బ్యాంకాక్: భారత్, మయన్మార్, థాయ్ ల్యాండ్ దేశాలను కలుపుతూ 1,400 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాన్ని నిర్మించనున్నట్లు థాయ్ లాండ్ లోని భారతీయ రాయబారి భాగవత్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా ఈ మార్గంపై చర్చలు జరుగుతున్నా అది అమలుకు నోచుకోలేదు. మయన్మార్ దేశంలో శిథిలావస్థలో ఉన్న 73 వంతెనలను భారత్ 18 నెలల్లో పునర్నిర్మిస్తుందని ఆయన వివరించారు. వీటన్నింటిని రెండో ప్రపంచయుద్ధ సమయంలో నిర్మించారని తెలిపారు.
ఇప్పుడు కొత్తగా 1400 కిలోమీటర్ల రోడ్డు వస్తే.. 2018 తర్వాత ఎంచక్కా రోడ్డు మార్గంలో థాయ్ లాండ్ చేరుకోవచ్చు. భారత్ లోని మోరే ప్రాంతం నుంచి మొదలయ్యే ఈ రోడ్డు మార్గం మయన్మార్ లోని టామూ నగరం వద్ద ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం థాయ్ లాండ్ లోని తఖ్ ప్రాంతం వరకు రోడ్డును పొడిగించేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి. థాయ్ లాండ్ తో భారత్ కు ఇప్పటికే సాంఘిక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని, త్వరలో ఇరు దేశాల మధ్య రోడ్డు మార్గం కూడా ఏర్పడుతుందని భాగవత్ పేర్కొన్నారు. తూర్పుదేశాలతో సహకార సంబంధాలు పెంచుకోవాలనే భారత్ ఆంకాక్షకు ఇది సరిగ్గా సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.