హితిన్ క్యా, అంగ్‌సాన్ సూకీ
మయన్మార్ : తమ అధ్యక్షుడు హితిన్ క్యా రాజీనామా చేసినట్లు మయన్మార్ అధ్యక్ష కార్యాలయ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుత బాధ్యతలు, విధుల నుంచి విశ్రాంతి తీసుకునేందుకు ఆయన రాజీనామా చేశారని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాయి. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు రాజీనామా చేస్తే ఉపాధ్యక్షులు అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అప్పటి నుంచి ఏడు రోజుల్లోగా పార్లమెంట్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. అప్పటివరకు ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న మింట్ స్వీ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
హితేన్ నామమాత్రమే...
2016లో జరిగిన ఎన్నికల్లో అంగ్‌సాన్ సూకీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ విజయం సాధించింది. అప్పుడు అంగ్‌సాన్ సూకీనే అధ్యక్షురాలు అవుతుందని అందరూ భావించారు. కానీ ఆ దేశ రాజ్యాంగం ప్రకారం.. విదేశీయుడిని పెళ్లి చేసుకున్న కారణంగా ఆమె అధ్యక్ష పదవికి దూరమయ్యారు. ఆమె స్థానంలో తనకు అత్యంత విధేయుడైన హితేన్‌కు పట్టం కట్టి సలహాదారుగా వ్యవహరించారు. ప్రధాని హోదాకు సమానమైన స్టేట్ కౌన్సిలర్‌గా, విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే దేశ పాలనలో తనదైన ముద్ర వేశారు. కానీ రోహింగ్యాల విషయంలో అంగ్‌సాన్ సూకీ, హితేన్ ఇతర దేశాల నుంచి వ్యతిరరేకత ఎదుర్కొన్నారు.
అనారోగ్య కారణాల వల్లే..
71 ఏళ్ల హితేన్ అనారోగ్య కారణంగానే అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగారని ఎన్‌ఎల్‌డీ పార్టీ అధికార ప్రతినిధి అంగ్ షిన్ తెలిపారు. పార్టీకి చెందిన మరో వ్యక్తి ఏడు రోజుల్లోగా అధ్యక్షునిగా ఎన్నికవుతారని, రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత ఉపాధ్యక్షుడిని అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment