కుల వృత్తులపై, చేతివృత్తులపై ఆధారపడి జీవి స్తున్న ప్రజలు భారత గ్రామీణ వ్యవస్థలో అత్యధికంగా వున్నారు. మారిన పాలకుల ఆర్థిక విధానాల వల్ల నమ్ముకున్న, నేర్చుకున్న వృత్తులు నిర్వీర్యం కావడం వల్ల తమ బతుకుదెరువును గురించి ఆందోళనలు చేపట్టారు, చాలా మంది ఇతర వృత్తులకు మారారు. కులం పరిధిలో వున్నారు కాబట్టి కుల వృత్తులు పోవాలి కాబట్టి వారి గురించి అభ్యుదయవా దులు, అంబేడ్కర్ వాదులు పట్టించుకోకుండా ఉందాం అంటారా, లేదు కులం పరిధిలో ఉన్న అణగారిన, బలహీనులను సమీకరించి చైతన్యం కలిగించి మానవీయకోణంలో వారి హక్కులు, అధికారాల వైపు ఆలోచింపజేస్తూ పోరాడేందుకు ప్రయత్నం చేద్దామా?
మారోజు వీరన్న అన్నట్లు కులంలో వర్గం, వర్గంలో కులం అనే సిద్ధాంతం మన దేశానికి, ముఖ్యంగా, మన రెండు తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తుంది. కులవృత్తులకు, చేతివృత్తులకు ప్రత్యామ్నాయ మార్గాలను మనం సూచిస్తూ ఆదిశగా ఏదైనా కార్యక్రమాన్నీ గతంలో చేశామా, భవిష్యత్‌లో ఏమైనా చేయగలమా, పాలకులు కులవృత్తులను, చేతివృత్తులను తప్పించి అన్ని రంగాలలో, తమ భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలకు, దళారులకు మొత్తంగా తమవారికి అనుకూలంగా బడ్జెట్లో కేటాయింపులు చేశారు, పంచవర్ష ప్రణాళికలలో అన్యాయం జరిగింది, మనం గమనించలేదు, నీతి అయోగ్‌లో అదే జరుగుతోంది మనం చూడటం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు వోట్ బ్యాంక్ రాజకీయ సమీకరణాలు చేస్తున్నాయి మనం గమనించం. కానీ కులం పోవాలి, కుల వృత్తులు పోవాలి అంటాం.. ఇది ఎట్లా సాధ్యం.
సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, సంక్షేమంలో జరిగే ప్రజా ఉద్యమాలలో వారిని భాగస్వామ్యం చేయడమే కుల నిర్మూలనకు పరి ష్కార మార్గం. కులరహిత సమాజం కోసం పని చేస్తున్న మనం కులవృత్తులు పోవాలి అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. సంతోషం, కానీ కులాన్ని ప్రక్కన పెట్టి కులం పేరుతో వందల, వేల సంవత్సరాల నుంచి ఆ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారు తమ జీవితాల్లో విద్యా, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, తినడానికి తిండి, ఉండటానికి నివాసం వంటి కనీస మౌలిక సౌకర్యాలు పొందడానికి వారికి మనం కలిపిం చిన చైతన్యం ఏమిటి? ఆ దిశగా పాలకుల నిర్లక్ష్యంపై మనం చేసిన ఒత్తిడి ఏమిటి? ఒక వైపు చేతివృత్తులను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు, బహుళజాతి సంస్థలకు విపరీతమైన రాయితీలను, భూమిని ధారాదత్తం చేస్తున్న సందర్భంలో గత 70ఏళ్లలో చేతివృత్తుల సామాజిక వర్గం ఒకటి ఉన్నదని, వారి గురించి కూడా మాట్లాడాలని ఏ అభ్యుదయ వాదులు, అంబేడ్కర్ వాదులు ప్రయత్నం చేసినా ఫలితాలు వేరే విధంగా ఉండేవి.
ఇప్పుడు చెప్పండి. చేతివృత్తులపై ఆధారపడిన అశేష ప్రజానీకాన్ని మినహాయించి కుల రహిత, మత రహిత సమాజాన్ని ఎట్లా నిర్మిద్దాం? కుల వృత్తులకు నీచత్వం అంటగట్టి అదే కుల వృత్తులను ఆధునిక, యంత్ర,సాంకేతిక పరిజ్ఞానంతో పెట్టుబడిదారులు, భూస్వాములు, అగ్రకులాలు హస్తగతం చేసుకొని వృతికళాకారులను గుమస్తాలుగా, కూలీలుగా పెట్టుకుని కోట్లలో వ్యాపారం చేస్తున్నప్పటికీ, మన అభ్యుదయ వాదులకు, అంబేడ్కర్ వాదులకు కనిపించడం లేదు, వారికి మనువాదం మాత్రమే కనిపిస్తోంది.
దాని వెనుక జరుగుతున్న దోపిడీ, పీడన, అణచి వేత కనిపించవు. కుల నిర్మూలన జరగాలి అంటే కులం పేరుతో కొనసాగుతున్న (కుల)చేతివృత్తుల వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావలసిన శిక్షణా, పెట్టుబడి, మార్కెట్ సౌకర్యాలు కల్పించాలి. ఆ పని మనం గతంలో చేశామా, ఇక ముందు మన ప్రయత్నం చేస్తామా? అనేది తేల్చుకోవాలి. ఈ పని మారోజు వీరన్న కొంతవరకు చేయగలిగిండు, అయిన చేయవలసింది ఇంకా మిగిలే ఉన్నదని గుర్తిస్తే దానికి తగిన ఆచరణ రూపాలను ఎంచుకోవచ్చు. వస్తువు ఉపరితలం ను మార్చితే వస్తువు రూపం మాత్రమే మారుతుంది, అందులోని సారం మాత్రం మారదు, మనం సారం మార్చితేనే సారం, రూపం మొత్తంగా పునాది నుంచి నిజమైన మార్పు జరిగినట్లుగా భావించాలి.
బెజ్జంకి ప్రభాకరాచారి,
కన్వీనర్ విశ్వకర్మ జనసమితి, తెలంగాణ
81439 66591
Comments
Please login to add a commentAdd a comment