సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు..శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఇది అక్షర సత్యం. నిండు శాసనసభలో అధ్యక్షా అనాలనే వారి చిరకాలవాంఛ తీర్చుకునేందుకు ఎన్ని ఎత్తుగడలైనా వేస్తారు..ఎన్నిసార్లయినా గోడ దూకుతారు. తాజాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జరుగుతోందిదే. గత ఎన్నికల్లో గెలిచిన మళ్లీ టికెట్ దక్కిందన్న ధీమాగా ఉన్న నేతలు ఒకవైపు ఉండగా, మరోవైపు ఓడినా పార్టీ కోసం పనిచేస్తున్నాం కాబట్టి మళ్లీ అదృష్టం వరిస్తుందనే ఆశలో కొందరు నేతలున్నారు.
ఇక టికెట్లు దక్కవని మరికొందరు నేతలు పక్క పార్టీల వైపు చూపులు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని నియోజకవర్గాల్లో గత ఎన్నికల సమయంలో బండ బూతులు తిట్టిన పార్టీ నుంచే ఈసారి టికెట్ దక్కించుకున్న నేతలున్నారు. ఆయా సెగ్మెంట్లలో ప్రత్యర్థులు వాళ్లే, కానీ పార్టీలే మారాయి! కాకపోతే గతంలో పోటీ చేసిన గుర్తుతో కాకుండా మరో గుర్తుతో పోటీ చేయాల్సి వస్తుండటంతో.. ప్రచారంలో తమ పార్టీ గుర్తుకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు.
కాంగ్రెస్ టు కాంగ్రెస్ వయా బీజేపీ..
2018లో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌తో పోటీ చేసి నెగ్గిన రాజగోపాల్‌రెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా బీజేపీకి పార్టీని వీడి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.
ఇప్పుడు మునుగోడు హస్తం అభ్యర్థి ఈయనే. మాజీ ఎంపీ అయిన రమేష్ రాథోడ్ ఖానాపూర్ నుంచి, సోయం బాపురావు బోథ్ నుంచి గత ఎన్నికల్లో చేయి ఎత్తగా.. ఇప్పుడు కమలం తరఫున తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 2014, 2018ల్లో వరుసగా రెండుసార్లు టీడీపీ టికెట్‌తో సత్తుపల్లి నుంచి గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్య.. ఆ తర్వాత కారెక్కి అదే పార్టీ నుంచి బరిలో దిగారు.
నాడు స్వతంత్రంగా, ప్రధాన పార్టీ నుంచి..
గతంలో వికారాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చంద్రశేఖర్ తాజాగా హస్తం గుర్తుతో జహీరాబాద్ నుంచి, గతంలో బాల్కొండలో బీఎస్‌పీ టికెట్‌తో పోటీ చేసిన ముత్యాల సునీల్ కుమార్.. తాజాగా కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగుతున్నారు.
గత ఎన్నికల్లో నిర్మల్ నుంచి చేయి గుర్తుతో పోటీ చేసిన మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు బీజేపీ టికెట్‌తో, 2018లో ఆర్మూర్ నుంచి, బీజేపీ టికెట్‌తో పోటీ చేసిన పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి, 2014, 2018ల్లో వరుసగా రెండుసార్లు నర్సాపూర్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సునీతా లక్ష్మారెడ్డి.. తాజాగా బీఆర్‌ఎస్ నుంచి పోటీలో దిగుతున్నారు.
గ్రేటర్‌లో..
♦ 2018లో కాంగ్రెస్ టికెట్‌తో మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సబిత.. ఇప్పుడు బీఆర్‌ఎస్ అభ్యర్థి.
♦ ఎల్బీనగర్, తాండూరు నుంచి 2018లో కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచిన సు«దీర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి ఇప్పుడు కారులో ఉన్నారు.
♦ 2009 ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి స్వతంత్రంగా, 2014, 2018ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కూన శ్రీశైలంగౌడ్.. తాజాగా బీజేపీ నుంచి దిగుతున్నారు.
♦ 2018లో మల్కాజ్‌గిరి అభ్యర్థిగా బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన మైనంపల్లి.. ఈ సారి హస్తం గుర్తుతో రంగంలోకి దిగారు.
♦ 2018లో టీడీపీ టికెట్‌తో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసిన సామరంగారెడ్డి.. ఇప్పుడు బీజేపీ టికెట్‌తో ఎల్బీ నగర్ నుంచి పోటీకి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మర్రి శశిధర్ రెడ్డి.. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ దాదాపు ఖరారైంది.
♦ 2014లో కాంగ్రెస్ టికెట్‌తో మహేశ్వరం నుంచి, 2018లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) టికెట్‌తో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మల్‌రెడ్డి .. తాజాగా మళ్లీ కాంగ్రెస్ టికెట్‌తో ఇబ్రహీంపట్నం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరేగాకుండా గత ఎన్నికల్లో వేర్వేరు పార్టీల చిహ్నలపై గెలిచి/ఓడి... ఇప్పుడు మరో పార్టీ తరఫున బరిలో నిలిచిన వారు అనేకమంది ఉన్నారు. మునుపెన్నడూలేని రీతిలో రాష్ట్ర రాజకీయాల్లో వేర్వేరు కండువాలు మార్చుకున్నవారి సంఖ్య ఈసారే ఎక్కువగా ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment