State Co-operative Bank
-
సహకార బ్యాంకింగ్ ‘విలీనాల్లో’ ముందడుగు
ముంబై: వివిధ షరతులకు లోబడి రాష్ట్ర సహకార బ్యాంకుతో (ఎస్టీసీబీ) జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీ) విలీనాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం స్పష్టం చేసింది. ఇలాంటి ప్రతిపాదన సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా రావాలన్నది ఈ షరతుల్లో ఒకటి. ఎస్టీసీబీ, డీసీసీబీల విలీనానికి ఉద్దేశించిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) చట్టం, 2020 గత నెల (ఏప్రిల్) 1వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చే విధంగా నోటిఫై అయిన సంగతి తెలిసిందే. విలీన నేపథ్యం... సహకార బ్యాంకులు ప్రధానంగా మూడు అంచెల్లో పనిచేస్తాయి. ఇందులో గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. జిల్లా స్థాయిలో సహకార కేంద్ర బ్యాంక్ పనిచేస్తుంది (దీని తరఫున మండల కేంద్రాల్లో బ్రాంచీలు పనిచేస్తాయి) మూడవ స్థాయి రాష్ట్ర సహకార బ్యాంక్. రైతుకు వడ్డీ భారం తగ్గించాలన్న ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర స్థాయి సహకార బ్యాంకులో జిల్లా స్థాయి సహకార బ్యాంకుల విలీన నిర్ణయం జరిగింది. తద్వారా రెండంచెల సహకార బ్యాంక్ వ్యవస్థకు మార్గం సుగమం అయ్యింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) చట్టం, 2020 ప్రకారం ఇందుకు రాష్ట్రాలు తప్పనిసరిగా ఆర్బీఐని సంప్రదించాలి. రెండంచెల సహకార వ్యవస్థకు (షార్ట్–టర్మ్ కో–ఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్) పలు రాష్ట్రాలు ఆర్బీఐని సంప్రదిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. నిబంధనల్లో ముఖ్యాంశాలు ► రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనను ఆర్బీఐ పరిశీలనలోకి తీసుకుని ‘న్యాయ, ద్రవ్యపరమైన అంశాలపై’ సమగ్ర అధ్యయనం అనంతరం ఇందుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ► అదనపు మూలధనం సమకూర్చడం, అవసరమైతే ద్రవ్య పరమైన మద్దతు, లాభదాయకతతో కూడిన వ్యాపార నమూనా, పాలనా పరమైన నమూనా వంటి అంశాలు విలీన అంశ పరిశీలనలో ప్రధానంగా ఉంటాయి. ► విలీన పథకానికి మెజారిటీ వాటాదారుల మద్దతు అవసరం. ► రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్ (నాబార్డ్) కూడా పరిశీలించి, తగిన సిఫారసులు చేస్తుంది. నాబార్డ్‌తో తగిన సంప్రదింపుల అనంతరం ఆర్బీఐ ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది. ► విలీనానికి సంబంధించి నికర విలువ ఆధారంగా షేర్ల మార్పిడి రేషియో విషయంలో కొన్ని డీసీసీబీ షేర్హోల్డర్లకు ఎటువంటి షేర్లనూ కేటాయించలేని పరిస్థితి ఉంటే, అటువంటి డీసీసీబీలకు ప్రభుత్వం తగిన మూలధనం సమకూర్చాలి. తద్వారా షేర్హోల్డర్లకు కనీసం ఒక షేర్ చొప్పున కేటాయింపు జరగాలి. -
పెన్షన్ విధానం కోసం ఐక్యంగా పోరాడుదాం
నిజామాబాద్ కల్చరల్ : ప్రభుత్వ సహకార బ్యాంకుల్లో పనిచేసే వారికి ఇంతవరకు ప్రభుత్వాలు పెన్షన్ సౌకర్యం కల్పించకపోవడం శోచనీయమని ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ఎ.వి. కొండారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగుల సంఘం మహాజనసభ ఆదివారం డీసీసీబీ ప్రాంగణంలో గల వైఎస్ఆర్ భవనంలో గల సమావేశపు హాల్లో జరిగింది. ముఖ్యఅతిథిగా కొండారెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు పదవీ విరమణచేసిన తరువాత పెన్షన్ల విధానం అమలవుతుండగా, కేవలం సహకార రంగంలోని ఉద్యోగులకే ఈ విధానం అమలు చేయకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వాలు ఇకనైన గ్రామీణస్థాయి వరకు రైతులను ఎన్నో రకాలుగా ఆదుకుంటున్న సహకార ఉద్యోగులకు పెన్షన్ అమలు చేసేందుకు చొరవ చూపాలని కోరారు. సహకార ఉద్యోగులందరు పెన్షన్ అమ లు కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సంతకా ల సేకరణ చేపట్టాలని సూచించారు. అవసరమైతే ఒకటి, రెండు రోజుల సమ్మె చేపట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. న్యాయమైన పెన్షన్ అమలు కోసం ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మద్దతునిస్తుందన్నారు. జాతీయ, గ్రామీణ బ్యాంకుల మాదిరిగా సహకార బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహకార వ్యవస్థపై ఆది నుంచి చిన్నచూపు చూస్తోందన్నారు. దేశంలో ఉన్న 75శాతం రైతాంగాని కి, గ్రామీణస్థాయిలో సహకార బ్యాంకు లు అందుబాటులో ఉండి వారికి సహా య సహకారాలు అందిస్తున్నాయని, ఈ విషయాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు, సీఇవోకు శాలవుకప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీబీఈఏ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. జనార్ధన్‌రావు, జనరల్ సెక్రెటరీ కె. బాలాజీ ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బోసుబాబు, డిస్ట్రిక్ట్ బ్యాంకర్ల కో-ఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి వి. కిషన్‌రావు, డీసీసీబీ సీఇవో అనుపమ, డీసీసీబీ జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్, డీజీఎంలు శ్రీధర్‌రెడ్డి, లింబాద్రి, సుమమాల, గజానంద్, ఏజీఎంలు గోవింద్, ఎస్. గంగారాం,ఎ.బలవంత్‌రావు పాల్గొన్నారు.