
ప్రజాస్వామ్య తీరం చేరేదెన్నడు?
2008 సైనిక రాజ్యాంగాన్ని సవరించడానికి మయన్మార్ సైనిక జుంటా నిరాకరించింది. దీంతో సూచీ అధ్యక్ష పదవిని చేపట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పినట్టయింది. అక్కడి ‘క్రమశిక్షణాయుత ప్రజాస్వామ్యాని’కి మురుస్తున్న ప్రపంచ నేతలకు ఇప్పుడు ఆమె పట్టదు.
మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత్రి ఆంగ్‌సాన్ సూచీ బహుశా తన రాజకీయ జీవితంలోకెల్లా అతి పెద్ద సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టున్నారు. సైనిక పాలన నుంచి విముక్తిని, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించి దాదాపు పదిహేనేళ్ల గృహ నిర్బంధం పాలైన ఆమె 2010లో విడుదలయ్యారు. సూచీ ఆశిస్తున్నట్టుగా వచ్చే ఏడాది దేశాధ్యక్ష పదవి ఆమెను వరిస్తుందా? లేక తిరిగి నిర్బంధం చవి చూడాల్సి వస్తుందా? 2015 చివర్లో జరిగే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే సూచ నప్రాయంగానైనా తేలవచ్చు. ఇప్పటికైతే అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఆమె అనర్హులని రాజ్యాంగ సవరణల పార్లమెంటరీ కమిటీ తేల్చేసింది.
1962 నుంచి కొనసాగుతున్న సైనిక నేతల పాలన పదిలంగా ఉండేలా 2008 ‘ప్రజాస్వామ్య’ రాజ్యాంగం తయారైంది. ప్రత్యేకించి సూచీ పీడ విరగడ చేసుకోవడం కోసమే విదేశీయులను వివాహమాడిన పౌరులను అధ్యక్ష పదవికి అనర్హులను చేస్తూ 59 (ఎఫ్) అధికరణాన్ని చేర్చారు. బ్రిటిష్ జాతీయుని పెళ్లాడిన సూచీ శాశ్వతంగా అధ్యక్ష పదవికి అనర్హురాలు. సూచీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ లీగ్ (ఎన్‌ఎల్‌డీ) అందించిన 168 సవరణల జాబితాను పార్లమెంటరీ కమిటీ 31-5 ఓట్ల తేడాతో గత వారం తిరస్కరించింది. అంతకు ముందే, గత ఏడాది నవంబర్‌లో జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో ఎన్నికల కమిషన్ చైర్మన్ టిన్ ఆయె... ఎన్నికలు 2010లో జరిగినట్టే జరుగుతాయని ప్రకటించారు. అంతేకాదు, 2012లో జరిగిన ఉప ఎన్నికలను ఎన్‌ఎల్‌డీ ‘తిరుగుబాటు’లాగా నిర్వహించిందనీ, అది ‘88 తిరుగుబాటు’ను (1988లో నెత్తురోడిన విద్యార్థి, యువజన ప్రజాస్వామ్య ఉద్యమం) గుర్తుకు తెచ్చిందనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి అభ్యర్థులు వారి వారి పార్లమెంటు నియోజకవర్గాలలోనే తప్ప ఇతర ప్రాంతాల్లో ప్రచారం సాగించరాదని కొత్త నిబంధనను విధించనున్నట్టు తెలిపారు.
2012 ఉప ఎన్నికల్లో సూచీ సహా ఎన్‌ఎల్‌డీ పార్లమెంటు ఉభయ సభల్లోని 44 స్థానాలకు పోటీచేసి 42 స్థానాలను గెలుచుకుంది. 2008 రాజ్యాంగం పార్లమెంటులో సైన్యం నియమించే ప్రతినిధులకు 25 శాతం స్థానాలను కేటాయించి, రాజ్యాంగ సవరణకు 75 శాతం సభ్యుల ఆమోదం తప్పనిసరి చేసింది. తద్వారా సైన్యానికి ఆచరణలో చట్టసభ నిర్ణయాలపై వీటో అధికారం లభించింది. అందుకే ఆ రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ ప్రమాణ స్వీకారం చేసేది లేదని అప్పట్లో సూచీ పట్టుబట్టారు. ‘మరింత ప్రజాసామ్యీకరణ’కు సైనిక దుస్తులు విడిచిన సైనిక దేశాధ్యక్షుడు థీన్ సీన్ శుష్క వాగ్దానంతో మెట్టు దిగారు.
ఏడాదికిపైగా ఒకప్పటి ప్రత్యర్థులైన సైనిక నేతలను, వారి ప్రతినిధులను రాజ్యాంగ సంస్కరణలకు ఒప్పించడానికి ఆమె విఫల యత్నం చేశారు. సంస్కరణల పట్ల సానుభూతి కలిగినవారనుకున్న స్పీకర్ ష్వా మాన్ మొండి చెయ్యి చూపారు. థీన్ సీన్ చేసిన కీలక వాగ్దానం... సైనిక జనరల్స్‌తో సూచీ ‘శిఖరాగ్ర సమావేశం’ సైతం నీటి మూటే అయింది. కమాం డర్ ఇన్ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హయాంగ్‌ను కలవడం కోసం గత రెండేళ్లుగా ఆమె చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. సైనిక జుంటాకుగానీ, దాని కీలుబొమ్మ అధికార యూఎస్‌డీపీకిగానీ ఆమెపై నమ్మకం కుదరడం లేదు. అదే అసలు సమస్య. ‘రాజ్యాంగ (2008) పరిరక్షణే సైన్యం ప్రధాన విధి’ అని జనరల్ హయాంగ్ ఇటీవలే మరో మారు బహిరంగంగా ప్రకటించారు. ఇప్పటికైతే సూచీకి అధికారం అప్పగించడానికి సైనిక నేతలు విముఖంగా ఉన్నారు. అయితే ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి.
సైన్యాన్ని బుజ్జగించే ప్రయత్నాలు విఫలం కావడంతో సూచీ, ఎన్‌ఎల్‌డీలు వ్యూహాన్ని మార్చాయి. రాజ్యాంగ సవరణల కోసం ప్రచారం, ప్రదర్శనలు, సభలు సాగిస్తున్నారు. గత నవంబర్‌లో యాంగూన్ తదితర నగరాల్లో భారీ ప్రదర్శనలను నిర్వహించారు. మయన్మార్ ప్రజలు సైనిక పాలనే కొనసాగుతున్నదని భావిస్తే ఎవరికి కావాలి? సూచీ పార్లమెంటు ప్రవేశంతోనే మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్ధారకులైన ప్రపంచ నేతల పని ముగిసింది. అక్కడి సంస్కరణవాద ‘క్రమశిక్షణాయుత ప్రజాస్వామ్యాని’కి మురిసి, ఆంక్షలను ఎత్తేసి, వాణిజ్య ఒప్పందాల కోసం పోటీలు పడుతున్నారు. ఇక సూచీ రాజ్యాంగ సంస్కరణల ఘోష ఎవరు వినాలి? మయన్మార్ ప్రజలు వింటున్నారు. 2015లోగా రాజ్యాంగ సవరణలు జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఆమె ఇటీవలి కాలంలో చేస్తున్న ఉద్రేకపూరిత ఉపన్యాసాలు వారికి పాత సూచీని గుర్తుకు తెస్తున్నాయి. సైన్యంతో పరిమితమైన సంఘర్షణాత్మక వైఖరి అనే సూచీ కొత్త ఎత్తుగడ పారుతుందా? బెడిసికొడుతుందా?
- ఎస్. కమలాకర్