సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారమంటే ఎక్కువ మందితో హడావుడి చేయడమే. జేజేల హోరు, నినాదాల జోరు, వాహన శ్రేణి, జెండాలు, కరపత్రాలు, హంగు, ఆర్భాటాలు. ప్రస్తుత ప్రచార పర్వమంతా ఇదే తరహాలో సాగుతోంది. ఈ ప్రచారంలో అభ్యర్థులకు తమ వెంట ఉండే జనసంఖ్యే కీలకం. ఎంత ఎక్కువ మంది ఉంటే ప్రచారం అంత భారీగా ఉంటుంది. కానీ పక్షం రోజులపాటు జరిగే ప్రచార పర్వానికి కార్యకర్తలంతా రాత్రింబవళ్లు వెన్నంటి ఉండాలంటే కష్టమే. దీంతో ఈ ప్రక్రియలో అభ్యర్థులు చాలాచోట్ల కూలీ కార్యకర్తలను వెంటేసుకుని ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో ఇలాంటి వారిదే ఎక్కువ హడావుడి కనిపిస్తోంది. కానీ వీరిని తీసుకురావడం అభ్యర్థులకు పెనుసవాలుగా మారింది. కూలీ డబ్బులతో పాటు భోజన సదుపాయాలు కల్పించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇలా వచ్చేవారు బెట్టు చేస్తుండటంతో ఖర్చు భారీగా పెరుగుతోంది. వ్యవసాయ కూలీకి వెళ్తే వచ్చే ఆదాయంకంటే ఎక్కువ మొత్తంలో ఇస్తే తప్ప ప్రచారంలో పాల్గొనేందుకు మొగ్గు చూపడం లేదు. ఒక్కో వ్యక్తికి రూ.500 వరకు నగదును ఇస్తుండటంతో పాటు మధ్యాహ్న సమయంలో భోజనం కింద బిర్యాణీ ప్యాకెట్‌ను ఇస్తున్నారు. మహిళల కేటగిరీలో మాత్రం రూ.300తోపాటు బిర్యానీ ప్యాకెట్ సరిపెడుతున్నారు. ఇలా వచ్చిన కూలీలతో జెండాలు పట్టించడం, కరపత్రాలు పంపిణీ చేయిస్తున్నారు. కొందరైతే ప్రత్యేకంగా పార్టీ రంగులో డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ ప్రచారాన్ని రంగులమయం చేస్తున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థుల ఫోటో, పార్టీ గుర్తుతో కూడిన చిన్న వాహనాలు, బైక్‌లు, రిక్షాబండ్లు గ్రామాల్లో తిప్పుతున్నారు.
మీటింగులకు సపరేటు..
అభ్యర్థుల ఇంటింటి ప్రచారంతోపాటు మేజర్ పంచాయతీలు, సర్కిళ్లలో ఏర్పాటుచేసే మీటింగ్‌లకు వచ్చే కూలీలు మరింత ప్రత్యేకం. అక్కడ మీటింగుల్లో జన సందోహంతోనే కళ వస్తుందనే ఉద్దేశంతో అభ్యర్థులు సైతం ఉత్సాహం చూపుతున్నారు. ఈక్రమంలో ఆయా మీటింగులకు వచ్చే వారికి ప్రత్యేక ప్యాకేజీలు కేటాయిస్తున్నారు. గ్రామాల నుంచి వాహనాల్లో తరలించడంతో పాటు రూ.800 వరకు చెల్లిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల సభలకు వచ్చే వాళ్లకు మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. రవాణా వసతితోపాటు నగదు చెల్లింపులు, దూర ప్రాంతాలకు తరలిస్తే రెండు పూటలా భోజన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కొందరు బృందంగా ఏర్పడి సభలు, సమావేశాలకు హాజరవుతున్నారు. కొందరు కూలీలు వ్యవసాయ పనులు, ఇతర కూలీ పనులను పక్కనబెట్టి ఎన్నికల సీజన్‌లో ఇలా ప్రచారంతో రెట్టింపు కూలీ దక్కించుకుంటున్నారు.
భారీ సభల సీజన్..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు భారీ సభలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. రోజుకు మూడు, నాలుగు చోట్ల సభలు ఏర్పాటు చేస్తుండగా... జనాలు సైతం భారీ సంఖ్యలోనే హాజరవుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా భారీ బహిరంగ సభల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. శుక్రవారం మేడ్చల్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ హాజరు కానున్నారు. ఈ సభను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు టీడీపీ కూడా భారీ సభలు నిర్వహించబోతోంది. మొత్తంగా వచ్చేనెల ఐదోతేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగసభలు కొనసాగనున్నాయి. ఈ సభలను విజయవంతం చేయాలంటే భారీ జనసందోహం కావాల్సిందే. దీంతో జనసమీకరణ కోసం నాయకులు పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారు. ముందస్తుగా వాహనాలు సిద్ధం చేసుకోవడంతోపాటు జనాల నుంచి ముందస్తు హామీలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment