పోలీసులను ఎదురెళ్లిన నన్ సిస్టర్ అన్న్ రోజ్ ను తవాంగ్ (ఫోటో కర్టెసీ)
యాంగాన్: మయన్మార్‌లో అధికారం సైన్యం చేతిల్లోకి వెళ్లింది. అధ్యక్షురాలు అంగ్ సాన్ సూకిని సైన్యం నిర్భంధించి.. అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిలటరీకి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. ప్రజల నిరసనని అణచివేయడానికి భద్రతా దళాలు ప్రయత్నిస్తూ ఉండడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా సైన్యం అరాచకాలను కళ్లకు కట్టే ఫోటో ఒకటి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరలవుతోంది. కచిన్ రాష్ట్రంలో మైత్‌క్వీనా నగరంలో సోమవారం నాడు తీసిన ఫోటో ఇది.
ఆ వివరాలు... కచిన్ రాష్ట్రంలో సోమవారం కొందరు బయటకు వచ్చి దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేస్తున్నారు. ఇంతలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేయడం.. మాట వినకపోతే తూటాకు పనిచెప్పడమే వారి లక్ష్యం. పోలీసులను చూసి అక్కడి యువకులు పరుగులు పెడుతున్నారు. అప్పటికే అధికారులు తుపాకులకు పని చెప్పడంతో ఓ యువకుడు మరణించాడు. మరి కొందరి ప్రాణాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు. ఈ విపత్కర పరిస్థితిని గ్రహించిన ఓ మహిళ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అధికారులకు అడ్డు నిలబడింది.
తెల్లటి దుస్తులు ధరించి శాంతికి మారుపేరుగా ఉన్న ఆ నన్ పోలీసులకు ఎదురెళ్లింది. నిగ్రహం పాటించండి అంటూ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆమె మాట వినలేదు. దాంతో ఆమె వెంటనే మోకాళ్లపై కూర్చొని ‘ఆందోళనకారులను ఏమీ చేయొద్దు.. కావాలంటే నా ప్రాణం తీసుకోండి’ అంటూ వేడుకుంది. ఆమెలోని తెగువ, మానవత్వానికి చలించిన అధికారులు ఆమెకు ప్రతి నమస్కారం చేశారు. మయన్మార్‌లో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్న ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
మైత్‌క్వీనాలో సోమవారం నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులకు నచ్చజెప్పేందుకు సిస్టర్ అన్న్ రోజ్ ను తవాంగ్ ప్రయత్నించారు. వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్తున్న పోలీసులను అడ్డుగా నిలిచారు. వారినేమీ చేయొద్దంటూ మోకాలిపై నిలబడి వేడుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫొటోనే ఇది. ఇద్దరు పోలీసులు సైతం ఆమెకు చేతులు జోడించి నమస్కరించడం కనిపించింది. ఫిబ్రవరి 28న సైతం నిరసనకారులపై ప్రతాపం చూపేందుకు వచ్చిన పోలీసులను ఇలానే అడ్డుకున్నారు సిస్టర్ తవాంగ్.
ఈ ఘటనపై సిస్టర్ తవాంగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మయన్మార్ దుఃఖంలో ఉంది. నా కళ్ల ముందు ప్రజలకు ఏమైనా జరిగితే తట్టుకోలేను. చూస్తూ ఊరుకోలేను. ప్రజల కోసమే నా జీవితాన్ని అంకితం చేశాను. వారి కోసం చావడానికి నేను భయపడను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment