను నిర్వహించారు. -
∙అమృతాహారం చిన్న రైతుల ‘సహజ ఆహారం’!
♦ 30 సేంద్రియ రైతుల సహకార సంఘాల భాగస్వామ్యంతో ♦ హైదరాబాద్, విశాఖపట్నంలో 10 ‘సహజ ఆహారం’ ఫుడ్ స్టోర్లు ♦ వ్యవసాయేతర ఆస్థులుంటేనే రైతుల సహకార సంఘాలకు రుణాలు ఆపైన 30% ఆదాయపు పన్ను విధింపు.. పేద రైతుల సొసైటీలకన్నా మినహాయింపునివ్వాలంటున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు సాగు చేస్తున్న చిన్న, సన్నకారు రైతులు, వినియోగదారులు కలిసి ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాల సమాఖ్య ‘సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ’. వివిధ రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్.ఎ.) ఈ సంస్థను ప్రమోట్ చేస్తోంది. స్థానిక వనరులతో సేంద్రియ వ్యవసాయం చేయడంతోనే చిన్న, సన్నకారు రైతుల జీవితాలు మారిపోవని.. రసాయనిక అవశేషాల్లేని తమ ఆహారోత్పత్తులను తాము నిర్ణయించుకున్న గిట్టుబాటు ధరకు నేరుగా వినియోగదారులకు అమ్ముకోగలిగినప్పుడే వారి నికరాదాయం పెరుగుతుందని సుస్థిర వ్యవసాయ కేంద్రం అనుభవపూర్వకంగా గ్రహించింది. ఆ తర్వాతే ‘సహజాహారం’ ఫుడ్ స్టోర్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలోని 12 జిల్లాలకు చెందిన 30 సేంద్రియ రైతుల సహకార సంఘాలకు ఇందులో భాగస్వామ్యం ఉంది. వీటిలో మహిళా రైతుల సంఘాలు 2, ఆదివాసీ రైతుల సహకార సంఘాలు 2 ఉన్నాయి. అంతేకాదు.. వినియోగదారుల సహకార సంఘం కూడా ఒకటుంది. కనీసం నాలుగేళ్లుగా 882 హెక్టార్లలో సేంద్రియ పంటలు పండిస్తున్న 496 మంది సర్టిఫైడ్ సేంద్రియ రైతులతో సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ 2014లో ప్రారంభమైంది. 200 రకాల సేంద్రియ ఆహారోత్పత్తులు.. రైతులు సేంద్రియ పద్ధతుల్లో పండించిన ధాన్యాలు, పప్పులు, కూరగాయలు తదితర ఉత్పత్తులను శుద్ధి చేసి, ప్యాక్‌చేసి ‘సహజ ఆహారం’ బ్రాండ్‌తో విక్రయించడం విశేషం. బియ్యం, పప్పులు, గానుగ వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, పండ్లు, శుద్ధిచేసి ప్యాక్ చేసిన ఆహారోత్పత్తులు, సౌందర్య సాధనాలు మొత్తం 200 రకాల సేంద్రియ ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకోసం విజయనగరం జిల్లా బొద్దాం, కర్నూలు జిల్లా నాగులదిన్నె, జనగామ జిల్లా కల్లెం, మహారాష్ట్ర వార్దా జిల్లా డోర్లీలో ప్రోసెసింగ్ హబ్‌లను ‘సహజ ఆహారం’ కంపెనీ నెలకొల్పింది. ఈ సేంద్రియ ఉత్పత్తులను హైదరాబాద్, విశాఖపట్నంలలో 10 సహజ ఆహారం స్టోర్ల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. మరో 15 స్టోర్లు త్వరలో తెరవనున్నారు. గరిష్ట ధరలో కనీసం 50% రైతుకు అందుతుంది సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలను అప్పటికప్పుడు మార్కెట్లో అమ్ముకోవడం కన్నా.. నిల్వ చేసి, ప్రోసెస్ చేసి వివిధ ఆహారోత్పత్తులుగా తయారు చేసి, ఒకే బ్రాండ్ పేరుతో విక్రయించడం ద్వారా అధిక నికరాదాయాన్ని పొందడానికి రైతులకు సహకార సంఘాలు, ప్రొడ్యూసర్ కంపెనీలు ఉపకరిస్తాయి. సాధారణంగా మార్కెట్లో అమ్మకానికి పెట్టే ఆహారోత్పత్తుల గరిష్ట విలువలో 22 నుంచి 25% మాత్రమే వాటిని పండించిన రైతులకు చేరుతున్నదని అంచనా. అయితే, ‘సహజ ఆహారం’ స్టోర్లలో సేంద్రియ ఆహారోత్పత్తులకు వినియోగదారులు చెల్లించే గరిష్ట ధరలో కనీసం 50% సొమ్మును పండించిన రైతుకు అందిస్తున్నామని డా. రామాంజనేయులు చెప్పారు. 30% ఆదాయపు పన్ను పోటా? రైతులు తమ ఉత్పత్తులను తమకు తామే నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటే ఆదాయపు పన్ను చెల్లించనక్కరలేదు. కానీ, కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటైన ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా అమ్మితే వచ్చిన లాభంపై 30% ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తున్నది. సేంద్రియ/ సహజ వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించి, నికరాదాయాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేసే చిన్న, సన్నకారు రైతులకు వెన్నుదన్నుగా ఉండాలంటే ఆదాయపు పన్నును వీరి సహకార సంఘాలకైనా మినహాయించాలని డా. రామాంజనేయులు కోరుతున్నారు. సంఘ సభ్యుల వ్యవసాయ భూములు లేదా సంఘం కొని దాచిన వ్యవసాయోత్పత్తుల విలువపై రుణపరపతి కల్పించడం అవసరం. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హితమైన సుస్థిర వ్యవసాయ పద్ధతులు పాటించే రైతుల సహకార సంఘాలను ప్రొత్సహించినట్టవుతుంది. తద్వారా భూమి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడినట్టవుతుంది. అన్నిటికీ మించి గ్రామీణ చిన్న, సన్నకారు రైతుల నికరాదాయాన్ని పెంపొందించడానికి దోహదపడినట్టవుతుంది. (వివరాలకు.. జ్టి్టp://ట్చజ్చ్జి్చ్చజ్చిట్చఝ.జీn 085007 83300) – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ వ్యవసాయేతర ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్థిక వనరులు లేని రైతులు, వినియోగదారుల సహకార సంఘాలు, ప్రొడ్యూసర్ కంపెనీలకు ఉదారంగా బ్యాంకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం మూడేళ్లు బ్యాలన్స్ షీట్‌తోపాటు వ్యవసాయేతర ఆస్తులను పూచీకత్తుగా పెట్టాలని బ్యాంకులు కోరడం అనుచితం. వనరులు తక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతులు సంఘాలుగా ఏర్పడి తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడాన్ని ప్రోత్సహించడానికి క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయాలి. ఇవి నిలదొక్కుకోవడానికి శైశవ దశలో తొలి మూడేళ్లలోనే ప్రభుత్వ మద్దతు అవసరం. అంతగా అయితే తొలి మూడేళ్లు పరిమితంగానే బ్యాంకు రుణాలు ఇవ్వాలి. వ్యవసాయేతర ఆస్థులు తనఖా పెట్టాలంటే పేద రైతులు ఎక్కడి నుంచి తేగలుగుతారన్న ఆలోచన పాలకులకు లేదా? అసంబద్ధమైన ఈ నిబంధనల కారణంగా పట్టణాలు, నగరాల్లో మోతుబరుల సహకార సంఘాలే బ్యాంకు రుణాలను ఎక్కువగా పొందగలుగుతున్నాయి. గ్రామీణ పేద రైతుల సహకార సంఘాలు మాత్రం బ్యాంకు రుణం పొందలేకపోతున్నాయి. బ్యాంకు రుణం దొరికితే 11–12% వార్షిక వడ్డీతో సరిపోతుంది. బ్యాంకు రుణం దొరక్కపోవడంతో మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఈ సంస్థల నుంచి రుణం తీసుకుంటే 13.5% వడ్డీ సహా 3 నెలల్లోనే అసలు మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించాల్సి వస్తున్నది. చిన్న, సన్నకారు రైతుల సహకార సంఘాలను సరిగ్గా నడుపుకోగలిగేలా ప్రభుత్వం వసతులు కల్పించడం ఎంతైనా అవసరం. – డా. జీ వీ రామాంజనేయులు (ట్చఝౌౌఃఛిట్చజీnఛీజ్చీ.ౌటజ), డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం, తార్నాక, సికింద్రాబాద్ -
18లోగా ప్రాథమిక గొర్రెల సంఘాలకు ఎన్నికలు
– పశుసంవర్ధకశాఖ జేడీ సుదర్శన్ కుమార్ కర్నూలు(అగ్రికల్చర్): ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలకు ఈ నెల 18లోగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్.. ఏడీలను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎన్నికలు జరగని సంఘాలు 70 వరకు ఉన్నాయన్నారు. వీటిన్నిటికి 5వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామని.. పశువైద్యులకు తగిన ఆదేశాలు ఇచ్చి 18లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సునందిని, క్షీరసాగర్ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఊరూరా పశుగ్రాస కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో కర్నూలు ఏడీ సీవీ రమణయ్య, ఆదోని ఏడీ పి.రమణయ్య, టెక్నికల్ ఏడీ విజయుడు, గొర్రెల అభివృద్ధివిభాగం ఏడీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అనంత మంజునాథ్ కమిషన్ సభలో రచ్చ
-
రెండు వర్గాల మధ్య ఘర్షణ: 15 మందికి గాయాలు
ఢిల్లీ: రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో అల్లర్లలో 15 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వాయువ్య ఢిల్లీలోని సంగం పార్క్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒక వర్గానికి చెందిన యువకుడు మరో వర్గానికి చెందిన వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో గొడవ ప్రారంభమైందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దీంతో వెంటనే ఇద్దరికి సంబందించిన గ్రూపులు ఒకే చోటకు చేరడంతో ఘర్షణ జరిగిందన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి సమయం నుంచి ఘర్షణ జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. -
పిల్లల పంచాయితీ పెద్దల పంచాయితీగా మారి..
ముజఫర్‌నగర్: ఓ బాలికను కొందరు ఆకతాయి యువకులు అల్లరి పెట్టడంతో అది కాస్త రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్నగర్లోగల హైబత్ పూర్లో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం ఈ ఘటనకు ముందు బాలిక ఓ బస్సులో వస్తుండగా మరో వర్గానికి చెందిన ఇద్దరు యువకులు కించపరిచేలా మాట్లాడారు. ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డారు. ఆ విషయం సదరు అమ్మాయి వాళ్ల వర్గంతో చెప్పడంతో అది కాస్త రెండు వర్గాల ఘర్షణకు దారి తీసి గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఇరు వర్గాల నుంచి చెరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13మందిపై కేసులు నమోదు చేశారు. -
కాంగ్రెస్ దళిత, గిరిజన బస్సుయాత్ర ప్రారంభం