ఎన్నికల వేళ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ ఆంక్షల ఫలితంగా నకిలీ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. గతేడాది నవంబర్, డిసెంబర్‌లో జరిగిన మద్యం అమ్మకాల కన్నా 30 శాతం మించి ఈ ఏడాది అమ్మకాలు చేయాలని ఎక్సైజ్ అధికారులు నియంత్రణ విధించారు. ఈ పరిమితిని మించి మద్యం అమ్మకాలు జరిపితే కారణాలు చూపుతూ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో మద్యం అమ్మకాలకు డిమాండ్ పెరగడం.. అందుకు తగినట్లు ఎక్సైజ్ డిపో నుంచి మద్యం సరాఫరా లేక వైన్స్ షాపుల నిర్వహకులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొంత మంది వ్యాపారులు నకిలీ మద్యం అమ్మకాలకు తెరలేపారు.
సాక్షి, కోరుట్ల: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దరిమిలా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మద్యానికి డిమాండ్ పెరిగింది. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడానికి వారం రోజులుగా మందు, విందులకు తెరలేపారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి సెగ్మెంట్లలో ఇప్పటికే ఎన్నికల మద్యం ఏరులై పారుతోంది. పోలింగ్‌కు మరో 3 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో సంఘాలు, గ్రూపుల వారీ గా రాజకీయ పార్టీలు ఓటర్లకు మద్యం అందించే అంకానికి తెరలేపాయి. ఈ క్రమంలో మద్యం కొనుగోళ్లు పెరిగాయి. కొనుగోళ్లు పెరిగినా గత ఏడాదికి మించి అమ్మకాలు చేయరాదన్న ఆంక్షలను ఆధారంగా చేసుకుని కొంతమంది మద్యం వ్యాపారులు పక్కతోవ పడుతున్నట్లు తెలిసింది.
తగ్గిన అమ్మకాలపై అనుమానాలు..
ఎన్నికల వేళ ఓటర్ల వద్దకు జోరుగా మద్యం చేరుతున్నా అమ్మకాలు మాత్రం తక్కవగా ఉండటం సందేహాలకు తావిస్తోంది. జిల్లాలో 2017, నవంబర్‌లో 61,430 కేసుల విస్కీ, 1,13,346 కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. నవంబర్‌లో 57,934 విస్కీ కేసులు, 1,04,431 బీరు కేసుల అమ్మకాలు జరిగాయి. నవంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో మద్యం అమ్మకాలు పెరగా ల్సి ఉండగా తగ్గడం అనుమానాలకు తావిస్తోంది. ఎక్సైజ్ అధికారులు ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించడం గతేడాది నవంబర్‌లో జరిగిన అమ్మకాల కన్నా 30 శాతం మించి మద్యం అమ్మితే కారణాలు చెప్పి.. వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో మద్యం వ్యాపారులు కొందరు కొత్తదారులు వెతుకుతున్నట్లు సమాచారం. ఎక్సైజ్ డిపో నుంచి సరాఫరా అవుతున్న మద్యం అమ్మకాలను పక్కన బెట్టి నకిలీ మద్యం అమ్మకాలకు తెరలేపారు.
నకిలీ జోరు..?
ఈనెల7న పోలింగ్ ఉన్న క్రమంలో 1 నుంచి 5 వరకు గతేడాది వైన్స్‌షాపులకు ఎంత మద్యం సరాఫరా అయిందో.. అంతే మద్యం çసరఫరా చేయనున్నట్లు తెలిసింది. పోలింగ్‌కు సమయం దగ్గరపడడంతో అమ్మకాలు తారా స్థాయి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అదనుగా మద్యం వ్యాపారులు కొంత మంది మహా రాష్ట్ర నుంచి చీప్‌లిక్కర్, నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఎత్తుగడతో మద్యం వ్యాపారులు ఎక్సైజ్ ఆంక్షల నుంచి తప్పించుకోవడంతోపాటు అడ్డగోలు లాభాలు పొందుతున్నట్లు తెలిసింది. ఎక్సైజ్ అధికారులు కట్టదిట్టంగా వ్యవహరిస్తే అనేక విషయాలు వెలుగులోకొస్తాయని ప్రజలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment