ప్రభుత్వ సహకార బ్యాంకుల్లో పనిచేసే వారికి ఇంతవరకు ప్రభుత్వాలు ..
నిజామాబాద్ కల్చరల్ : ప్రభుత్వ సహకార బ్యాంకుల్లో పనిచేసే వారికి ఇంతవరకు ప్రభుత్వాలు పెన్షన్ సౌకర్యం కల్పించకపోవడం శోచనీయమని ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ఎ.వి. కొండారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగుల సంఘం మహాజనసభ ఆదివారం డీసీసీబీ ప్రాంగణంలో గల వైఎస్‌ఆర్ భవనంలో గల సమావేశపు హాల్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా కొండారెడ్డి హాజరై మాట్లాడారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు పదవీ విరమణచేసిన తరువాత పెన్షన్‌ల విధానం అమలవుతుండగా, కేవలం సహకార రంగంలోని ఉద్యోగులకే ఈ విధానం అమలు చేయకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వాలు ఇకనైన గ్రామీణస్థాయి వరకు రైతులను ఎన్నో రకాలుగా ఆదుకుంటున్న సహకార ఉద్యోగులకు పెన్షన్ అమలు చేసేందుకు చొరవ చూపాలని కోరారు. సహకార ఉద్యోగులందరు పెన్షన్ అమ లు కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సంతకా ల సేకరణ చేపట్టాలని సూచించారు.
అవసరమైతే ఒకటి, రెండు రోజుల సమ్మె చేపట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. న్యాయమైన పెన్షన్ అమలు కోసం ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మద్దతునిస్తుందన్నారు. జాతీయ, గ్రామీణ బ్యాంకుల మాదిరిగా సహకార బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహకార వ్యవస్థపై ఆది నుంచి చిన్నచూపు చూస్తోందన్నారు.
దేశంలో ఉన్న 75శాతం రైతాంగాని కి, గ్రామీణస్థాయిలో సహకార బ్యాంకు లు అందుబాటులో ఉండి వారికి సహా య సహకారాలు అందిస్తున్నాయని, ఈ విషయాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు, సీఇవోకు శాలవుకప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏపీసీసీబీఈఏ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. జనార్ధన్‌రావు, జనరల్ సెక్రెటరీ కె. బాలాజీ ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బోసుబాబు, డిస్ట్రిక్ట్ బ్యాంకర్ల కో-ఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి వి. కిషన్‌రావు, డీసీసీబీ సీఇవో అనుపమ, డీసీసీబీ జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్, డీజీఎంలు శ్రీధర్‌రెడ్డి, లింబాద్రి, సుమమాల, గజానంద్, ఏజీఎంలు గోవింద్, ఎస్. గంగారాం,ఎ.బలవంత్‌రావు పాల్గొన్నారు.