బర్మా నుంచి భారతీయులే పారిపోయి వస్తే... | Like the Rohingya, Indians too were once driven out of Myanmar | Sakshi
Sakshi News home page

బర్మా నుంచి భారతీయులే పారిపోయి వస్తే...

Published Tue, Sep 12 2017 6:58 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

Like the Rohingya, Indians too were once driven out of Myanmar



న్యూఢిల్లీ:
నాటి బర్మా నేటి మయన్మార్‌లో కొనసాగుతున్న జాతి విద్వేష దాడులకు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని రోహింగ్యా మైనారిటీ జాతి ముస్లింలు నలుదిక్కులా పరుగులు తీస్తున్నారు. అటు బంగ్లాదేశ్, ఇటు మన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోకి వచ్చి తలదాచుకుంటున్నారు. ఆశ్రయం ఇచ్చి ప్రాణభిక్ష పెట్టాల్సిందిగా బ్రతిమాలాడుతున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితి నాడు భారతీయులకు కూడా దాపురించింది. బర్మా దేశీయులు తమ దేశం నుంచి తరిమి కొడితే ఉష్ణమండల అడవుల్లో నుంచి లక్షలాది మంది భారతీయులు పారిపోయి వచ్చారు. వారిలో వేలాది మంది మార్గమధ్యంలో ప్రాణాలు వదిలారు.
 
1826లో బర్మా, బ్రిటిష్‌ పాలకుల మధ్య జరిగిన యుద్ధంలో బర్మా ఓడిపోయింది. 1855 నాటికి ఆ దేశాన్ని బ్రిటిష్‌ పాలకులు పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. నాటి నుంచి బర్మాలోకి భారతీయుల వలస ప్రారంభమైంది. 1985 నాటికి బర్మా జనాభాలో ఏడు శాతం మంది భారతీయులు ఉన్నారు. ముందుగా వ్యాపార కార్యకలాపాల కోసం శెట్టియార్, మర్వారీ, గుజరాతీలు బర్మాకు వలసపోయారు. బెంగాల్‌ డెల్టా ప్రాంతం నుంచి బెంగాల్‌ బాబులు కూడా అక్కడికి వలసపోయారు. ఆ తర్వాత సామాన్య ప్రజలు వలసపోయి కార్మికులుగా, కూలీలుగా స్థిరపడ్డారు.
 
ఇళ్లలో వంట మనుషులుగా, పనివాళ్లుగా కూడా స్థిరపడ్డారు. బర్మా ఇంటి యజమానులకు బర్మా భాష రాకపోయినా ఫర్వాలేదుగానీ, భారతీయ వంటవాళ్లతో మాట్లాడేందుకు కనీసం ‘కిచెన్‌ ఉర్దూ’ అయినా రావాలని ప్రముఖ రచయిత జార్జి ఆర్వెల్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.  కొందరు అక్కడి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చేరారు. ‘దేవదాసు’ లాంటి చిత్ర కథలను అందించిన ప్రముఖ భారత కథా రచయిత శరత్‌ ఛంద్ర ఛటోపాధ్యాయ కూడా బర్మాలో పలు ఉద్యోగాలు చేశారు. ముందుగా రైల్వేలో పనిచేసిన ఆయన అకౌంటెంట్‌గా, గుమాస్తాగా పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. బర్మాకు వలసపోయిన వారిలో తెలుగువారు కూడా ఎక్కువగానే ఉన్నారు. 
 
తెలుగువారితో ఘర్షణ..
బర్మా రాజధాని రంగూన్‌ ఓడ రేవులో 1930లో బర్మీయులకు, తెలుగువారికి మధ్య తొలిసారిగా ఘర్షణ జరిగింది. ఆ తర్వాత 1938లో పెద్ద ఎత్తున జరిగిన అల్లర్లలో వేలాది మంది భారతీయులు మరణించారు. రంగూన్‌లోనే ఎక్కువగా అప్పుడు భారతీయులకు వ్యతిరేకంగా జాతి విద్వేష దాడులు లేదా ఘర్షణలు జరగడానికి కారణం రంగూన్‌లో ఎక్కువ మంది భారతీయులు ధనవంతులు కావడమే. రంగూన్‌ మున్సిపల్‌ పన్నుల్లో 55 శాతం పన్నులను భారతీయులు చెల్లిస్తుండగా, బర్మ దేశీయులు కేవలం 11 శాతం పన్నులు చెల్లించేవారు. మిగతా పన్నులను ఇతర జాతులు, దేశస్థులు చెల్లించేవారు. భారతీయులను వారు అప్పుడు కాలా (నలుపు) అని, కోలా అని పిలిచేవారు. బర్మా భాషలో కోలా అంటే విదేశీయుడు అని అర్థం. 
 
రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా..
రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్‌ బర్మాపై దాడి చేసింది. బ్రిటిష్‌ సైన్యం వెనక్కి తగ్గింది. బ్రిటిష్‌ సైన్యంలో భారతీయులు భాగం అవడం వల్ల అటు జపాన్‌ దాడులను, మరోపక్క స్థానిక బర్మా ప్రజల దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. బర్మా నుంచి భారతీయులు ప్రాణభీతితో వెనక్కి రావడం 1930లో ప్రారంభమై 1960వ దశకం వరకు కొనసాగింది. 1948లో బర్మాకు బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం రావడంతో భారతీయులపై దాడులు మరింత తీవ్రమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా బర్మాలో పది లక్షల మంది భారతీయులు ఉండగా, అది 1950 నాటికి ఏడు లక్షలకు పడిపోయింది. అంటే దాదాపు మూడు లక్షల మంది భారతీయులు భారత్‌కు తిరుగుబాట పట్టారు. 
 
1962లో సైనిక ప్రభుత్వం కఠిన వైఖరి
1949 నుంచి 1961 మధ్య తమకు బర్మా వారసత్వాన్ని కల్పించాల్సిందిగా కోరుతూ 1,50,000 మంది భారతీయులు అక్కడి ప్రభుత్వానికి దరఖాస్తు చే సుకున్నారు. వారిలో తమ అవసరాన్ని,వృత్తి నైపుణ్యాలను పరిగణలోకి తీసుకొని ఐదోవంతు భారతీయులకు మాత్రమే బర్మా ప్రభుత్వం పౌరసత్వం మంజూరు చేసింది. 1962లో బర్మాలో సైనిక ప్రభుత్వం ఏర్పడింది. వలస చట్టాలను మరింత కఠినతరం చేసింది. అప్పటి సైనిక నియంతనే విన్, భారతీయులతోపాటు వివిధ మైనారిటీ జాతుల ఆస్తులను జాతీయం చేశారు. వారిని దేశం నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో 1962 నుంచి 1964 మధ్య దాదాపు మూడు లక్షల మంది భారతీయులు వెనక్కి వచ్చారు. 
 
ఐదు లక్షల మంది భారతీయులకు..
బర్మా ప్రభుత్వం 1982లో మరింత కఠినమైన పౌరసత్వాన్ని తీసుకొచ్చింది. దీంతో రోహింగ్యా ముస్లిం మైనారిటీ తెగతోపాటు భారతీయులు కూడా ఏ దేశానికి చెందిన వారయ్యారు. ప్రతి పౌరుడు మాత భాష బర్మానే మాట్లాడాలి, బర్మాలోనే విద్యాభ్యాసం కొనసాగించాలి. ఉద్యోగ వ్యవహారాలను బర్మాలోనే నిర్వహించాలనే కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తీవ్ర అణచివేతను ఎదుర్కొంటున్న రోహింగ్య ముస్లింలు గతేడాది చేతుల్లోకి ఆయుధాలు తీసుకొని బర్మా జాతీయులపై తిరుగుబాటు లేవనెత్తారు. ఫలితంగా సైనిక దాడుల్లో వేలాది మంది రోహింగ్యాలు మరణిస్తుండగా, లక్షలాది మంది బంగ్లా, భారత దేశాలకు పారిపోయి వస్తున్నారు. 
 
నాడేం చేయలేదు, నేడేమీ చేయడం లేదు
బర్మాలో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న భారతీయులను రక్షించేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని 1960వ దశకంలో బర్మా భారతీయుల నుంచే కాకుండా అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు ఎదురయ్యాయి. బర్మాలో అప్పుడు నివసిస్తున్న చైనీయుల రక్షణకు చైనా ప్రభుత్వం చొరవ తీసుకోవడం ఈ విమర్శలకు ఆస్కారమైంది. ఇప్పటికి కూడా బర్మాలో ఐదు లక్షల మంది భారతీయులు ఉంటారన్నది అనధికార అంచనా. భారత్‌ వచ్చిన రోహింగ్యలను వెనక్కి పంపిస్తున్న ప్రస్తుత భారత ప్రభుత్వం, భారతీయులు వస్తే వారికి ఆశ్రయం ఇస్తుందన్న గ్యారెంటీ కనిపించడం లేదు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement