సాక్షి, హైదరాబాద్: సామాజిక వర్గాలకు అధికారం– సకల జనాల సంక్షేమం, ఉద్యమకారులకు గౌరవం దక్కాలనే లక్ష్యంతో ఆవిర్భవించిన తెలంగాణ ఇంటి పార్టీ మొదటి వార్షికోత్సవానికి సిద్ధమైంది. శనివారం నల్లగొండ పట్టణంలో భారీఎత్తున వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ‘సాక్షి’తో మాట్లాడారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి న కేసీఆర్ దళిత ఉద్యమాలను అణచివేస్తున్నారని అన్నారు. దళితుల భూములను ప్రభుత్వం గుంజుకొని దౌర్జన్యం చేస్తోందని ఆరోపించారు. ఆంధ్రా కార్పొరేట్ శక్తులకు అమ్ముడుపోయిన వేళ.. ఇంటికో ఉద్యోగమని చెప్పి నిరుద్యోగులను మోసం చూస్తున్న వేళ.. ఉద్యమ, సామాజికశక్తులను సంఘటితం చేస్తూ 2017 జూన్ 2న తెలంగాణ ఇంటి పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. మల్లన్నసాగర్, నేరెళ్ల సంఘటన, ఆడబిడ్డల ఆర్తనాదాలు, రైతుల జీవన్మరణ పోరాటాలు, సమస్య ఎక్కడున్నా అక్కడ చిలకపచ్చ తెలంగాణ ఇంటి పార్టీ జెండా ఎగిరిందని అన్నారు. తెలంగాణ అమర గాయకుడు గూడ అంజన్న సంస్మరణ సభ పెట్టే తీరికలేని ప్రభుత్వాల తీరు ను తెలంగాణ ఇంటి పార్టీ ఎండగట్టిందని చెప్పారు.
సబ్బండ వర్ణాల ఆశల సింగిడి...
సబ్బండ వర్ణాల ఆశల సింగిడిగా ఇవాళ తెలంగాణ ఇంటి పార్టీ ఎదిగిందని, మట్టి నేల మీద వెట్టి బతుకుల మధ్య పరుచుకున్న వెచ్చని బొంత లాంటి ఒక సెంటిమెంటు, ఒక కమిట్‌మెంట్, ఒక ఆచరణాత్మక డాక్యుమెంటు ఇంటి పార్టీ అని సుధాకర్ పేర్కొన్నారు. సకల జనుల పోరాటాల్లో ఎదిగిన ఉద్యమ జేఏసీలకు, కుల సంఘాల నేతలకు, వివిధ పార్టీల్లో నష్టపోయి కష్టపడిన ఉద్యమబిడ్డలను తెలంగాణ ఇంటి పార్టీ సాదరంగా ఆహ్వానిస్తోందని అన్నారు.
కేసీఆర్ తన నాలుగేళ్ల పాలనలో ప్రజావ్యతిరేక నిర్ణయాలతో సకల వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, ప్రతికా ప్రకటనలకు, పనికిరాని రీడిజైనింగ్ పనులతో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. ‘సాలు దొరో నీ పాలన– ఏలిన కాడికి సాలు’అనే యువతను పార్టీలోకి ఆహ్వానించి వారినే ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెడతామని చెప్పారు. పార్టీని బలోపేతం చేయటం కోసం తెలంగాణ స్టూడెంట్ యూనియన్(టీఎస్‌యూ), యూత్ వింగ్, లీగల్ సెల్, తెలంగాణ సాంస్కృతిక సైన్యం ఏర్పాటు చేశామన్నారు.
సామాజిక వర్గాలకు అధికారమే లక్ష్యం
Published Sat, Jun 2 2018 2:02 AM | Last Updated on Sat, Jun 2 2018 2:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment