నిర్భయ, దిశ వంటి అనేక కఠినమైన చట్టాలు వస్తున్నా మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులపై సైతం కామాంధులు కన్నేస్తున్నారు. మైనర్‌లని కూడా చూడకుండా వారి జీవితాలను బుగ్గి చేస్తున్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దిశ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయడంతో బాలికలపై జరుగుతున్న అకృత్యాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే జిల్లాలో ముగ్గురు బాలికలపై
జరిగిన అఘాయిత్యాలు బయటపడటం కలవరపెడుతోంది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :కంటికి రెప్పలా కాపాడాల్సిన అయిన వారే వారి పాలిట యమపాశాలుగా మారుతున్నారు. రక్షించాల్సిన వారే తమ జీవితాలను ఛిద్రం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోదిస్తున్నారు. విషయం బయటపడితే తమతో పాటు కుటుంబ పరువు పోతుందనే భయంతో పంటి బిగువున బాధను భరిస్తూ నరకయాతన పడుతున్నారు. ఒక పక్క కరోనా మహమ్మారి మానవాళి జీవితాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో అంతకంటే భయంకరమైన కొన్ని మానవ మృగాలు అభం శుభం తెలియని మైనర్ బాలికలపై తమ కామ వాంఛను తీర్చుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా జరుగుతున్న అమానవీయ ఘటనలు వింటే ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళన, మనోవేదనలకు గురవ్వాల్సిన దుస్థితి దాపురించింది. తమ జీవితాలను బాగు చేయాల్సిన తల్లిదండ్రులు, అన్న వదినలు, అక్కాచెల్లెళ్లు ఇలా పేగుబంధాలనే నమ్మలేని దుర్భర పరిస్థితి నెలకొంది. జిల్లాలో మైనర్ బాలికలపై జరుగుతున్న వరుస దుర్ఘటనలు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి.
♦ జిల్లాలో గత వారం రోజుల్లో మూడు దుర్ఘటనలు జరిగాయి. వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కావలి సమీపంలోని ముసునూరు ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక వారి వద్ద నుంచి వచ్చి అన్న, వదినల వద్ద ఉంటుంది. అయితే తల్లి తరువాత తల్లిలా భావించే వదినమ్మే ఆ బాలికను డబ్బు కోసం ఓ వ్యభిచార ముఠాకు రూ.27 వేలకు అమ్మివేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికను డబ్బిచ్చి కొన్న వ్యభిచార ముఠా కందుకూరు శివారు ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ బాధ భరించలేక వారి నుంచి తనకు రక్షణ కల్పించమంటూ సదరు బాలిక డయల్ 100 కు ఫోన్ చేయడంతో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు కందుకూరు పోలీసులు బాలికను వ్యభికార కూపం నుంచి రక్షించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలికతో వ్యభిచారం చేయించే ముఠాతో పాటు ఆమె వదినపై కూడా దిశ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటన అయిన వారి అండ కోరుకునే బాలికలకు నిద్ర పట్టకుండా చేస్తుంది.
♦ ఒంగోలు నగరంలో జరిగిన మరో ఘటన అమ్మతనానికే మచ్చ తెచ్చేలా ఉంది. బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళ భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఏడేళ్లుగా అతనికి దూరంగా ఉంటోంది. కొంతకాలం పాటు కుమార్తెలిద్దరూ తల్లి వద్దే ఉన్నారు. అయితే తల్లి ప్రవర్తన నచ్చని చిన్న కుమార్తె అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. పెద్ద కుమార్తె మాత్రం తల్లివద్దనే ఉంటూ 9వ తరగతి చదువుతోంది. అయితే తల్లి బలరాం కాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పరచుకుని సహజీవనం సాగిస్తోంది. అయితే ఆ కామాంధుడి కన్ను తన కూతురులాంటి మైనర్ బాలికపై పడింది. ఈ క్రమంలో మైనర్ బాలికను బెదిరించి రెండుసార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పగా కామాంధుడిని చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన ఆమె గోల చేయవద్దంటూ కూతురికి నచ్చజెప్పి ఇద్దరికి పెళ్లి చేస్తానంటూ చెప్పింది. అయితే తల్లితో సహజీవనం చేసే వ్యక్తితో తనకు పెళ్లి ఏంటని భావించిన బాలిక బేస్తవారిపేటలోని అమ్మమ్మ ఇంటికి చేరుకుని విషయం తెలియజేసింది. దీంతో బాధితులు దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా కామాంధుడితో పాటు అతనితో సహజీవనం చేస్తున్న బాలిక తల్లిపై సైతం కేసు నమోదైంది. కంటికి రెప్పలా చూడాల్సిన తల్లి కన్న కూతురినే తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చూసిన ఆమెను విషయం తెలిసిన వారంతా ఛీత్కరించుకుంటున్నారు.
♦ కొత్తపట్నంలో ఆలస్యంగా మరో ఘటన వెలుగు చూసింది. తల్లి చనిపోయి, తండ్రికి చూపు సరిగా కనిపించక ఉన్న బాలికపై ఓ కామాంధుడి కన్ను పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిగా ఉంది. అయితే కామాంధుడు చేసిన పాపానికి శాపమై తన కడుపులో బిడ్డగా పెరుగుతున్న విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను మథనపడుతూ మౌనంగా రోదిస్తున్న తరుణంలో దీనిని గమనించిన మేనత్త గట్టిగా ప్రశ్నించడంతో మృగాడి దాష్టీకాన్ని బయటపెట్టింది. దీంతో దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో కామాంధుడిపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
♦ ఇలా చెప్పుకుంటూ పోతే మైనర్ బాలికలపై వరుసగా లైంగిక దాడులు, అమానవీయ ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అయితే గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ బాధితులు ఫిర్యాదు చేసేందుకు బయటికి వచ్చేవారు కాదు. పోలీస్ స్టేషన్‌లకు వెళ్తే న్యాయం జరగదనే భయంతో పరువు పోతుందనే ఆందోళనతో రహస్యంగా ఉంచేవారు. అయితే దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు మైనర్ బాలిక, మహిళలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి కేసులు నమోదు చేయడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తుండటంతో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment