నిర్భయ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రీనాథ్ (పాత ఫొటో)
న్యూఢిలీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనను అంత తేలికగా మర్చిపోలేం. నిర్భయ మరణ వాంగ్ములాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ ఘటనను నేరపూరిత కుట్రగా ధ్రువీకరించి.. దోషులకు గతేడాది ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్భయ కేసులో తీర్పు వచ్చింది కానీ ఇంకా న్యాయం మాత్రం జరగలేదంటూ ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకి తాము ఓటు వేయబోవడం లేదని వెల్లడించారు.
ఈ సందర్భంగా 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాన ప్రచారకర్తగా ఉన్న ప్రధాని మోదీ.. ‘మీరు ఓటు వేయడానికి వెళ్లేటపుడు నిర్భయను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని’ పిలుపునిచ్చిన విషయాన్ని నిర్భయ తల్లి ఆశాదేవి గుర్తు చేస్తూ.. ‘వచ్చే ఎన్నికల్లో నేను ఎవరికీ ఓటు వేయను. నాకు ఇంకా ఎవరిపై నమ్మకం, ఆశలు లేవు’ అంటూ వ్యాఖ్యానించారు.
ఆ తీర్పు కాగితాలకే పరిమితం..
‘నా కూతురి చావుకి కారకులైన మృగాళ్లకు సంబంధించిన తీర్పు కాగితాలకే పరిమితమైంది. అంతేకాదు గత ఆరేళ్లుగా నిర్భయ నిధులను సీసీటీవీల కొనుగోలు కోసం వెచ్చించాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం ఆ నిధులను ఏ విధంగా ఉపయోగిస్తుందో కూడా మేము ప్రశ్నిస్తూనే’ ఉన్నామని ఆశాదేవి పేర్కొన్నారు. ‘ఎంతో మంది తల్లిదండ్రులు, అమ్మాయిలు చట్ట పరమైన సలహాల కోసం తనను ఆశ్రయిస్తున్నారని.. ఆ సమయంలో ఆరేళ్లుగా తన కూతురు కోసం తానెలా పోరాడానో వారికి చెప్పగలుగుతున్నానే తప్ప.. కానీ పూర్తి న్యాయం జరిగినట్లు నాకు అనిపించడం లేదని’ ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టాలెన్ని వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు..
‘సరిగ్గా ఏడాది క్రితం అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును మేము స్వాగతించాం. కానీ శిక్ష మాత్రం అమలు కావడం లేదు. న్యాయం జరగడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో.. మా కూతురుని కోల్పోయి ఆరేళ్లు గడిచింది. ఇప్పటికీ ఆమె అత్యాచారానికి గురైందని మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సి వస్తుంది’ అంటూ నిర్భయ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాలు ఎన్ని తెచ్చినా కథువా, ఉన్నావ్ వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని నిర్భయ తండ్రి బద్రీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా 2017లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా నిర్భయ కేసులో ఇద్దరు దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా తరపు లాయర్లు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘ఒక వ్యక్తి మరణించాలా లేదా జీవించాలా అనే అంశం కోర్టు నిర్దారించలేదని.. శిక్ష వల్ల నేరస్థులను చంపగలమే కానీ నేరాన్ని కాదని’ వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌ను రిజర్వులో పెట్టింది.
2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు బస్సులో నలుగురితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment