Amal Clooney
-
రోహింగ్యాలు: జాంబియా బాటలో మాల్దీవులు..
మాలే/మాల్దీవులు: మానవ హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అమల్ క్లూనీ రోహింగ్యాల తరఫున అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు వినిపించనున్నారు. రోహింగ్యాలకు అండగా నిలిచిన మాల్దీవులు ప్రభుత్వం ఈ మేరకు అమల్ క్లూనీని సంప్రదించినట్లు పేర్కొంది. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యాలు తమ దేశ పౌరులు కాదని, వారంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన తెగ అంటూ ఆ దేశం వారికి పౌరసత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానికంగా రోహింగ్యాలపై దాడులు జరిగాయి. ఈ క్రమంలో రోహింగ్యాలు వలసబాట పట్టి... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మయన్మార్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. రోహింగ్యాలకు మద్దతుగా... పశ్చిమాఫ్రికా దేశం జాంబియా గతేడాది నవంబరులో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మయన్మార్‌లో జరుగుతున్న ఊచకోతను ఆపాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిందిగా కోర్టు మయన్మార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.(భారత్ మా మాతృదేశం అవుతుందనుకున్నాం : రోహింగ్యాలు) ఈ క్రమంలో తాజాగా మాల్దీవులు సైతం మయన్మార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఐసీజేలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయం గురించి మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ మాట్లాడుతూ... ‘‘ రోహింగ్యా ప్రజల పట్ల జరుగుతున్న అకృత్యాలకు మయన్మార్ జవాబుదారీగా ఉండాలి. రోహింగ్యాలకు రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవులు మద్దతు తెలుపుతోంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ 14వ సదస్సులో... ఈ మేరకు నిర్ణయం తీసుకుంది’’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమల్ క్లూనీని తమ న్యాయవాదిగా నియమించుకున్నట్లు తెలిపారు. ఇక ఈ విషయంపై స్పందించిన అమల్ క్లూనీ.. ‘‘అంతర్జాతీయ న్యాయస్థానంలో మాల్దీవులుకు ప్రాతినిథ్యం వహించాలని నన్ను సంప్రదించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రోహింగ్యాల పట్ల మయన్మార్ వ్యవహరించిన తీరుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. రోహింగ్యా బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను’’ అని పేర్కొన్నారు. కాగా అమల్ క్లూనీ గతంలో మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తరఫున వాదించి.. గెలిచారు. ఆయనకు అన్యాయంగా జైలు శిక్ష విధించారని అంతర్జాతీయ న్యాయస్థానంలో నిరూపించారు. కాగా మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లకు యంగూన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించగా.. వారికి అమల్ క్లూనీ అండగా నిలిచిన విషయం తెలిసిందే. అదే విధంగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నదియా మురాద్ తరఫున కూడా అమల్ క్లూనీ వాదించారు.(‘ఆ జర్నలిస్టులకు క్షమాభిక్ష పెట్టాలి’) -
‘ఆ జర్నలిస్టులకు క్షమాభిక్ష పెట్టాలి’
న్యూయార్క్ : జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టుల తరపున వారి కుటుంబాలు.. మయన్మార్ అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేశాయని మానవ హక్కుల న్యాయవాది అమల్ క్లూనీ తెలిపారు. శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో జరిగిన పత్రికా స్వేచ్ఛా కార్యక్రమంలో అమల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లకు మయన్మార్ అధ్యక్షుడు విన్ మింట్ క్షమాభిక్ష పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఆమెకే బాగా తెలుసు.. ‘ఒక వ్యక్తికి శిక్ష పడిన తర్వాత క్షమాభిక్ష ద్వారా అతడు మళ్లీ సాధారణం జీవితం గడిపేందుకు వీలవుతుంది కదా. ఈ కోవలోనే వా లోన్, కా సో ఓల కుటుంబ సభ్యులు అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం వారి తరపున దరఖాస్తు చేశారు. నాకు తెలిసి మయన్మార్ అధ్యక్షుడు ఈ విషయమై అంగ్ సాన్ సూకీతో తప్పకుండా చర్చిస్తారు. వారిద్దరు తలచుకుంటే ఈ ఇద్దరు జర్నలిస్టులకు ఈరోజుతో శిక్ష నుంచి విముక్తి లభిస్తుంది. ఒక రాజకీయ ఖైదీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అంగ్ సాన్ సూకీ కంటే ఎవరికీ కూడా అంత ఎక్కువగా తెలిసి ఉండదు’ అంటూ అమల్ వ్యాఖ్యానించారు. కాగా మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లకు యంగూన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మయన్మార్ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంగా అరెస్టైన వీరిద్దరి వద్ద దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు లభ్యమయ్యాయన్న ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు వీరికి శిక్ష ఖరారు చేస్తూ సెప్టెంబరు 3న తీర్పు ఇచ్చింది. ధైర్యంగా ఎదుర్కొంటాం.. తీర్పు అనంతరం వా లోన్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ తీర్పును మేం దృఢచిత్తంతో, ధైర్యంగా ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ప్రభుత్వం తమను అరెస్ట్ చేయగలదనీ, కానీ ప్రజల కళ్లు, చెవులను మాత్రం మూయలేదని కా అన్నారు. కాగా ఇద్దరు జర్నలిస్టులను విడుదల చేయాలని మయన్మార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేశాయి. -
ట్రంప్‌కు మహిళా లాయర్ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌కు అంతర్జాతీయ హక్కుల ప్రముఖ న్యాయవాది అమల్ క్లూనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు కొన్ని నైతిక కట్టుబాట్లు ఉన్నాయని, వాటిని ఆయన గౌరవించాలని లేదంటే హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో అమెరికాయేతరులపట్ల చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలను గుర్తు చేసేలా కొన్ని సంఘటనలు అప్పుడే వెలుగులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచారం కోసం ఆయన చేసిన వ్యాఖ్యలను ఆచరణలో చూపడానికి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని అన్నారు. అమల్ క్లూనీ హక్కుల న్యాయవాదిగానే కాకుండా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన బాధితులకు కూడా ఆమె అండగా ఉంటారు. అంతేకాదు, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ప్రతినిధిగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా ఆమె స్పందిస్తారు. గత వారం టెక్సాస్ లో జరిగిన మహిళల సదస్సులో ఆమె మాట్లాడుతూ ట్రంప్ కు ఈ హెచ్చరిక చేశారు. ట్రంప్ ప్రచార సమయంలో అమెరికా మొత్తం మత పరీక్షలు వంటివి నిర్వహించాలన్నారని, ఉగ్రవాదులుగా అనుమానం ఉన్న కుటుంబాలను అంతమొందించాలని వ్యాఖ్యానించారని ఇవన్నీ కూడా అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన నేరం కిందకు వస్తుందని క్లూనీ చెప్పారు. ఇప్పటికే ప్రపంచాల్లోని కొన్ని దేశాల్లో అమెరికాలో ఉన్న తమ వాళ్లకు సంబంధించి కొంత ఆందోళన నెలకొందని, దానిని పోగొట్టాల్సిన బాధ్యత ట్రంప్‌కే ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే అమెరికా నుంచి కొన్ని హక్కుల ఉల్లంఘనల ఘటనలకు సంబంధించి తనకు ఫోన్లు వస్తున్నాయని నైతిక నిబంధనలు అమెరికా తప్పకుండా పాటించాలని గుర్తు చేశారు. మతపరమైన విద్వేషాలకు తావివ్వకుండా చూడాలని కోరారు.