గుంటురు జిల్లా బాపట్లలోని పటేల్ నగర్లో మైనర్ బాలికపై ప్రేమ వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. స్థానిక పటేల్ నగర్లోని మైనర్ బాలికను తమను ప్రేమించాలంటూ గత కొద్దికాలంగా గోపికృష్ణ, కొండరెడ్డిలు వేధిస్తున్నారు. ఆ క్రమంలో తమను ప్రేమించకుంటే ముఖంపై యాసిడ్ పోస్తామని వారిరువురు గురువారం మైనర్ బాలికను బెదిరించారు.
దాంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు వెల్లడించింది. దీంతో వారు బాపట్ల పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ మైనర్ బాలిక తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు గోపికృష్ణ, కొండారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిపై నిర్భయ కేసు నమోదు చేశారు.