ఇంఫాల్: మనిషి రూపంలోని మృగాల కోసం మణిపూర్‌లో భారీ ఎత్తున వేట కొనసాగుతోంది. జాతుల మధ్య వైరంతో విద్వేషం పెంచుకుని.. మూక దాడిలో ఇద్దరిని బలిగొనడమే కాకుండా.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అందులో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే అభియోగాలపై ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా ఈ వ్యవహారంలో మరో అరెస్ట్ జరిగింది.
వైరల్ వీడియో ఆధారంగా.. ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ సింగ్‌ను.. మరో ముగ్గురిని పోలీసులు ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి మరో వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అరెస్టుల సంఖ్య ఐదుకి చేరింది. మరోవైపు హుయిరేమ్ ఇంటిని తగలబెట్టిన కొందరు మహిళలు.. అతని కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలిన నిందితులను పట్టుకునేందుకు భారీ ఎతున సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు మణిపూర్ పోలీసులు. ఈ సెర్చ్ ఆపరేషన్‌ను స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్‌సింగ్ పర్యవేక్షిస్తున్నారు.
నిందితుల్లో ఓ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో.. తీవ్ర విమర్శల నేపథ్యంలో మరణశిక్ష కోసం ప్రయత్నిస్తామంటూ సీఎం బీరెన్ సింగ్ ప్రకటించిన సంగతీ తెలిసిందే. వీడియో ఆధారంగా వీలైనంత మందిని ట్రేస్ చేసి.. వాళ్ల ద్వారా మిగతా వాళ్లను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. వీడియో వైరల్ కావడంతో వాళ్లంతా తలోదిక్కు పారిపోయి తలదాచుకుని ఉంటారని భావిస్తున్నారు.
మణిపూర్ వ్యాప్తంగా అటు కొండప్రాంతంలో.. ఇటు లోయ ప్రాంతాల్లోనూ 126 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి జల్లెడపడుతున్నారు. శాంతి భద్రతలకు మరోసారి విఘాతం కలిగే అవకాశాలు ఉండడంతో.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే నిందితులను త్వరగతిన పట్టుకునే ప్రయత్నం చేస్తామని మణిపూర్ పోలీస్ శాఖ ప్రకటించింది. అలాగే.. నిబంధనలు ఉల్లంఘించిన 413 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇంకోపక్క మణిపూర్ వీడియోలు అంటూ సోషల్ మీడియాలో దిగ్భ్రాంతికర కంటెంట్ అవుతోంది. ఈ క్రమంలో పుకార్లకు చెక్‌పెట్టేందుకు.. 9233522822 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయించింది మణిపూర్ ప్రభుత్వం. ఇక.. కుకీ వర్సెస్ మెయితీల ఘర్షణల్లో ఎత్తుకెళ్లిన ఆయుధాలను దయచేసి దగ్గర్లో ఉన్న స్టేషన్‌లో అప్పగించాలంటూ జనాలకు విజ్ఞప్తి చేస్తోంది ప్రభుత్వం.
బెస్ట్ స్టేషన్ సమీపంలోనే..
మణిపూర్ నుంచి దేశాన్ని కుదిపేసిన కీచకపర్వానికి సంబంధించి మరో దిగ్భ్రాంతికర విషయం వెలుగు చూసింది. 2020లో దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంది నోంగ్‌పోక్ సెక్మయ్ స్టేషన్. ఈ పీఎస్ పరిధిలో.. అదీ ఒక కిలోమీటర్ పరిధిలో ఈ అకృత్యం జరగడం గమనార్హం. మే 4వ తేదీన(మణిపూర్ ఘర్షణలు మొదలైన మరుసటి రోజే) బీ ఫైనోమ్ గ్రామంలో మహిళలను నగ్నంగా ఊరేగించారు. పక్షం తర్వాత బాధితులు ఫిర్యాదు చేయడంతో.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నోంగ్‌పోక్ సెక్మయ్ పోలీసులు.. అపహరణ, హత్య, గ్యాంగ్ రేప్ నేరాల కింద కేసు నమోదు చేశారు. అయితే.. జులై 19న వీడియో వెలుగులోకి రావడం.. విమర్శల నేపథ్యంలో.. ఇప్పుడు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
మరో ఘటన కూడా?
మణిపూర్‌లో ఘర్షణల ముసుగులో జరిగిన రాక్షస చర్యలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మహిళలను నగ్నంగా ఉరేగించిన ఘటన సమయంలోనే మరో దారుణం చోటుచేసుకుందని తెలుస్తోంది. బీ ఫైనోమ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో.. కాంగ్‌పోక్సీలో కారు సర్వీస్ సెంటర్‌లో పని చేసే ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్ జరిగిందని.. అనంతరం బయటకు ఈడ్చేయడంతో వాళ్లు తీవ్రంగా గాయపడ్డారని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వాళ్లు కన్నుమూశారని ఆ యువతుల స్నేహితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఒకటి జాతీయ మీడియా కథనాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై అక్కడి పోలీసుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment