konda reddy
-
దేవుణ్ణి చూసిన వాడు
‘వానలో కలిసిన చీకటి ఆకాశం నుంచి నల్లటి విషంలా కారుతోంది’ అని మొదలవుతుంది తిలక్ ‘దేవుణ్ణి చూసిన వాడు’ కథ. ఆ రాత్రి వానలో ఉలిక్కిపడి లేచిన గవరయ్యకు పెరటి వసారాలో ఏదో మూలుగు. ఏమిటది? లాంతరు తీసుకుని బయటకి వచ్చాడు. హోరుగాలి... భీకర వర్షం... మూలుగుతూ పడి ఉన్న ప్రాణి. లాంతరు ఎత్తి చూసి దిమ్మెరపోయాడు. భార్య. తనను వదిలిపెట్టి వెళ్లిన భార్య. ‘గవరయ్య భార్య లేచిపోయిందట’ అని ఊరంతా గేలి చేయడానికి కారణమైన స్త్రీ. మోసపోయి, నిండు గర్భంతో, నొప్పులు పడుతూ, మొహం చెల్లక వసారాలో పడి ఉంది. దూరంగా మెరుపు మెరిసింది. చెవులు చిల్లులుపడేలా పిడుగు. కాన్పు జరిగిపోయింది. కేర్‌మని– చేతుల్లోకి తీసుకోగానే సముదాయింపు పొందిన ఆ పసికూన గవరయ్యతో బంధమేసింది. క్షణం ఆలోచించలేదు అతడు. ఆమెను, ఆమె కన్న తనది కాని బిడ్డను లోపలికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఊరిపెద్దలు ‘లేచిపోయిందాన్ని ఏలుకుంటావా’ అని వస్తే గవరయ్య ఏం చేశాడు? కత్తి పట్టుకు వచ్చి ‘అడ్డు పడినవాళ్లను అడ్డంగా నరుకుతాను’ అన్నాడు. అతడు మనిషి. దేవుడు. మానవత్వంలో దేవుడిని చూసినవాడు.మధురాంతకం రాజారాం ‘కొండారెడ్డి కూతురు’ అనే కథ రాశారు. ఫ్యాక్షనిస్టు కొండారెడ్డి కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. పారిపోయి బతుకుతోంది. చాన్నాళ్ల తర్వాత ఊరి మనుషులు చూడటానికి వచ్చారు. తన మనుషులు. తన తండ్రి దగ్గర పని చేసే మనుషులు. కొండారెడ్డి కూతురు ఎంతో సంతోషపడింది. మర్యాదలు చేసింది. వారి చేసంచుల్లో చాటుగా ఉన్న ఆయుధాలు చూసి అంతలోనే నిశ్చేష్టురాలైంది. తనను, భర్తను చంపుతారన్నమాట. తండ్రి పంపించాడన్న మాట. కాని ఇంటికి వచ్చిన అతిథులను అవమానించవచ్చా? వారి కోసం ఏమిటేమిటో వండింది. కొసరి కొసరి వడ్డించింది. ఊరి ముచ్చట్లు అడిగి చెప్పించుకుంది. ఆ రాత్రి తనకు ఆఖరు రాత్రి. హాలులో కుర్చీ వేసుకుని భర్త గదికి కాపలా కూర్చుంది. వాళ్లు వస్తారు. తనని చంపుతారు. కొండారెడ్డికి పుట్టినందుకు తాను చస్తుంది. కాని భర్తను చంపడానికి వీల్లేదంటుంది. వాళ్లు వచ్చారు. నీడల్లా నిలబడ్డారు. చంపుతారనుకుంటే కాళ్ల మీద పడ్డారు. ‘అమ్మా మేమెందుకొచ్చామో తెలిసీ అన్నం పెట్టావు. చెడ్డ పనులు చేసే రోజు మీ అమ్మ ముఖం చూడకుండా తప్పుకునేవాళ్లం. చూస్తే చేయలేమని. ఇవాళ నీ ముఖం చూస్తూ నిన్నెలా చంపుతా మమ్మా’... ఏడుస్తూ కాళ్లు కడుగుతున్నారు. ఆమె మనిషే. దేవత కాకపోవచ్చు. కాని మానవీయత ఉన్న మనిషి వదనంలో దైవత్వం ఉంటుంది.‘మనందరం దేవుళ్లమే’ అంటాడు ‘సత్యమే శివం’లో కమలహాసన్. ‘సృష్టీ విలయం రెండూ మన చేతుల్లోనే’ అంటాడు ‘సెపియెన్స్’ పుస్తక రచయిత హరారి. ‘నేటి మనిషి రెండు విషయాల వల్ల మనిషి గుణాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. ఒకటి ప్రకృతి విధ్వంసం– రెండు సాంకేతికతను పెంచి తాను మరుగుజ్జుగా మారడం’ అంటాడు హరారి. ప్రకృతికి ఎడంగా జరిగే కొద్ది, పరిసరాల్లో సిమెంటు పెరిగే కొద్ది, నాలుగు గోడల నుంచి నాలుగు గోడలకు అతని దినచర్య మారేకొద్ది సహజమైన మానవ స్పందనలు మొద్దుబారక తప్పదు. పెట్ డాగ్స్ సమక్షంలో అతడు పొందగలుగుతున్నది కొద్దిగా ఓదార్పే. పల్లెలో ప్రకృతిలో ఉన్నప్పుడు గొడ్డూ గోదా, మేకా ఉడుతా, కాకీ పిచుకా అన్నీ అతని స్పందనలను సజీవంగా ఉంచేవి. ‘ఎలా ఉన్నావు?’ నుంచి ‘ఎంత సంపాదిస్తున్నావు?’ను దాటి ‘ఏం కొన్నావు?’కు వచ్చేసరికి అతనిలో మొదలైంది పతనం.‘లాభం’ అనే మాట కనిపించని దారాలతో ఆడించే మాయావి. మనిషిని ఎంత ఓడిస్తే లాభం అంత గెలుస్తుంది. అంతేకాదు ‘మనిషి మీద నమ్మకం పోయింది’ అనే మాటను పుట్టించడం లాభాపేక్ష గల పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రాథమిక అవసరం. మనిషి మీద నమ్మకం పోయేలా... వాణ్ణి అది వస్తుగత, స్వార్థపరమైన, సంపద లాలసలో కూరుకుపోయేలా చేస్తుంది. లాభపడాలంటే, సుఖపడాలంటే చేయవలసింది మానవత్వాన్ని త్యాగం చేయడమే. అది పోగానే వాడు కుటుంబంతో, స్నేహితులతో, సమాజంతో, ప్రకృతితో, మానవాళితో ఎంత దారుణంగా అయినా వ్యవహరించవచ్చు. ‘మనిషి మీద నమ్మకం పోయేలా’ చేస్తే పెట్టుబడిదారీ వ్యవస్థకు మరో లాభం ఏమిటంటే... ఏ మనిషీ మరో మనిషితో కలవడు. సమూహంగా మారడు. తిరుగుబాటు చేయడు. నలుగురు బాగుపడి కోట్ల మంది మలమలమాడే వ్యవస్థకు ఢోకా రానివ్వడు. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థ ‘యుద్ధం’ అనే ముద్దుబిడ్డను పదేపదే కంటూ ఉంటుంది. యుద్ధం మానవత్వానికి అతి పెద్ద విరుగుడు. అయితే మనిషి ఇలాగే ఉంటాడా? ఏ రచయితో అన్నట్టు ‘రగిలిస్తే రాజుకునే మహాఅగ్ని మానవత్వం’. కోల్‌కతా నిరసనల్లో ఇవాళ అదే చూస్తున్నాం. యుగాలుగా... చితి పెట్టిన ప్రతిసారీ బూడిద నుంచి మానవత్వం తిరిగి జనిస్తూనే ఉంది. కాకుంటే అందుకు కావల్సిన రెక్కలు సాహిత్యమే ఇస్తుందని గ్రహించాలి. తల్లిదండ్రులూ..! మీ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు తప్పకుండా చేయండి. కాని నాలుగు మంచి పుస్తకాలు చదివించి మొదట మనిషిని చేయండి. ఏ విటమిన్ లేమికి ఏం తినాలి సరే... మానవత్వ లేమి ఉందేమో కనిపెట్టి విరుగుడుగా ఒక పుస్తకం చేతిలో పెట్టండి. ఎక్కడ పుస్తకాలు ఉంటాయో అక్కడ మానవత్వపు ఆవరణం ఏర్పడుతుంది. అదే దేవుడు తిరుగాడే తావు. ప్రపంచ మానవత్వ దినోత్సవ శుభాకాంక్షలు. -
కొండ మూలన ‘కీడు పాక’
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు మన్యంలో ఎత్తైన కొండలపై చెట్టుకొకటి, పుట్టకొకటి అన్నట్టుగా ఉండే మారుమూల పల్లెలవి. అక్కడ నివసించే కొండరెడ్డి గిరిజనుల్లో నూటికి 70 మంది నిరక్షరాస్యులే. గిరిజన జాతుల్లో కొండరెడ్ల జీవనం ప్రత్యేకంగా ఉంటుం ది. అనాదిగా వారి జీవన విధానాన్ని మూఢనమ్మ కాలే శాసిస్తున్నాయి. రాష్ట్ర విభజనతో తెలంగాణ నుంచి విడివడి తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన నాలుగు విలీన మండలాల్లోనూ కొండరెడ్డి గిరిజనులు ఎక్కువగానే ఉన్నారు. కూనవరం, చింతూరు, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లోని సుమారు 70 ఆవాసాల్లో 2,500 కుటుంబాలున్నాయి. వీరి జనాభా 8 వేల పైమాటే. ఎవరికీ కనిపించనిచోట ‘కీడు పాక’ కొండరెడ్లలో పూర్వీకుల నుంచి ఓ దురాచారం కొనసాగుతోంది. అదే కీడుపాకల ఆచారం. కొండరెడ్డి మహిళలు నెలసరి, ప్రసవ సమయంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు ఎట్టిపరిస్థితుల్లో కనిపించకూడదు. ఆ సమయంలో మహిళలు ఊరి బయట ప్రత్యేకంగా ఉండే పూరిపాకల్లో ఒంటరిగా నివాసం ఉండాల్సిందే. నెలసరి (పీరియడ్స్) సమయం నాలుగైదు రోజుల్లో పర పురుషులెవరూ ఆమెను కన్నెత్తి కూడా చూడకూడదు. ఆ మహిళకు భర్త మాత్రమే ఆహారం తీసుకువెళ్లాలి. అతడు కూడా ఆహారాన్ని ఆ పాకముందు పెట్టి ఆమెకు కనిపించకుండా తిరిగి వచ్చేయాలి. ప్రసవ సమయంలో గర్భిణులు రెండు నెలలకు పైగా కీడుపాకలోనే ఉండాలి. ప్రసవం కూడా ఆ పూరిపాకలోనే. పుట్టిన బిడ్డకు ఆ తల్లే బొడ్డుపేగు కత్తిరించి ముడివేయాలి. ఈ ఆచారాన్ని పాటిస్తేనే అడవి జంతువులు, శారీరక రుగ్మతల నుంచి కొండ దేవరలు కాపాడతారని కొండరెడ్ల విశ్వాసం. కీడుపాక ఆచారం వల్ల సకాలంలో ప్రసవాలు జరగక, వైద్యం అందక పురిటి సమయంలోనే నవజాత శిశువులు, గర్భిణులు, బాలింతలు మృత్యువాత పడుతుండేవారు. ప్రభుత్వ చర్యలతో మార్పొస్తోంది ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం చింతూరు ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మొదట్లో చింతూరు ఐటీడీఏ అధికారులు ఎంతగా నచ్చచెప్పినా అక్కడి మహిళలు కీడు పాకల ఆచారాన్ని విడిచిపెట్ట లేదు. చివరకు కీడుపాకకు ప్రత్యామ్నాయంగా ఊరి చివర్లో చిన్నపాటి భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతంలో చింతూరు ఐటీడీఏ పీవోగా పనిచేసిన ఆకుల వెంటకరమణ వీటిని ఏర్పాటు చేయించారు. వాటిలో విద్యుత్ సదుపాయం, మంచినీరు, స్నానాల గదులు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించారు. దీంతోపాటు ఆ గ్రామాల్లో పాఠశాలలను మెరుగుపరచడమే కాకుండా వారి పిల్లలను బడులకు రప్పించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. గిరిజనులు ఇప్పుడిప్పుడే అధికారుల మాట వింటున్నారు. గర్భిణులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా కీడుపాకల వల్ల తలెత్తే దుష్ఫలితాలపై అవగాహన కల్పిస్తుండటంతో గర్భిణులు కాన్పుల కోసం పీహెచ్‌సీలకు వెళుతున్నారు. అమ్మఒడి, విద్యాకానుక వంటి పథకాలతో అక్కడి పిల్లలు చదువుల వైపు ఆకర్షితులవుతున్నారు. చింతూరు మండల ఏరియా ఆస్పత్రి, కూనవరం మండలం కూటూరు, వీఆర్ పురం మండలం రేకపల్లి పీహెచ్‌సీలకు కాన్పులకు వచ్చే గర్భిణిల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చింతూరు డివిజన్లో గతంలో ఏడాదికి కాన్పులు 70లోపే ఉండేవి. ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది 148 కాన్పులు జరిగాయి. గతంలో మూడో తరగతి నుంచి డిగ్రీ వరకు వెయ్యి మించి లేని విద్యార్థు సంఖ్య ఇప్పుడు 1,500 మందికి పెరగడం మార్పునకు సంకేతంగా పేర్కొంటున్నారు. కాన్పులపై అవగాహన పెరిగింది ఆస్పత్రుల్లో కాన్పుల పట్ల కొండరెడ్డి మహిళల్లో అవగాహన పెరిగింది. ఆస్పత్రిలో కాన్పయితే ప్రభుత్వం జేఎస్వై క్రింద తక్షణం రూ.వెయ్యి, ఆరోగ్యశ్రీ కార్డుంటే రూ.4000 ఇస్తున్న విషయాన్ని ఏఎన్ఎం, ఆశాలు, అంగన్వాడీ సిబ్బంది కొండలపైకి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులను ప్రసవానికి 15 రోజులు ముందే మైదాన ప్రాంత ఆస్పత్రికి తరలించి బర్త్ వెయిటింగ్ సెంటర్లో ఉంచుతున్నాంద. – డాక్టర్ శివకృష్ణారెడ్డి, వైద్యాధికారి, కూటూరు పీహెచ్సీ, కూనవరం మండలం కీడుపాకలు వదిలిపెడుతున్నారు ప్రస్తుత ప్రభుత్వం కొం డరెడ్లకు మంచి సౌకర్యాలు కల్పిస్తోంది. గతంలో ఊరికి దూరంగా ఉండే కీడుపాకల్లోనే ప్రసవాలు జరిగేవి. వైద్యసిబ్బంది తరచూ కొండలపైకి వచ్చి అవగాహన కల్పిస్తుండటంతో ప్రసవాల కోసం కీడుపాకలు విడిచిపెట్టి ప్రభుత్వ ఆస్పత్రులకు వెళుతున్నారు. కీడుపాకలకు బదులుగా భవనాలు నిర్మించేందుకు అధికారులు ముందుకు రావడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. – కదల బూబమ్మ, ఎర్రగొండపాకల, చింతూరు మండలం -
కొండా రెడ్డి బెదిరింపుల కేసు: నిందితుడికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: సినిమా పంపిణీదారుడు శివ గణేష్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి దౌర్జన్యం చేసిన కేసులో నిందితుడు రామచంద్రారెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. ఈయన కొండారెడ్డి, శివగణేష్‌ల మధ్యవర్తిగా ఉన్నారు. శివగణేష్‌ను బెదిరించిన కేసులో రామచంద్రారెడ్డి మూడవ నిందితుడిగా ఉన్నాడు. కాగా.. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొండారెడ్డి ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బాధితుడు శివ గణేష్‌కు కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ బెదిరింపు కాల్స్ వస్తుండటం గమనార్హం. ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డిపై కేసు నమోదైంది. డిస్ట్రిబ్యూటర్ శివగణేష్‌ను బెదిరించిన కేసులో బంజారాహిల్స్ పీఎస్‌లో కొండారెడ్డిపై కేసునమోదు చేశారు. ప్రొద్దుటూరు నుంచి తండ్రి వరదరాజులరెడ్డి హైదరాబాద్ వచ్చారు. కొండారెడ్డి, అతని అనుచరుల కోసం గాలింపు కొనసాగుతోంది. గాలింపు చర్యల్లో భాగంగా కొండాపూర్‌లోని రవిరెడ్డి విల్లాలో బంజారాహిల్స్ పోలీసులు తనికీలు నిర్వహించారు. కాగా.. కొండారెడ్డి, రవిరెడ్డి, రామచంద్రారెడ్డి ఢిల్లీ వెళ్లినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడైన కొండారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. (తుపాకులతో టీడీపీ నేత కుమారుడి హల్చల్) -
పెన్షన్ విధానం కోసం ఐక్యంగా పోరాడుదాం
నిజామాబాద్ కల్చరల్ : ప్రభుత్వ సహకార బ్యాంకుల్లో పనిచేసే వారికి ఇంతవరకు ప్రభుత్వాలు పెన్షన్ సౌకర్యం కల్పించకపోవడం శోచనీయమని ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ఎ.వి. కొండారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగుల సంఘం మహాజనసభ ఆదివారం డీసీసీబీ ప్రాంగణంలో గల వైఎస్ఆర్ భవనంలో గల సమావేశపు హాల్లో జరిగింది. ముఖ్యఅతిథిగా కొండారెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు పదవీ విరమణచేసిన తరువాత పెన్షన్ల విధానం అమలవుతుండగా, కేవలం సహకార రంగంలోని ఉద్యోగులకే ఈ విధానం అమలు చేయకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వాలు ఇకనైన గ్రామీణస్థాయి వరకు రైతులను ఎన్నో రకాలుగా ఆదుకుంటున్న సహకార ఉద్యోగులకు పెన్షన్ అమలు చేసేందుకు చొరవ చూపాలని కోరారు. సహకార ఉద్యోగులందరు పెన్షన్ అమ లు కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సంతకా ల సేకరణ చేపట్టాలని సూచించారు. అవసరమైతే ఒకటి, రెండు రోజుల సమ్మె చేపట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. న్యాయమైన పెన్షన్ అమలు కోసం ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మద్దతునిస్తుందన్నారు. జాతీయ, గ్రామీణ బ్యాంకుల మాదిరిగా సహకార బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహకార వ్యవస్థపై ఆది నుంచి చిన్నచూపు చూస్తోందన్నారు. దేశంలో ఉన్న 75శాతం రైతాంగాని కి, గ్రామీణస్థాయిలో సహకార బ్యాంకు లు అందుబాటులో ఉండి వారికి సహా య సహకారాలు అందిస్తున్నాయని, ఈ విషయాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు, సీఇవోకు శాలవుకప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీబీఈఏ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. జనార్ధన్‌రావు, జనరల్ సెక్రెటరీ కె. బాలాజీ ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బోసుబాబు, డిస్ట్రిక్ట్ బ్యాంకర్ల కో-ఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి వి. కిషన్‌రావు, డీసీసీబీ సీఇవో అనుపమ, డీసీసీబీ జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్, డీజీఎంలు శ్రీధర్‌రెడ్డి, లింబాద్రి, సుమమాల, గజానంద్, ఏజీఎంలు గోవింద్, ఎస్. గంగారాం,ఎ.బలవంత్‌రావు పాల్గొన్నారు. -
వీరుడా.. వందనం!
శత్రుసైన్యం దాడిలో ప్రాణాలర్పించిన వీరజవాన్ యాదయ్యకు కొండారెడ్డిపల్లి ఘననివాళి అర్పించింది. సరిహద్దులో సైనికుడా..! ఓ వీరజవాన్, ఓ పోరు జవాన్!! అంటూ జేజేలు పలికింది. శత్రువులకు ఎదురొడ్డి నిలిచిన ఓ వీరుడా..ఓ అమరుడా, నీకు సలామ్..అంటూ వందనం చేసింది. దేశకోసం బిడ్డను కోల్పోయిన ఆ పురిటిగడ్డ తన జ్ఞాపకాలను పదిలపర్చుకుంది. గుండెనిండా ధైర్యం.. ధీరత్వం..నీవు చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. వంగూరు: గతేడాది జూన్24న జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ ప్రాంతంలో పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నేలరాలిన వీరజవాన్ మల్లెపాకుల యాదయ్య వర్ధంతి సభ మంగళవారం ఆయన స్వగ్రామం మండలంలోని కొండారెడ్డిపల్లిలో జరిగింది. స్థానిక ఏర్పాటుచేసిన యాదయ్య విగ్రహాన్ని సైనిక సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షులు కెప్టెన్ దివాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎ.రేవంత్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజ్, చల్లా వంశీచంద్‌రెడ్డి ఘననివాళి అర్పించారు. వీరమరణం పొందిన యాదయ్యను ఈనేల ఎప్పటికీ మరిచిపోదని జ్ఞాపకాలను గుర్తుచేశారు. ఓ సైనికుడి త్యాగం వల్ల ఎక్కడో మారుమూల ఉన్న కొండారెడ్డిపల్లి పేరు దేశవ్యాప్తంగా తెలిసిందని, ఆయన వీరమరణం యువతలో స్ఫూర్తి నింపడంతోపాటు ఏ నోట విన్నా యాదయ్య పేరే వినిపించిందన్నారు. ఆ పేరు చిరస్థాయిగా ఉండే విధంగా గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసి పార్కును నిర్మించనున్నట్లు చెప్పారు. యాదయ్య భార్య సుమతమ్మకు ఉద్యోగం, పిల్లలు సుష్మిత, షష్మితల చదువులతోపాటు ఇంటిస్థలం, ఇల్లు, ఐదెకరాల వ్యవసాయభూమి ఇప్పించే బాధ్యత తమదేనని ఎమ్మెల్యేలు ముగ్గురు ముక్తకంఠంతో చెప్పారు. భారతీయులు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారంటే దేశసరిహద్దులో కాపలా ఉన్న సైనికుల గొప్పతనమేనని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిది కొండారెడ్డిపల్లి కావడం గర్వకారణమని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన పేర పదోతరగతిలో పాఠ్యాంశం చేర్చడం హర్షణీయమన్నారు. యాదయ్య కుటుంబానికి ఎల్లవేళలా తాము అందుబాటులో ఉంటామని, వారికి ఏకష్టం వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. వర్ధంతి సభలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే రాములు, జిల్లా సైనికసంక్షేమ అధికారి బాలాజీ, కాంగ్రెస్ నాయకులు కేవీఎన్‌రెడ్డి, గ్రామసర్పంచ్ పార్వతమ్మ పర్వతాలు, ఎంపీటీసీ సభ్యురాలు నీరజాకృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ వేమారెడ్డి, తహశీల్దార్ సైదులు, ఎంపీడీఓ విశ్వనాథం, కల్వకుర్తి సీఐ భిక్షపతిరావులతోపాటు వీరసైనికుడు యాదయ్య తల్లిదండ్రులు నాగమ్మ, అర్జునయ్య, భార్య సుమతమ్మలతోపాటు కుటుంబసభ్యులు, వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆకట్టుకున్న యాదయ్య పాటలు వీరజవాన్ యాదయ్య సైన్యంలో చేరడం, వీరమరణం పొందడంపై ఆయన సహచరుడు సైదులు కొన్ని పాటలు రాశాడు. అతడు ఆలపించిన ‘సరిహద్దులో సైనికుడా.. ఓ పోరుజవాన్’ అనే పాట పలువురిని ఉద్వేగానికి గురిచేసింది. స్పందించిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి జవాన్ యాదయ్యపై రాసిన ఆరుపాటలను సీడీలుగా మార్చి యువతకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీఇచ్చారు. -
మైనర్ బాలికపై వేధింపులు: నిందితులు అరెస్ట్
గుంటురు జిల్లా బాపట్లలోని పటేల్ నగర్లో మైనర్ బాలికపై ప్రేమ వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. స్థానిక పటేల్ నగర్‌లోని మైనర్ బాలికను తమను ప్రేమించాలంటూ గత కొద్దికాలంగా గోపికృష్ణ, కొండరెడ్డిలు వేధిస్తున్నారు. ఆ క్రమంలో తమను ప్రేమించకుంటే ముఖంపై యాసిడ్ పోస్తామని వారిరువురు గురువారం మైనర్ బాలికను బెదిరించారు. దాంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు వెల్లడించింది. దీంతో వారు బాపట్ల పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ మైనర్ బాలిక తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు గోపికృష్ణ, కొండారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిపై నిర్భయ కేసు నమోదు చేశారు.