ఆడపిల్లలపై సమాజంలో నెలకొన్న వివక్షపై దేశం నలుమూలలా లోతైన చర్చకు కారణమైన నిర్భయ ఉదంతం జరిగి దాదాపు ఏడాది కావస్తోంది.
సంపాదకీయం: ఆడపిల్లలపై సమాజంలో నెలకొన్న వివక్షపై దేశం నలుమూలలా లోతైన చర్చకు కారణమైన నిర్భయ ఉదంతం జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. న్యూఢిల్లీ రాజవీధుల్లో నడుస్తున్న బస్సులో ఒక యువతిపై అమానుషంగా నలుగురు దుండగులు సాగించిన హింసాకాండ, సామూహిక అత్యాచారం అందరినీ కదిలించాయి. ఆగ్రహోదగ్రులను చేశాయి. ఇకపై ఇలాంటివి జరగనీయరాదన్న పట్టుదలను పెంచాయి. అందుకు ఏంచేయాలో రోడ్లపైకి వచ్చిన ప్రజానీకమే ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేసింది. ఆడపిల్లల విషయంలో కనబడుతున్న ఈ ఆదుర్దా, ఈ ఆందోళన ఒక మంచి మార్పునకు దారితీయగలదని అందరూ అనుకున్నారు.
మహిళలను సాటి పౌరులుగా చూసే ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడటానికి ఇది దోహదపడుతుందని భావించారు. ఆ ఆందోళనలపై అప్పట్లో నోరుజారిన కొందరు నేతలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమై చివరకు వారు క్షమాపణలు చెప్పేదాకా కూడా వచ్చింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఇకపై నోరు సంబాళించుకుంటారని అనుకున్నారు. కానీ, పరిస్థితేమీ మారలేదని సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా మంగళవారం చేసిన వ్యాఖ్య తెలియజెబుతోంది. బెట్టింగ్‌ను చట్టబద్ధం చేస్తే నష్టమేమీ లేదని, ఇంచుమించు అదే తరహాలో సాగుతున్న లాటరీ, కేసినోల వంటివాటిని అనుమతిస్తూ బెట్టింగ్‌ను మాత్రమే నిషేధించడం సరికాదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. అక్కడితో ఊరుకుంటే బాగుండేది.
కానీ, ఆయన ఇంకాస్త ముందుకెళ్లి... బెట్టింగ్‌పై నిషేధాన్ని అమలుచేయలేకపోవడం ఎలాంటిదంటే ‘రేప్‌ను నిరోధించలేకపోతే దాన్ని ఆస్వాదించండి’ అని చెప్పడం లాంటిదని ఉదహరించారు. ఇందులో అత్యాచారానికి సంబంధించిన అంశాన్ని లాక్కొచ్చి చెప్పిన మాటలు సహజంగానే అందరికీ అభ్యంతకరంగా తోచాయి. చట్టం ఉన్నా అమలు చేయలేకపోవడమనే స్థితిని గురించి చెప్పడానికి ఇంతకన్నా ఆయనకు వేరే మంచి మాటలేవీ దొరకలేదా అని ఆవేదన వ్యక్తం చేసినవారున్నారు. అత్యాచారానికి సంబంధించి చెప్పిన మాటలతో ఆయనకు ఏకీభావం ఉన్నట్టు కనబడకపోయినా ... మహిళలపై జరిగే అత్యంత హేయమైన నేరాన్ని ఉదాహరణగా ఎందుకు చెప్పాల్సివచ్చిందన్న ప్రశ్న తలెత్తుతుంది. న్యూఢిల్లీ ఘటన తర్వాత జరిగిన ఆందోళనల పర్యవసానంగా మహిళలపై జరిగే అన్ని రకాల నేరాలకూ కాస్తయినా అడ్డుకట్ట పడగలదని ప్రజలంతా భావించారు. కానీ, అది అడియాసే అయింది. ఢిల్లీలోనే గతంతో పోలిస్తే ఆ తరహా నేరాల సంఖ్య పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఎప్పటిలాగే మహిళలపై జరిగే నేరాల్లో శిక్షల శాతం 24 కంటే తక్కువుంది.
దాదాపు 76 శాతం కేసుల్లో ఆరోపణలు రుజువుకాకపోవడంతో ఎప్పటిలాగే దోషులు తప్పించుకుంటున్నారు. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు దగ్గరనుంచి దర్యాప్తుల వరకూ ఎప్పటిలాగే అంతా నత్తనడకే నడుస్తోంది. పరిస్థితులు ఎప్పటిలాగే ఉన్నాయి గనుక మహిళలపై నేరాలు కూడా యథాతథంగానే సాగుతున్నాయి. ఇంకా పెరిగాయి కూడా. మహిళలపై సాగుతున్న నేరాలకు మూలాలు ఎక్కడున్నాయో ఇప్పుడు స్పష్టంగానే తెలుస్తుంది. సమాజాన్ని సరైన దోవలో నడిపించాల్సినవారిలో అందుకు అవసరమైన పరిణతి లేకపోవడం, ఆ తరహా కేసుల విషయంలో వ్యవహరించడానికి అవసరమైన సున్నితత్వం వారిలో లోపించడం ఇందుకు ప్రధాన కారణాలు. సరిగ్గా నిర్భయ ఉదంతంపై దేశమంతా ఆగ్రహోదగ్రమై ఉన్న వేళ ఢిల్లీలోని ఒక హోటల్లో తనపై సుప్రీంకోర్టు జడ్జి ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని యువ మహిళా న్యాయవాది వెల్లడించి అందరినీ దిగ్భ్రాంతిపరిచారు.
రంజిత్ సిన్హా దేశంలోని అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థ సీబీఐకి అధిపతి. పైగా ఆయన ఇలా మాట్లాడింది ‘క్రీడల్లో నైతిక విలువలు-విశ్వసనీయత’ అనే అంశానికి సంబంధించిన సదస్సులో. క్రీడల్లో ఉండాల్సిన నైతిక విలువలగురించి ప్రబోధించే పోలీసు అధికారి అంత సులభంగా అత్యాచారం గురించి ప్రచారంలో ఉన్న మాటల్ని ప్రయోగించడం దిగ్భ్రాంతికరమైన విషయం. అత్యాచారంపై సమాజంలో వేళ్లూనుకున్న పితృస్వామిక భావజాలం ఈ తరహా ఆలోచనకు మూలం. నిర్భయ ఘటనకు ముందూ తర్వాత కూడా చాలాచోట్ల రాజకీయ నాయకులు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు అత్యాచారాల విషయంలో మహిళలపై నిందలేయడానికి తాపత్రయపడటం వెనకున్న ప్రధాన కారణం ఇదే. మహిళలు ధరించే దుస్తులే వారిపై నేరాలకు పురిగొల్పుతున్నాయని ఒకరంటే, ఆ విషయంలో ఇంకొంచెం ముందుకెళ్లి మహిళలకు డ్రెస్ కోడ్ నిర్దేశించినవారు మరొకరు.
ఉన్నత విలువలను, ఉత్తమ సంస్కారాన్ని పెంపొందించాల్సినవారే ఇలావుంటే సాధారణ వ్యక్తులు మహిళల విషయంలో ప్రజాస్వామిక ధోరణితో వ్యవహరిస్తారని ఆశించలేం. చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నా మహిళలను సాటి వ్యక్తిగా గుర్తించి గౌరవించే ధోరణి పెరగకపోవడానికి పురుషుల ఆలోచనా ధోరణిలో ఉన్న వెనకబాటుతనమే కారణమని విశ్లేషకులు చెబుతారు. మహిళలకు అన్నిరంగాల్లోనూ సమానావకాశాలు కల్పించినప్పుడే ఈ వెనకబాటుతనం పోతుందంటారు. అందుకు నార్వే పెద్ద ఉదాహరణ. అక్కడ శతాబ్దం క్రితం మహిళల పరిస్థితి దయనీయంగా ఉండేది. అప్పట్లో వారికి కనీసం ఓటు హక్కు కూడా లేదు. కానీ, వర్తమాన నార్వేలో వారిది గౌరవప్రదమైన స్థానం. పార్లమెంటులో 39.6 శాతం మంది మహిళా ప్రతినిధులుండగా, స్థానిక సంస్థల్లో వారి శాతం 40. ఇందువల్ల వచ్చిన ఫలితాలు కూడా సామాన్యమైనవి కాదు. స్త్రీ, శిశు సంక్షేమ పథకాల్లో ఆ దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. గతంలో నోరుజారినవారిలాగే ఇప్పుడు రంజిత్‌సిన్హా కూడా క్షమాపణ కోరారు. అయితే, సమస్య అది కాదు. ఇలాంటి ఆలోచనాధోరణిని మార్చడానికి ఏంచేయాలన్న విషయంపై అందరూ దృష్టిపెట్టాలి. లోటుపాట్లను గమనించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి.