విశ్లేషణ: అనుద్దేశపూర్వకంగానే అయినా నిర్భయ కేసు తీర్పు భావి నేరగాళ్లకు పంపే సందేశం భయానకమైనది. సాక్ష్యాలే లేకుండా సాక్షులను చంపేయాలని సూచిస్తుంది! నేడు రేపిస్టుకు విధించే ఉరిశిక్ష రేపటి రేప్ బాధితురాలికి మరణ శిక్షగా మారదా?
నిర్భయ, జాగృతి, అమానత్, దామిని అంటూ ఆమెకు నివాళులర్పించాం. ఆమెపై ‘ఆ ఆరుగురు’ జరిపిన అమానుష నేరాలు- హత్య, మానభంగం, సాక్ష్యాల ధ్వంసం, కుట్ర, కిడ్నాప్, మరెన్నో. బందిపోటు దొంగతనం చేస్తూ హత్య అన్న ఆరోపణ ఒక్కటీ రుజువు కాలేదని ఢిల్లీ ప్రత్యేక కోర్టు అదనపు జడ్జి యోగేశ్ ఖన్నా నిర్భయ కేసు తీర్పులో పేర్కొన్నారు. ఆమె కేవలం అత్యాచారానికి గురై హత్యకు గురికావడం మాత్రమే జరగలేదు. ఆమెను, ఆమె మిత్రుడ్ని బస్సులో ఎక్కించుకుని, దారితప్పించి, అపహరిం చి, దోచుకున్నారు, తీవ్రంగా గాయపరచారు. ఆమెపై అతి క్రూరమైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నెత్తుటి ముద్దయి, కొన ఊపిరితో ఉన్న ఆమె రెండు వారాలకు సింగపూర్ ఆస్పత్రిలో మరణించిం ది. అరుదైన నేరాల్లోకెల్లా అరుదైన నేరానికి మరణశిక్ష విధించవచ్చని మన న్యాయవ్యవస్థ సిద్ధాంతీకరించింది. హత్యా నేరానికి మరణశిక్ష విధిం చవచ్చని భారత శిక్షాస్మృతి చెబుతోంది. ఆ అమానుష ఘటన తదుపరి చట్టంలో వచ్చిన మార్పులతో అత్యాచారానికి యావజ్జీవ కారాగార శిక్షకు అవకాశం ఏర్పడింది.
మురికివాడల్లో పుట్టిన నేరం
నిర్భయ నేరస్తులు ఆరుగురూ దక్షిణ ఢిల్లీలో కూలినాలి చేసుకునే ఒక మురికివాడ వాసులే. అక్షయకుమార్ సింగ్ బస్సు క్లీనర్, వినయ్‌శర్మ వ్యాయామశాల శిక్షకుడు. పవన్‌గుప్త పండ్ల వ్యాపారి. ముఖేష్‌సింగ్ నిరుద్యోగి. వారు నలుగురూ నిర్భయపైన 11 నేరాలకు పాల్పడ్డట్టు తేలింది. బస్సు డ్రైవర్ రాంసింగ్ (34) మార్చి 11న జైల్లో ఉరి వేసుకుని చనిపోయాడు. కనుక అతనిపై విచారణ రద్దయింది. మరొక నేరస్తుడు 18 ఏళ్ల లోపు మైనర్ అని తేలింది. కాబట్టి అతడ్ని మూడేళ్లపాటూ జూవనైల్ హోంలో ఉంచాలని కోర్టు తీర్పు చెప్పింది. రాంసింగ్ తమ్ముడు ముఖేశ్ (29) రాజస్థాన్ నుంచి ఉద్యోగ ప్రయత్నంలో ఢిల్లీకి వచ్చాడు.
అన్నతోనే కలిసి ఉండేవాడు. తాను కష్టపడే మనిషినని, సాదాసీదాగా బతుకుతానని ముఖేష్ తన గురించి చెప్పుకున్నాడు. మహిళలంటే తనకు గౌరవమని, తనపై ఆరోపించిన నేరాలేవీ తాను చేయలేదని న్యాయస్థానానికి విన్నవిం చాడు. వినయ్‌శర్మ (20), రాంసింగ్ ఇంటి పక్కనే ఉంటేవాడు. నేరస్తులలో అతడొక్కడే హైస్కూల్ చదువు పూర్తి చే సినవాడు. ఇక పవన్ గుప్త (19), భవన నిర్మాణ పనులు, విందుల్లో వడ్డనలు చేస్తూ బతికేవాడు. రాంసింగ్‌కు స్నేహితుడు. ఇటుకల బట్టీలో, సారా దుకాణంలో పనిచేసే అక్షయ్(28)కు పెళ్లయింది, రెండేళ్ల కొడుకున్నాడు. మరొకడు 17 ఏళ్ల మైనరు కాబట్టి వాడి పేరు చెప్పడానికి చట్టాలు ఒప్పుకోవు. చట్టం ప్రకారం వాడు చట్టంతో పోరాడే కుర్రాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడు పదకొండో ఏటనే ఇంటి నుంచి పారిపోయాడు. ఢిల్లీలో వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదని తల్లి తెలిపింది. రాంసింగ్ బస్సు క్లీనర్‌గా ఉంటూ, ఆ బస్సులోనే నిద్రపోయేవాడు.
అమెరికా లాంటి దేశాల్లో ఒక్కొక్క నేరానికి విడివిడిగా దశాబ్దాల కారాగార శిక్షలను విధిస్తారు. అంటే ఒక్కోసారి నేరస్తునికి రెండు, మూడు వందల సంవత్సరాల శిక్ష పడుతుంది. కాని మన దేశంలో ఎన్ని నేరాలకు శిక్షలుపడ్డా అన్నీ ఏక కాలంలోనే అమలవుతాయి. అతి పెద్ద శిక్ష యావజ్జీవ కారాగారం లేదా మరణ శిక్ష. ఈ నేరం జరిగిన తీరు చేస్తే హంతకులలో మానవత్వం మచ్చుకి కూడా కానరాదు. మరణశిక్ష వద్దనే కరుణామయులు సైతం ఈ నేరగాళ్లను ఉరి తీయాలని భావించేటంతటి దారుణ నేరం ఇది, నిజమే. కానీ లోతుగా తరచి చూస్తే వారిని చంపడమే దయతలచడం అవుతుందేమోనని అనిపిస్తోంది. అంతకంటే బతికించి వారు చేసిన నేరం క్షణక్షణం గుర్తుకు వచ్చి అనుక్షణం నరకయాతన అనుభవించేట్టు చేయడమే వారికి తగిన శిక్ష కావచ్చని తోస్తోంది. నలుగురు నిందితులకు ఉరిశిక్ష పడ్డా, అది హైకోర్టు, సుప్రీం కోర్టులను దాటి, రాష్ట్రపతి క్షమాభిక్షను దాటి, ఉరి కంబానికి చేరడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. ఈలోగా మరణశిక్షలను విధించడంలోని ఔచిత్యం ఏమిటనే అంశంపై చర్చ జరగాల్సి ఉంది. ఈ నలుగురిని ఉరి తీస్తే న్యాయం మీద నమ్మకం కలుగుతుందని, భయపడి అత్యాచారాలకు పాల్పడటం తగ్గిపోతుందని వాదిస్తున్నారు.
ఇది ప్రజాగ్రహానికి, ప్రజాభీష్టానికి అనుగుణమైన తీర్పు అని ప్రశంసిస్తున్నారు. వారిని ఉరి తీసినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయా? ధనంజయ్ చటర్జీ లాంటి వాళ్లు ఎందరినో ఉరి తీశారు. అయినా అత్యాచారాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయెందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే మరో నలుగురిని ఉరి కంబం ఎక్కించి న్యాయం జరిగిందని చేతులు దులుపుకుందామా? ఒక రుజువైన నేరానికి శిక్షలను విధించేటప్పుడు ఆ ప్రక్రియపై భావోద్వేగాలు ప్రభావం చూపకూడదు. ఇచ్చే తీర్పు రాబోయే ఎన్నికలపై కలిగించే ప్రభావం గురించిన ఆలోచన అసలే ఉండకూడదు. నేరస్తులపై పనిచేసిన పరిసరాల, పరిస్థితుల ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని న్యాయశాస్త్రాలు బోధిస్తున్నాయి. నిర్భయ కేసు అందుకు మినహాయింపు కాదు.
దారుణమైన నిర్భయ కేసులోని నేరస్తుల మురికివాడలు రాజధాని నగరం చూట్టూ వెలస్తున్న నేరస్తులను తయారుచేసే కార్ఖానాలు. నిర్భయ ఘటన తరువాత పెల్లుబికిన ప్రజాచైతన్యం మొత్తంగా దేశాన్నే ఆలోచింపజేసింది, చట్టాన్ని మార్చింది. తొమ్మిది నెలల్లోనే కేసు శిక్ష విధించే వరకు చేరింది. అయినా అవే నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అదే అమానుష క్రౌర్యం కాటేస్తూనే ఉంది. నిర్భయ కేసులోలాగే అలాంటి ప్రతి నేరం విషయంలోనూ కేసు రుజువై, నేరస్తులు చట్టానికి దొరికేలా పరిశోధనను పటిష్టం చేయాలనే అంశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదెందుకు? నేరస్తులను ఉరి తీయాలని పోరాడటం కన్నా అసలా నేరాన్నే ఉరి తీయాలనీ, ఆ నేర ప్రవృత్తినే పాతిపెట్టాలని ఎందుకు కోరుకోవడం లేదు, ఎందుకు కృషి చేయడం లేదు? అసలు నేరాన్ని నిరోధించడం ఎలా? ఇలాంటి నేరాలు జరిగినప్పుడు సత్వరమే నేరాన్ని రుజువుచేసి, నేరస్తులను శిక్షించడం ఎలా? అని ఆలోచించే వారు తక్కువైపోవడం శోచనీయం.
మరో కోణాన్నీ చూడాలి...
నిర్భయ కేసులో నలుగురు నేరస్తులకు ఉరిశిక్ష పడటానికి మూల కారణం బాధితురాలి సాక్ష్యమే. నిర్భయ కేసులో విధించిన మరణ శిక్షలు నిజానికి అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినందుకు విధించినవే. కానీ సామాన్యులకు మాత్రం రేప్ చేస్తే ఉరితీస్తారనే అర్థం అవుతుంది. ప్రత్యేకించి నగరాల మురికివాడల్లో తయారవుతున్న కొత్త రేపిస్టులకు అలాగే అర్థం అవుతుంది. కాబట్టి అనుద్దేశపూర్వకంగానే అయినా నిర్భయ కేసు తీర్పు భావి నేరగాళ్లకు పంపే సందేశం చాలా భయానకమైనది. అది భావి నేరాలను ఆపేది కాదు. సాక్ష్యాలే లేకుండా సాక్షులను చంపేయాలని సూచిస్తుంది! నిర్భయ కేసులో ప్రధానమైన సాక్షి బాధితురాలే. ఆమెను, ఆమె మిత్రుడిని నేరస్తులు అందుకే బస్సుతో తొక్కేయాలని ప్రయత్నించారీ ఘటనలో.
వారి ఉద్దేశాలకు అతీతంగా వారు బతికారు. నిర్భయ మరణ వాఙ్మూలంతోపాటూ, ఆమె మిత్రుడి ప్రత్యక్ష సాక్ష్యం కూడా ఉంది. కాబట్టే నేరం రుజువైంది. నేరగాళ్ల హత్యా ప్రయత్నం ఫలించి ఉంటే, ఈ నేరం క్రూర స్వభావం పూర్తిగా బయటకు వచ్చేది కాదేమో. నేరస్తులను ఈ విధంగా ఉరితీస్తూ పోతే ఇక ముందు సాక్షులు బతుకుతారా? అసలు సాక్షి అయిన బాధితురాలు బతుకుతుందా? రోగికి చికిత్స చేసే డాక్టర్ రోగిని చంపకుండా రోగాన్ని తొలగించినట్టుగా... న్యాయవ్యవస్థ నేరస్తులను గాక నేరాలను తొలగించాలనేది న్యాయసూత్రం. అది విస్మరించి నేడు ఉరిశిక్షలు విధిస్తూ పోతే చివరికి అవి సాక్షులకు విధించే మరణ శిక్షలుగా మారిపోవా? అత్యాచార ఘటనల్లో అసువులు కోల్పేయే అతివల సంఖ్య విపరీతంగా పెరిగిపోదా? నేడు రేపిస్టుకు విధించే ఉరిశిక్ష వాస్తవంలో రేపటి బాధితురాలికి మరణ శిక్షగా మారదా? రేపిస్టును కోర్టు ఉరి తీస్తే, మరణ వాంగ్మూలమైనా ఇవ్వకముందే బాధితురాలికి రేపిస్టు మరణశిక్ష విధిస్తాడు.
మరణశిక్ష ఎవరికి?
Published Sat, Sep 21 2013 2:20 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM
Advertisement
Advertisement