మయన్మార్ అధ్యక్షునిగా టిన్ క్వా ప్రమాణం
విదేశాంగ మంత్రిగా సూచీ
నేపితా: మయన్మార్ కొత్త అధ్యక్షునిగా ఆంగ్ సాన్ సూచీ ప్రధాన అనుచరుడు టిన్ క్వా(60) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. క్వా ప్రమాణ స్వీకారంతో 50 ఏళ్ల మిలిటరీ పాలన తర్వాత సూచీ ప్రజాస్వామ్య ఉద్యమంతో మయన్మార్‌లో కొత్త శకానికి పునాది పడినట్లయ్యింది. మరోవైపు సూచీ.. క్వా కేబినెట్‌లో విదేశాంగ శాఖతో పాటు విద్య, ఇంధన, అధ్యక్ష కార్యాలయ శాఖల బాధ్యతలనూ నిర్వర్తించనున్నారు. మాజీ జనరల్ థీన్ సేన్ స్థానంలో టిన్ క్వా కొత్త అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
క్వా.. సూచీకి స్కూల్ స్నేహితుడు. అలాగే నమ్మకమైన వ్యక్తి. ఆర్మీ తెచ్చిన కొత్త రాజ్యాంగం వల్ల అధ్యక్షురాలయ్యే అవకాశం సూచీ కోల్పోయినా.. క్వా ద్వారా ఆమె పరోక్షంగా దేశాన్ని నడిపించనున్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్‌ఎల్‌డీ) ఘన విజయం సాధించడం తెలిసిందే. కాగా, ప్రజాస్వామ్య ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త శకానికి స్వాగతమని, దేశ రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవిస్తానని క్వా తెలిపారు. గణతంత్ర మయన్మార్ ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తానన్నారు.