‘వానలో కలిసిన చీకటి ఆకాశం నుంచి నల్లటి విషంలా కారుతోంది’ అని మొదలవుతుంది తిలక్ ‘దేవుణ్ణి చూసిన వాడు’ కథ. ఆ రాత్రి వానలో ఉలిక్కిపడి లేచిన గవరయ్యకు పెరటి వసారాలో ఏదో మూలుగు. ఏమిటది? లాంతరు తీసుకుని బయటకి వచ్చాడు. హోరుగాలి... భీకర వర్షం... మూలుగుతూ పడి ఉన్న ప్రాణి. లాంతరు ఎత్తి చూసి దిమ్మెరపోయాడు. భార్య. తనను వదిలిపెట్టి వెళ్లిన భార్య. ‘గవరయ్య భార్య లేచిపోయిందట’ అని ఊరంతా గేలి చేయడానికి కారణమైన స్త్రీ. మోసపోయి, నిండు గర్భంతో, నొప్పులు పడుతూ, మొహం చెల్లక వసారాలో పడి ఉంది.
దూరంగా మెరుపు మెరిసింది. చెవులు చిల్లులుపడేలా పిడుగు. కాన్పు జరిగిపోయింది. కేర్‌మని– చేతుల్లోకి తీసుకోగానే సముదాయింపు పొందిన ఆ పసికూన గవరయ్యతో బంధమేసింది. క్షణం ఆలోచించలేదు అతడు. ఆమెను, ఆమె కన్న తనది కాని బిడ్డను లోపలికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఊరిపెద్దలు ‘లేచిపోయిందాన్ని ఏలుకుంటావా’ అని వస్తే గవరయ్య ఏం చేశాడు? కత్తి పట్టుకు వచ్చి ‘అడ్డు పడినవాళ్లను అడ్డంగా నరుకుతాను’ అన్నాడు. అతడు మనిషి. దేవుడు.
మానవత్వంలో దేవుడిని చూసినవాడు.
మధురాంతకం రాజారాం ‘కొండారెడ్డి కూతురు’ అనే కథ రాశారు. ఫ్యాక్షనిస్టు కొండారెడ్డి కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. పారిపోయి బతుకుతోంది. చాన్నాళ్ల తర్వాత ఊరి మనుషులు చూడటానికి వచ్చారు. తన మనుషులు. తన తండ్రి దగ్గర పని చేసే మనుషులు.
కొండారెడ్డి కూతురు ఎంతో సంతోషపడింది. మర్యాదలు చేసింది. వారి చేసంచుల్లో చాటుగా ఉన్న ఆయుధాలు చూసి అంతలోనే నిశ్చేష్టురాలైంది. తనను, భర్తను చంపుతారన్నమాట. తండ్రి పంపించాడన్న మాట. కాని ఇంటికి వచ్చిన అతిథులను అవమానించవచ్చా? వారి కోసం ఏమిటేమిటో వండింది. కొసరి కొసరి వడ్డించింది. ఊరి ముచ్చట్లు అడిగి చెప్పించుకుంది. ఆ రాత్రి తనకు ఆఖరు రాత్రి.
హాలులో కుర్చీ వేసుకుని భర్త గదికి కాపలా కూర్చుంది. వాళ్లు వస్తారు. తనని చంపుతారు. కొండారెడ్డికి పుట్టినందుకు తాను చస్తుంది. కాని భర్తను చంపడానికి వీల్లేదంటుంది. వాళ్లు వచ్చారు. నీడల్లా నిలబడ్డారు. చంపుతారనుకుంటే కాళ్ల మీద పడ్డారు. ‘అమ్మా మేమెందుకొచ్చామో తెలిసీ అన్నం పెట్టావు. చెడ్డ పనులు చేసే రోజు మీ అమ్మ ముఖం చూడకుండా తప్పుకునేవాళ్లం. చూస్తే చేయలేమని. ఇవాళ నీ ముఖం చూస్తూ నిన్నెలా చంపుతా మమ్మా’... ఏడుస్తూ కాళ్లు కడుగుతున్నారు. ఆమె మనిషే. దేవత కాకపోవచ్చు. కాని మానవీయత ఉన్న మనిషి వదనంలో దైవత్వం ఉంటుంది.
‘మనందరం దేవుళ్లమే’ అంటాడు ‘సత్యమే శివం’లో కమలహాసన్. ‘సృష్టీ విలయం రెండూ మన చేతుల్లోనే’ అంటాడు ‘సెపియెన్స్’ పుస్తక రచయిత హరారి. ‘నేటి మనిషి రెండు విషయాల వల్ల మనిషి గుణాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. ఒకటి ప్రకృతి విధ్వంసం– రెండు సాంకేతికతను పెంచి తాను మరుగుజ్జుగా మారడం’ అంటాడు హరారి.
ప్రకృతికి ఎడంగా జరిగే కొద్ది, పరిసరాల్లో సిమెంటు పెరిగే కొద్ది, నాలుగు గోడల నుంచి నాలుగు గోడలకు అతని దినచర్య మారేకొద్ది సహజమైన మానవ స్పందనలు మొద్దుబారక తప్పదు. పెట్ డాగ్స్ సమక్షంలో అతడు పొందగలుగుతున్నది కొద్దిగా ఓదార్పే. పల్లెలో ప్రకృతిలో ఉన్నప్పుడు గొడ్డూ గోదా, మేకా ఉడుతా, కాకీ పిచుకా అన్నీ అతని స్పందనలను సజీవంగా ఉంచేవి. ‘ఎలా ఉన్నావు?’ నుంచి ‘ఎంత సంపాదిస్తున్నావు?’ను దాటి ‘ఏం కొన్నావు?’కు వచ్చేసరికి అతనిలో మొదలైంది పతనం.
‘లాభం’ అనే మాట కనిపించని దారాలతో ఆడించే మాయావి. మనిషిని ఎంత ఓడిస్తే లాభం అంత గెలుస్తుంది. అంతేకాదు ‘మనిషి మీద నమ్మకం పోయింది’ అనే మాటను పుట్టించడం లాభాపేక్ష గల పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రాథమిక అవసరం. మనిషి మీద నమ్మకం పోయేలా... వాణ్ణి అది వస్తుగత, స్వార్థపరమైన, సంపద లాలసలో కూరుకుపోయేలా చేస్తుంది. లాభపడాలంటే, సుఖపడాలంటే చేయవలసింది మానవత్వాన్ని త్యాగం చేయడమే.
అది పోగానే వాడు కుటుంబంతో, స్నేహితులతో, సమాజంతో, ప్రకృతితో, మానవాళితో ఎంత దారుణంగా అయినా వ్యవహరించవచ్చు. ‘మనిషి మీద నమ్మకం పోయేలా’ చేస్తే పెట్టుబడిదారీ వ్యవస్థకు మరో లాభం ఏమిటంటే... ఏ మనిషీ మరో మనిషితో కలవడు. సమూహంగా మారడు. తిరుగుబాటు చేయడు. నలుగురు బాగుపడి కోట్ల మంది మలమలమాడే వ్యవస్థకు ఢోకా రానివ్వడు. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థ ‘యుద్ధం’ అనే ముద్దుబిడ్డను పదేపదే కంటూ ఉంటుంది. యుద్ధం మానవత్వానికి అతి పెద్ద విరుగుడు.
అయితే మనిషి ఇలాగే ఉంటాడా? ఏ రచయితో అన్నట్టు ‘రగిలిస్తే రాజుకునే మహాఅగ్ని మానవత్వం’. కోల్‌కతా నిరసనల్లో ఇవాళ అదే చూస్తున్నాం. యుగాలుగా... చితి పెట్టిన ప్రతిసారీ బూడిద నుంచి మానవత్వం తిరిగి జనిస్తూనే ఉంది. కాకుంటే అందుకు కావల్సిన రెక్కలు సాహిత్యమే ఇస్తుందని గ్రహించాలి. తల్లిదండ్రులూ..! మీ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు తప్పకుండా చేయండి.
కాని నాలుగు మంచి పుస్తకాలు చదివించి మొదట మనిషిని చేయండి. ఏ విటమిన్ లేమికి ఏం తినాలి సరే... మానవత్వ లేమి ఉందేమో కనిపెట్టి విరుగుడుగా ఒక పుస్తకం చేతిలో పెట్టండి. ఎక్కడ పుస్తకాలు ఉంటాయో అక్కడ మానవత్వపు ఆవరణం ఏర్పడుతుంది. అదే దేవుడు తిరుగాడే తావు. ప్రపంచ మానవత్వ దినోత్సవ శుభాకాంక్షలు.
దేవుణ్ణి చూసిన వాడు
Published Mon, Aug 19 2024 12:09 AM | Last Updated on Mon, Aug 19 2024 12:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment