ఇంఫాల్: మణిపూర్‌లో గిరిజనులు.. గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్ల అంశం చిచ్చు ఇంకా రగులుతోంది. నాలుగు నెలల కిందట మొదలైన అల్లర్లు.. హింసాత్మక ఘటనలకు కొంతకాలం బ్రేక్ పడినా.. తాజాగా మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ గ్యాప్‌లో ఈశాన్య రాష్ట్రంలో జరిగిన ఘోరాలపై దర్యాప్తులో విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారని ఇటీవల తెలియడంతో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఇద్దరు విద్యార్థుల హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌కు చెందిన పూర్వీకుల ఇంటిపై దాడిచేసేందుకు అల్లరి మూక ప్రయత్నించింది. ఇంఫాల్ శివారులో పోలీసుల పర్యవేక్షణలో ఖాళీగా ఉంటున్న బీరెన్ సింగ్‌కు చెందిన ఇంటిపై బుధవారం రాత్రి దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు గాల్లో కాల్పులు జరిపి వారిని అడ్డుకున్నారు. అయితే.. సీఎం బీరెన్ సింగ్ ప్రస్తుతం ఇంఫాల్‌లోని అధికార నివాసంలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు.
#Breaking:
— Aman Shukla (@AmanINC_) September 29, 2023
Manipur CM N Biren Singh's residence under Mob attack.
Rounds of firing heard as the forces retaliate the attack.
Manipur is now a Lawless State#Manipur#IndiaWithCongress pic.twitter.com/Z7U0dvoTE2
సీఎం సొంత ఇంటిపై దాడిచేసేందుకు రెండు గ్రూపులు వేర్వేరు మార్గాల్లో వచ్చేందుకు ప్రయత్నించాయని, అయితే దుండగులను 150 మీటర్ల దూరం నుంచే అడ్డుకున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టియర్ గ్యాస్ ప్రయోగించిందని, రాష్ట్ర పోలీసులు గాల్లో కాల్పులు జరిపి అల్లరిమూకను చెల్లాచెదురు చేశారని చెప్పారు. దుండగుల చర్యను కట్టడిచేసే క్రమంలో సీఎం నివాస ప్రాంతంలో పోలీసులు విద్యుత్ సరఫరాను ఆపేశారు. మరిన్ని బ్యారీకేడ్‌లతో మోహరించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సీఎం నివాసానికి సమీపంలో ఉన్న రోడ్డుపై నిరసనకారులు టైర్లను తగులబెట్టారు.
అస్థికలైనా ఇప్పించండి..
ఈ ఏడాది జులైలో కన్పించకుండా పోయిన ఓ అమ్మాయి, అబ్బాయి మృతదేహాల ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ (CBI) దర్యాప్తు చేపట్టింది. అయితే, ఇప్పటివరకు వారి మృతదేహాలను మాత్రం గుర్తించలేకపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పిల్లల అవశేషాలనైనా గుర్తించి అప్పగిస్తే.. తాము అంత్యక్రియలు చేసుకుంటామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మణిపుర్‌లో ఇటీవల ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలను ఎత్తివేయడంతో ఈ మృతదేహాల ఫొటోలు బయటికొచ్చాయి. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఒక ఫొటోలో ఉండగా.. వారి వెనుక ఇద్దరు సాయుధులు కన్పించారు. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్ అయ్యింది. మృతులను మైతేయ్ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా గుర్తించారు. ఈ ఏడాది జులైలో వారు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత వారిని సాయుధులు కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టినట్లు మణిపుర్ ప్రభుత్వం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment