అమల్ క్లూనీ
న్యూయార్క్ : జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టుల తరపున వారి కుటుంబాలు.. మయన్మార్ అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేశాయని మానవ హక్కుల న్యాయవాది అమల్ క్లూనీ తెలిపారు. శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో జరిగిన పత్రికా స్వేచ్ఛా కార్యక్రమంలో అమల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లకు మయన్మార్ అధ్యక్షుడు విన్ మింట్ క్షమాభిక్ష పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
ఆమెకే బాగా తెలుసు..
‘ఒక వ్యక్తికి శిక్ష పడిన తర్వాత క్షమాభిక్ష ద్వారా అతడు మళ్లీ సాధారణం జీవితం గడిపేందుకు వీలవుతుంది కదా. ఈ కోవలోనే వా లోన్, కా సో ఓల కుటుంబ సభ్యులు అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం వారి తరపున దరఖాస్తు చేశారు. నాకు తెలిసి మయన్మార్ అధ్యక్షుడు ఈ విషయమై అంగ్ సాన్ సూకీతో తప్పకుండా చర్చిస్తారు. వారిద్దరు తలచుకుంటే ఈ ఇద్దరు జర్నలిస్టులకు ఈరోజుతో శిక్ష నుంచి విముక్తి లభిస్తుంది. ఒక రాజకీయ ఖైదీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అంగ్ సాన్ సూకీ కంటే ఎవరికీ కూడా అంత ఎక్కువగా తెలిసి ఉండదు’ అంటూ అమల్ వ్యాఖ్యానించారు.
కాగా మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లకు యంగూన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మయన్మార్ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంగా అరెస్టైన వీరిద్దరి వద్ద దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు లభ్యమయ్యాయన్న ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు వీరికి శిక్ష ఖరారు చేస్తూ సెప్టెంబరు 3న తీర్పు ఇచ్చింది.
ధైర్యంగా ఎదుర్కొంటాం..
తీర్పు అనంతరం వా లోన్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ తీర్పును మేం దృఢచిత్తంతో, ధైర్యంగా ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ప్రభుత్వం తమను అరెస్ట్ చేయగలదనీ, కానీ ప్రజల కళ్లు, చెవులను మాత్రం మూయలేదని కా అన్నారు. కాగా ఇద్దరు జర్నలిస్టులను విడుదల చేయాలని మయన్మార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment