‘మోదీ, మీరంటే కోపం లేదు. కానీ.. రాజేని సహించే ప్రసక్తే లేదు’ రాజస్తాన్‌లో ఎక్కడికి వెళ్లినా ఇదే నినాదం వినిపిస్తోంది. ఎవరికీ అందుబాటులో ఉండరు, తలబిరుసు ఎక్కువ వంటి విమర్శల్ని ఎదుర్కొంటూ ఎన్నికలకు ముందే ప్రజాగ్రహం వేడిని చూస్తున్న వసుంధరా రాజే.. కుల సమీకరణలతోనైనా నెగ్గడానికి వ్యూహాలు పన్నుతున్నారు. ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ రాజస్తాన్‌లో కులమే అత్యంత కీలకమని, అభ్యర్థుల జయాపజయాల్ని అదే శాసిస్తుందని బలంగా నమ్ముతున్న రెండు పార్టీలు టిక్కెట్ల పంపిణీ సమయంలో కులాల లెక్కల్ని పక్కాగా వేసుకొని బరిలోకి దిగాయి. దీంతో 30 చోట్ల ఒకే కులానికి చెందిన అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. 15 నియోజకవర్గాల్లో జాట్లు తలపడుతుండగా.. 7 స్థానాల్లో బ్రాహ్మణులే బ్రాహ్మణులతో తలపడాల్సి వస్తోంది. 4 సీట్లలో రాజ్‌పుత్‌లు ఒకరిపై మరొకరు సై అంటుండగా.. 2 చోట్ల గుజ్జర్లు, యాదవ్‌లు నువ్వా నేనా అని సమరశంఖం పూరిస్తున్నారు.
రాజపుత్‌లు ఎవరివైపు?
రాజస్తాన్ జనాభాలో 9% ఉన్న రాజపుత్‌లు ఓట్లు ఏ పార్టీకైనా అత్యంత కీలకం. గతసారి ఎన్నికల్లో బీజేపీ అండదండగా ఉన్న ఈ సామాజిక వర్గం ఇప్పుడు కమలనాథులపై ఆగ్రహంతో ఉంది. రాజ్‌పుత్ అయిన గ్యాంగ్‌స్టర్ ఆనందపాల్ సింగ్ నకిలీ ఎన్‌కౌంటర్, పద్మావత్ సినిమా విడుదలకు రాజే సర్కార్ సై అనడం, ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణలు వంటివి బీజేపీపై రాజ్‌పుత్‌లలో కోపాన్ని పెంచాయి. రాజ్‌పుత్ సంఘాలు బహిరంగంగానే సభలు నిర్వహిస్తూ గతంలో కమలం పార్టీకి ఓటు వెయ్యడం తాము చేసిన తప్పిదమంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ సారి బీజేపీని ఓడించాలంటూ శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన కన్వీనర్ లోకేంద్ర కాల్వీ పిలుపునిచ్చారు. వీరి ఓట్లన్నీ ఈ సారి కాంగ్రెస్‌కు మళ్లే అవకాశం ఉంది. ఇక రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన నేత జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. అయితే, రాజపుత్ర సేనను చీల్చిన సుఖ్‌దేవ్ సింగ్ గోగామేధీ బీజేపీకి మద్దతు ప్రకటించారు.
రాజ్‌పుత్‌లు - 9%
ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 25
బీజేపీ ఇచ్చిన టికెట్లు- 26
కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 15
గుజ్జర్ల అండ దక్కేదెవరికి?
రాష్ట్ర జనాభాలో 9%శాతం ఉన్న గుజ్లర్లు కూడా ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన ఈ వర్గం తమను సంచార తెగగా గుర్తించి ఎస్టీ హోదా కల్పించాలంటూ దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఎస్టీ కులమైన మీనాలతో రాజకీయంగా పోటీపడుతున్నారు. రాజే సర్కార్ గత జులైలోనే గుజ్లర్లను తిరిగి ఓబీసీల్లోకి చేర్చింది. దీంతో ఇప్పటికే అమల్లో ఉన్న 21% రిజర్వేషన్లు వారికీ వర్తిస్తాయి ఇక అదనంగా ఒక్క శాతాన్ని అత్యంత వెనుకబడిన వర్గాల్లోకి (ఎంబీసీ) చేర్చింది. ఈ చర్యతో రాష్ట్రంలో సుప్రీం అనుమతిచ్చిన 50% రిజర్వేషన్లు పూర్తయ్యాయి. అయినా గుజ్లర్లు సంతృప్తిగా లేరు. మరోవైపు కాంగ్రెస్‌లో గుజ్జర్ అయిన సచిన్ పైలెట్ సీఎం అభ్యర్థి రేసులో ముందు ఉండడంతో ఈ ఎన్నికల్లో గుజ్లర్లు కాంగ్రెస్‌కే మద్దతు ఇవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ‘ప్రభుత్వంలో మా ప్రాధాన్యం చాలా తక్కువగా ఉంది. గుజ్జర్ నేతలు ఎక్కువ మంది ఎన్నికైతేనే మా డిమాండ్లు సాధించుకునే అవకాశం ఉంటుంది. సచిన్ పైలెట్ సీఎం రేసులో ఉండడం హర్షణీయం. ఈ సారి మా మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుంది’ అని గుజ్జర్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి శైలేంద్ర సింగ్ ధభానీ వెల్లడించారు.
గుజ్జర్లు- 9%
ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 25
కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 12
బీజేపీ ఇచ్చిన టికెట్లు- 10
జాట్లు రూటు ఎటు?
గ్రామీణ రాజస్థాన్‌లో జాట్ల ప్రాబల్యం ఎక్కువ. రాష్ట్ర జనాభాలో 15% ఉన్న వీరు మొదట్నుంచి కాంగ్రెస్ పక్షమే. కానీ ఆ పార్టీ తమకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి వీరిలో ఉంది. పరశురామ్ మధేర్నా, రామ్‌నివాస్ మీర్ధా, శీష్‌రాం ఓలా వంటి బలమైన జాట్ నేతలను కాంగ్రెస్ ఎప్పుడూ సీఎంను చేయలేదని జాట్‌లు అసంతృప్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో పరశురామ్ మధేర్నాను సీఎంగా కాంగ్రెస్ ప్రకటించాలని ఒత్తిడి తెచ్చారు. కానీ మాలీ వర్గానికి చెందిన అశోక్ గెహ్లాట్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో వీరంతా కాంగ్రెస్‌కు దూరమయ్యారు. జాట్లలో అత్యధికులు వ్యవసాయ రంగం మీద ఆధారపడే ఉన్నారు. అయితే రైతాంగ సమస్యల కారణంగా వారు బీజేపీ వైపు కూడా ఉండే అవకాశం లేదు. తిరిగి జాట్లను తమ గూటికి లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్నిరకాలుగా ప్రయత్నించింది. వ్యూహాత్మకంగా ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా ముందుకు వెళ్లింది. ఈ సారి ఎన్నికల్లో ప్రముఖ జాట్ నాయకుడు హనుమాన్ బేనీవాల్ రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీతోబరిలో దిగడంతో జాట్ ఓటు బ్యాంకు అటు మళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జాట్లు- 15%
ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 60
కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 33
బీజేపీ ఇచ్చిన టికెట్లు- 33
సర్వేలు ఏం చెబుతున్నాయంటే
ఏబీపీ సీఎస్‌డీఎస్
బీజేపీ - 84
కాంగ్రెస్- 110
ఇతరులు-06
టైమ్స్ నౌ సీఎన్‌ఎక్స్
బీజేపీ - 70-80
కాంగ్రెస్- 110-120
బీఎస్పీ- 1-3
ఇతరులు- 7-9
ఇక ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో వసుంధా రాజే ప్రభుత్వం మారాలని 48% మంది కోరుకుంటే, రాజే ప్రభుత్వ పనితీరుపై 32% మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల వివరాలు..
ఎన్నికలు – డిసెంబర్ 7
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు
కౌంటింగ్, ఫలితాలు – డిసెంబర్ 11
రాష్ట్ర జనాభా– 6.86 కోట్లు
హిందువులు– 88.49%,
ముస్లింలు– 9.07%
ఓటర్ల సంఖ్య – 4,77,89,815
పోలింగ్ కేంద్రాల సంఖ్య– 51,965
అసెంబ్లీ స్థానాలు – 200
పోలింగ్ జరిగే సీట్లు– 199
ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్లు– 34
ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్లు– 25
జనరల్ సీట్లు– 141
పోటీలో ఉన్న అభ్యర్థులు–2,873
మహిళా అభ్యర్థులు– 189
సీఎం – వసుంధరా రాజే (బీజేపీ)
2013 అసెంబ్లీ ఎన్నికల్లో
బీజేపీ–163 సీట్లు– 45,17%
కాంగ్రెస్–22 సీట్లు– 33.07%
ఇతరులు–17 సీట్లు– 22%
Comments
Please login to add a commentAdd a comment