తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలం కారుమానుకొండలో కీడుపాక
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు మన్యంలో ఎత్తైన కొండలపై చెట్టుకొకటి, పుట్టకొకటి అన్నట్టుగా ఉండే మారుమూల పల్లెలవి. అక్కడ నివసించే కొండరెడ్డి గిరిజనుల్లో నూటికి 70 మంది నిరక్షరాస్యులే. గిరిజన జాతుల్లో కొండరెడ్ల జీవనం ప్రత్యేకంగా ఉంటుం ది. అనాదిగా వారి జీవన విధానాన్ని మూఢనమ్మ కాలే శాసిస్తున్నాయి. రాష్ట్ర విభజనతో తెలంగాణ నుంచి విడివడి తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన నాలుగు విలీన మండలాల్లోనూ కొండరెడ్డి గిరిజనులు ఎక్కువగానే ఉన్నారు. కూనవరం, చింతూరు, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లోని సుమారు 70 ఆవాసాల్లో 2,500 కుటుంబాలున్నాయి. వీరి జనాభా 8 వేల పైమాటే.
ఎవరికీ కనిపించనిచోట ‘కీడు పాక’
కొండరెడ్లలో పూర్వీకుల నుంచి ఓ దురాచారం కొనసాగుతోంది. అదే కీడుపాకల ఆచారం. కొండరెడ్డి మహిళలు నెలసరి, ప్రసవ సమయంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు ఎట్టిపరిస్థితుల్లో కనిపించకూడదు. ఆ సమయంలో మహిళలు ఊరి బయట ప్రత్యేకంగా ఉండే పూరిపాకల్లో ఒంటరిగా నివాసం ఉండాల్సిందే. నెలసరి (పీరియడ్స్) సమయం నాలుగైదు రోజుల్లో పర పురుషులెవరూ ఆమెను కన్నెత్తి కూడా చూడకూడదు. ఆ మహిళకు భర్త మాత్రమే ఆహారం తీసుకువెళ్లాలి. అతడు కూడా ఆహారాన్ని ఆ పాకముందు పెట్టి ఆమెకు కనిపించకుండా తిరిగి వచ్చేయాలి.
ప్రసవ సమయంలో గర్భిణులు రెండు నెలలకు పైగా కీడుపాకలోనే ఉండాలి. ప్రసవం కూడా ఆ పూరిపాకలోనే. పుట్టిన బిడ్డకు ఆ తల్లే బొడ్డుపేగు కత్తిరించి ముడివేయాలి. ఈ ఆచారాన్ని పాటిస్తేనే అడవి జంతువులు, శారీరక రుగ్మతల నుంచి కొండ దేవరలు కాపాడతారని కొండరెడ్ల విశ్వాసం. కీడుపాక ఆచారం వల్ల సకాలంలో ప్రసవాలు జరగక, వైద్యం అందక పురిటి సమయంలోనే నవజాత శిశువులు, గర్భిణులు, బాలింతలు మృత్యువాత పడుతుండేవారు.
ప్రభుత్వ చర్యలతో మార్పొస్తోంది
ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం చింతూరు ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మొదట్లో చింతూరు ఐటీడీఏ అధికారులు ఎంతగా నచ్చచెప్పినా అక్కడి మహిళలు కీడు పాకల ఆచారాన్ని విడిచిపెట్ట లేదు. చివరకు కీడుపాకకు ప్రత్యామ్నాయంగా ఊరి చివర్లో చిన్నపాటి భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతంలో చింతూరు ఐటీడీఏ పీవోగా పనిచేసిన ఆకుల వెంటకరమణ వీటిని ఏర్పాటు చేయించారు. వాటిలో విద్యుత్ సదుపాయం, మంచినీరు, స్నానాల గదులు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించారు.
దీంతోపాటు ఆ గ్రామాల్లో పాఠశాలలను మెరుగుపరచడమే కాకుండా వారి పిల్లలను బడులకు రప్పించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. గిరిజనులు ఇప్పుడిప్పుడే అధికారుల మాట వింటున్నారు. గర్భిణులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా కీడుపాకల వల్ల తలెత్తే దుష్ఫలితాలపై అవగాహన కల్పిస్తుండటంతో గర్భిణులు కాన్పుల కోసం పీహెచ్‌సీలకు వెళుతున్నారు.
అమ్మఒడి, విద్యాకానుక వంటి పథకాలతో అక్కడి పిల్లలు చదువుల వైపు ఆకర్షితులవుతున్నారు. చింతూరు మండల ఏరియా ఆస్పత్రి, కూనవరం మండలం కూటూరు, వీఆర్ పురం మండలం రేకపల్లి పీహెచ్‌సీలకు కాన్పులకు వచ్చే గర్భిణిల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చింతూరు డివిజన్‌లో గతంలో ఏడాదికి కాన్పులు 70లోపే ఉండేవి. ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది 148 కాన్పులు జరిగాయి. గతంలో మూడో తరగతి నుంచి డిగ్రీ వరకు వెయ్యి మించి లేని విద్యార్థు సంఖ్య ఇప్పుడు 1,500 మందికి పెరగడం మార్పునకు సంకేతంగా పేర్కొంటున్నారు.
కాన్పులపై అవగాహన పెరిగింది
ఆస్పత్రుల్లో కాన్పుల పట్ల కొండరెడ్డి మహిళల్లో అవగాహన పెరిగింది. ఆస్పత్రిలో కాన్పయితే ప్రభుత్వం జేఎస్‌వై క్రింద తక్షణం రూ.వెయ్యి, ఆరోగ్యశ్రీ కార్డుంటే రూ.4000 ఇస్తున్న విషయాన్ని ఏఎన్‌ఎం, ఆశాలు, అంగన్‌వాడీ సిబ్బంది కొండలపైకి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులను ప్రసవానికి 15 రోజులు ముందే మైదాన ప్రాంత ఆస్పత్రికి తరలించి బర్త్ వెయిటింగ్ సెంటర్‌లో ఉంచుతున్నాంద.
– డాక్టర్ శివకృష్ణారెడ్డి, వైద్యాధికారి, కూటూరు పీహెచ్‌సీ, కూనవరం మండలం
కీడుపాకలు వదిలిపెడుతున్నారు
ప్రస్తుత ప్రభుత్వం కొం డరెడ్లకు మంచి సౌకర్యాలు కల్పిస్తోంది. గతంలో ఊరికి దూరంగా ఉండే కీడుపాకల్లోనే ప్రసవాలు జరిగేవి. వైద్యసిబ్బంది తరచూ కొండలపైకి వచ్చి అవగాహన కల్పిస్తుండటంతో ప్రసవాల కోసం కీడుపాకలు విడిచిపెట్టి ప్రభుత్వ ఆస్పత్రులకు వెళుతున్నారు. కీడుపాకలకు బదులుగా భవనాలు నిర్మించేందుకు అధికారులు ముందుకు రావడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది.
– కదల బూబమ్మ, ఎర్రగొండపాకల, చింతూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment