18లోగా ప్రాథమిక గొర్రెల సంఘాలకు ఎన్నికలు
– పశుసంవర్ధకశాఖ జేడీ సుదర్శన్ కుమార్
కర్నూలు(అగ్రికల్చర్): ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలకు ఈ నెల 18లోగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్.. ఏడీలను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎన్నికలు జరగని సంఘాలు 70 వరకు ఉన్నాయన్నారు. వీటిన్నిటికి 5వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామని.. పశువైద్యులకు తగిన ఆదేశాలు ఇచ్చి 18లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సునందిని, క్షీరసాగర్ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఊరూరా పశుగ్రాస కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో కర్నూలు ఏడీ సీవీ రమణయ్య, ఆదోని ఏడీ పి.రమణయ్య, టెక్నికల్ ఏడీ విజయుడు, గొర్రెల అభివృద్ధివిభాగం ఏడీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.