రాజకీయ పార్టీల రూటు మారింది. సాధారణంగా రద్దీ కూడళ్లు, కాలనీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించే అభ్యర్థులు తాజాగా నగర శివార్లకు తరలి వెళ్తున్నారు. శివార్లలోని ఫంక్షన్‌హాళ్లు, ఫాంహౌస్‌లు, ఆలయాలను సైతం ప్రచార వేదికలుగా మలుచుకుంటున్నారు. ఈ వరసలో కార్తీక వనభోజనాల్లో ఇప్పుడు పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. కుల, కాలనీ, అపార్ట్‌మెంట్ సంఘాల ఓట్లను గంపగుత్తగా వేసుకొనేందుకు రాజకీయ పార్టీలే వనభోజనాలను నిర్వహిస్తున్నాయి. వివిధ కులసంఘాలకు హామీల వర్షం కురిపిస్తున్నాయి.
ఫంక్షన్ హాళ్లు, పార్కుల్లో ముందస్తు బుకింగ్‌లు
కాలనీ, అపార్ట్‌మెంట్ సంఘాలు కూడా ఏడాదికోసారి ఆటవిడుపుగా ఉండేందుకు, సాన్నిహిత్యాన్ని పెంచుకొనేందుకు నగరంలోని పార్కుల్లో ఇలాంటి వేడుకలను నిర్వహిస్తారు. కానీ ఈసారి వనభోజనాలు ఎన్నికల ప్రచార వేదికలుగా మారాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున మొదటి విడత వన భోజనాలను నిర్వహించిన పార్టీలు రానున్న కార్తీక మాసం చివరి రెండు ఆదివారాల (ఈ నెల 25, డిసెంబర్ 2)లో రెండో విడత కార్తీక వన భోజనాలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకున్నాయి.
వంటలు.. వడ్డింపులు
సాధారణంగా కుల సంఘాలు, కాలనీ సంఘాలు నిర్వహించే వనభోజనాలకు పిల్లలు, పెద్దలు కలిసి వెయ్యి నుంచి 1,500 మంది వరకు ఉంటారు. అందరినీ ఆకట్టుకునేందుకు త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా మెనూ రూపొందిస్తున్నట్లు ఓ పార్టీ నాయకుడు తెలిపారు. ఇక సొంత కులానికి చెందిన వాళ్లే వనభోజనాలకు తరలివచ్చిన చోట అభ్యర్థుల పని మరింత సులువవుతోంది.
చలో టూర్..
వారాంతాలు, వరస సెలవులు కూడా పార్టీల ప్రచారానికి కలిసొచ్చాయి. కాలనీ సంఘాలకు, సీనియర్ సిటీజన్స్ సంఘాలకు టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. సరదాగా పర్యాటక ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకొనే పెద్దవాళ్లకు పార్టీల అభ్యర్థులే స్వయంగా వాహనాలు బుక్ చేసి, టూర్ ప్యాకేజీలను అందజేస్తున్నారు. ఎస్సార్‌నగర్‌లోని ఓ కాలనీకి చెందిన సీనియర్ సిటిజన్స్ పర్యటన కోసం ఒక పార్టీకి చెందిన అభ్యర్థి రూ.2 లక్షలు అందజేశారు. టూర్ ముగించుకొని వచ్చాక వనభోజనాల కోసం మరికొంత డబ్బు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
..::: పగిడిపాల ఆంజనేయులు
వనభోజనాలు.. పొలిటికల్ మీల్స్
Published Sat, Nov 24 2018 3:37 AM | Last Updated on Sat, Nov 24 2018 11:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment