వీరుడా.. వందనం!
శత్రుసైన్యం దాడిలో ప్రాణాలర్పించిన వీరజవాన్ యాదయ్యకు కొండారెడ్డిపల్లి ఘననివాళి అర్పించింది. సరిహద్దులో సైనికుడా..! ఓ వీరజవాన్, ఓ పోరు జవాన్!! అంటూ జేజేలు పలికింది. శత్రువులకు ఎదురొడ్డి నిలిచిన ఓ వీరుడా..ఓ అమరుడా, నీకు సలామ్..అంటూ వందనం చేసింది. దేశకోసం బిడ్డను కోల్పోయిన ఆ పురిటిగడ్డ తన జ్ఞాపకాలను పదిలపర్చుకుంది. గుండెనిండా ధైర్యం.. ధీరత్వం..నీవు చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.
వంగూరు: గతేడాది జూన్24న జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ ప్రాంతంలో పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నేలరాలిన వీరజవాన్ మల్లెపాకుల యాదయ్య వర్ధంతి సభ మంగళవారం ఆయన స్వగ్రామం మండలంలోని కొండారెడ్డిపల్లిలో జరిగింది. స్థానిక ఏర్పాటుచేసిన యాదయ్య విగ్రహాన్ని సైనిక సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షులు కెప్టెన్ దివాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎ.రేవంత్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజ్, చల్లా వంశీచంద్‌రెడ్డి ఘననివాళి అర్పించారు. వీరమరణం పొందిన యాదయ్యను ఈనేల ఎప్పటికీ మరిచిపోదని జ్ఞాపకాలను గుర్తుచేశారు.
ఓ సైనికుడి త్యాగం వల్ల ఎక్కడో మారుమూల ఉన్న కొండారెడ్డిపల్లి పేరు దేశవ్యాప్తంగా తెలిసిందని, ఆయన వీరమరణం యువతలో స్ఫూర్తి నింపడంతోపాటు ఏ నోట విన్నా యాదయ్య పేరే వినిపించిందన్నారు. ఆ పేరు చిరస్థాయిగా ఉండే విధంగా గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసి పార్కును నిర్మించనున్నట్లు చెప్పారు. యాదయ్య భార్య సుమతమ్మకు ఉద్యోగం, పిల్లలు సుష్మిత, షష్మితల చదువులతోపాటు ఇంటిస్థలం, ఇల్లు, ఐదెకరాల వ్యవసాయభూమి ఇప్పించే బాధ్యత తమదేనని ఎమ్మెల్యేలు ముగ్గురు ముక్తకంఠంతో చెప్పారు. భారతీయులు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారంటే దేశసరిహద్దులో కాపలా ఉన్న సైనికుల గొప్పతనమేనని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిది కొండారెడ్డిపల్లి కావడం గర్వకారణమని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన పేర పదోతరగతిలో పాఠ్యాంశం చేర్చడం హర్షణీయమన్నారు. యాదయ్య కుటుంబానికి ఎల్లవేళలా తాము అందుబాటులో ఉంటామని, వారికి ఏకష్టం వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు.
వర్ధంతి సభలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే రాములు, జిల్లా సైనికసంక్షేమ అధికారి బాలాజీ, కాంగ్రెస్ నాయకులు కేవీఎన్‌రెడ్డి, గ్రామసర్పంచ్ పార్వతమ్మ పర్వతాలు, ఎంపీటీసీ సభ్యురాలు నీరజాకృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ వేమారెడ్డి, తహశీల్దార్ సైదులు, ఎంపీడీఓ విశ్వనాథం, కల్వకుర్తి సీఐ భిక్షపతిరావులతోపాటు వీరసైనికుడు యాదయ్య తల్లిదండ్రులు నాగమ్మ, అర్జునయ్య, భార్య సుమతమ్మలతోపాటు కుటుంబసభ్యులు, వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న యాదయ్య పాటలు
వీరజవాన్ యాదయ్య సైన్యంలో చేరడం, వీరమరణం పొందడంపై ఆయన సహచరుడు సైదులు కొన్ని పాటలు రాశాడు. అతడు ఆలపించిన ‘సరిహద్దులో సైనికుడా.. ఓ పోరుజవాన్’ అనే పాట పలువురిని ఉద్వేగానికి గురిచేసింది. స్పందించిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి జవాన్ యాదయ్యపై రాసిన ఆరుపాటలను సీడీలుగా మార్చి యువతకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీఇచ్చారు.