యువతిని వేధిస్తున్న యువకులు అరెస్ట్
ఆదిలాబాద్: ఎస్ఎంఎస్లతో యువతిని వేధిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. పోలీసుల కథనం... ఓ యువతికి గత కొంత కాలంగా ఆమె సెల్ ఫోన్కు అసభ్యకర ఎస్ఎంఎస్లు వెల్లువెత్తాయి. ఆ ఎస్ఎంఎస్లు ఎవరు పంపుతున్నారో అర్థంకాక ఆమె తీవ్ర మానసిక క్షోభ అనుభవించింది. అదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అందులోభాగంగా జిల్లాలోని లక్ష్మణ్చాందా మండలం వడ్యాల గ్రామం నుంచి ఆ అసభ్యకర ఎస్ఎంఎస్లు వస్తున్నట్లు గుర్తించారు. దాంతో ఆ గ్రామంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో వారు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.